యాకోబు జీవిత చరిత్ర
పరిచయం
ఈసాకు,రెబ్కాల రెండవ కుమారుడు యాకోబు, ఏసావుని కవల సోదరుడు. యాకోబు రక్షణ చరిత్రలో చాల ప్రముఖమైన వ్యక్తి. తాను సాధించాలి అనుకున్నదానిని, ఎంత కష్టించి అయిన సాధించుకోవుటలో, పట్టు విడువకుండ ఉండుటలో , నిరాశ దరిచేరనివ్వని ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.
యాకోబు స్వభావం
యాకోబులో రెండు రకాల స్వభావాలు మనం చూస్తాము. ఇతనిలో మంచి మరియు చెడు రెండు స్వభావాలు మనకు కనబడుతాయి. ఆయన తన జీవితంలో మంచి, చెడు చేసే విషయాలలో పడిపోతూ, లేస్తూ ఉంటాడు. తను పడిపోయిన కాని దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు. మరియు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు, తన బలహీనతలు మరియు శక్తి సామర్ధ్యాలు ఇవన్నీ కూడా ఆయన జీవితాన్ని చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఇతని జీవితం బాహుముఖాలు కలిగిఉంది. ఈనాటి మానవ స్వాభావానికి సరిగ్గా సరిపోతాడు. యాకోబులో లోపాలు ఉన్నాయి కాని ప్రార్ధన పరుడు. నిలకడలేనితనం ఉంది కాని చివరిలో చాలా మార్పు చెందనివాడు అయ్యాడు. తన జీవిత మొదటి భాగంలో మంచి చెడులు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం చాలా ఆసక్తిగలది.
యాకోబు తన తల్లి పక్షపాత ప్రేమకు పాత్రుడు అయ్యాడు. తన తల్లి ఆయనను ప్రేమించింది. యాకోబు స్వార్ధపరునిగా జీవించాడు. తన అన్న ఆకలితో ఇంటికి వచ్చినప్పుడు, తన అన్న ఆకలిని ఆసరాగా తీసుకొని తన జేష్ట పుత్రుని హక్కును అపహరించాడు. స్వభావ పరంగా యాకోబు మోసగాడు. తన మనసాక్షిని చంపుకొని, తన తల్లి కోరిక మేరకు తన అన్నను మోసం చేశాడు. తను పొందవలసిన దీవెనలు పొందాడు. అబద్ధం చెప్పి తండ్రిని మోసం చేశాడు. కంటి చూపు సరిగా లేని తన తండ్రి ఆసరాగా చేసుకొని తన తండ్రిని మోసం చేశాడు. అంతేకాదు తానే ఏసావును అని అబద్దం చెప్పాడు. ఇటువంటి అన్ని పనులు ఉన్న ఇతని జీవితంలో రెండు ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దైవ అనుభవాలు ఉన్నాయి. ఒకటి బేతేలు దగ్గర మరియు పెనియెలు దగ్గర. తన క్రమశిక్షణ ద్వారా దేవుడు ఆయనను తన వైపు మరల్చుకున్నాడు. యాకోబు దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి. తనకు దేవుడు ఇచ్చిన కుమారులు ఒక దేశానికి మూలం అయ్యారు. వారు హిబ్రూ దేశం అంటే యాకోబు కుమారులు, యిస్రాయెలు సంతానం అని అర్ధము.
అన్నను మోసగించి జేష్ట అధికారం పొందుట
ఈసాకు రిబ్కాలకు అనేక సంవత్సరాలు సంతానం లేదు, దేవుడు వారి విన్నపాన్ని వినగా ఆమె గర్భం దాల్చింది. రిబ్కాకు ఇద్దరు కుమారులు పుట్టారు, మొదటిగా ఏసావు , వెంటనే యాకోబు పుట్టాడు. వీరు ఇద్దరు కవలలు. యాకోబు ఏసావు పుట్టిన వెంటనే అతని మడమపట్టుకొని తల్లి గర్భం నుండి బయటకు వచ్చాడు. యాకోబు అంటే మడమ లేక మోసగాడు అని అర్ధం. యాకోబు చిన్నప్పుడు సౌమ్యునిగా, తన ఇంటిని అంటిపెట్టుకొని జీవించేవాడు. చిన్నప్పటి నుండి పని చేయకుండానే తనకు కావలసినవి పొందుటకు ఇష్టపడేవాడు. ఒక రోజు ఏసావు పొలము నుండి అలసిపోయి వచ్చాడు. యాకోబు ఎర్రని పులుసు చేసాడు, అప్పుడు ఏసావు ఆకలితో ఉండి ఆ పులుసును త్రాగుటకు తనకు ఇవ్వమని అడుగగా, అందుకు యాకోబు జేష్టునిగా ఉన్న తన అన్న ఏసావు హక్కులను తనకు ఆ పులుసుకోసం అమ్మివేయుమని అడిగాడు. అందుకు ఏసావు, ఆ హక్కు నేనేమీ చేసుకుంటాను, నీవే దానిని తీసుకొని నాకు పులుసు ఇవ్వమని చెప్పగా, అందుకు యాకోబు మాట మాత్రమే చాలదని అన్న చేత దానిని వదులుకుంటున్నట్లు ప్రమాణం చేయించుకున్నాడు. ఏసావు ప్రమాణం చేసి తన జేష్ట అధికారమును యాకోబుకు కట్టబెట్టాడు. యాకోబు తన అన్నకు ఉండవలసిన జేష్ట అధికారము ఆ విధంగా, ఆకలిని ఆయుధంగా చేసుకొని తీసుకున్నాడు.
ఈసాకును మోసగించి దీవెనలు పొందుట
ఈసాకు ముసలివాడై, చనిపోయే ముందు తన పెద్ద కుమారుడుని ఆశీర్వాదించాలని, ఏసావును పిలిచి, తనకు దుప్పి మాంసంను తెచ్చి, భోజనం ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆ మాటలను వినిన రిబ్కా , ఆ దీవెనలు తన చిన్న కుమారుడు యాకోబుకు దక్కాలనే ఆశతో, ఆమె ఒక పన్నాగం పన్ని, యాకోబుతో మంద నుండి ఒక మేక పిల్లను తీసుకొచ్చి, దానితో రుచికరమైన భోజనం చేసి, ఆ దీవెనలు నీవే పొందమని చెప్పింది. దానికి యాకోబు, ఒక వేళ ఆ ప్రణాళికా ఈసాకుకు తెలిసినచో తన తండ్రి కోపానికి గురవుతానేమొ, అని భయపడి అది తల్లికి చెప్పగా, ఆ శాపమేదో నాకే తగులనిమ్ము, కాని నీవు నేను చెప్పినట్లు చేయమనగా, అతడు ఆమె చెప్పినట్లు చేసాడు. అప్పడు రిబ్కా యాకోబు తెచ్చిన, మేక పిల్ల మాంసమును వండి, యాకోబు ఏసావు వలె ఉండుటకు ఏసావు కట్టుకునే మేలి ఉడుపులు ఇచ్చి,మేక పిల్లల తోళ్ళతో యాకోబు మెడను కప్పింది. ఆమె వండిన భోజనాన్ని యాకోబుకు ఇచ్చి తండ్రి దగ్గరకు పంపింది.
