26.5.23
అనుదిన ఆత్మీయ ఆహారం, యోహాను 21:15-19
23.5.23
అనుదిన ఆత్మీయ ఆహారం, యోహాను 17:11-19
యోహాను 17:11-19
పవిత్రుడవైన తండ్రి! మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్ట పుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు. కాని, నేను ఇపుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసితిని. కాని లోకము వారిని ద్వేషించినది. ఎలయన, నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్ధించుట లేదు. కాని, దుష్టుని నుండి కాపాడమని ప్రార్ధించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్టింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్టింపబడునట్లు వారి కొరకు నన్ను ప్రతిష్టించుకొనుచున్నాను.
ధ్యానము:
"పవిత్రుడవైన తండ్రి! మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము." తండ్రి దేవునకి కుమారునికి మధ్య ఉన్న అన్యోన్యత, ఐక్యతను గురించి ఈ సువిశేష భాగం చెబుతుంది. తండ్రి, కుమారుడు ఒకరియందు ఒకరు ఉన్నారు. కుమారుడు అడిగినది తండ్రి చేయడానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటాడు. తండ్రి చిత్తమును కుమారుడు సంపూర్తిగా చేయడానికి ప్రాణమును కూడా అర్పిస్తాడు. ఇద్దరు ఎప్పుడు ఐక్యంగా ఉంటారు. ఒకరి యందు ఒకరు ఉంటారు.
వీరి అన్యోన్యత, వీరి బంధం, శిష్యులకు ఆదర్శం, యేసు ప్రభువు శిష్యులు, అనుచరులు కూడా ఇదే విధంగా వారిలో వారు ఐక్యంగా ఉండాలని యేసు ప్రభువుని ఆకాంక్ష. శిష్యులు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉన్నది, వీరు ఐక్యంగా ఉండకపోతే వారు సాతాను యొక్క ప్రణాళికలకు గురి అవుతారు. కనుక యేసు ప్రభువు వారిని ఎల్లప్పుడు ఐక్యంగా ఉంచమని ప్రార్ధిస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులను ఐక్యముగ మాత్రమే ఉంచమని చెప్పడం లేదు. వారిని సురక్షితంగా ఉంచమని తండ్రిని అడుగుతున్నారు. వీరిని సురక్షితముగా తండ్రి మాత్రమే ఉంచాలి, యేసు ప్రభువు తాను వారితో ఉన్నప్పుడు వారిని అందరినీ నుండి కాపాడుకున్నాడు. యేసు ప్రభువు శిష్యులను పరిసయ్యుల, ధర్మ శాస్త్ర భోదకుల, భోదనల నుండి, శోదనల నుండి పాపము నుండి అన్ని విధాలుగా వారిని కాపాడుకున్నాడు. ఇప్పుడు ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత తండ్రే వారిని కాపాడాలి. శత్రువుల నుండి, లోకము నుండి, సాతాను నుండి దేవుడు వారిని కాపాడాలి. అందుకే వారిని సురక్షితముగా ఉంచమని ప్రార్ధిస్తున్నాడు.
"నేను నీ వాక్కును వారికి అందజేసితిని. కాని లోకము వారిని ద్వేషించినది. ఎలయన, నా వలె వారును లోకమునకు చెందినవారు కారు." యేసు ప్రభువు శిష్యులు దేవుని వాక్కును విశ్వసించారు, వారు ఆ వాక్కును అనుసరించడానికిని, మరియు ఆ వాక్కును పొందుటకు వారు సిద్ధముగా ఉన్నారు. దేవుని వాక్కు కేవలం శిష్యులకు మాత్రమే అందచేయబడలేదు. దేవుని వాక్కు అందరికీ అందచేయబడింది. కాని, శిష్యులు మాత్రమే దానిని అంగీకరించారు. ఇక్కడ శిష్యులు దేవుని వాక్కును అంగీకరించినవారు. వారు ఆ వాక్కును పాటించుటకు సిద్ధమైనవారు. వారిని ఈ లోకము ద్వేషించినది. వారు దేవునికి , దేవుని వాక్కుకు ఎంత దగ్గర అవుతున్నారో లోకము వారిని అంతగా ద్వేషిస్తుంది. శిష్యులు ఈ లోకములో ద్వేషించబడతారు, ఎందుకంటే వారు లోకము అనుసరించి జీవించుటలేదు. లోకములో ఉన్న కాని లోకమునకు వ్యతిరేకముగా, లోక ఆశలకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు. యేసు ప్రభువు ఈ లోకమునకు చెందిన వాడు కాదు. అందుకే ఈ లోకము ఆయనను ద్వేషించింది. ద్వేషించి, హింసించి, మరణానికి కారణమయ్యింది. యేసు ప్రభువుని చూచిన విధముగానే ఈ లోకము తన శిష్యులను చూస్తుంది.
"వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్ధించుట లేదు. కాని, దుష్టుని నుండి కాపాడమని ప్రార్ధించుచున్నాను." యేసు ప్రభువు తండ్రిని వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని చెప్పడం లేదు. ఎందుకు వారిని తీసుకొని వెళ్ళమని చెప్పడం లేదు అని అంటే, వారు ఈ లోకములో ఉండి, యేసు ప్రభువును ఎలా ఈ లోకమునకు తండ్రిని తెలియచేశారో అలానే యేసు ప్రభువు వెళ్ళిన తరువాత శిష్యులు తండ్రిని లోకమునకు తెలియజేయాలి. అందుకే యేసు ప్రభువు వారిని ఈ లోకము నుండి తీసుకొని వెళ్ళమని చెప్పుట లేదు కాని వారిని ఈ లోకములో కాపాడమని ప్రార్ధిస్తున్నాడు.
"సత్యమునందు వారిని ప్రతిష్టింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్టింపబడునట్లు వారి కొరకు నన్ను ప్రతిష్టించుకొనుచున్నాను" ఇక్కడ ప్రతిష్టించుట గురించి చెబుతున్నారు. ప్రతిష్టించుట అంటే ఒక ప్రత్యేక కార్యానికి ఉద్దేశించబడి వేరు చేయబడిన వారు. ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు దేవుని వాక్కు కోసం, సత్యము కోసం వారిని వేరు చేయమని అడుగుతున్నారు. తండ్రి , యేసు ప్రభువును ఎలా ఈ లోకమునకు పంపడం జరిగినదో అలానే యేసు ప్రభువు కూడా శిష్యులను పంపుచున్నారు. యేసు ప్రభువు వలె వారు ఈ లోకంలో జీవించాలి, వారు దేవుడు కారు , కాని వారి జీవితం ద్వారా దేవున్ని తెలియజేయవలసిన భాధ్యత వారి మీద ఉంది. అందుకే వారు యేసు ప్రభువు తండ్రి చిత్తమును చేయడానికి ఎలా ఉన్నారో , శిష్యులు కూడా యేసు ప్రభువును తెలియజేస్తూ ఉండాలి.
ప్రార్ధన : ప్రభువా మీరు ఈ లోకములో ఉన్నప్పుడు, మీ శిష్యులను ప్రతి ఆపద నుండి కాపాడారు, అన్ని రకాల శోదనల నుండి, సమస్యల నుండి , అవిశ్వాసం నుండి సాతాను నుండి , ఈ లోక ఆశల నుండి, చెడు గుణాల నుండి వారిని కాపాడారు. మేము ఇప్పుడు ఈ లోకములో జీవిస్తున్నాము, మిమ్ములను నమ్మి, మీ వాక్కు తెలుసుకొని పాటించే వారు మీ శిష్యులు, అనుచరులు అవుతారు అని తెలుసుకుంటున్నాము. మీ శిష్యులను మీరు అన్ని విధాలైన సమస్యల నుండి కాపాడిన విధముగా మమ్ములను కాపాడండి. మిమ్ములను అనుసరించినట్లయితే మిమ్ములను లోకము ద్వేషించినట్లే మమ్ములను కూడా ఈ లోకము ద్వేషిస్తుంది, అది మమ్ములను ద్వేషించిన మిమ్ములను విడనాడకుండా జీవించేలా మమ్ము దీవించండి. ప్రభువా మేము ఈ లోకములో జీవిస్తూ ఎలా అయితే మీరు తండ్రిని లోకమునకు తెలియ పరిచారో , మీ శిష్యులు ఎలా తండ్రిని లోకమునకు తెలియ పరచాలి అని మీరు కోరుకున్నారో మేము అలా చేసే విధముగా మమ్ము ఆశీర్వాదించండి. ఓ ప్రభువా మేము ఈ లోకములో మిమ్ములను, సత్యమును, నిత్య జీవమును తెలియజేయుటకు మమ్ములను ప్రతిష్టించండి. ఆమెన్
అనుదిన ఆత్మీయ అహరం, యోహాను 17:1-11
యోహాను 17:1-11
22.5.23
అనుదిన ఆత్మీయ ఆహారం , యోహాను 16:29-33
యోహాను 16:29-33
అందుకు ఆయన శిష్యులు "ఇప్పుడు మీరు దృష్టాంతములతోకాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు, ఒకరు మిమ్ము అడుగనవసరము లేదనియు ఇపుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవునినుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము" అనిరి. అపుడు యేసు "ఇపుడు మీరు నన్ను విశ్వసించు చున్నారా? ఇదిగో ! మీరు నన్ను ఒంటరిగ వదలి, చెల్లాచెదరై, ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కాని, నేను ఒంటరిగా లేను. ఎలయన, తండ్రి నాతో ఉన్నాడు. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు కాని, దైర్యము వహింపుడు. నేను లోకమును జయించితిని" అని చెప్పెను.
ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు ఆయన గురించి తెలుసుకున్నట్లుగా మాటలాడుతున్నారు. వారి పూర్తి విశ్వాసాన్ని వెల్లడిచేస్తున్నారు. ఇక్కడ వీరు ఏమి మాట్లాడుతున్నారు? యేసు ప్రభువుకు మొత్తము తెలుసు అని అంటున్నారు. ఎలా వారు ఇది తెలుసుకోగలిగారు. యేసు ప్రభువుకు శిష్యుల మనసులలో ఏమి ఉన్నదో తెలుసు. అందుకే ఆయన వారు ఏదో ఆయనను అడగదలుచుకున్నారు అని ఆయనే వారితో ఆ మాటలను చెబుతున్నారు. 19 వ వచనంలో. ఇవన్నీ గ్రహించిన శిష్యులు ఆయనే శక్తి ఏమిటి, ఆయనకు ఎలా సమస్తము తెలుసు అని తెలుసుకున్నారు, అంతేకాక వారి మనసులలో ఉన్న భావాలు కూడా ప్రభువుకు తెలుసు అని గ్రహించారు. అందుకే ఆయన సర్వజ్ఞుడు అని వారు అంటున్నారు. మనం ఏమి అడుగకుండానే మన మనసులో ఉన్న భావం ఆయనకు ఏరుకనే.
ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా ? అని యేసు ప్రభువు అడుగుతూ ఎలా వారి విశ్వాసం పరీక్షకు గురి అవుతుందో తెలుపుచున్నారు. మనం దేవుని విశ్వసిస్తున్నాము మనం ఎటువంటి కష్టాలలో కూడా వెనుకడుగేయం అని అనుకుంటూ ఉంటాము. మనకు ఇప్పుడు ఆయన ఎవరో తెలుసు అనుకుంటాం. నిజానికి మనం చాలా బలహీనులం, మన విశ్వాసాన్ని చూపించవలసిన సమయం వచ్చినప్పుడు లేక మనం ఏదైనా పరీక్షకు గురి అయినప్పుడు మన విశ్వాసం ఎంత గట్టిదో తెలుస్తుంది. శిష్యులు యేసు ప్రభువు సర్వజ్ఞుడు అని ఆయనకు అంతా తెలుసని, ఆయన అన్నియు చేయగలడని , సర్వశక్తివంతుడని తెలిసి కూడా ఆయనను వదలి పెట్టి వెళ్లిపోయారు. ఎందుకు ఇలా చేశారు అంటే వారికి నమ్మకం లేక కాదు, వారి జీవితాన్ని పూర్తిగా అర్పించడానకి వారు సిద్దపడలేదు, ఇహపరమైన జీవితంమీద మాత్రమే ఆశ కలిగి ఉండటం వలన.
నేను ఒంటరిగా లేను
యేసు ప్రభువు నేను ఒంటరిగా లేను అని అంటున్నారు. కారణం కూడా ఆయనే చెబుతున్నారు. ఎందుకు శిష్యులు అందరు వదలిపెట్టి వెళ్ళిపోయిన ఆయన ఒంటరిగా ఉండరు అంటే తండ్రి ఆయనతో ఉంటారు. తండ్రి దేవునితో ఆయన ఎప్పుడు కలిసి ఉంటారు. వీరి సంబంధం విడదీయలేనిది. తండ్రి కోసం కుమారుడు ఏమి చేయడానకి కూడా వెనుకాడడు, అదే విధముగా తండ్రి కుమారుడు అడిగిన ప్రతిదీ కూడా ఇస్తాడు. వీరి బంధం శిష్యులు మరియు యేసు ప్రభువుల బంధం లాంటిది కాదు, కాని శిష్యుల యేసు ప్రభువు బంధం కూడా తండ్రికి మరియు యేసు ప్రభువుకు మధ్య ఉన్న బంధంగా దృఢంగా ఉండాలి. యేసు ప్రభువు శిష్యుల గురించి ప్రార్ధించే సమయంలో మరియు ఈ అధ్యాయంలో కూడా యేసు ప్రభువునితో మన బంధం దృఢంగా ఉండాలని , నేను తండ్రి యందును తండ్రి నాయందు ఉన్నట్లు మీరు నాయందు ఉండాలి అని ప్రభువు అడుగుచున్నారు. అప్పుడు మనం కూడా మిగుల ఫలవంతం అవుతాము.
"మీరు కష్టలపాలగుదురు కాని ధైర్యం వహింపుడు. నేను లోకమును జయించితిని." యేసు ప్రభువు తన శిష్యులకు తమ జీవితములో ఎటువంటి కష్టం రాదు అని కాని వారి జీవితం ఈలోకమమున సంతోషకారముగానే ఉంటుంది అని కాని చెప్పలేదు. వీటి అన్ని పొంది కూడా ఆయన ఈ లోకాన్ని జయించాడు. ఈ లోకాన్ని జయించుటకు మనం వీటితోటి పోరాడాలి, అలా కాకుండా ఈ లోకంతో మనం లాలూచీ పడినట్లయితే మనం మనల్ని కోల్పోతాము, మరియు ఈలోకానికి బానిసలుగా మిగిలిపోతాము. అలా కాకుండా యేసు ప్రభువు వలె జీవించినచో మనం ఈ లోకాన్ని జయించవచ్చు. తన శిష్యులు ఎప్పుడుకూడా అధైర్యంగా ఉండకూడదని , అన్ని కష్టాలు ఉన్న కూడా వారు శాంతిని పొందుటకు యేసు ప్రభువు వారికి భరోసా ఇస్తున్నాడు. ఎప్పుడ అయితే శిష్యులు కూడా యేసు ప్రభువు వలె జీవిస్తారో వారి జీవితాలలో కూడా అందరు వదలి వెళ్ళిన వారు క్రుంగిపోరు, దేవుడు వారికి తోడుగా ఉంటారు.
ప్రార్దన : ప్రభువా మీరు సర్వజ్ఞులు అని తెలుసుకున్న శిష్యులు మిమ్ములను ఏమి అడుగకుండానే, మీరు వారి మనసులలో భావాలు తెలుసుకున్నరాని గ్రహించి మీ గొప్పతనం గురించి వెల్లడి చేస్తున్నారు. మేము మీ గురించి పూర్తిగా తెలిసికూడా అనేక సమయాలలో శిష్యుల వలె మాకు వచ్చే భాద్యలు, కష్టాలు చూచి మిమ్ములను వదలి వెళ్ళి పోతున్నాము, అటువంటి పరిస్తితులలో మమ్ములను క్షమించండి. మేము మిమ్ములను వదలిపెట్టకుండా , ఎల్లప్పుడు మిమ్ము అంతిపెట్టుకొని జీవించేలా చేయమని వేడుకుంటున్నాము. మిమ్ములను అందరు వదలి పెట్టిన తండ్రి మీకు ఎలా తోడుగా ఉన్నారో మీరు మాకు ఆవిధముగానే తోడుగా ఉండండి. మా జీవితాలలో కూడా అందరు మమ్ములను విడిచిపెట్టె సమయాలలో మీ సాన్నిధ్యం మేము పొందుతూ నిజమైన మీ ఆధారణకు మమ్ములను అర్హులను చేయండి. మీ శాంతి మాకు ఎల్లవేళలా ఉండేలా మమ్ము దీవించి, ఈ మీ వలె మాకు ఈ లోకం మీద విజయాన్ని దయచేయండి. ఆమెన్
19.5.23
అనుదిన ఆత్మీయ ఆహారం, యోహను 16: 23-28
యోహను 16: 23-28
సువిశేషం : నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియును అడుగలేదు. అడుగుడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. "నేను మీకు దృష్టాంతములతో చెప్పితిని. కాని , తండ్రిని గురించి దృష్టాంతములతొగాక , తేట తెల్లముగచెప్పు గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి విన్నవింతునని నేను చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును . నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెల్లుచున్నాను" అని పలికెను.
"మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును". యేసు ప్రభువు మీరు నా పేరిట ఏమి అడిగినను మీకు ఇచ్చును అని చెబుతున్నారు. ఎందుకు మనం యేసు ప్రభువు పేరిట ప్రార్ధన చేస్తాము అంటే యేసు ప్రభువు మనకు ఈరోజు సువిశేషంలో చెబుతున్నారు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను తండ్రి మీకు అనుగ్రహిస్తారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు తాను ఏ అధ్బుతం చేసిన మొదట తండ్రికి ప్రార్దన చేసేవారు. ప్రార్దన అనేది తండ్రి దేవునితో మానవుడు ఒక గొప్ప సంబంధం ఏర్పరుచుకునే సాధనం. యేసు ప్రభువు ఈ లోకమునకు రాక మునుపు తన తండ్రితో తనకు ఉన్న బంధం, అలానే కొనసాగించినది ఈ ప్రార్దన అనే సాధనం ద్వారం. మనం కూడా యేసు ప్రభువు వలె తండ్రి తో బంధం ఏర్పరుచుకోవాలి. అది ఏర్పరుచుకోవాలంటే ప్రార్ధించాలి. తండ్రితో యేసు ప్రభువుకు ఉన్న బంధం వల్ల ఆయన ఏమి అడిగిన అది జరిగింది. మన జీవితంలో యేసు ప్రభువు వలె జీవిస్తే , మనం ఏమి అడిగిన అది జరుగుతుంది. మనం చేసే ప్రార్దన యేసు ప్రభువు పేరిట చేయడం అంటే ఆయనలా చేయడం, జీవించడం .
"ఇంత వరకు నా పేరిట మీరు ఏమి అడుగలేదు" - ఎందుకు యేసు ప్రభువు మీరు ఇంత వరకు నా పేరిట ఏమి అడుగలేదు అని అంటున్నారు ? అంటే యేసు ప్రభువు శిష్యులుకు ఇంత వరకు ఏమి అడిగే అవసరం రాలేదు. శిష్యులకు తండ్రికి , కుమారునికి మధ్య ఉన్న ఐక్యత పూర్తిగా తెలియదు. శిష్యులు ప్రభువుని ప్రార్దన నేర్పమని అడిగినప్పుడు ప్రభువు వారికి పరలోక ప్రార్దన నేర్పుతున్నారు. శిష్యులు ఈ సమయంలో తండ్రికి మరియు కుమారునికి మధ్య గల బంధం గురించి తెలుసుకుంటున్నారు. వారు ఇద్దరు ఎంతో ఐక్యమై ఉన్నారు. ఒక సారి మనకు తండ్రి మరియు కుమారుని మధ్య గల బంధం తెలిసినట్లయితే మనం చేసే ప్రార్ధన ఎల్లప్పుడు ఆయన పేరు మీద చేస్తాము. ఎందుకంటే తండ్రికి కుమారుడు అంటే అంత ప్రేమ. మరియు కుమారునికి తండ్రి అంటే అంతే ప్రేమ. తండ్రి కోసం కుమారుడు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.
"మిమ్ము గురించి విన్నవింతునని నేను చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్దనుండి వచ్చితినని విశ్వసించితిరి. కనుక, తండ్రి స్వయముగ మిమ్ము ప్రేమించును" ఇక్కడ మనం కుమారుడంటే తండ్రికి ఎంత ప్రేమో తెలియ జేస్తున్నారు. మనం ఆయన పేరిట ప్రార్దన చేసినప్పుడు , యేసు ప్రభువు మన కోసం తండ్రిని అడుగుతాను అని చెప్పటం లేదు. కాని కుమారుడంటే తండ్రికి ఇష్టం కనుక , కుమారున్నీ ప్రేమించిన వారిని తండ్రి ఎంతగానో ప్రేమిస్తారు. మరియు వారికి కావలసినవి మొత్తం తండ్రి సమకురుస్తారు. ఇక్కడ యేసు ప్రభువును నమ్మడం, లేక విశ్వసించడం ముఖ్యం , ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన వారు యేసు ప్రభువును విశ్వసించలేదు.శిష్యులు కొన్ని సార్లు యేసు ప్రభువును విడనాడి ఉండవచ్చు కాని వారు ఆయన్ను ప్రేమించారు. ఆయనను తమ గురువుగా అభిమానించారు. శిష్యులు చేసిన మంచి పని ఏమిటి అంటే ఆయనను విశ్వసించడం,ప్రేమించడం. మనము కూడా ఆయనను విశ్వసించమని, మరియు ప్రేమించమని, ఆయన శిష్యులు అవ్వమని ఇది ఒక ఆహ్వానం.
"నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని. మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెల్లుచున్నాను" యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన ఈ చివరి సందేశంలో తాను ఎక్కడ నుండి వచ్చినది, ఎక్కడకు వెళుతున్నది అని తెలియచేస్తున్నారు. తన యొక్క మహిమాన్వత స్థానానికి మరల వెళుతున్నారు. ఈలోకంలో తన యొక్క పనిని పూర్తి చేసుకున్నాడు. తాను వెళ్ళేముందు తన శిష్యులు ఏవిధంగా సంపూర్ణ సంతోషం కలిగి ఉండాలంటే ఏమి చేయాలో ప్రభువు చెబుతున్నారు. మన సంతోషం సంపూర్ణంగా ఉండాలంటే మనం యేసు ప్రభువు వలె జీవించాలి. యేసు ప్రభువు పేరిట ప్రార్ధించాలి. యేసు ప్రభువు వలె దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. యేసు ప్రభువును ప్రేమించాలి, మరియు ఆయనను విశ్వసించాలి. అప్పుడు మనం తండ్రి చేత ప్రేమించబడుతాం. తండ్రి చేత అన్నీ సమకూర్చబడుతాం. మరియు సంపూర్ణ సంతోషం పొందుతాం.
ప్రార్ధన : ప్రభువా! ఈలోకంలో మిమ్ములను ప్రేమించక , విశ్వసించక నిజమైన సంతోషమునకు, మీ యొక్క ప్రేమకు, మీ అనుగ్రహాలకు దూరంగా ఉన్నాము. అటువంటి సందర్భాలలో మమ్ములను క్షమించమని వేడుకుంటున్నాము. ఈలోకం వలె అనేక సార్లు మేము ప్రవర్తిస్తున్నాము. మీకు దూరంగా వెళుతున్నాము. మీరు ఇస్తాను అంటున్నా సంతోషం మాకు దయ చేయండి. ఆ సంతోషం పరిపూర్ణమగునట్లు చేయండి. అప్పడు మీకును తండ్రికిని గల సంబంధం తెలుసుకొనే విధంగా మాకు మీ ప్రేమను తెలియ చేయండి. ప్రభువా! తండ్రి మిమ్ములను ప్రేమించే వారిని ప్రేమిస్తారు అని తెలుపుచున్నారు. మా జీవితంలో ప్రభువా ! ఈ నిజమైన ప్రేమను తెలుసుకొనే భాగ్యం దయ చేయండి. మేము మిమ్ములను ప్రేమించేలా, విశ్వసించేలా చేసి, తండ్రి ప్రేమను మేము అనుభవించే విధంగా మమ్ము అనుగ్రహించమని వెడుకొనుచున్నాము. ఆమెన్
18.5.23
అనుదిన ఆత్మీయ ఆహారం, యోహను 16:20-23
యోహను 16:20-23
సువిశేషం: మీరు శోకించి, విలపింతురు. కాని, లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు. కాని మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగ చెప్పు చున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదనపడును. కాని, బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇపుడు దుఃఖముతో ఉన్నారు. కాని, నేను మిమ్ము మరల చూచెదను. అపుడు మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవడు తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమియు అడుగరు.
మన జీవితంలో వచ్చిన కొన్ని కష్టమైన సందర్భాలలో అనేకం ఉండవచ్చు. అటువంటి ఒక సందర్భాన్ని మనసు నందు వుంచి ఈ సువిశేష భాగాన్ని ధ్యానిస్తే మనకు ఇది ఎక్కువగా అర్ధం అవడానికి అవకాశం ఉంది. అప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. మనం దేవుడి మీద నమ్మకంగా ఉన్నమా? లేక మనకు వచ్చిన కష్టానికి మన మీద మనం కోపంగా , దీనంగా ఉన్నమా? , భయంగా ఉన్నమా? ఎందుకు ఇన్ని బాధలు చనిపోవడం మేలు అనుకుంటున్నమా? కొన్ని సార్లు మనకు వచ్చే బాధల్ని తట్టుకోలేక మనల్ని మనం శపించుకుంటాం. కాని ఈ సువిశేషం ద్వారా యేసు ప్రభువు మనలను ఓర్పు కలిగి ఉంటే మీ దుఃఖం , సంతోషంగా మారుతుంది అని చెపుతున్నారు.
యేసు ప్రభువు తన శిష్యులు తమకు ఎటువంటి రోజులు రాబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే వారికి వచ్చే కష్టాలు గురించి ముందుగానే చెబుతున్నారు. వారికి శోకించే, విలపించే ,దుఃఖించే సమయం వస్తుంది అని వారిని సిద్ధ పరుస్తున్నారు. అంతే కాదు వారి శోకం , విలాపం , దుఃఖం మారిపోయి ఆనందించే సమయం వారికి రానున్నది అని ప్రభువు వారికి వెల్లడిచేస్తున్నారు. మరలా వారు యేసు ప్రభువును చూసే రోజు వస్తుంది. వారికి ఆనందించే రోజు వస్తుంది అనే భరోసా వారికి ప్రభువు ఇస్తున్నారు. మనం ఆయన సాన్నిధ్యం మరియు ఆయన బహుమానం మనం పొందాలి అంటే మనం ఓర్పుతో వేచి ఉండాలి.
యేసు ప్రభువు ఇక్కడ ఒక ప్రసవ వేదనలో ఉన్న స్త్రీని ఉదాహరణగా చెబుతున్నారు. ఆమె ప్రసవించిన తరువాత తాను పొందిన బాధను, వేదనను మొత్తం మరచిపోతుంది. తాను ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన ఆనందం ఆమెకు ఉంటుంది. ఆ ఆనందం ఆమె పొందిన వేదన కన్నా చాలా గొప్పది. తన జీవితానికి ఒక నూతన అర్ధాన్ని ఇచ్చేది అవుతుంది.
ప్రతి తల్లికి తెలుసు, తన యొక్క వేదన కొద్ది సమయమే కావచ్చు, అది భరించలేనిదిగా ఉండవచ్చు ఆ స్త్రీకి. కాని తరువాత వచ్చే ఆనందము కోసం ఆమె ఆ బాధను భరించడానికి సిద్దంగానే ఉంటుంది.
మన జీవితంలో కూడా ఎటువంటి కష్టం లేకుండా మనకు అన్నీ సమకూరినా , దానిని మనం అనుభవించిన కాని, దాని మాధుర్యం మనం పొందలేము. కాని మన కష్టంతో కూడిన దాని ఫలితముగా మనకు వచ్చే మంచికి మనం ఎక్కువ విలువనిస్తాము. దాని మాధుర్యం గొప్పగా ఉంటుంది.