యాకోబు ఈసాకు దగ్గరకు ఆ భోజనము తీసుకొని వెళ్ళాడు. తండ్రి దగ్గరకు వెళ్ళిన తానే పెద్ద కుమారుడు అయిన ఏసావును అని చెప్పి, నీవు చెప్పినట్లే అడవికి వెళ్ళి జింక మాంసం తెచ్చాను, దానిని తినమని చెప్పాడు. ఈసాకు ఇంత తొందరగా ఎలా జింక మాంసం ఎలా దొరికింది అని అడుగగా యాకోబు, నీ దేవుడైన ప్రభువే దానిని నా యొద్దకు పంపెను అని దేవుని పేరు చెప్పి మోసం చేసాడు. ఈసాకు, యాకోబును తన దగ్గరకు పిలిచి తడిమి చూసి గొంతు యాకోబులా ఉన్న చేతులు మాత్రము ఏసావువే అనుకున్నాడు. ఈసాకు అతనిని దివించాలని నీవు నిజముగా ఏసావువేనా అని అడిగాడు, అందుకు యాకోబు అవును అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఈసాకు నీవు తెచ్చిన జింక మాంసమును తీసుకొనిరా, నేను తిని నిన్ను దివిస్తాను అని చెప్పగా , యాకోబు అలానే చేశాడు. దానిని తినిన తరువాత ఈసాకు తన కుమారుడుని, దీవించుటకై నాయన వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పగా ,యాకోబు వెళ్లి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు యాకోబు ధరించిన దుస్తుల వాసన చూచి అతనిని దీవించాడు. యాకోబుకు ధాన్యమును , పంటలను, చేలను ద్రాక్షసారాయము సమృద్దిగా సమకూరునని, ఎల్ల జనులు తన సేవకులవుతారు అని , తన సోదరులను పాలించును అని, తనని శపించువారు శపించబడుతారని, యాకోబును దీవించిన వారు దీవించబడతారని దీవించగానే, ఏసావు వేటనుండి వచ్చి తండ్రికి భోజనము తీసుకొని వచ్చి తండ్రిని దీవించమని అడుగాడు. అందుకు ఈసాకు నాయన నీవు ఎవరవు? అని అడిగాడు. అప్పుడు నేను నీ పెద్దకుమారుడను ఏసావును అని అతడు చెప్పగా, ఈసాకు జరిగినది మొత్తం పెద్ద కుమారునికి తెలియజేశాడు. అందుకు ఏసావు అతనికి సార్ధకమైన పేరే పెట్టారని, ఇప్పటికి యాకోబు రెండు సార్లు నన్ను మోసాగించాడు అని చెప్పాడు. యాకోబు తనకు బదులుగా దీవెనలు పొందినందుకు ఏసావు యాకోబు మీద పగ పట్టాడు, తండ్రి చనిపోయిన తరువాత యాకోబు ప్రాణము తీయాలనుకొన్నాడు. ఏశావు ఆలోచనలు తెలిసిన రిబ్కా, యాకోబును పిలిచి హారనులో ఉన్న తన సోదరుడు లాబాను ఇంటికి పొమ్మని చెప్పి, ఏసావు కోపం తగ్గినంత వరకు అక్కడ ఉండమని చెప్పింది. తన అన్న కోపం తగ్గిన తరువాత తనను పిలిపిస్తాను అని చెప్పింది.
ఆమె ఈసాకుతో ఏసావు పెళ్లి చేసుకున్న హిత్తియుల పిల్లలు తనను ఇబ్బంది పెడుతున్నారని యాకోబు కూడా ఇక్కడి హిత్తియుల పిల్లలను చేసుకోవడం తనకు ఇష్టం లేదని వారితో తను పడలేనని చెప్పింది. అప్పుడు ఈసాకు, యాకోబును పిలిచి కనానీయుల పిల్లలను ఎవరను పెళ్లి చేసుకోవద్దని చెప్పి పద్దనారములోని లాబాను ఇంటికి వెళ్ళి అక్కడ లాబాను కూతురులలో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పి, దీవించి లాబాను వద్దకు పంపించాడు.
యాకోబు కల
ఏసావు కోపం నుండి తప్పించుకోవాలని యాకోబు బయలుదేరాడు. బేర్షేబా దాటి, హారను వైపు వెళ్ళే దారిలో వెళుతూ, చీకటి పడుచుండగా అక్కడే ఆగి పోయాడు. అక్కడ ఉన్న ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెనను చూసాడు, దాని మొదలు నేలను, దాని చివర ఆకాశమును అంటుచున్నవి. దేవ దూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచు దిగుచు ఉన్నారు. అపుడు యావే దేవుడు నిచ్చెన పైగ నిలుచొని యాకోబుతో నేను ప్రభుడను, నీ పితామహులగు అబ్రహామునకు, ఈసాకునకు నేనే దేవుడను, నీవు పడుకొనిన ఈ ప్రదేశమును నీకును నీ సంతతికిని అప్పగింతును, నీ సంతతిని అసంఖ్యాకముగా పెరిగిపోయి, నేల నాలుగు అంచుల వరకు వ్యాపింతురు. నీద్వారా, నీ సంతానము ద్వారా, భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు బడయుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చేదను. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అనెను.
యాకోబు నిద్ర నుండి మేల్కొని ఇక్కడ దేవుడు ఉండుట నిజము, ఇది నాకు తెలిసెనని భయపడ్డాడు. ఈ ప్రదేశము దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అని, యాకోబు ఉదయమునే లేచి తలగడగా చేసుకున్న రాతిని స్తంభముగా నాటి దాని మీద తైలము దేవునికి అంకితం చేశాడు. ఆ ప్రదేశమునకు బేతేలు (దైవ నిలయం) అని పేరు పెట్టాడు. దానికి ముందు దాని పేరు లూజు. తరువాత యాకోబు దేవుడు నాకు తోడుగా ఉండి నా ప్రయాణములో నన్ను కాపాడినచో, నాకు తిండి, గుడ్డ సమకూర్చి, నేను నా తండ్రి ఇంటికి తిరిగి సమాధానంతో వెళ్ళిన యెడల ప్రభువే నాకు దేవుడగును అనుకొన్నాడు.తానూ స్తంభంగా నాటిన రాయి దైవ మందిరమగునని దేవుడు ట్యాంకు ఇచ్చిన దానిలో పదియవ వంతు దేవునికే చెల్లింతునని మ్రొక్కుకొన్నాడు.
యాకోబు లాబాను ఇంటికి చేరుట
యాకోబు తూర్పు జాతుల దేశం చేరి, అక్కడ పొలములో ఒక బావిని చూసెను, ఆ బావి దగ్గర గొర్రెల మందలు నీరు త్రాగును, ఆ బావి మీద పెద్ద రాయి ఉన్నది, అక్కడి మందలు ఆ నీరు తాగుటకు ఆ రాతిని తీయవలసిఉంటుంది. యాకోబు అక్కడ ఉన్నవారితో అన్నలారా మీది ఏ ఊరు అని వారిని అడుగగా వారు మాది హారను అని చెప్పగ వారితో మీకు లాబాను గురించి అతని యోగా క్షేమాలు గురించి అడుగగా అతను బాగానే ఉన్నాడు, అతని కూతురు రాహెలు మంద వెంట వస్తున్నది, చూచి వారు ఆ విషయం చెప్పారు. రాహెలు అక్కడకు రాగ , ఆమెను చూచి యాకోబు బావి దగ్గరకుపోయి దాని మీద రాతిని తీసివేసి, లాబాను మందకు నీళ్ళు పెట్టి, రాహెలును ముద్దు పెట్టుకొని నీ తండ్రికి అయినవాడను అని చెప్పాడు . అప్పుడు ఆమె పరుగెత్తుకొని పోయి జరిగిందంత తన తండ్రికి చెప్పగా అతను తన మేనల్లుడు వచ్చేనని వచ్చి యాకోబును కౌగలించుకొని ముద్దు పెట్టుకొనగా, జరిగిన విషయములను మొత్తం యాకోబు అతనికి వివరించాడు. తరువాత అక్కడే నెల రోజుల పాటు ఉన్నాడు.
యాకోబు వివాహములు
లాబాను యాకోబుతో నీవు నాకు బందువే కాని, ఊరకనే ఊడిగము చేయడం ఎందుకు? నీకు ఎంత జీవితము కావాలో చెప్పమని అడిగాడు. లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు లేయా మరియు రాహేలు, లేయా బలహీనమైన కళ్ళు కలది , రాహేలు సౌందర్యవతి. రాహేలును యాకోబు ప్రేమించాడు, కనుక యాకోబు లాబానుతో నేను ఏడు సంవత్సరాలు రాహేలు కోసం ఊడిగం చేస్తాను అని చెప్పాడు. దానికి లాబాను ఒప్పుకున్నాడు. యాకోబు రాహేలు కొరకు ఏడు సంవత్సరాలు పని చేశాడు అవి ఏడు గడియలు వలె గడిచి పోయాయి, అంతగా ఆమెను అతడు ప్రేమించాడు. ఏడు సంవత్సరాల తరువాత యాకోబు తనకు రాహేలును అప్పగించమని లాబానును అడుగగా, లాబాను అక్కడి వారిని అందరిని, పిలచి, విందు ఏర్పాటు చేసి, చీకటి పడిన తరువాత తన పెద్ద కూతురు లేయాను యాకోబు వద్దకు తీసుకొనిపొగా అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాడు. అపుడే లేయాకు లాబాను జిల్ఫా అనే ఒక బానిస పిల్లను దాసిగా ఇచ్చాడు. తెల్లవారిన తరువాత తాను రాత్రి గడిపినది లేయాతో అని యాకోబు తెలుసుకున్నాడు. అతను లాబానుతో ఇదేమి, నేను పని చేసినది రాహేలు కొరకు కదా! నన్ను ఎందుకు మోసగించితివి అని అడిగాడు. అందుకు లాబాను పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా చిన్న పిల్లకు పెళ్లి చేయుట మా ఆచారము కాదు. ఈ ఏడు రోజుల ఉత్సవము జరుగనిమ్ము, తరువాత రాహేలును కూడా నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను, కాని దానికి మరల నాకు ఏడు సంవత్సరాలు ఊడిగము చేయాలి అని చెప్పాడు. అందుకు యాకోబు ఒప్పుకున్నాడు. తరువాత యాకోబుకు రాహేలును ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమెతో పాటు బిల్హా అనే దాసిని కూడా ఇచ్చాడు. యాకోబు ఏడు సంవత్సరములు ఊడిగం చేశాడు.
యాకోబు కుమారులు
లేయా భర్త ప్రేమకు నోచుకోలేక పోయింది. అది చూచిన దేవుడు ఆమెను సంతానవతిగా చేశాడు. రాహేలు గొడ్రలుగా ఉంది. లేయా బిడ్డను కాని దేవుడు నా బాధను చూచెను. ఇప్పుడైన నా భర్త నన్ను ప్రేమించునా అనుకొన్నది. అందుకే తన బిడ్డకు రూబేను అని పేరు పెట్టింది, దాని అర్ధం బాధను చూచుట. ఆమె మరల బిడ్డను కని అతనికి షిమ్యోను అను పేరు పెట్టింది. దాని అర్ధం వినుట. నేను నా భర్త అనురాగానికి దూరం అయ్యానని విని దేవుడు నాకు ఈ బడ్డను ఇచ్చాడు అని లేయా అనుకున్నది. మరల ఆమె గర్భం దాల్చి ఒక కుమారున్నీ కని ఆ బిడ్డకు లేవి అని పేరు పట్టింది. ఆ మాటకు అర్ధం అంటుకొనియుండుట, ఈ బిడ్డ ద్వారా తన భర్త తనకు అంటుకొని ఉంటాడు అనుకున్నది. నాలుగవ సారి కూడా ఆమె ఒక కుమారుని కని అతనికి యూదా అని పేరు పెట్టి, నేను ఇక దేవుని స్తుతించుకుంటాను అని అనుకున్నది, యూదా అనగా స్తుతించు అని అర్ధం.
రాహేలుకు బిడ్డలు లేక పోవుటచే లేయాను చూచి అసూయ పడింది. ఆమె యాకోబుతో, నాతో బిడ్డలను కంటవా లేక నేను చావనా అని వాపోయింది. దానికి యాకోబు నీకు బిడ్డలను ఇవ్వవలసింది దేవుడు , నేనేమైన ఆయన స్థానమున ఉన్ననా అని చెప్పగా దానికి ఆమె తన దాసి అయిన బిల్హాను తీసుకొచ్చి ఆమెతో శయనించి, తన బదులుగా ఆమెతో బిడ్డలను కనమని చెప్పింది. అలా ఆమె తన దాసిని యాకోబుకు భార్యగా చేసింది. అప్పుడు ఆమె గర్భవతి అయి బిడ్డను కన్నది, ఆ బిడ్డకు దాను అని పేరు పెట్టారు. దాను అంటే తీర్పు అని అర్ధం. మరల బిల్హా గర్భవతి అయి ఒక బిడ్డను కనగా రాహేలు నేను మా అక్కతో బాగా పోరాడితిని అని ఆ బిడ్డకు నప్తాలి అని పేరు పెట్టింది. అప్పుడు లేయా తను కూడా తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా చేసింది. ఆమె ఒక కుమారుని కనగా, ఆ బిడ్డకు గాదు అని పేరు పెట్టిరి, గాదు అనగా అదృష్టము, ఆమె మరియొక కుమారుని కనగా అతనికి ఆషేరు అని పేరు పెట్టెను, ఆ పేరు అర్ధం భాగ్యము.