మనం చేయవలసినది, ఆయన మీద నమ్మకం ఉంచి వేచి ఉండాలి. కాని మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అది అంత సులువు కాదు. మనకు మంచి జరుగుతుంది అని మనం నమ్మక పోవచ్చు. మనకు మంచి జరిగే రోజు చాలా దూరం ఉండవచ్చు. ఆయన మీద నమ్మకం ఉంటే మనం ఎంత కాలమైన ఆయన కోసం ఎదురుచూస్తాం. ఆయన మీద మన విశ్వాసం ఎంత గొప్పది అనేది తెలిసేది, మనం ఆయన్ను చూడకుండానే, ఆయన సాన్నిధ్యం పొందకుండానే ఆయన మీద నమ్మకంతో ఎదురు చూడటంలో.
"నేను మిమ్ము మరల చూచెదను అప్పడు మీరు సంతోషింతురు". ఇక్కడ యేసు ప్రభువు నేను మిమ్ము మరలా చూచెదను అని చెబుతున్నారు. ఇది రెండు సందర్భాల గురించి కావచ్చు. తాను మరణాన్ని జయించిన తరువాత ఆయన పునరుత్థాన క్రీస్తు వారిని చూసే సమయం. మరల ఆయన తుది తీర్పు సమయంలో ఆయన మరలా చూడటం గురించి చెబుతున్నారు. యేసు ప్రభువుని చూడటం అంటే మనం ఆనందించే సమయం. ఆయన వారికి ఇంకొక విషయం కూడా చెప్పారు. నేను ఎల్లప్పుడు మీతో వుంటాను అని చెప్పారు. అంటే మనం ఎల్లప్పుడు ఆనందంగా ఉండవచ్చు. ఆయన సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడు అనుభవించడం మనం నేర్చుకున్నప్పుడ. కనుక క్రీస్తు అనుచరులమైన మనం ఏళ్ళప్పుడు ఆయన సాన్నిధ్యం పొందడం నేర్చుకోవాలి.
ఆయన మనకు ఇస్తాను అని చెప్తున్న సంతోషం శాశ్వతమైనది. దానిని ఎవరు మీ నుండి తీసివేయలేరు అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి ఈ శాశ్వతమైన సంతోషం, ఎందుకు ఎవరు దీనిని మన నుండి తీసివేయలేరు అంటే అది అంతరంగీకమైనది. మన ఈ లోక కష్టాలు, బాధలకు అది అతీతమైనది. నేను రక్షింపబడ్డాను అనే సత్యం తెలుసుకోవడం ద్వారా వచ్చే సంతొషం అది. దాని అర్ధం నేను ఈ లోకంలో ఉండే సమస్యలకు అతీతుడును కాను, కాని ఇది తెలుసుకున్న తరువాత నేను పొందే బాధ, కష్టం నన్ను ఏమి చేయలేదు. ఆ సంతోషం మనకు చాలా ముఖ్యం. పునీతులు ఇటువంటి జీవితంను వారు అనుభవించారు. అందుకే వారు ఎటువంటి కష్టాలు అనుభవించిన, వారి జీవితాలలో ఎప్పుడు సంతోషాన్ని అనుభవించారు. వారి సంతోషాన్ని ఈ కష్టాలు తీసి వేయలేకపోయాయి.
ప్రార్దన : ప్రభువా! నేను నా జీవితంలో వచ్చే కష్టాలకు, బాధలకు క్రుంగి పోతున్నాను. కొన్ని సార్లు నాకు ఎందుకు ఇన్ని కష్టలు అని నన్ను నేను అసహ్యంగా చూస్తున్నాను. మీరు చెప్పిన విధంగా ఓర్పు కలిగి ఉండలేకపోతున్నాను. అటువంటి సమయాలలో నాకు తోడుగా ఉండి మీకు కోసం ఎదురుచూసే మనసు ఇవ్వండి. నా జీవితంలో వచ్చే కష్టలలో మీ సాన్నిధ్యం పొందే భాగ్యం ఇవ్వండి దాని ద్వార మీరు ఇచ్చే సంతోషాన్ని సదా కాలము నేను పొందగలగుతాను. ఆమెన్
17.5.23
అనుదిన ఆత్మీయ ఆహారం , యోహను 16:16-20
యోహను 16:16-20
అనుదిన ఆత్మీయ ఆహారం, యోహాను 16: 12-15
యోహాను 16:12-15
సువిశేషం : నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది. కాని, ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన, సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపక తాను వినిన దానినే బోధించును. జరుగబోవు విషయములను మీకు తెలియ చేయును. ఆయన నన్ను మహిమ పరుచును . ఏలన , ఆయన నాకున్న దానిని , నా నుండి గైకొని దానిని మీకు తెలియ చేయునని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది. అందుచేత నానుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని.
"ఇప్పడు మీరు వానిని భరింపలేరు", ఎందుకు వీరు యేసు ప్రభువు చెప్పే వాటిని భరించలేరు, కారణం ఏమిటి అంటే వీరు కష్టాలు, బాధలు పొందటానికి ఇంకా సిద్ధంగా లేరు. అందుకే యేసు ప్రభువు వారికి ఈ విషయమును వెల్లడిచేస్తున్నారు. ఇది యేసు ప్రభువుని వీడ్కోలు ఉపదేశం, అంటే వారు ఆయనను ఒక రాజుగా జయ జయ నినాధాలతో యెరుషలేము నగరములోనికి ఆహ్వానించిన తరువాత ఇది జరుగుతుంది. శిష్యులు యేసు ప్రభువును ఒక వీరోచితమైన రాజుగా చూస్తున్నారు. కాని యేసు ప్రభువు వారికి రాబోయే కష్టముల గురించి చెబుతున్నారు. ఆయన వెళ్ళిన తరువాత వారి జీవితాలలో వచ్చే హింసల గురించి యేసు ప్రభువు వారికి పూర్తిగా చెప్పటం లేదు.
ఎందుకు యేసు ప్రభువు వారికి వారు పొందబోవు శ్రమల గురించి పూర్తిగా చెప్పడం లేదు? వీరు ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత చాలా క్రూరమైన హింసలకు గురిఅయ్యారు, అప్పుడు వాటిని భరించారు కాని ఇప్పుడు వీరికి ఇటువంటి వాటిని తట్టుకునే శక్తి లేదు, అందుకే వారికి పవిత్రాత్మ వచ్చిన తరువాత ఇవన్నీ అర్ధం అవుతాయి అని చెబుతున్నారు. దేవుడు మనలను మనం భరించ లేని కష్టాలుకు గురిచేయరు. అందుకే వారు పొందబోయే హింసలు ,కష్టాలు అన్ని వారికి చెప్పడం లేదు. ఇవన్నీ తెలియజేయడానికి, ఆ కష్ట కాలంలో పవిత్రాత్మ వారికి సహాయం చేస్తుంది. వారికి యేసు ప్రభువు తండ్రి దగ్గరకు పోయేంత వరకు చెప్పేమాటలు, రాబోవు పరిస్థితులను తట్టుకొనే విధంగా వారికి ఒక తర్ఫీదు కాలం ఆవుతుంది. అంతే కాదు వారికి ఆ సమయాల్లో ఏమి చేయాలో , ఏమి చెప్పాలో కూడా పవిత్రాత్మ వారికి తెలియ జేస్తుంది. దీనిని మనం యేసు ప్రభువు శిష్యులు , పాలకులు, పెద్దలు మొదలగువారి ముందు మాటలాడినప్పుడు వారు ఎటువంటి జ్ఞానం తో మాటలాడింది, మనం అపోస్తుల కార్యాలలో చూస్తాము. దీనికంతటికి తోడ్పడు ఇస్తుంది, నడిపిస్తుంది, పవిత్రాత్మయే.
"ఆయన సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును" : యేసు ప్రభువు వలె సత్యమును బోధించుటకు, సత్యమునకు నడిపించుటకు ఇప్పుడు పవిత్రాత్మ యొక్క అవసరం శిష్యులకు ఉంది. సత్యం మనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మన పాపమును అది చూపిస్తుంది. మన చెడు జీవితమును మనకు తెలుపుతుంది. ఈరోజుల్లో మనం ఏది మనకు అనుకూలంగా ఉంటుందో దానికి పాటించుటకు ఇష్ట పడుతున్నాము. సత్యమును పాటించుటకు ఇష్టపడుటలేదు. సత్యం మనలను అనేక బందనముల నుండి విముక్తులను చేస్తుంది. సత్యం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువు నేనే సత్యమును జీవమును మార్గమును అని చెప్పారు.
పవిత్రాత్మ సత్య స్వరూపి , అంటే మనలను చేడుగా నడిపించడు, మనలను ఎక్కడకు నడిపించాలి? మనం గమ్యం ఏమిటి? యేసు ప్రభువు నేనే మార్గమును అని చెబుతున్నారు. మన మార్గం ఆయనే ఖచ్ఛితముగా మనలను పవిత్రాత్మ యేసు ప్రభువు దగ్గరకు నడిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువు సత్యము. అంతే కాదు యేసు ప్రభువు తన గురించి చెప్పేటప్పుడు, నా అంతట నేను ఏమి చెప్పుటలేదు, నా తండ్రి నుండి చూసిన దానిని, వినిన దానినే నేను చెబుతున్నాను అని చెప్పారు. పవిత్రాత్మ కూడా తనంతట తాను ఏమి చేయదు, తాను వినిన దానినే బోధించును.
"జరుగబోవు విషయములను మీకు బోధించును", పవిత్రాత్మ క్రైస్తవ సంఘానికి సహాయకునిగా , అనేక సమస్యలను తీర్చుటలో వీరికి సహాయ పడింది. అనేక సార్లు పవిత్రాత్మ వారికి ఏమి చేయాలో నేర్పుతుంది. పౌలు గారి మీద అందరు వ్యతిరేకంగా ఉన్నా, పవిత్రాత్మ ఆయన మీదకు వస్తుంది , ఎందుకంటే ప్రభువే ఆయన్ను ఎన్నుకున్నారు కాబట్టి. పవిత్రాత్మ వీరితో ఉన్నప్పుడు వీరు యేసు ప్రభువు జ్ఞానం కలిగి ఉన్నారు. వారు ఎప్పుడు ఏమి చెప్పాలో పవిత్రాత్మ చెబుతుంది.
ఆయన నాకున్న దానిని, గైకొని మీకు తెలియజేయును : ఇక్కడ యేసు ప్రభువు పవిత్రాత్మ యొక్క తత్వాన్ని తెలియ జేస్తున్నారు. ఆయన తెలుసుకున్నదానిని, వినిన దానిని తీసుకొని మీకు తెలియజేయును, తనంతట తాను ఏమి చెప్పడు. అంటే తండ్రికి ఉన్నదంతయు నాది, దానిని ఆయన మీకు ఇస్తాడు, తెలియ జేస్తాడు, అని యేసు ప్రభువు చెబుతున్నారు. యోహను , తండ్రి అంతయు ఆయనకు ఇచ్చెను అని చెబుతున్నారు. మనకు అంటే తెలియ పరచడానికి పవిత్రాత్మ మనకు సహాయం చేస్తుంది. అన్నిటి మీద యేసు ప్రభువుకు అధికారం ఉన్నట్లు, మరియు అంతా ఆయనదే అని పవిత్రాత్మ తెలియజేస్తుంది. ఆయన ఇచ్చే రక్షణ తెలియ జేస్తుంది. దానికి ఏమి చేయాలో తెలియ జేస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా పవిత్రాత్మ యేసు ప్రభువును మహిమ పరుస్తాడు. పవిత్రాత్మ ఎప్పటికీ ఆయనకు వ్యతిరేకముగా ఏమి చెప్పడు.
యేసు ప్రభువు అంతయు తండ్రి దగ్గర నుండి పొందుతున్నాడు. తండ్రిని చేరుకోవడానికి ఆయనే మార్గం. యేసు ప్రభువు తండ్రి దగ్గరకు పోతున్నప్పుడు పవిత్రాత్మకు అంతయు అప్పగిస్తున్నారు, ఇప్పుడు యేసు ప్రభువును తెలుసుకోవడానికి పవిత్రాత్మ మార్గం అవుతుంది. అంతేకాదు యేసు ప్రభువు చెప్పినవన్ని తెలియజేస్తుంది , ఆయన శిష్యులను నడుపుతుంది. మార్గ చూపరి అవుతుంది.
ప్రార్ధన : ప్రభువా ! మీరు తండ్రి దగ్గరకు వెళుతున్నప్పుడు మీ శిష్యులకు తోడుగా ఉండుటకు, మరియు వారికి మీ వద్దకు నడిపించుటకు పవిత్రాత్మను వారికి సహాయంగా పంపారు. పవిత్రాత్మ వారికి అన్ని విధాలుగా సహాయ పడుతూ , సంపూర్ణ సత్యమగు మీ వైపు నడిపినది, కాని ప్రభువా ఈ లోకంలో జీవిస్తూ మీ దరి చేరాలని కోరిక ఉన్న అనేక సార్లు చెడు మార్గాలలో నడుస్తున్నము ప్రభువా, అటువంటి అపదల నుండి మాకు సహయం చేయుటకు మాకు తోడుగా ఉండుటకు పవిత్రాత్మను మాకు అనుగ్రహించండి. ఆమెన్
15.5.23
అనుదిన ఆత్మీయ ఆహారం , యోహను 16:5-11
యోహను 16:5-11
కాని, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడు "నీవు ఎక్కడకు పోవుచున్నావు"? అని నన్ను అడుగుట లేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందున మీ హృదయములు దుఃఖముతో నిండి వున్నవి. ఐనను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ వద్దకు పంపేదను. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకన వారు నన్ను విశ్వసించుట లేదు. నీతిని గురించి ఎందుకన , నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను. ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకన, ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది.