లేయా పెద్ద కుమారుడు రూబెను పొలము వెళ్ళి కొన్ని పండ్లను కోసికొనిరాగ, రాహేలు వాటిలో కొన్నింటిని తనకు ఇవ్వమని అడిగింది దానికి లేయా ఒప్పుకోకపోవడంతో, రాహేలు లేయా తో నీ కుమారుడు తీసుకొచ్చిన పండ్లను ఇస్తే ఆ రోజు నీవు యాకోబుతో శయనించవచ్చు అని చెప్పింది, అందుకు లేయా ఒప్పుకోని యాకోబు పొలము నుండి ఇంటికి వచ్చే సమయంలో ఎదురెల్లి జరిగినది చెప్పి, యాకోబును తీసుకు వెళ్ళి, అతనితో శయనించగ ఆమె గర్భం దాల్చి ఐదవ కుమారుని కని అతనికి యిస్సాఖారు అని పేరు పెట్టింది. మరల యాకోబు ఆమెను కూడగా ఆమె గర్భం దాల్చి ఆరవ కుమారుని కని ఆ బిడ్డకు సెబులూను అని పేరు పెట్టెను, అనగా కానుక అని అర్ధం. దేవుడు రాహేలును మరచిపోక ఆమెకు ఒక కుమారుని ఇచ్చెను అతనికి యోసేపు అని పేరు పెట్టెను, యోసేపు అంటే అధికము చేయుట లేక తొలగించుట.
యాకోబు సంపన్నుడగుట
యేసేపు పుట్టిన తరువాత యాకోబు లాబానుతో నన్ను మా దేశం పంపివేయమని, తన భార్యాలను పిల్లలను తనకు అప్పగించమని అడిగాడు. దానికి లాబాను నీ వలన దేవుడు నాకు మేలు చేశాడు కనుక నీకు ఏమి కావాలో అడుగు అని చెప్పగా దానికి యాకోబు నీ నుండి నాకు ఏమి వద్దు, నీ మందలనుండి నల్లని గొర్రె పిల్లను, పొడలు మచ్చలు ఉన్న మేకపిల్లలను వేతనముగా తీసుకొందును అని చెప్పాడు. అందుకు లాబాను ఒప్పుకున్నాడు. కాని లాబాను తెల్ల చారలు మచ్చలు గల మేకపోతులను, తెల్ల పొడలుగల అడుమేకలను , నల్ల గొర్రె పిల్లలను వేరు చేసి తన కుమారులకు ఇచ్చి వారిని దూరముగా యాకోబు మందల నుండి మూడు రోజుల ప్రయాణం పట్టే దూరంలో ఉంచాడు.
యాకోబు రావి, బాదము, బూరుగు చెట్ల పచ్చి పుల్లలను తీసుకొచ్చి వానిలో తెల్ల చారలు కనపడునట్లు పై బెరడు తీసివేసి వాటిని మందలు నీళ్ళు త్రాగే తోట్లలో పాతి పెట్టను. ఎదకు వచ్చిన ఆడ మేకలు నీళ్ళు త్రాగుటకు వచ్చినప్పుడు, ఆ పుల్లలు వాటకి ఎదురుగా ఉండెను కనుక వానికి తెల్ల చారలు పొడలు మచ్చలుగల పిల్లలు పుట్టెను. గొర్రెలను వేరు చేసి లాబాను మందలో నల్లరంగు, నల్ల మచ్చలు గల వాని వైపు తోలేను. ఆ గొర్రెలకు నల్ల పిల్లలు పుట్టెను. అలా ఆయన సొంత మందను పెంచి విడిగా మెపెను. బలమైన పశువులు ఎదకు వచ్చినప్పుడు మాత్రమే అతడు నీళ్ళ తొట్లలో పుల్లలుంచేను. ఆ విధంగా యాకోబు బలమైన వాటిని పొంది సంపన్నుడు అయ్యాడు. చాలామంది దాసి దాసులను, ఒంటెలను గాడిదలను సంపాదించుకున్నాడు.
యాకోబు పారిపోవుట
లాబాను కుమారులు మాట్లాడుకుంటూ, యాకోబు మన తండ్రి ఆస్తిని కాజేసినందుకే, ఇంత సంపన్నుడు అయ్యాడు అనుకొనుటను యాకోబు విన్నాడు. లాబాను కూడా మునుపటి ప్రేమను యాకోబు మీద చూపించుట లేదు. దేవుడు యాకోబుతో నీ పితరుల దేశములో ఉన్న, నీ బంధువుల యొద్దకు వెళ్ళుము. నేను నీ వెన్నంటి ఉంటాను అని అభయమియగా యాకోబు పొలములో ఉన్న లేయాను , రాహేలును పిలిపించి, లాబాను ఎలా అతనిని మోసం చేసినది, ఎన్ని సార్లు తన జీతం మార్చినది, మరియు దేవుడు లాబాను వలన అతనికి ఎటువంటి అపాయం కలుగకుండా కాపాడింది, మరియు ఎలా దేవుడు తన పశు సంపదను పెంచినది అనే విషయాలను మరియు కలలో దేవుని దూత తనకు కనిపించి వెంటనే ఈ దేశము విడిచి, నీవు పుట్టినచోటికి తిరిగి పొమ్మని చెప్పిన విషయమును చెప్పాడు. లేయా , రాహేలు యాకోబుతో మాకు తండ్రి ఇంటిలో పాలుపంపకములు ఏమి లేవు, మమ్ములను కూడా కానివారినిగానే చూస్తున్నాడు. మమ్ము విక్రయించిన సొమ్మును కూడా తానే తీసుకొన్నాడు. దేవుడు మా తండ్రికి చెందకుండా చేసినదంత మాది, మా పిల్లలది. కనుక దేవుడు చెప్పినట్లే చేయమని అతనితో అన్నారు. యాకోబు తనకు చెందినదంత తీసుకొని తన భార్యలు పిల్లలను ఒంటెలమీద ఎక్కించి, మందలను పశుసమూహములను, వస్తువులను తొలుకొని పద్దనారములో సంపాదించినది మొత్తం తీసుకొని, కనానులో ఉన్న తన తండ్రి ఈసాకు వద్దకు బయలు దేరాడు. యాకోబు లాబానుకు చెప్పకుండా తన ప్రయాణం ప్రారంభించాడు.
లాబాను యాకోబును వెంటాడుట
యాకోబు పారియాడు అనే మాట లాబానుకు మూడు రోజుల తరువాత తెలుసినది. అప్పుడు తన మనుషులను తీసుకొని ఏడు రోజుల పాటు వెంటాడి గిలాదు కొండ వద్ద యాకోబును పట్టుకున్నాడు, ఆ రాత్రి దేవుడు లాబానుకు కలలో కనబడి యాకోబుకు ఎటువంటి హాని చెయవద్దు అని చెప్పాడు. లాబాను యాకోబుతో ఇదేమి? నాకు చెప్పకుండ వచ్చితివి. నాకు చెప్పిన యెడల నిన్ను మేళతాళాలతో పంపనా అని చెప్పి, నీవు వచ్చినప్పుడ నా కుమార్తెలను కడసారి చూడలేదని మరియు నా దేవతలను ఎలా దొంగిలించితివి అని అడుగగా దానికి యాకోబు నీ కుమార్తెలను తీసికొని పోవుదవేమో అని భయపడ్డాను కాని నీ దేవతావిగ్రహములను దగ్గర పెట్టుకొన్నవారికీ చావు మూడింది అని చెప్పాడు. రాహేలు ఆ విగ్రహాలు దొంగిలించిన సంగతి ఆయనకు తెలియదు. అంతేకాక, నీది నా దగ్గర ఎమున్న తీసుకోమని చెప్పాడు. లాబాను అక్కడి వారి గుడారములు వెతికాడు. లేయా, రాహేలు యాకోబు, దాస దాసి గూడారములు వెతికారు. రాహేలు దేవతావిగ్రహాలు తీసుకెళ్ళి, ఒంటె జీను క్రింద పెట్టి దానిమీద కూర్చున్నది. లాబానుకు ఏమి దొరకలేదు. అందుకు యాకోబు కోపంతో నేను చేసిన తప్పేమి, నన్ను ఎందుకు వెంటాడితవి, నీకు సంభందించినది ఏమైనా దొరికినదా అని అడిగి , దొరికినట్లయితే వీరి ముందు పెట్టు, వీరే తీర్పు చెప్పుదురు అని అన్నాడు. అంతేకాక తాను ఎంత కష్ట పడి ఇరవై సంవత్సరాలు లాబాను నుండి ఏమి ఆశించకుండా ఉన్నది తెలియజేశాడు.
లాబాను యాకోబుల ఒడంబడిక
లాబాను యాకోబుతో వీరు అందరు నా వారే. ఈ పిల్లలు నా పిల్లలే. నీవు చూచుచున్నదంతయు నాదే. నా కుమార్తెలకు నేనేమీ చేయగలను. నీవు, నేను ఒక ఒడంబడిక చేసుకుందము అని చెప్పగా యాకోబు ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి దానిని స్తంభంగా నిలబెట్టి రాళ్ళు ప్రోగుచేయమని చెప్పగా వారు రాళ్ళు తెచ్చి కుప్ప చేశారు. దాని దగ్గరే వారు భోజనం చేశారు. యాకోబు దానికి గలెదు అని పేరు పెట్టాడు. దాని అర్ధం సాక్షియగు కుప్ప . అప్పుడు లాబాను యాకోబుతో, నీకు నాకు ఈ కుప్ప సాక్షిగా ఉండును అని చెప్పెను. లాబాను మనము ఒకరి కోకరు కనపడకుండా విడిపోయినప్పుడు, దేవుడు మన ఇద్దరను ఒక కనిపెట్టునుగాక అని చెప్పి, ఆ తావుకు మిస్పా అని పేరు పెట్టాడు . లాబాను యాకోబుతో నీవు నా కుమార్తెలను హింసించిన, వేరే పెళ్లి చేసుకున్న నీకు నాకు మధ్య దేవుడు సాక్షిగా ఉన్నాడు. ఈ కుప్ప , ఈ స్తంభం సాక్షిగా ఉన్నాయి మరియు నీవు నాకు కీడు చేయుటకు ఈ కుప్పను , స్తంభంను దాటి ఇటు రావద్దు , నీ వైపు నేను రాను అని చెప్పుకొనిరి. అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు మనకు తీర్పరిగా ఉండును అని లాబాను చెప్పగా యాకోబు మా తండ్రి ఈసాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణము చేశాడు. మరునాడు లాబాను తన కుమార్తెలను వారి పిల్లలను ముద్దాడి, దీవించి తిరిగివెళ్ళెను. యాకోబు ప్రయాణించుచుండగా అతనికి దేవుని దూతలు ఎదురవ్వగా యాకోబు ఇది దేవుని సైన్యం అని పలికి, ఆప్రదేశమునకు మహనయీము అని పేరు పెట్టెను.
యాకోబు ఏసావును కలుసుకొనుటకు సిద్దమవుట
యాకోబు తన అన్న ఏసావును కలిసే ముందుగ తన దూతలను అతని వద్దకు పంపి తన అనుగ్రహం కొరకు వర్తమానం పంపాడు. ఏసావు ఏదోము దేశమందు సెయీరు మండలములో ఉన్నాడు. యాకోబు పంపిన దూతలు తిరిగి వచ్చి మేము మి అన్నను చూచితిమి, ఆయన నిన్ను త్రోవలోనే కలుసుకొనుటకు నాలుగు వందల మందితో వస్తున్నాడు అని చెప్పారు. ఏసావు తనను తన వారిని, మందలను నాశనం చేస్తాడు ఏమో అని భయపడి , దేవునికి కాపాడమని మొరపెట్టుకున్నాడు. ఆ రాత్రి అక్కడే బస చేసి , తన అన్నకు బహుమానముగా పంపుటకు తన కంటే ముందుగా రెండు వందల అడుమేకలను, ఇరువై మేకపోతులను , రెండు వందల గొర్రెలను ఇరువై పోటెల్లను పాడి ఒంటెలను , ఇరువై అడుగాడిదలను , పది మగ గాడిదలను విడి విడిగా ఒక్కో మందను, ఒక్కో దాసునకు ఇచ్చి పంపుతూ , వారికి ఎదురు వచ్చి అడిగిన వారితో , ఇవి మీ దాసుడగు యాకోబు మంద, ఏసావునకు వీనిని కానుకగా పంపెను, ఆయన వెనుక వస్తున్నాడు అని చెప్పమని చెప్పాడు. దాని ద్వారా ఏసావు కోపం తగ్గుతుంది అని యాకోబు తలంచాడు. కానుకలు పంపి యాకోబు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు.