యేసు ప్రభువు తన తండ్రి వద్దకు పోయేముందు, తన వీడ్కోలు ఉపదేశంను తన శిష్యులకు ఇస్తున్నాడు. ఈ సమయంలో శిష్యులు ఎవరు ఆయనను నీవు ఎక్కడకు వెళుతున్నావు? అని అడగలేదు. అందరు బాధలో ఉన్నారు, ఆయన వారిని వీడి పోతున్నారు కాని పూర్తిగా వారికి అక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. వారికి అర్ధం అయిన విషయం వారి గురువు వారి నుండి వెళ్ళిపోతున్నారు. అందుకు వారు బాధ పడుతున్నారు. యేసు ప్రభువు ఈ మాటలను మొదటి సారి చెప్పడం లేదు, అనేక సార్లు చెప్పి ఉన్నారు. ఇప్పుడు చెబుతున్న మాటలు ఖచ్ఛితముగా వారిలో ఒక మార్పు తీసుకువస్తున్నాయి, ఎందుకంటే వారు, యేసు ప్రభువుకు వ్యతిరేకముగా జరుగుతున్న పరిస్థితుల గురించి అవగాహన చేసుకుంటున్నారు. కనుక వారు ఏమి అడగడానికి సహసించలేదు. అంటే వీరికి పూర్తిగా ఆయనకు ఎటువంటి కష్టాలు వస్తున్నాయో తెలుసు అని కాదు అర్ధం. వారి దృష్టిలో ఇది వారికి అర్ధమయ్యే విషయం కూడా కాదు. కనుక దాని గురించి వారు ఏమి మాటలాడుటలేదు.
నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం : యేసు ప్రభువు నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని చెబుతున్నారు. ఎందుకు శ్రేయస్కరం అంటున్నారు అంటే ఆయన వెళితే ఓదార్చువాడు అయిన పవిత్రాత్మ వస్తాడు. ఆయన పాపము, నీతి , మరియు తీర్పు గురించి లోకామునకు నిరూపిస్తాడు. ఎందుకు వీటి గురించి లోకానికి తెలియచేయాలి? లోకం ప్రభువును తెలుసుకోవాలి, ఆయనను విశ్వసించాలి, పాపమును వదలి వేయాలి. లోకము యేసు ప్రభువును విశ్వసించక, అవిశ్వాసంతో జీవిస్తుంది. పాపము మానవున్ని ఏమి చేస్తుందో పవిత్రాత్మ తెలియజేస్తుంది. లోకం చేసిన తప్పు ప్రభువును విశ్వసించకపోవడం. నీతి గురించి లోకమునకు తెలియదు, నీతి లోకం దృష్టిలో క్షణికమైంది కాని నిజానికి అది శాశ్వతమైనది. అంతే కాదు పవిత్రాత్మ యేసు ప్రభువును నమ్మక , ఆయన చెప్పినట్లు జీవింపకపోతే వచ్చే తీర్పు గురించి తెలియచేస్తుంది. మనకు ప్రభువు నేర్పిన విషయములను అన్నింటిని గుర్తుకు తెస్తుంది.
అంతే కాదు ప్రభువు నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని శిష్యులకు చెప్పేది, ఇంకా ఎందుకంటే ప్రభువు మీదనే ఇంకా శిష్యులు ఆధారపడుతారు, కాని ప్రభువు వారి నుండి వెళ్ళిన తరువాత పవిత్రాత్మ సహాయంతో వారు లోకం అంతట ప్రభువు గురించి , దేవుని రాజ్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడ శిష్యులు కేవలం స్వీకరించేవారు కారు, ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత వారు ప్రభువును పంచే వారు అయ్యారు. దానికి ప్రభువు వారి వద్ద నుండి వెళ్లారు. దీనికి పవిత్రాత్మ వారికి సహాయం చేస్తుంది. యేసు ప్రభువు పాపము గురిచి చెబుతున్నారు,ముఖ్యంగా ఈ లోకం యొక్క ఘోరమైన పాపం ఏమిటి అంటే ఆయనను నమ్మక పోవడం, విశ్వసించక పోవడం. కొన్ని సార్లు మనం కూడా ఇలానే ఉంటూ వుంటాం. ఆయన చెప్పే మాటలను మనం పాటించక పోవడం.
నీతి గురించి ప్రభువు చెబుతున్నారు, ఇక్కడ యేసు ప్రభువు గురించి ఈ మాటలు వున్నవి. ఆయన తండ్రి దగ్గరకు వెళుతున్నారు. ఆయన నిత్యం ఉండువాడు. తండ్రి దగ్గరకు వెళ్ళిన ఆయన జీవించువాడు. ఆయన ఎంతో నీతిమంతుడు, ఆయన చేసినవి అన్ని నీతితో కుడినవే. కానీ లోకం ఆయన నీతిని అంగీకరించలేదు. ఆయన్ను సాతాను సాయంతో సాతానును వెడలగొడుతున్నాడు అని అన్నది, ఆయన మంచిని లోకం అంగీకరించలేదు. సబ్బాతు రోజున ఆయన చేసే మంచి వద్దు అన్నది. ఆయన కరుణను అంగీకరించలేక పోయింది. యోహను తన సువిశేషం మొదటిలోనే చెప్పాడు ఈ విషయం. దేవుడు వెలుగుగా లోకమునకు వచ్చినప్పటికీ మానవుడు వెలుగు దగ్గరకు పోవుటకు ఇష్ట పడలేదు, ఎందుకంటే మానవుని పాపం, అవినీతి ఎక్కడ ఈ వేలుగులో కనపడుతుందో అని , చీకటినే ప్రేమించాడు మానవుడు. వెలుగు దగ్గరకు పోవడానికి భయ పడ్డాడు. మనం కూడా కొన్ని సార్లు ఇలానే జీవిస్తూ ఉంటాం. దేవుని దగ్గరకు పోతే ఎక్కడ మన నిజ జీవితాలు బయట పడుతాయో అనుకుంటూ వుంటాం. అందుకే పవిత్రాత్మ మనకు పాపం దాని పర్యవసానం గురించి తెలియ చేస్తుంది అని ప్రభువు పలుకుతున్నారు.
మీరు నన్ను చూడరు,అని యేసు ప్రభువు చెబుతున్నారు. శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఆయన తండ్రి వద్దకు వెళ్ళిన తరువాత ఆయన వారికి దూరం అయి పోతారు. కాని వారికి ఆదరణ కర్తను పంపుతాను అని చెబుతున్నారు. ఈ అధరణ కర్త కేవలం వీరికి వీటిని చెప్పడమే కాదు వీరికి సహాయ పడుతుంది. పాపం చేయడం ద్వారా మనం దేవుని నుండి మనం పొందే ఎడబాటు గురించి తెలియచేస్తుంది. అంతే కాదు యేసు ప్రభువు ఈ పాపన్ని జయించుటకు చేసిన అన్ని కష్టాలును తెలియజేస్తుంది. మరియు సాతాను ను జయించిన దానిని తెలియజేస్తుంది. మనం కూడా క్రీస్తు ను అనుసరించి , పవిత్రాత్మ సహాయంతో సాతానును జయించుదాం.
ప్రార్దన : ప్రభువా మీరు తండ్రి వద్దకు వెళ్ళుటకు ముందుగ మీ శిష్యులను మీ ఎడబాటును తట్టుకోవడానికి వారిని ముందుగానే సిద్ధం చేశారు. మీరు మీరు ఎక్కడకి వెళుతున్నది, ఎందుకు వెళుతున్నది వారికి తెలియజేస్తున్నారు. మీ ఎడబాటులో వారని ఆధారపడే వారి నుండి ఆదరించే వారిగా మారుతున్నారు. మీరు పంపిన పవిత్రాత్మ వారిని ఇలా చేస్తుంది. మా జీవితంలో కూడా ప్రభువా మేము మాకు తోడుగా ఉండుటకు మీ ఆత్మను పంపంచి, మమ్ములను ఎప్పుడు కూడా మా విశ్వాసమందు గట్టిగా ఉండేలా చేయండి. మాకు ఎల్లప్పుడు కూడా మీ ఆత్మ తోడుగా ఉండే విధంగా మమ్ము దీవించండి. మీ పవిత్రాత్మ ఏ విధముగా అయితే పాపం గురించి, నీతి గురించి మరియు తీర్పును గురించి తెలియజేస్తున్నదో అవి మేము తెలుసుకొని మిమ్ము విశ్వసించి, ఎప్పటికీ పాపములో పడకుండా, మేము నీతి వంతమైన జీవితం ప్రతి నిత్యం జీవించి, మీరు తీర్పు తీర్చుటకు వచ్చినప్పుడు మిమ్ములను చూచుటకు, మీతో పాటు వుండుటకు కావలనసిన అనుగ్రహం దయచేయండి. ఆమెన్
14.5.23
అనుదిన ఆత్మీయ ఆహారం, యోహను 15:26-16:4
యోహను 15:26-16:4
సువిశేషం : నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చేడువాడు, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపి అగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్య మిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు. కనుక మీరు నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెంద కుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పితిని. వారు మిమ్ము ప్రార్ధన మందిరముల నుండి వెలివేయుదురు , మిము హత్య చేయు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయు చున్నానని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని, నన్నుగాని, ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచు కొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంత వరకు ఈ విషయములు మీతో చెప్పలేదు.
ఈనాటి దేవుని వాక్యం యేసు ప్రభువు పంపే పవిత్రాత్మ గురించి చెబుతుంది. పవిత్రాత్మను ప్రభువు ఓదార్చువాడు అని చెబుతున్నాడు. మరల పవిత్రాత్మ సత్య స్వరూపి అని చెబుతున్నాడు, యేసు ప్రభువు గురించి ఈ పవిత్రాత్మ సాక్షం ఇస్తుంది. ఇక్కడ ఓదార్పు యొక్క అవసరం ఏమిటి? అంటే యేసు ప్రభువు శిష్యులకు ఓదార్పు అవసరం ఉంది. వారు జీవించేది యేసు ప్రభువు వలె కనుక ఈలోక ప్రేమికులు వారిని చూసి, వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. వారిని అన్యాయముగా కష్ట పెడతారు. అంతే కాదు యేసు ప్రభువు చెప్పినట్లుగా ఆయన శిష్యులను చంపే వారు, దేవునికి సేవ చేస్తున్నట్లు భావిస్తారు. ఇది మనం అపోస్తుల కార్యాలలో చూస్తాము. పౌలు గారు మారు మనస్సు పొందక ముందు క్రైస్తవులను హింసిస్తు, తాను తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను అనుకుంటున్నారు.
ఈరోజు కూడా అనేక మంది వారి వారి విశ్వాసాలను పాటించుట కంటే కూడా క్రైస్తవల మీద దాడి చేయడం వారి విశ్వాసాన్ని పాటించడం అన్నంతగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల గురించి యేసు ప్రభువు ముందుగానే శిష్యులకు చెబుతున్నారు. తాను వారి నుండి తండ్రి దగ్గరకు వెళ్లేముందు, ఈ లోకం దాని తీరు గురించి శిష్యులకు ప్రభువు తెలియచేస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు , మిమ్ములను ప్రార్ధన మందిరముల నుండి వెలివేయుదురు అని చెబుతున్నారు, అంటే మనకు ఉన్న సమస్యలకు, కష్టాలకు బాధలకు, అన్నింటికీ దేవుడే తీర్చుతారు అని మనం నమ్ముతాము, అటువంటి దేవున్ని ప్రార్ధన చేసుకునే మందిరములకు వీరిని దూరం చేస్తుంది, ఈ లోకం. అంటే వీరికి ఎవరి నుండి సహాయం వచ్చే అవకాశం లేకుండా చేస్తుంది.
ఎందుకు వీరు ఇవన్నీ చేస్తారు ? అంటే వారికి తండ్రి (దేవుడు) తెలియదు, ఆయన ప్రేమ తెలియదు, ఆయన గుణగణాలు తెలియవు. తండ్రి దేవుడు వారి వలె ఉంటారు అనే భావనలో వారు ఉన్నారు. దేవుని దయార్ధ హృదయం ఎంత గొప్పదో వారికి తెలియకనే వారు ఈ పనులు చేస్తున్నారు. మనం పౌలు గారినే ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. యేసు ప్రభువు ఆయనకు దర్శనం ఇవ్వకముందు, చాలా క్రూరంగా ప్రవర్తించాడు, కాని తరువాత యేసు ప్రభువును తెలుసుకొని ఆయన మంచి లక్షణాలు కలిగి జీవించడం ప్రారంభిచాడు.
నిజ దేవుని గురించి తెలిసిన వారు ఎవరు ఇతరులను హింసలకు గురిచేయరు. ఎందుకంటే వారు ఆయనకు సాక్షులుగా జీవిస్తారు, ఆయన ప్రేమకు, దయకు, కరుణకు సాక్షులుగా జీవిస్తారు.
వారి విశ్వాసం కోసం ఇటువంటి బాధలు , కష్టాలు , హింసలు అనుభవిస్తున్న వారికి పవిత్రాత్మ తోడ్పడుతుంది. వారికి ఓదార్పుఇస్తుంది. వారు ఎప్పుడు ఏమి చేయాలో, ఎప్పుడు ఏమి మాట్లాడాలో అంతా పవిత్రాత్మ వారికి తెలియజేస్తుంది. ఈ పవిత్రాత్మ శిష్యులను నడిపింది. వారికి యేసు ప్రభువు బోధించిన అన్నీ విషయాలను జ్ఞప్తికి తీసుకువచ్చింది. వారు కష్టాలు, హింసలకు గురి అయినప్పడు వారికి ప్రభువు చెప్పిన విషయాలు తెలియచేసింది. కనుక వారు అన్నింటిని తట్టుకొని నిలబడగలిగారు.
మనము తండ్రిని తెలుసుకున్నవారము. ఆయన ప్రేమ ఎటువంటిదో తెలిసిన వారము కనుక ఖచ్ఛితముగా మన జీవితము ఈ లోకంను అభిమానించే వారి కంటే భిన్నముగా ఉండాలి. ఏ ఒక్కరినీ మన విశ్వాసం కోసం హింసించడం దేవుడు మన నుండి కాంక్షీంచడు. అప్పడు మనం అటువంటి పనులు చేయకూడదు. అంతే కాదు మనం పతనం కాకూడదు అని ప్రభువు కోరుకుంటున్నారు. ప్రభువుకు ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. పతనాన్ని తెచ్చుకోకూడదు.
పవిత్రాత్మ మనకు సత్యం తెలుపుతుంది. పవిత్రాత్మ సత్య స్వరూపి. మనలను హింసించు వారు దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఎందుకంటే వారికి తండ్రి తెలియదు, అంతే కాదు సత్యము ఏమిటో తెలియజేయుటకు పవిత్రాత్మను వారు పొందలేదు. మనం తెలుసుకున్న సత్యమును ఇతరులకు తెలుపుటకు సిద్ధ పడాలి. వారిని అజ్ఞానం నుండి బయటకు తేవాలి. అజ్ఞానంనే జ్ఞానం అని అనేక మంది జీవిస్తున్నారు ఈ రోజుల్లో వారి కోసం ప్రార్ధన చేయాలి.
యేసు ప్రభువుకు పవిత్రాత్మ సాక్షిగా నిలుస్తుంది. అంతే కాదు ఆయన శిష్యులు కూడా సాక్షులుగా ఉన్నారు. మరి మన జీవితం ఏమిటి ? మనం కూడా యేసు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ఆయన పవిత్రాత్మను పొంది ఆయన వలె జీవించాలి. ఒక సాక్షి జీవితం జీవించాలి. ఎటువంటి పరిస్థితులలో అయిన నిజమైన సాక్షిగా జీవించి ప్రభువు వాగ్ధానం చేసిన నిత్య జీవితం పొందాలి.
మనం మంచి జీవితం జీవించడానికి సిద్ధ పడితే ఆయన మనకు ఆదరణ కర్త అయిన పవిత్రాత్మను పంపి మనలను ఓదార్చుతారు. మంచి జీవితం జీవించుటకు మరియు పవిత్రాత్మను పొందుటకు కావలసిన అనుగ్రహం కోసం ప్రార్ధించుదాం.
ప్రార్ధన : ప్రభువా మీరు పవిత్రాత్మను మీ శిష్యులకు ఇస్తాను అని వాగ్దానం చేశారు. ఆ పవిత్రాత్మను నాకు కూడా ఒసగండి, ఆ పవిత్రాత్మ నా జీవితంలో అందరు నాకు వ్యతిరేకముగా ఉన్న నన్ను ఓదార్చువానిగా నాలో ఎల్లప్పుడు ఉండేలా నాకు మీ అనుగ్రహం దయచేయండి. ఆ పవిత్రాత్మ సత్య స్వరూపి కనుక ఎల్లప్పుడు కూడా నాతో ఉన్నట్లయితే నాలో ఎటువంటి అసత్యం లేకుండ నన్ను శుద్ది చేయువిధంగా నన్ను మలచండి. ప్రభువా మీకు మేము సాక్షులుగా జీవించుటకు కావలసిన శక్తిని మాకు దయచేయండి. పవిత్రాత్మ మీకు సాక్షిగా ఉంటుంది, ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండే ఆ పవిత్రాత్మ మేము కూడా సాక్షులుగా ఉండుటకు మాకు సాయం చేసేలా చేయండి. మాకు జరుగబోయే విషయాలలో, మేము మీకు సాక్షులుగా జీవించుటకు మాకు అడ్డు అయ్యే అనేక రకాల సమస్యలలో మేము భయపడి, వెనుకకుపోకుండా నిజమైన సాక్షులుగా జీవించే శక్తిని మాకు దయచేయండి. ఆమెన్.
12.5.23
ఈసాకు జీవిత చరిత్ర
ఈసాకు జీవిత చరిత్ర
వాగ్ధాన ఫలం
తండ్రి మాటకు కట్టుబడే కుమారుడు
అబ్రహము బలి అర్పించటానికి మోరియా వెళుతున్నప్పుడు, అక్కడకు చేరిన తరువాత కొండ మీదకు అక్కడ సేవకులను, గాడిదను అక్కడ వదలి పైకి వెళుతున్నారు, మార్గ మధ్యలో ఈసాకు తన తండ్రిని బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఎక్కడ అని అడుగగా ఆయన దేవుడే ఇస్తాడు అని చెబుతున్నాడు. ఈసాకు కొండ మీదికి వెళ్ళిన తరువాత బలికి సిద్ధం చేసిన తరువాత ఈసాకు ఆ పీఠం మీద బలి వస్తువుగా పడుకుంటున్నాడు. బలికి సిద్ధమవుతున్నాడు. తన తండ్రి చిత్తానికి తన జీవితాన్ని అర్పిస్తున్నాడు. ఈసాకు యేసు ప్రభువు వలె తన తండ్రి ఏమి చెప్పిన చేయడానికి సిద్ధం అవుతున్నాడు.
ఈసాకుకు 8వ రోజున సున్నతి చేశారు. అబ్రహాము తన కుమారున్ని, దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొని పోయినప్పుడు, ఈసాకు మారు మాట్లాడకుండా తండ్రి చెప్పినట్లు ఆ బలి పీఠం మీద బలిగా అర్పించబడటానికి సిద్ధపడ్డాడు. ఈయన తన తండ్రి మీద విశ్వాసం వుంచి తండ్రి మాట జవదాటని వానిగా తన జీవితం మొత్తం కూడా ఉన్నాడు. ఆ విధంగా యేసు ప్రభువు వలె, బలి కావడానికి సిద్ధమైన వాడు, తండ్రి ఇష్టమునకు తన జీవితమును అర్పించడానికి సిద్దమైన వాడు. తన తండ్రి చిత్తమునకు తన జీవితమును అర్పించడానికి సిద్ధమైనప్పటి నుండి ఈసాకు దేవునికి అంకితమైనటువంటి వానిగా జీవించాడు.
అబ్రహాము ఇష్టప్రకారం తన పెండ్లిని కూడా నిర్ణయించే అధికారం మాత్రం తండ్రికే వదలి పెట్టాడు ఈసాకు.ఈసాకు మాత్రమే తన భార్య ఎవరు కావాలనేది దేవుని చిత్తమునకు వదలిపెట్టాడు. అబ్రహాము తన జీవిత ముగింపులో ఉన్నాడు. తాను స్వయంగా ఈసాకుకు పెండ్లి కుమార్తెను చూడుటకు తన సేవకుడిని పిలిచి హారాను వెళ్ళి తన చుట్టాలలో ఒకరిని చూడమని చెప్పారు. ఆయనకు తన కుమారునికి అక్కడ వారు ఐగుప్తు వారిలో కాకుండా తన సొంత వారి దగ్గర నుండి మాత్రమే చేసుకోవాలి అనుకున్నాడు. కనుక తన సేవకుడు హారాను వెళ్ళి రెబ్కాను తీసుకొని వచ్చారు.
తల్లి మరణము - స్త్రీకి ఈసాకు ఇచ్చిన గౌరవం - ఆధ్యాత్మిక చింతన
సారా మరణించిన తరువాత ఈసాకు చాలా క్రుంగిపోయాడు. తన తల్లి చనిపోయే నాటికి ఇస్సాకు మూప్పై ఆరు సంవత్సరాలు వయసులో ఉన్నాడు. ఈ కృంగుబాటు నుండి తన పెండ్లి తరువాత మాత్రమే బయట పడుతున్నాడు. తన తల్లి చనిపోయినందుకు ఈసాకు చాలా దుఃఖించాడు. తనకు పెళ్లి అయినంత వరకు తనకు తల్లి లేని లోటు, ఆ బాధ నుండి బయటపడలేక పోయాడు. విశ్వాస పితరులలో కేవలం ఒక్క ఈసాకు మాత్రమే ఒకే భార్య కలిగి ఉన్నాడు. తన జీవితంలో మరొక స్త్రీ కి స్థానం కలిగించలేదు. ఈసాకు మొదటి నుండి ఆధ్యాత్మిక చింతన కలిగి జీవించాడు. అబ్రహాము సేవకుడు రెబ్కాను ఈసాకుకు భార్యగా చేయడానికి హారను నుండి తీసుకొని వస్తున్నప్పుడు ఆయన పొలంలో ధ్యానిస్తున్నాడు. ఆమెను తీసుకొని వస్తున్నప్పుడు నెగెబు వద్ద ధ్యానించుకొనేందుకు ఈసాకు పొలమునకు వెళ్ళిన తావునే వారు రాగా రెబ్కా అక్కడ కనపడుతున్న ఈసాకు గురించి వాకాబు చేయగా సేవకుడు ఆయనే ఈసాకు అని ఆమెకు చెప్పగా ఈసాకు ఆమెను తీసుకొని పోయి భార్యగా చేసుకొన్నాడు. తరువాత వారు అక్కడకు రాగ, ఆమెను తీసుకు వెళ్ళి తన భార్యగా చేసుకొనుచున్నాడు. ఈసాకు తన తల్లి లేని లోటును తన భార్య ద్వారా తీర్చుకున్నాడు అంటే అంతగా ఆమె మీద ఆధారపడ్డాడు, మరియు ఆమెను అంతగా ప్రేమించాడు. ఇక్కడ మనం ఈసాకు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అని చూస్తున్నాం.
ఈసాకు తండ్రి ఆగుట
ఈసాకు నలువది సంవత్సరాల ప్రాయంలో పెండ్లి చేసుకున్నాడు. చాలా సంవత్సరాల వరకు వీరికి బిడ్డలు కలుగలేదు. తరువాత దేవుని కృప వలన రెబ్కా ఇద్దరి కవలలకు జన్మనించింది. ఏసావు మరియు యకొబు ఇద్దరు బిడ్డలు పుట్టారు. రిబ్కా తండ్రి పేరు బెతూవెలు, ఆమెకు లాబాను అను ఒక సోదరుడు కలడు. ఆమె గొడ్రాలు అవుటవలన ఆమె కొరకు ఈసాకు దేవుని వెదుకొనగా ఆమె గర్భవతి అయ్యింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టిరి. వారు గర్భమున ఉండగానే ఒకరిని ఒకరు నెట్టుకొనిరి. మొదట పుట్టిన బిడ్డ ఎర్రగా ఉండెను. రోమవస్త్రము వలె అతని ఒడలియందంతట వెంట్రుకలు ఉండెను. అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే అతని మడమ పట్టుకొని రెండవ బిడ్డ కూడా పుట్టాడు. అప్పడు ఈసాకు వయసు అరువై.
వలస జీవితం - దేవుని తోడ్పాటు - ఈసాకు వృద్దిచెందుట
అబ్రహాము కాలములో కరువు వచ్చిన సమయంలో ఈసాకు పిలిస్తీయుల రాజు అబీమెలెకు దగ్గరకు వెళ్లారు. ఆ కాలంలో అబిమెలెకు గెరారులో ఉన్నారు. దేవుడు ఈసాకుకు ప్రత్యక్షమై ఐగుప్తు వెల్లవద్దని, ఆ దేశమునే ఉండమని చెప్పగా, ఈసాకు దేవుడు చెప్పినట్లుగానే గెరారులో జీవించాడు. అక్కడ ఈసాకు భయపది రిబ్కాను తన సోదరి అని చెప్పి జీవించుచున్నాడు. ఆమె తన భార్య అని చెప్పుటకు ఆయన భయ పడ్డాడు. అబీమెలెకు రాజు , ఈసాకు తన భార్యతో సరసమాడుచు ఉండగా చూశాడు. అతడు ఈసాకును నిజము చెప్పమని అడుగుగా అతను తన భార్య అని ఒప్పుకున్నాడు. అప్పుడు అబీమెలెకు ఈసాకును గాని రిబ్కాని కాని ముట్టుకొన్న వారికి చావుముడుతుంది అని తన ప్రజలను హెచ్చరించాడు.
ఈసాకు అక్కడ పొలములో విత్తనములు విత్తగా అది వందరెట్లు పంట ఇచ్చింది. ఆ విధంగా మహా సంపన్నుడు అయ్యాడు. దినదినాభివృద్ది చెందుతూ వచ్చాడు. గొర్రెలు, గొడ్లు సేవకులు ఇంకా అనేక సంపదలు సంపాదించాడు. అది చూసి పిలిస్తియులు ఆయన మీద అసూయ పడ్డారు. వారు అబ్రహాము కాలమున తవ్విన బావులను మట్టితో పూడ్చివేశారు. అబీమెలెకు కూడా నీవు మాకంటే సంపన్నుడవు అయ్యావు ఇక్కడి నుండి వెళ్లిపో అని చెప్పాడు, అపుడు ఈసాకు అక్కడనుండి గెరారు లోయలో, గూడారములు వేసుకొని అక్కడే నివసించాడు. ఈసాకు అబ్రహాము కాలము నాటి బావులను మరల త్రవ్వించి, వాటికి అబ్రహాము పెట్టిన పేర్లు పెట్టించాడు. ఈసాకు బానిసలు ఆ స్థలంలో త్రవ్వగా అన్ని చోట నీరు పడ్డాయి. కాని గెరారు కాపరులు వచ్చి ఆ నీళ్ళు మావని వాదనకు దిగారు. కనుక ఆ బావికి ఎసెకు అని పెట్టారు, దాని అర్ధం జగడము. తరువాత ఈసాకు పనివారు మరియొక బావిని త్రవ్వగా దాని కొరకు వారు పోట్లాడిరి, కనుక దానికి సిత్నా అను పేరు పెట్టిరి, అనగా పగ అని అర్ధం. అక్కడ నుండి పోయి ఈసాకు మరియొక బావి త్రవ్వించెను దానికి రెహోబోతు అని పేరు పెట్టి ఈనాటికి దేవుడు మాకు కావలసినంత చోటు చూపించేను, ఇక మేము ఇక్కడ అభివృద్ది చెందగలము అని అనెను. ఆ రాత్రి ఈసాకు బేర్షేబాకు వెళ్ళగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై అతనితో నేను నీ తండ్రి అబ్రహాము కొలిచిన దేవుడను భయపడకుము, నీకు చేదోడుగా ఉందును, నీ తండ్రిని బట్టి నిన్ను దీవింతును, నీ సంతతిని విస్తరిల్లచేయుదును అని చెప్పగా, ఈసాకు అక్కడ ఒక బలిపీఠము నిర్మించి, దేవుని అక్కడ ఆరాధించి అక్కడే గుడారము వేసికొనేను. అతని బానిసలు అక్కడ కూడా ఒక బావిని తవ్విరి.
అబిమెలెకు తో వడంబడిక
అబిమెలెకు తన సలహాదారుడు ఆహుసతు, సేనాధిపతి ఫీకోలుతో గెరారు నుండి ఈసాకు కడకు వచ్చి దేవుడు ఆయనకు తోడుగా ఉండుట చూచి, దేవుడు నీకు చేదోడుగా ఉండుట మేము కన్నులారా చూచితిమి, మేము నీకు ఎన్నడూ కీడు చేయలేదు. కనుక మేము నీకు కీడు చేయనట్టే నీవు మాకు ఏ కీడు చేయనని మాట ఇవ్వమని అడిగిరి, అందుకు ఈసాకు వారికి విందు తయారు చేయగా, విందు చేసి ఉదయాన్నే ప్రమాణములు చేసుకొనిరి. తరువాత వారు మిత్ర భావంతో వెళ్లారు. ఆరోజే ఈసాకు పనివారు ఒక బావిని త్రవ్వగా అక్కడ నీరు పడెను. ఆ బావికి షేబా అను పేరు పెట్టెను. అందుకే ఇప్పటికి కూడా ఆ నగరము బేర్షేబా అను పేరిట ఉంది. అంటే ప్రమాణము చేసిన బావి అని అర్ధం.