యాకోబు దేవునితో కుస్తీపట్టుట
యాకోబు రాత్రి వేళ లేచి తన భార్యలను , దాసి దాసులను, కొడుకులను యబ్బో కు రేవు దాటించి అతను మాత్రం అక్కడే మిగిలిపోయాడు. అపుడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టాడు. అతడు యాకోబును ఓడింపకపోవుటచే అతని తుంటి మీద కొట్టాడు. అపుడు యాకోబునకు తుంటి తొలగింది. ఆ మనుష్యుడు యాకోబుతో తెల్లవారుచున్నది, నన్ను పోనిమ్ము అని చెప్పగా, అందుకు యాకోబు నన్ను దీవించువరకు నిన్ను వెళ్లనియను అని చెప్పాడు అప్పుడు ఆ మనుష్యుడు యాకోబును నీ పేరు ఏమిటి అని అడుగగా యాకోబు నా పేరు యాకోబు అని చెప్పాడు దానికి ఆ వ్యక్తి నీకు ఇక ముందు నీకు యాకోబు అను పేరు కాక, యిస్రాయేలు అని పేరుండును. నీవు దేవునితో, మానవునితో పోరాడి గెలిచితివి అని చెప్పాడు. అపుడు యాకోబు అతన్ని పేరు అడుగగా దానికి నా పేరు అడుగనేలా అని యాకోబుని దీవించెను. యాకోబు నేను దేవుడను ముఖాముకిగా చూచియు బ్రతికితిని అని ఆ ప్రదేశమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. యాకోబు కుంటుకొనుచు అక్కడ నుండి వెళ్ళెను.
యాకోబు ఏసావును కలుసుకొనుట
యాకోబు కన్నులేత్తి చూడగా ఏసావు నాలుగువందల మందితో వస్తున్నాడు. అది చూసి యాకోబు తన పిల్లలను వేరు చేసి లేయాకు రాహేలుకు ఇచ్చి దాసి స్త్రీలను వారి పిల్లలను వారి ముందుంచి అందరి చివర రాహేలు యేసేపు ఉన్నారు. యాకోబు అందరి కంటే ముందుగా వెళ్ళి తన అన్నను సమీపిస్తూ ఏడుసార్లు సాగిల పడ్డాడు ఏసావు పరుగెత్తుకొచ్చి యాకోబును కౌగలించుకొని మెడపై ముద్దు పెట్టుకొన్నాడు. ఇద్దరు కన్నీరు పెట్టుకొన్నారు. ఏసావు వారి అందరినీ చూచి, వీరందరు ఎవరు అని అడుగగా, దానికి యాకోబు వీరు దేవుడు నీ దాసునికి అనుగ్రహించిన పిల్లలు అని చెప్పగా వారు అందరు ఏసావు ముందుకు వచ్చి సాగిలపడ్డారు. అప్పుడు వారు తీసుకొచ్చిన కానుకలను చూచి ఇది నా ముందుకు వచ్చినది ఎందుకు అని ఏసావు అడుగుగా, యాకోబు నీ అనుగ్రహము సంపాదించుటకే అని చెప్పెను. అందుకు ఏసావు తమ్ముడా! నాకు కావలసినంత నాకు ఉన్నది అని చెప్పిన కాని, యాకోబు బలవంతము చేయగా ఆ బహుమానములను తీసుకున్నాడు.
ఏసావు వెళ్లిపోవుట
ఏసావు యాకోబుతో నేను ముందు నడుచుచు దారి చూపుదును, అని చెప్పగా దానికి యాకోబు తనకు మందలు, పిల్లలు, మేకలు పశువులు ఇవి అన్ని ఉండుటవలన నిదానముగా వచ్చి, సేయీరు లో ఏసావును కలుసుకుంటాను అని చెప్పెను, అందుకు ఏసావు , తన మనుష్యులను కొంతమందిని వారిని అనుసరించుటకు ఉంచుటకు సిద్దపడగా, యాకోబు నా మీద నీకు దయగలిగింది, అదియే చాలు. ఇక ఈ బలగంతో పని ఏముంది అని చెప్పెను. ఇక ఆ రోజే ఏసావు అక్కడనుండి వెళ్ళి పోయాడు. యాకోబు సుక్కోతునకు వెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టి , పశువులకు పాకలు వేయించెను. సుక్కోతు అనగా పాక అని అర్ధం. అక్కడ నుండి షేకెము చేరి అక్కడ గూడారములు వేసిన చోటును షెకెము తండ్రి అయిన హొమొరు కుమారుల నుండి నూరు వెండి నాణెములుతో కొన్నాడు. అక్కడ ఒక బలి పీఠము కట్టి దానికి ఎల్ ఏలోహి యిస్రాయేలు పేరు పెట్టాడు అంటే యిస్రాయేలు దేవుడయిన దేవునికి అని అర్ధం.
దీనా మానభంగము
యాకోబు లేయాల కూతురు దీనా. దీనా ఒక రోజు ఆ దేశ స్త్రీలను చూచుటకు వెళ్ళగా ఆ దేశ యువరాజు హమోరు కుమారుడు షెకెము చూచి , ఆమెను ప్రేమించి, ఆమెను ఇచ్చి నాకు పెళ్లి చేయమని తన తండ్రి హమోరును అడిగాడు. యాకోబు తన కూతురు దీనాను చెరచెనని విని , తన కొడుకులు పొలములో నుండి వచ్చినంతవరకు ఏమి మాట్లాడలేదు. షెకెము తండ్రి యాకోబుతో మాట్లాడుటకు వచ్చి , దీనాను తన కుమారునికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగి, వారికి కావలసినది ఏమి అయిన ఇవ్వుటకు సిద్దం అయ్యాడు. యాకోబు కుమారులు ఈ సంగతి తెలుసుకొని చాలా కోపపడ్డారు. వారు హమోరుతో ఇది చేయలేము, సున్నతి చేయనివారికి మా చెల్లిని యిచ్చుట మాకు అవమానకరం అని చెప్పారు. వారు సున్నతి చేసుకుంటే ఒప్పుకుంటాము అని చెప్పారు. ఆ మాటలు హమోరు షెకెముకు నచ్చినవి. నగర ద్వారమునకు వెళ్ళి వారి ప్రజలందరకు చెప్పి, సున్నతి చేసుకోటకు ఒప్పించిరి. వారందరు సున్నతి చేసుకున్నారు.
ప్రతి కారము
సున్నతి చేసుకోవడం వలన కొంతమంది నొప్పితో బాధపడుతుండగా యాకోబు కుమారులు దీనా సోదరులు షీమ్యోను, లెవీ కత్తులు చేపట్టి నగరములోకి వెళ్ళి ప్రతి పురుషున్ని చంపారు, హమొరును, షెకెమును ఘోరముగా చంపారు. దీనాను విడిపించుకొని వెళ్లారు. యాకోబు ఇతర కుమారులు నగరమునకు వెళ్ళి నగరమును దోచుకున్నారు. పొలములో ఉన్న పశు సంపదను, వారి వశము చేసుకున్నారు. స్త్రీలను చెరపట్టారు. అపుడు యాకోబు షిమ్యోను, లెవీలను కోపపడ్డాడు. అందుకు వారు మా సోదరిని అలా చేయడం తగునా అని సమాధానం ఇచ్చారు.