యాకోబు ఈసాకు దీవెనలు పొందుట
ఏసావు యూదితును, బాసెమతును వివాహం చేసుకొన్నారు, వారు హిత్తుయులగు బీరీ మరియు ఏలోను కుమార్తెలు , వీరి వలన ఈసాకు మరియు రిబ్కాకు తీవ్ర మనస్తాపము కలిగింది. ఈసాకు పండు ముసలి వాడు అయిన తరువాత అతని కనులు కనపడనంతగా మసకపడెను. సుమారు 50 సంవత్సరాలు ఆయన గుడ్డివానిగానే జీవించాడు. అతడు పెద్ద కుమారుడు ఏసావును పిలిచి జింక మాంసం తీసుకొనివచ్చి తనకు వడ్డించమని, తరువాత తను తృప్తిగా భుజించి తనను దీవించి కన్నుమూసెదను అని చెప్పాడు.
అది వినిన రిబ్కా యాకోబుతో రెండు మేకలను తీసుకొని రమ్మని చెప్పి దానిని రుచికరముగా వండి మీ తండ్రికి వడ్డించి నీవు దీవెనలు పొందమని చెప్పింది. అందుకు యాకోబు తన అన్న శరీరం అంత వెంట్రుకలతో వున్నది గదా, తండ్రి నన్ను తడిమి చూచిన తెలుసుకొనును గదా ,అప్పుడు నాకు తండ్రి కోపము శాపము అవునేమో అని చెప్పగా , దానికి ఆమె ఆ శాపమేదో నాకే తగలనిమ్ము, నీవు మాత్రము వెళ్ళి చెప్పినట్లు చేయని చెప్పగా యాకోబు అట్లే చేసెను. అప్పుడు తల్లి భోజనం తయారు చేసి ఏసావు కట్టుకొనే మేలి ఉడుపులు ఇంటిలో ఉండగా రిబ్కా వాటిని తీసుకొని యాకోబుకి ఇచ్చి, మేక పిల్ల తోళ్ళతో యాకోబు చేతులను, నున్ననిమెడను కప్పి, ఆమె సిద్దము చేసిన భోజనము యాకోబుకు ఇచ్చి తండ్రి వద్దకు పంపెను. యాకోబు తండ్రి వద్దకు రాగ, ఈసాకు ఇంత తొందరగా ఎలా మాంసం దొరికినది అని అడగ్గా నీ దేవుడైన యావే దానిని నా వద్దకు పంపెను అని చెప్పాడు.
ఈసాకు యాకోబుతో తన దగ్గరకు రమ్మని పిలిచి తనను తడిమి చూసి గొంతు యాకోబు గొంతు వలె ఉన్నను, చేతులు ఏసావు చేతులే అనెను. అతనిని దీవింపనేంచి నీవు నిజముగా నా కుమారుడు ఏసావువేనా అడుగగా, దానికి యాకోబు అవును అని సమాధానం ఇచ్చాడు. అపుడు ఆ మాంసము తిని, ద్రాక్ష సారాయమును ఇవ్వగా అది త్రాగి, యాకోబుతో తన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోమని చెప్పగా, యాకోబు అట్లే చేయగా, యాకోబు ధరించిన వస్త్రముల వాసన చూచి ఆయనను దీవించాడు. నీవు నీ సోదరులను పాలింతువు, అన్ని జాతులు నీకు తలొగ్గును అని, నిన్ను దీవించు వారు దీవించబడుదురు అని దీవించేను. ఈసాకు దీవించుట ముగించిన త వెంటనే ఏసావు వచ్చి భోజనము సిద్దము చేసి తండ్రికి ఇచ్చి, లేచి భుజించి తనను దీవింపమని అడుగగా ఈసాకు నాయన నీవు ఎవరవు అని ప్రశ్నించాడు. నేను ఏసావును నీ పెద్ద కుమారుడను అని చెప్పగా ఈసాకు ఒళ్ళు కంపించింది. అప్పుడు జరిగినది చెప్పగా, ఏసావు తండ్రి నన్ను కూడా దీవింపుము అని అడిగెను. ఆ దీవెనకు తిరుగులేదు అని ఆయన సమాధానం చెప్పెను. ఆ మాటకు ఏసావు పెద్దగా ఏడ్చి , తన సోదరుని గురించి అతనికి యాకోబు అని సార్ధకమైన పేరే పెట్టితిరి, అతడు నన్ను మోసము చేయుట రెండవ సారి అని అన్నాడు. తండ్రి నాకు ఏ దీవెనయు మిగులలేదా అని అడుగగా, అందుకు ఈసాకు, నీవు భూసారము కొరవడిన చోట నివసింతువు, నీవు ఖడ్గము చేపట్టి బ్రతుకుదువు, నీ తమ్ముని సేవింతువు కాని నీవు తిరుగుబాటు చేసిన రోజు నీ మెడ మీద నుండి అతని కాడి విరిచేదవు అని చెప్పాడు.
ఈసాకు యాకోబును లాబాను వద్దకు పంపుట
రిబ్కా ఈసాకుతో ఏసావు వివాహమాడిన హిత్తియుల పిల్లలు నా ప్రాణాలు తీసివేస్తున్నారు. యాకోబు కూడా ఈ జాతి పిల్లను వివాహమాడిన నేను చచ్చిన, బ్రతికిన సమానమే అని చెప్పగా, ఈసాకు యాకోబును పిలిపించి, దీవించి అతనికి బుద్దులు చెప్పి, కనానీయులలో ఎవరని పెండ్లి చేసుకోవద్దని, యాకోబు మేనమామ అయిన లాబాను కూతురులలో ఒకరిని వివాహమాడమని చెప్పి, దేవుని ఆశీర్వాదములు పలికి అక్కడ నుండి పద్దనారములోని లాబాను ఇంటికి పంపెను. లాబాను అరమీయుడయిన బెతూవెలు కుమారుడు మరియు రిబ్కా సోదరుడు.
ఈసాకు మరణం - గొప్ప వ్యక్తిత్వం
యాకోబు మమ్రేలో ఉన్న తన తండ్రి దగ్గరకు వచ్చిన తరువాత, నూటయెనుబది సంవత్సరాల వయసులో మరణించగా యాకోబు, ఏసావులు తమ తండ్రిని సమాది చేశారు. ఈసాకు వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనది, తన కుటుంబ జీవితం ఎంతో ఉన్నతమైనది, నైతికంగా అయన జీవితాన్ని ఎవరితో పోల్చలేము అంత గోప్య నైతిక జీవితాన్ని జీవించాడు. తన తండ్రి వలె ఈయన కూడా తన భార్యను కూడా తన చెల్లి అని చెప్పడం జరిగింది. ఒక రకముగా ఈయన జీవితంలో అది మాత్రమే ఒక మచ్చ అంతకుమిచ్చి ఇతని జీవితంలో ఎటువంటి పొరపాటు జరుగలేదు. ఈయన మంచి భోజన ప్రియుడు , తన పెద్ద కుమారుడు అనిన ఇతనికి చాలా ఇష్టం అని మనకు తెలుస్తుంది.
7.5.23
పాస్క కాల ఐదవ ఆదివారం
యోహాను 14:1-12
యేసు వారితో "మీ హృదయములను కలవరపడనియకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు." అనెను. తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. అందుకు యేసు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును నా మూలముననే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. మీరు నన్ను ఎరగియున్నచో, నా తండ్రిని కూడా ఏరిగి యుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచి ఉన్నారు. అని పలికెను. అప్పుడు ఫిలిప్పు "ప్రభూ! మాకు తండ్రిని చూపుము. మాకు అది చాలును" అనెను. అందుకు యేసు ఇట్లనెను: "ఫిలిప్పు! నేను ఇంత కాలము మీతో ఉంటిని. నన్ను తెలిసికొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఏట్లు అడుగుచున్నావు! నేను తండ్రియందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు. కాని, నా తండ్రి నా యందు నివసించుచు, తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు, తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టియైనను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నాను. కనుక, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మీ హృదయములను కలవరపడనియకుడు
యేసు ప్రభువు తన శిష్యులతో మీ హృదయములను కలవరపడనియకుడు అని చెబుతున్నారు. శిష్యులు కలవరపడవలసిన పరిస్తితి ఎందుకు వచ్చినది? ఎందుకంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పారు. మూడు సంవత్సరాలు వారు యేసు ప్రభువుతో కలిసి జీవించారు. ఆయన చేసిన అన్ని అద్భుతకార్యములకు, ఆయన చూపిన కారుణ్యమునకు వీరు సాక్షులు. శిష్యులకు ఆయన జీవితం భరోసా అయ్యినది. అటువంటి ప్రభువు ఇప్పుడు వారి నుండి వెళ్లిపోతున్నారు. ఇంకా ఎందుకు వీరు కలవరపడుతున్నారు? యేసు ప్రభువుకి పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు కొంత మంది సద్దుకయ్యులు శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వీరి నుండి వెళ్లిపోతే యేసు ప్రభువు శిష్యులు వారికి శత్రువులుగా మారిపోతారు. ఎందుకంటే వారికి యేసు ప్రభువు అంటే ఇష్టం లేదు. వారు యేసు ప్రభువు వారి నుండి వెళ్ళిన తరువాత వీరిని శిక్షిస్తారు అని కలవరం వారికి ఉండవచ్చు. యేసు ప్రభువుకు మరియు శిష్యులకు ఉన్న సంబంధం చాలా అన్యోన్యత కలిగిఉన్నది. ఈ అన్యోన్యత తెగిపోతుంది అని వారు కలవరపడి ఉండవచ్చు. యేసు ప్రభువుతో కలిసి వారు భుజించారు, కలిసి భుజించడం వారి సామాజిక పరిస్థితుల ప్రకారం వారి మధ్య ఉన్న అన్యోన్యత మరియు వారి స్నేహానికి గుర్తు. యేసు ప్రభువు శిష్యులను స్నేహితులులా చూశారు. ఈ స్నేహం తెగిపోబోతుంది. ఇవన్నీ వారి కలవరానికి కారణాలు.
యేసు ప్రభువుతో పేతురు, తన గురువు కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అందరు వెళ్ళిపోయిన తాను వదలి వెళ్ళను అని అన్నాడు, దానికి యేసు ప్రభువు, పేతురు యేసు ప్రభువు ఎవరో కూడా తెలియదు అని చెప్పడానికి కూడా వెనుకాడడు అని చెప్పారు. తనను యేసు ప్రభువు నమ్ముట లేదు అని, ఏమి జరుగబోవుతుందో అని కలవరపడిఉండవచ్చు. తమ గురువును వారే అమ్మబోవుతున్నారు అని యేసు ప్రభువు చెబుతున్నారు, అది తలచుకొని వారు కలవరపడి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒక్కో కారణం ఉండి ఉండవచ్చు కలవరపడటానికి, అది వారికి యేసు ప్రభువుకు మధ్య ఉన్న అన్యోన్యత మరియు ప్రేమ మీద ఆధారపడుతుంది. యేసు ప్రభువు వీరికి కలవరపడవద్దు అని చెబుతున్నారు.
నిత్యము మనలను కాపాడి మన మధ్య ఉండే ప్రభువు - మనలను తనతో తీసుకుపోతారు
యేసు ప్రభువు తన శిష్యులు కలవరపడకుండా ఉండుటకు ఆయన కారణం చెబుతున్నారు. ఆయన వారి నుండి పోవుతున్నది వారి కోసమే అని చెబుతున్నారు. వారు ఎందుకు కలవరపడనవసరం లేదంటే, ఆయన వారి నుండి వెల్లుతున్నది వారికి ఒక నివాసస్థానం ఏర్పాటు చేయడానికి. మరలా ఆయన వారి వద్దకు వచ్చును. ఆయన వుండే చోటూనే వీరు కూడా ఉండే విధంగా ఆయన చేస్తారు. కనుక వారు కలవరపడనవసరం లేదు. "నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." ఈ నివాస స్థానం పరలోకమే. దేవుని నివాస స్థానమే. అది మనకు నిజమైన, శాశ్వతమైన నివాసం. ఇది తండ్రి మరియు కుమారునికి మధ్యగల సంబంధం తెలియజేస్తుంది. తండ్రి దగ్గర ఏమి ఉంది అనేది తెలిసినది పూర్తిగా కుమారునికి మాత్రమే. అందుకే ఆయన "నా"తండ్రి గృహమున అనేక నివాసములు కలవు అని చెబుతున్నారు. ఈ సంబంధం గురించి ఆయన అనేక సార్లు చెప్పుటకు కారణం ఏమిటి అంటే తన తండ్రిని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు అని తెలియచేయడమే, ఆయనే పనులను మాత్రమే కుమారుడు చేస్తున్నాడు. తండ్రికి తెలియకుండా ఏమి చేయుటలేదు. ఆయన తన తండ్రి గృహమున మనకు ఒక నివాసాన్ని ఏర్పాటుచేయడానికి కల్వరి కొండమీద శిలువ మరణం ద్వారా మనకు సిద్దపరుస్తున్నాడు. మూడు రోజులు భూగర్భంలో ఉండి మనకు నివాసాన్ని ఏర్పాటుచేస్తున్నాడు.
"నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." యేసు ప్రభువు ఇక్కడ చేసిన ఈ వాగ్ధానం తన శిష్యులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆయన తన శిష్యులను వదలి వేయడం లేదు. ప్రత్యేకంగా వీరి కొరకు వస్తాను అని చెబుతున్నారు. ఇది లోకాంతంలో కాదు. ఇది తన శిష్యులు ఎప్పుడు కూడా ఆయన సాన్నిధ్యం పొందేలా చేస్తుంది. అంతేకాక వీరిని తన వద్దకు చేర్చుకుంటాను అని చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులను , మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనుచరులు అయిన వారికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఇది. నేను ఉండు స్థలమునే మీరును ఉండునట్లు నా వద్దకు చేర్చుకొందును అనే వాగ్ధానం మరల ఆయన శిష్యులు ఎవరు నీరుత్సాహంలో లేకుండే చేసే వాగ్ధానం. కాని దీనిని ఎల్లప్పుడు గుర్తుంచుకోవడంలో మనం విఫలం చెందుతున్నాము. యేసు ప్రభువు చేసిన ప్రతి వాగ్ధానం మనం గుర్తు చేసుకొని మనం జీవించినచో మన జీవితంలో ఎటువంటి అపాయంలో కూడా మనం కలవరపడకుండా ఉండగలం.