యాకోబు బేతేలు చేరుట
దేవుడు, యాకోబుతో నీవు లేచి, బేతేలుకు వెళ్ళి అచట స్థిరపడమని, తన సోదరుని నుండి తప్పించుకొని పోయే సమయంలో కాపాడిన దేవునికి అక్కడ బలి పీఠం నిర్మించమని చెప్పాడు. యాకోబు తన వారితో, వారి దగ్గర ఉన్న అన్య దేవత విగ్రహాలు పారవేసి, వారిని వారు శుద్ది చేసుకోమని చెప్పాడు. బేతేలు వెళ్ళి తనని కాపాడిన దేవునికి బలి పీఠం నిర్మించాలని వారికి చెప్పాడు. వారు వారి వద్ద ఉన్న విగ్రహాలను, చెవి పొగులను యాకోబుకు ఇచ్చారు. అప్పడు అతను వాటిని షెకెము వద్ద సింధూర చెట్టు కింద పాతిపెట్టాడు. అక్కడ నుండి కనాను దేశంలో గల లూజుకు వెళ్లారు, అదే బెతేలు. అక్కడ దేవునికి బలి పీఠము నిర్మించారు. అపుడు రిబ్కా దాసి దెబోర మరణించగా, యాకోబు ఆమెను బెతేలుకు క్రింద ఉన్న సిందూర వృక్షం దగ్గర సమాధి చేశాడు. దేవుడు తనతో మాట్లాడి, ఇక నీకు యాకోబు అని పేరు ఉండక యిస్రాయేలు అని ఉంటుంది అని చెప్పి అతనిని దీవించాడు. ఆ ప్రదేశమున యాకోబు ఒక స్తంభం నాటి, దానిపై పానీయము పోసి తైలాభిషేకము చేశాడు, ఆ ప్రదేశమునకి బెతేలు అని పేరు పెట్టాడు. వారు బెతేలు నుండి ఏఫ్రాతాకు దగ్గరలో ఉండగా రాహేలు ప్రసవవేదన అనుభవించి కుమారుని కని మరణించినది, అతనికి ఆమె బెనోని అని పేరు పెట్టగా, యాకోబు బెన్యామీను అని పిలిచాడు. రాహేలు మరణించగా ఏఫ్రాతాకు వెళ్ళు బాట ప్రక్కన సమాధిచేశారు. యాకోబు ముందుకు వెళ్ళి ఏదెరులో గోపురము అవతల గుడారము వేసుకున్నాడు. ఈ సమయంలో రూబెను బిల్హతో శయనించాడు. యాకోబు మమ్రెలో ఉన్న తండ్రికి వద్దకు వచ్చాడు, ఈసాకు చనిపోగ ఏసావు , యాకోబులు అతనిని పాతిపెట్టారు.
యాకోబు, తన తండ్రి నివసించిన కనాను దేశమందు నివాసం ఏర్పారుచుకొని అక్కడ జీవించాడు. అతని కుమారులు మందలను మేపెవారు. చిన్న వాడు అయిన యేసేపు అంటే అతనికి చాలా ఇష్టం. తన అన్నలు చేసే చెడు పనులను యోసేపు తండ్రికి చెప్పేవాడు, యాకోబు అతనికి నిలువుటంగిని కుట్టించాడు. యేసేపును తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించుట వలన యోసేపు అంటే వారికి అసూయ పుట్టింది. యాకోబు యేసేపును తన అన్నల మేపు మందల దగ్గరకు పంపగా, వారు యేసేపు వచ్చుటను చూసి అతనిని చంపుటకు కుట్రచేశారు. అది విన్న రూబెను యేసేపును కాపాడదలచి, ఈ రక్తపాతమేలా, ఇతనిని అడవిలో గోతిలో తోయమని చెప్పాడు. వారు అతని అంగీని తీసుకొని అలానే చేశారు. దానిలో నీళ్ళు లేవు. అపుడు గిలాదు నుండి ఐగుప్తుకు వెళ్ళే వర్తకులకు యోసేపును అమ్ముటకు యూదా తన సోదరులతో మాట్లాడాడు. ఇరవై వెండి నాణెములకు యోసేపును అమ్మారు. ఆ వర్తకులు యోసేపును ఐగుప్తు తీసుకువెళ్లారు. రూబెను ఆ గోతి దగ్గరకు వెళ్ళి యోసేపు అక్కడ లేకపోవుట చూసి, తన బట్టలు చించుకొని తన సోదరులతో చెప్పి ఇపుడు ఏమి చేయాలని ఏడ్చాడు. యోసేపు అంగీని తీసుకున్న సోదరులు నెత్తుటిలో ముంచి దానిని తండ్రి దగ్గరకు తెచ్చి, ఇది మా కంట బడింది. ఇది నీ కొడుకు అంగీ ఏమో గుర్తుపట్టమని చెప్పారు, దానిని చూసిన యాకోబు ఏ మృగమో తన కుమారుడిని మింగివేసినదని, ఎన్నో రోజులు కొడుకును తలచుకొని ఏడ్చాడు, యాకోబును కుమారులు, కుమార్తెలు ఓదార్చిన ఆయనకు ఓదార్పు కలుగలేదు.