తండ్రి మన గమ్యం కుమారుడే మార్గం- ఈ మార్గమే గమ్యం -దేవున్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా దేవుని దగ్గరకు వెళ్ళాలి?
తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. తోమస్సు యేసు ప్రభువు చెప్పిన మాటలు అర్ధం చేసుకోలేక పోయాడు. అందుకే ఆయనే ఎక్కడకు వెళుతున్నారో తెలియదు అని చెబుతున్నారు. తోమసు మొదటి నుండి తనకు అర్ధం కాని విషయములను అడుగుటకు సిగ్గుపడలేదు. ప్రభువు ముందు తనను ఏప్పుడు గొప్పవాడిగా లేక మొత్తం తెలిసిన వానిగా చూపించుకోవాలని చూడలేదు, తన నిజ స్తితి ఎప్పుడు బహిర్గతం చేస్తునే ఉన్నాడు. అందుకే ప్రభూ మీరు ఎక్కడకు వెళుతున్నారో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరగుదుము అని అంటున్నారు. అందుకు ప్రభువు నేనే మార్గము సత్యము జీవము. నా మూలమునే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాలేడు అని చెబుతున్నాడు. యేసు ప్రభువు జీవితం మొత్తం కూడా తండ్రిని తెలియపరచడమే. తండ్రి ఎలా ప్రేమిస్తారు, తండ్రి ఎలా క్షమిస్తారు, తండ్రి ఎలా మనలను దగ్గరకు తీసుకుంటారు, తండ్రి ఎలా మన కోసం పరితపిస్తారు అనే విషయాలు యేసు ప్రభువు ద్వారానే మనం తెలుసుకుంటున్నాము. ఈ విషయాలు ఇంతకు ముందు చెప్పిన అవి వారికి అర్ధం కాలేదు. మరలా యేసు ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. యేసు ప్రభువు ద్వారా మాత్రమే మనం తండ్రిని ఆయన పూర్తి ప్రేమను తెలుసుకోగలం, యేసు ప్రభువు నేనే మార్గం అని చెబుతున్నారు.
దేవున్ని మనం ఎలా తెలుసుకోగలము? ఆయన దగ్గరకు మనం ఎలా వెళ్లగలము? ఆయన ఎవరు? అనే ప్రశ్నలకు యేసు ప్రభువు మాటలలో మనకు సమాధానం దొరకుతుంది. అంతేకాక ఆ సమాధానం ఆయనే అవుతున్నారు. యేసు ప్రభువే తండ్రి దగ్గరకు వెళ్ళుటకు మార్గం, మరియు ఆయన మన గమ్యంగా ఉంటారు, ఎందుకంటే ఆయనను చేరుకున్నప్పుడు తండ్రిని చేరుకున్నట్లే, ఆయన తండ్రి యందు తండ్రి ఆయన యందు ఉన్నారు. ఆయనే సత్యము, ఆయన కేవలం సత్యమును తెలియజేయుటకు మాత్రమే రాలేదు, ఆయనే సత్యం, ఆయన మాత్రమే నిత్యుడు, ఆయన మనకు జీవం ఇచ్చువాడు మాత్రమే కాదు ఆయనే జీవము. కనుకనే యేసు ప్రభువు మాత్రమే తండ్రి దేవుని దగ్గరకు మార్గం, ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలం.
ప్రభువే మార్గం
నేనే మార్గం, సత్యం, జీవం. నా ములమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. యేసు ప్రభువు ఇక్కడ తోమసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. నేనే మార్గం అని చెబుతున్నారు. తండ్రి దగ్గరకు పోవుటకు యేసు ప్రభువు మాత్రమే మార్గం. ఎందుకంటే తండ్రి గురించి పూర్తిగా తెలిసినది కుమారునికి మాత్రమే. యేసు ప్రభువు ఇతర ప్రవక్తల వలె, నాయకుల వలె, న్యాయాధిపతుల వలె కాక తండ్రి ప్రేమను, కరుణను, కృపను, తండ్రి అయిన దేవున్ని చూపించడంలో విఫలం చెందక, పూర్తిగా దానిలో సఫలీకృతం అయ్యి తండ్రిని తన మాటల ద్వారా, పనుల ద్వారా మరియు అద్భుతాల ద్వారా, కరుణ ద్వారా మరియు తాను చూపించిన ప్రేమ ద్వారా తెలియ పరిచారు. ఎవరు ఈ తండ్రి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం యేసు ప్రభువు జీవితం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ తండ్రి ద్వారానే చేశారు, తానకై తాను చేయక, తండ్రి ఇష్టప్రకారమే అన్ని చేశాడు. అలా తండ్రిని తన ద్వారా చూపించాడు. ఆ తండ్రి దేవున్ని తెలుసుకోవడానికి మార్గం కేవలం యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభువు దేవున్ని తెలుసుకోవడానికి మార్గం మాత్రమే కాదు, ఆయన గమ్యం కూడా. ఈ మార్గం మనలను ఎక్కడకు తీసుకుపుతున్ననది, అంటే తండ్రి దగ్గరకు. తండ్రి మరియు కుమారుడు ఎప్పుడు ఏకమై ఉన్నారు. ఆ విధంగా ఆయనే మనం మార్గం మరియు గమ్యంగా ఉన్నారు. ఆయనను అనుసరించినచో మనము ఎప్పటికీ మార్గమును తప్పక, ఆయనను అనుసరించిన ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకుంటారు.
యేసు ప్రభువు సత్య స్వరూపుడు
యేసు ప్రభువు నేనే సత్యం అని చెబుతున్నారు. ఏమిటి ఈ సత్యం? యేసు ప్రభువును సత్యమనగా ఏమిటి? అని పిలాతు అడుగుతున్నారు. యేసు ప్రభువు తనను తాను లోకమునకు వెలుగు అని చెబుతున్నారు. ఆయనలో అంధకారం అనేది ఏమి లేదు. నేనే సత్యం అని యేసు ప్రభువు చెబుతున్నప్పుడు ఆయనలో అసత్యం అనేది ఏమి లేదు. ఆయన పూర్తిగా సత్యం. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యం. ప్రతిదీ కూడా జరిగితీరుతుంది. మన మాటలలో అనేక అసత్యాలు ఉంటాయి కాని యేసు ప్రభువు సత్యం. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువు వలె సత్యం కాదు, వారి వారి జీవితాలలో అనేక సార్లు అసత్యం అడినవారే. సత్యం మనలను స్వతంత్రులను చేస్తుంది. సత్యం మనకు దేవున్ని తెలియపరుస్తుంది. సత్యమును అన్వేషించే ప్రతి వారు కూడా దేవున్ని అన్వేషించే వారే. దేవుడు సత్య స్వరూపుడు. అందుకే యేసు ప్రభువు తాను సత్యమును అని చెపుతున్నారు. అసలు సత్యం అంటే ఏమిటి? తత్వశాస్త్రంలో అరిస్టాటిల్ సత్యం గురించి ఉన్నదానిని ఉన్నది అని చెప్పడం, తెలుసుకోవడం సత్యం అని చెబుతారు. పునీత అక్విన తోమసు గారు సత్యం గురించి నిత్యం ఉండునది సత్యం అని చెబుతున్నారు. కేవలం దేవుడు మాత్రమే నిత్యం ఉండేది. అందుకే యేసు ప్రభువు నేనే సత్యము అని చెబుతున్నారు.
యేసు ప్రభువే జీవం
నేనే జీవం అని యేసు ప్రభువు చెబుతున్నారు. దేవుడు జీవం, మనందరికీ జీవం ఉంది. కాని దేవుడు జీవం. మన నుండి ఈ జీవం వెళ్ళి పోతుంది. కాని దేవుడే జీవం కాబట్టి ఆయన నుండి అది వెళ్లిపోదు, అందుకే మనం ఆయనను స్వయంబు అని చెబుతున్నాము. తాను జీవించుటకు ఎవరి మీద ఆధారపడలేదు. కాని మనం మన జీవించుటకు వేరే వారి మీద ఆదరపడిఉంటాం. మనం కూడా ఈ జీవంతో ఎల్లప్పుడు ఉండాలి అనే కోరిక ఉంటుంది అది ఆయన మనకు ఇస్తాడు ఎందుకంటే ఆయన జీవం కాబట్టి. అందుకే యేసు ప్రభువు నేనే జీవం అని చెబుతున్నారు. యేసు ప్రభువు ఈ విషయం గురించి అనేక సార్లు చెప్పారు. పాత నిబంధనలో కూడా దేవుని గురించి మోషే అడుగుతున్నప్పుడు దేవుడు ఆయన ఎవరు అని చెబుతున్నారు. మోషే , దేవునితో నిన్ను ఎవరు పంపారు, ఆయన పేరు ఏమిటి అని అడిగితే నేను ఏమి చెప్పాలి అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకు చెబుతున్నారు. "నేను ఉన్నవాడను" అని. ఇక్కడ ఉన్నవాడు అంటే కలకాలం ఉండేవాడు అని అర్ధం. ఆయన గతించిన కాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో ఉంటాడు, మరియు వర్తమాన కాలంలో ఉన్నాడు అని అర్ధం. ఇలా ఎందుకు అంటే ఆయన జీవం కాబట్టి. ఏవరు అయితే కలకాలం ఉండాలి అంటే ఆయన దగ్గరకు వెళ్ళాలి.
ఇవి అన్ని కూడా దేవుని లక్షణాలు, యేసు ప్రభువు తన జీవితం ద్వారా తండ్రిని మనకు తెలియజేస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు మాత్రమే దేవుని దగ్గరకు మనలను తీసుకువెలుతారు, ఎందుకంటే యేసు ప్రభువుకు మాత్రమే తండ్రి పూర్తిగా తెలుసు. అందుకే యేసు ప్రభువు ములమునే మనం తండ్రి దగ్గరకు వెల్లగళం. తండ్రిని మనం తెలుసుకోవాలి అనుకున్న, లేక తండ్రిని చూడాలి అని అనుకున్నా మనం యేసు ప్రభువును తెలుసుకోవాలి, మరియు చూడాలి. అందుకే పిలిప్పు తండ్రిని చూపించమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు, పిలిప్పు నీవు నన్ను చూడలేదా? అని అడుగుతున్నారు. యేసు ప్రభువు మాటలు మొత్తం తండ్రి మాటలు, యేసు ప్రభువు పనులు మొత్తం తండ్రి పనులు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక మాట చెబుతున్నారు. అది ఏమిటి అంటే నేను తండ్రి యందు మరియు తండ్రి నా యందు ఉన్నాము అని చెబుతున్నారు. యేసు ప్రభువు అనేక సార్లు తండ్రితో తన ఐక్యత గురించి చెప్పారు. యేసు ప్రభువు తన శిష్యులను ఆయన చేసిన పనులను బట్టి అయిన తనని విశ్వసించమని చెబుతున్నారు. ఆయనను విశ్వసించిన వారి ద్వారా మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనేక మంచి పనులను చేస్తారు. ఆయన శిష్యులు ఆయనను ఏమి అడిగిన అది దయచేస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు.
4.5.23
అబ్రహాము జీవిత చరిత్ర
అబ్రహాము జీవిత చరిత్ర
అబ్రహాము తేరా చిన్న కుమారుడు. అబ్రహాము అసలు పేరు అబ్రం, ఆ పేరుకు గల అర్ధం ఉన్నతికి తండ్రి. దేవుడు అబ్రహాముకు అబ్రహాము అని పేరు మార్చినది తనకు లెక్కకు మిక్కుటముగా సంతానము కలుగ చేస్తాను అని చెప్పి తన పేరును మార్చి తనను అబ్రహాము అని పిలిచాడు, అనగా అనేక తెగలకు తండ్రి అని అర్ధం.
అబ్రహాము దేవుని స్నేహితుడు
అబ్రహామును దేవుడు ఒక క్రొత్త జీవన విధానానికి పిలుచుకున్నాడు. దేవుని మీద విశ్వాసముంచి జీవించే విధానం అబ్రహముతో మొదలవుతుంది. ఒక ఒడంబడిక విధానం కూడా అబ్రహాముతోనే మొదలవుతుంది. దేవునికి స్నేహితునిగా దేవునితో స్నేహితుని వలె మాటలాడిన మొదటి వ్యక్తిగా కూడా అబ్రహము ప్రసిద్ది చెందడం జరిగింది.