కరువు - ఐగుప్తు పోవుట
ఆ కాలంలో ప్రతి దేశమున కరువు వచ్చినది, అప్పుడు యాకోబు ఐగుప్తు నందు ధాన్యము ఉందని విని, తన కుమారులను పిలిచి, అక్కడకు వెళ్ళి ధాన్యమును కొని రమ్మని చెప్పి పంపించేను. యోసేపు ఐగుప్తులో సర్వాధికారి. దేశ ప్రజలకు ధాన్యం అమ్మేవాడు. ఆయన తన అన్నలను గుర్తు పట్టేను, కాని వారు అతనిని గుర్తు పట్టలేదు. యోసేపు వారితో, మీరు గూఢచారులు, మా దుర్గముల లోటు తెలుసుకొనుటకు వచ్చారు అని చెప్పగా, వారు ఎలా అక్కడకు వచ్చినది, మరియు వారు ఎంతమంది అన్నదమ్ములు అని చెప్పగా, తమ చిన్న తమ్ముడిని తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే వారిని విడిచిపెడుతాము అని చెప్పాడు. అలా చెప్పి వారిలో ఒకరిని ఇంటికి పంపించి తమ్ముడిని తీసుకొనిరమ్మని చెప్పాడు. అప్పుడు యోసేపు వారు తెచ్చిన డబ్బును వారి సంచులలోనే పెట్టించాడు, వారికి ధాన్యమును ఇచ్చాడు. తరువాత యూదా ఐగుప్తు నుండి కనాను వెళ్ళి జరిగినది మొత్తం చెప్పి బేన్యమీనును తమతో ఐగుప్తు పంపమని అడిగారు. కాని యాకోబు దానికి ఒప్పుకోలేదు. అప్పుడు యూదా తన తమ్మునికి ఎటువంటి అపాయం రాకుండా చూచుకుంటానని చెప్పాడు. యాకోబు ఒప్పుకున్న వారు బెన్యామీనును తీసుకొని ఐగుప్తు వెళ్లారు. వారు వెళ్ళి అంతకు ముందు తమ సంచులలో పెట్టించిన సొమ్మును కూడా ఇచ్చి, జరిగినది చెప్పారు. తరువాత యోసేపు తనతమ్ముని చూసి, తన తండ్రి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంకా వారి మనసులను తెలుసుకోగోరి, వారు తీసుకొని వెళ్లగలిగినంత, అహర పదార్ధములను వారి సంచులలో పెట్టి, తన తమ్ముని సంచిలో తన వెండి గిన్నెను పెట్టించాడు. వారు వెళుతుండగా తన వారిని పంపించి, మీరు ఈ ఎలా వెండి గిన్నెను దొంగిలించారు అని అడిగించాడు. మేము అటువంటి పని చేయలేదు అని వారు చెప్పి , వెండి కాని, బంగారం కాని, ఎవరి వద్ద అయిన ఉన్నట్లయితే అతడు మీకు బానిస అవుతాడు అని చెప్పాడు. ఆ సంచులను విప్పగా, వారు బేన్యమీను సంచిలో వాటిని చూశారు. అప్పుడు యోసేపు వద్దకు యూదా వెళ్ళి, తన తమ్ముని వదలి వేయమని, తన తమ్ముని బదులు, తాను బానిస అవుతాను అని చెప్పాడు. అప్పుడు యోసేపు సేవకులను బయటకు పంపి, తనను వారికి తెలియ పరుచుకున్నాడు. తరువాత వారు ఫరో రాజును కలుసుకొని, కనాను వెళ్ళి యోసేపు బ్రతికి ఉన్నాడు అని ఐగుప్తును ఏలుతున్నాడు అని యాకోబుతో చెప్పారు. యోసేపు తనను తీసుకుపోవడానికి బండ్లను పంపాడని, విని యాకోబు సంతోషించాడు.
యాకోబు తనకు ఉన్నదంత తీసుకొని బేర్షేబాకు వచ్చి, అక్కడ దేవుని కొలచి అక్కడ నుండి తన పిల్లలతో ఐగుప్తు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళిన వారు మొత్తం అరవై ఆరుగురు. వారిలో అతని కుమారుల భార్యలు చేరలేదు. ఐగుప్తులో చెరినప్పుడు వారు మొత్తం డెబ్బై మంది. గోషెనులో యోసేపును కలవడానికి వచ్చి, తన తండ్రిని కలసి ఆయన మెడ మీద వాలి ఏడ్చాడు. యాకోబు యోసేపుతో నిన్ను కన్నులారా చూచాను ఇక చనిపోయేదను అని అన్నాడు. యోసేపు తన సోదరులను ఫరో రాజు దగ్గరకు తీసుకొనిపొగ, ఆయన వారిని ఆ దేశములో ఉండమని చెప్పాడు. యాకోబును యోసేపు ఫరో రాజు దగ్గరకు తీసుకురాగ యాకోబు ఫరో రాజును దీవించాడు. ఫరో రాజు యాకోబు వయస్సు అడుగగా తనకు నూట ముప్ఫై ఐదు సంవత్సరములు అని చెప్పాడు.
యాకోబు తుది కోర్కెలు
యిస్రాయేలు ప్రజలు గోషేనులో నివశించి అక్కడ భూములు సంపాదించారు. అక్కడ యాకోబు పదిహేడు సంవత్సరాలు జీవించి, నూట నలభై ఏడు సంవత్సరాల బ్రతికాడు. మరణ సమయం వచ్చినప్పడు యోసేపును పిలిచి, తనను అక్కడ పాతి పెట్టవద్దని, తన తాత ముత్తాతల సరసన పాతిపెట్టమని చెప్పాడు. అలానే చేసేదనని యోసేపు ప్రమాణం చేశాడు. అటు తరువాత యాకోబు తల వాలిపోయేను. తండ్రికి జబ్బుచేసినదని తెలిసిన వెంటనే యోసేపు మనష్హే మరియు ఎఫ్రాయీమును తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్ళగా, యాకోబు తన బలాన్ని మొత్తం కూడగట్టుకొని లేచి, యోసేపుతో నీకు ఐగుప్తులో నేను రాక ముందు పుట్టిన బిడ్డలు నా కుమారులే అని చెప్పాడు. తరువాత పుట్టిన వారే నీ బిడ్డలు అని చెప్పాడు. యోసేపు కుమారులను చూచి, వారు ఎవరు అని యోసేపును అడుగగా వారు నా కుమారులని, ఐగుప్తు దేశంలో నాకు దేవుడు ఇచ్చాడని చెప్పాడు. అప్పుడు యాకోబు వారిని తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పి వారిని ముద్దాడి, దీవించి దేవుని దయతో నిన్నే కాదు నీ కుమారులను సైతము చూడగలిగాను అని చెప్పాడు. అప్పుడు యోసేపు కుమారులను తండ్రి ఒడి నుండి తీసుకొని సాష్టాంగనమస్కారం చేశాడు. యాకోబు తన కుడి చేతిని చాచి చిన్న వాడయిన ఏఫ్రాయీమును, ఎడమ చేయి చాచి పెద్ద వాడైన మనస్సేను దీవించాడు. పెద్ద వాడైన వాని మీద ఎడమ చేతిని, చిన్న వాడైన వాని మీద కుడి చేయి పెట్టి దీవించడాన్ని యోసేపు చూసి, అది చెప్పగా దానికి యాకోబు నాకు అది తెలిసే చేశాను, మనస్సే గొప్ప వాడగును, కాని అంతకంటే ఏఫ్రాయీము ఎక్కువ గొప్పవాడగును అని చెప్పాడు.
యాకోబు దీవెనలు పలుకి మరణించుట
యాకోబు తన కుమారులను పిలిచి వారిని దీవించి చివరిగా, తనను ఏఫ్రోను భూమిలో ఉన్న గుహలో పాతి పెట్టమని చెప్పి ప్రాణము విడిచిపెట్టెను. యోసేపు, తన తండ్రి ముఖము మీద వాలి ముద్దుపెట్టుకొని రోధించాడు. యాకోబు దేహాన్ని నలబై రోజులు సుగంధ ద్రవ్యములతో భద్రపరిచారు. ఐగుప్తు దేశీయులు డెబ్బై రోజులు అంగలార్చారు. యాకోబు చెప్పినట్లే అతని కుమారులు యాకోబును కనాను దేశములో ఉన్న మక్ఫెళా పొలములో ఉన్న గుహలో పాతిపెట్టారు.