అబ్రహాము తెరా ముగ్గురు కుమారులలో ఒకడు. మిగిలిన ఇద్దరు కుమారులు నహోరు మరియు హారను, హారను ఉరు పట్టణములోనే చనిపోయాడు. లోతు అను వాడు ఈ హారను కుమారుడు. తెరా కల్దియుల దేశమైన ఉరు అనే ప్రాంతమునకు చెందిన వాడు. తరువాత కనాను దేశమునను వెళుతూ హారములో స్థిర పడిపోయారు. అబ్రహాము 73 సంవత్సరాల వయసులో ఉండగా దేవుని స్వరమును విన్నాడు. దేవుడు ఆయనతో తన దేశమును, పుట్టినింటిని, చుట్టపక్కాలను వదలి తాను చూపే దేశమునకు వెళ్ళమని చెప్పాడు. దాని ద్వారా ఆయనను ఒక గొప్ప జాతిగా తీర్చిదిద్దుతాను అని దేవుడు అబ్రహాముకు చెప్పడం జరిగింది. అబ్రహాము ఆ మాటలకు విలువనిచ్చి దేవుడు చెప్పినట్లు చేయడం జరిగింది. తాను హారనులో సంపాదించినది, తన సేవకులతో, భార్య సారా మరియు తన సోదరుని కుమారుడు లోతుతో కలసి అబ్రహాము హారనును వదలినప్పుడు అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు. హారాను నుండి కనాను దేశములోని షెకెము అనే ప్రదేశం చేరి మోరే వద్ద సింధూర వృక్షము వద్ద ప్రభువు కనపడి ఈ దేశమును నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. అక్కడ అబ్రహాము ఒక బలి పీఠము నిర్మించి బేతేలు , హాయికి మధ్య బలి పీఠము నిర్మించి దేవుని ఆరాధించి, అక్కడనుండి నెగెబు వెళ్ళాడు. అక్కడ కరువు రాగ ఐగుప్తు వెళ్ళి అక్కడ తన భార్య సారాను తన సోదరి అని చెప్పమని అడిగెను ఎందుకంటే ఆమె మిక్కిలి అందగత్తె, మరియు ఆమె నిమిత్తం అబ్రహము చంపుతారు ఏమో అని అతను భయపడెను. ఫరో రాజు వద్దుకు తన సేవకులు తీసుకోపొగా ఆమె వలన అతను అబ్రహాముకు మేలు చేయగా ఆయన గొర్రెలను , పశువులను సంపాదించేను. దేవుడు ఆమెను కాపాడుటకు ఫరో రాజు కుటుంబంలో అనేక రోగముల పాలు చేయగా ఫరో నిజము తెలుసుకొని అబ్రహామును పిలిచి తన భార్యను తీసుకొని పొమ్మని చెప్పగా ఆయన అలాగే తన సంపద మొత్తం తీసుకొని అక్కడ నుండి మరల నెగెబుకు వెళ్ళి అక్కడ నుండి బేతెలు హాయికి మధ్య మొదట గుడారము ఏర్పాటు చేసిన ప్రదేశమునకు వచ్చెను. అక్కడ లోతు మరియు అబ్రహాము సేవకుల మధ్య గొడవలు జరుగగా కనుక అబ్రహాము లోతుతో మనము విడిపోవుట మేలు అని ఇక్కడ నుండి మన ముందు కావలసినంత నేల ఉంది. నీవు కుడి వైపుకు వెళ్ళిన నేను ఎడమ వైపు వెలుతాను, లేక నివు ఎడమ వైపు వెళ్ళిన కుడి వైపు వెలుతాను అని చెప్పగా లోతు యొర్దాను మైదానం వైపు చూచి అక్కడ నీటి వనరు ఉన్నదని గ్రహించి యొర్ధాను కోరుకొని అక్కడకు వెళ్ళడానికి కోరుకున్నారు. అబ్రహాము హెబ్రోనులో మమ్రె వద్ద ఉండెను.
అబ్రహాము యుద్దము చేయుట
సొదొమ రాజు, గోమోర రాజు , అద్మా రాజు, సెబోయీము రాజు, బెలారాజగు సోయారులు ఏకమై వారిని అనేక సంవత్సరాలు సామంతులుగా చేసిన ఎలాము, గోయీము, షీనారు , ఎల్లాసరు రాజుల మీద యుద్దానికి వెళ్ళి మరల ఓడిపోవడం చేత శత్రువులు సొదొమో, గోమోరలో ఉన్న ఆస్తిని తీసుకొని పొతు వారు సొదొమలో ఉన్న లోతుని కూడా బంధించి తీసుకెళ్లారు. అది తెలిసిన అబ్రహాము తన ఇంట ఉన్న వారిని మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని పోయి రాత్రి వేళ వారిని ఎదురించి వారిని తరిమి కొట్టి లోతును అతని స్త్రీలను, ఆస్తిని విడిపించి తీసుకొని వచ్చారు. యుద్ధం నుండి పారిపోయిన సొదొమ రాజు అబ్రహాము చేసిన పని తెలుసుకొని అతని కలుసుకోవడానికి వచ్చి మనుషులను తనకి అప్పగించి వస్తువులను తీసుకోమని చెప్పినప్పుడు అబ్రహాము తన ప్రజలను మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని సొదొమ రాజుకే ఇచ్చి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు నేను అబ్రహామును ధనవంతున్ని చేసాను అని అనకూడదు అని మొత్తం ఇచ్చి వేశాడు. అబ్రహము షాలేము రాజు మెల్కిసెదేకు రొట్టెను ద్రాక్షసారాయమును కొనివచ్చి అబ్రహాముకు ఆశ్వీరచనములు పలికాడు.
యిష్మాయేలు
అబ్రహాముకు సారాతో పిల్లలు పుట్టక పోవడం వలన ఆమెకు ఉన్న ఒక ఐగుప్తు దాసి కన్య హాగారును స్వీకరించి తనకు బిడ్డలు కలుగ జేయమని కోరింది. ఆమె గర్భం దరించినప్పటి నుండి సారాను చులకనగా చూడటం మొదలు పెట్టేది. సారాయి తరువాత ఆమెను పలు విధాలుగా ఇబ్బంది పెట్టగా ఆమె పారిపోయినది.
ఒడంబడిక - సున్నతి
అబ్రామునకు తొంబది తొమ్మిది సంవత్సరాల వయసులో దేవుడు అబ్రాముతో ఒక ఒడంబడిక ఏర్పాటు చేసుకొని ఆయన పేరును మార్చి అబ్రహాము అని పెట్టెను. ఇక నిన్ను అనేక జాతులకు తండ్రిగా చేసెదను అని చెప్పెను. నేను నీకు కానను భూమిని నీకు నీ సంతతికి ఇస్తాను అని చెప్పాడు. ఈ ఒడంబడిక గుర్తుగా సున్నతి చేసుకొనవలయును అని చెప్పారు. అలానే సారాయి పేరును సారా అని మార్చారు. ఆమె సకల జాతులకు తల్లి అగును అని చెప్పారు.
అబ్రహాము వేడుకోలు
మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్ష వనమున అబ్రహము తన గుడారము దగ్గర వుండగా ముగ్గురు వ్యక్తులు అక్కడ ఆయన ముందు వున్నారు. అబ్రహము గుడారము వెళ్ళి వారిని తన ఇంటిని సందర్శించమని అడిగి వారికి అతిధ్యమిచ్చారు. వారు తరువాత సారా గురించి వాకబు చేసి ఆమె మరుసటి సంవత్సరానికి ఆమె ఒక కుమారుని కనును అని చెప్పిరి. అది తలుపు చాటున నిలచి విన్న సారా తనలో తాను నవ్వుకుంది. అక్కడ నుండి సొదొమ వైపు వారు వెళుతూ అబ్రహాముకు తాము పోవుచున్న పని గురించి చెప్పారు. అక్కడి ప్రజలు పాపపు జీవితము గురించి తన చెవిన పడిన విషయమును అబ్రహముతో చెప్పడం జరిగినది. అబ్రహాము దేవునితో చెడ్డ వారితో పాటు మంచి వారిని కూడా నాశనం చేయుదురా అని ప్రశ్నించెను. ఆ పట్టణములో ఏబది మంది మంచి వారు ఉన్నచో ఆ నగరమును నాశనము చేయక కాపాడవా అని అడుగగా దేవుడు ఆ పట్టణమున ఏబది మంది మంచి వారు ఉన్నట్లయితే వారిని కాపాడుతానని చెప్పెను. ఆ విధంగా అడుగుతూ చివరకు పది మంది మంచి వారు ఉన్న ఆ పట్టణమును పాడు చేయవద్దని చెప్పగా దేవుడు దానికి ఒప్పుకోని అక్కడ నుండి వెళ్ళి పోవడం జరిగింది.
అబ్రహాము - అబీమెలెకు
అబ్రహాము అక్కడ నుండి నేగేబునకు వెళ్ళి కాదేషు , షూరు మధ్య ఉన్న గెరారులో పరదేశివలే నివసిస్తూ ఉన్నాడు. తన భార్యను చెల్లెలిగా చెప్పి అక్కడ జీవించేవాడు. గెరారు రాజు అబీమెలెకు సారాను తన అంతఃపురమునకు చేర్చుకున్నాడు. కాని దేవుడు ఆ రాజుకు కలలో కనపడి ఆమె వివాహిత అని చెప్పి, ఆమె వలన నీవు చనిపోతావు అని చెప్పగా అందుకు ప్రభూ నేను నిర్ధోషిని అని చెప్పి, అబ్రహామే ఆమె తన చెల్లి అని చెప్పిన సంగతి ఆమె కూడా అబ్రహాము తన సోదరుడు అని చెప్పినందుకు దేవుడు అతనిని మన్నించి అబ్రహాముకు సారాను అప్పగించమని చెప్పి అబ్రహాము గొప్పతనను గురించి ఆయన ప్రవక్త అని , ఆయన కొరకు విన్నపములు చేస్తాడు అని చెప్పి, సారాను అబ్రహాముకు అప్పగింపకపోతే తాను మరణిస్తాడు అని చెప్పెను. అబిమేలేకు అబ్రహాముకు సారాను అప్పగించి గొర్రెలను, గోడ్లను, దాసిదాసులను అబ్రహాముకు ఇవ్వడం జరిగింది. అప్పుడు అబిమెలేకు ఇంటిలో ఉన్న వారు గర్భం ధరించారు. అంతకు ముందు దేవుడు వారి గర్భములను మూసివేసేను.
అబ్రహామునకు వాగ్ధాన ఫలం
దేవుడు అబ్రహామునకు మాటఇచ్చినట్లే దేవుడు సారా పట్ల కనికరం చూపి ఆమె గర్భం దాల్చి కుమారున్నీ కనింది, ఆ కుమారుడే ఈసాకు. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. సారా అబ్రహాముతో హాగారును మరియు యిష్మాయేలును ఇంటి నుండి పంపించి వేయమని అడుగగా ఆయన చాలా బాధ పడ్డాడు. దేవుడు ఆయనకు ఈసాకే తన వారసుడు అని చెప్పగా అలానే చేశాడు. కాని దేవుడు వాగ్ధాన ఫలముగా ఉన్న ఈసాకును బలిగా అర్పించమని అడిగారు. మోరియా ప్రదేశమున అబ్రహాము దేవుడు చూపించిన కొండ దగ్గరకు ఈసాకును బలి ఇవ్వడానికి ఉదయాన్నే , ఒక గాడిద మీద బలికి కావలసిన అన్ని వస్తువులను తీసుకొని ఇద్దరు సేవకులతో బయలుదేరి వెళ్ళాడు. తన సేవకులను క్రిందనే ఉంచి ఈసాకుకు కట్టెల మోపును ఇచ్చి తాను కత్తి మరియు నిప్పు తీసుకొని కొండమీదకు వెళ్ళాడు. మార్గ మధ్యలో ఈసాకు తమకు బలికి కావలసిన బలి వస్తువు కొరకు అడుగగా దేవుడే సమకూరుస్తాడు అని సమాధానం చెబుతాడు. ఆ కొండ మీదకు పోయిన తరువాత అక్కడ బలి ఇవ్వడానికి బలి పీఠం ఏర్పాటు చేసి మొత్తం సమకూర్చిన తరువాత కుమారున్నీ బంధించి బలి ఇవ్వడానికి కత్తిని తీసుకొనగా అప్పుడు యావే దూత అబ్రహామును ఈసాకును ఏమి చేయవద్దని చెప్పి, అబ్రహాము హృదయం తనకు తెలుసు అని, తన కుమారున్నీ కూడా చంపడానికి వెనుకాడ లేదని అక్కడ బలి ఇవ్వడానికి ఒక పొట్టేలు పొదలో ఉన్నదని తెలియ చేస్తుంది. అప్పుడు ఆ పొట్టేలును బలిగా అర్పించడం జరుగుతుంది. అక్కడ నుండి వచ్చే సమయంలో మరల దేవుని దూత ఆయనను దీవిస్తుంది. బెర్షాబా వచ్చి మరణించే వరకు అక్కడే ఉన్నారు.
అబ్రహాము పండు ముసలి వయసుకు వచ్చినప్పుడు తన కుమారుడు పెండ్లి చేయావలేనని సంకల్పించి తాను తన తండ్రి స్వదేశమున ఒక అమ్మాయిని తన కుమారునికి ఇవ్వాలి అని సంకల్పించిన తాను వెళ్లలేని పరిస్తితిలో తన దగ్గర ఉన్న ప్రధాన సేవకుడిని పిలిచి తన తండ్రి ఇంటికి వెళ్ళి తన చుట్టాలలో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఈసాకు పెండ్లి చేయాలి అని కోరడం జరిగింది. అయితే ఒక వేల అక్కడ ఎవరు ఇష్ట పడక పోయిన యెడల నీ కుమారుని అక్కడకు తీసుకువెల్లమందురా అని అడిగినప్పుడు అబ్రహాము దేవుడు అతనికి చేసిన వాగ్ధానం గుర్తు చేసుకొని దేవుడు తనను వదలి పెట్టి రమ్మనిన ప్రదేశమునకు మరల తిరిగి తన కుమారుని పంపించడానికి ఒప్పుకోలేదు.
అబ్రహాము భార్యలు - మరణం
సారా కనానులో హెబ్రోనులో నూట ఇరవై ఏడేండ్లు వయసులో మరణించినది, ఆమెను మక్ఫెలాలో సమాది చేశారు. అబ్రహాము చివరిగా కతూరా అను స్త్రీ ని వివాహమాడగా ఆమె అతనికి ఆరుగురు బిడ్డలను కన్నది. అబ్రహాము తనకు ఉన్నది అంతయు ఇస్సాకునకు ఇచ్చి మిగినలిన వారికి బాహుమనములను ఇచ్చి వారిని తూర్పు వైపుగా తూర్పు దేశము వైపు పంపి వేశాడు. ఆయన చనిపోయే సమయానికి అబ్రహాము వయస్సు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు. అబ్రహామును ఈసాకు , యిష్మయేలు మమ్రేకు తూర్పున ఉన్న మక్ఫెలా గుహలో పాతిపెట్టారు. అతని భార్య సారాను కూడా అక్కడే పాతి పెట్టిరి.
సమూయేలు చరిత్ర
సమూయేలు చరిత్ర సమూవేలు పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...
-
మోషే జీవిత చరిత్ర మోషే అంటే నీటి నుండి తీసుకొనబడిన వాడు. మోషే అమ్రాము యోకెబెదుల చిన్న కుమారుడు. హెబ్రీయుల గొప్ప నాయకుడు మరియు ధర్మ శాస్త్ర...
-
పెంతికొస్తు మహోత్సవం యోహాను 20:19-23 అది ఆదివారము సాయంసమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొనియుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలు...
-
లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తి...