మత్తయి 4:18-22
గలిలీయసరస్సు తీరమున యేసు నడచుచు, వలవేసి చేపలనుపట్టు పేతురు అను పేరుగల సీమోనును, అతని సోదరుడగు అంద్రెయను చూచెను. వారు జాలరులు. "మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను"అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచటినుండి పోవుచు యేసు జెబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితోపాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా, వెంటనే వారు పడవను, తమ తండ్రిని వదలి పెట్టి ఆయనను వెంబడించిరి.
ధ్యానము : సీమోను, అంద్రెయ అను సోదరులు మరియు యాకోబు ,యోహాను అను మరి ఇద్దరు సోదరుల దైవ పిలుపును ఈ సువిశేష భాగంలో చూస్తున్నాము. యేసు ప్రభువు వారిని తనను అనుసరించమని అడిగిన వెంటనే వారు యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. వలలను, తండ్రిని కూడా వీరు అక్కడే వదలి పెట్టారు. ఎందుకు వారు ఇలా చేస్తున్నారు? వారు యేసు ప్రభువులో ఏమి చూసారు? ఎందుకు మారుమాట్లాడకుండా ఆయనను అనుసరిస్తున్నారు? యేసు ప్రభువు ఒక వ్యక్తిని తనను అనుసరించమని అడిగినపుడు ఎవరుకూడా వెనుకకు పోలేదు, యేసు ప్రభువు మాటలు, ఆయన మాటలు చూపులు , వ్యక్తిత్వము మనలను ఆయనను అనుసరించేలా చేస్తాయి. యేసు ప్రభువు నన్ను అనుసరించమని అడిగిన ఆ మోహోన్నత వ్యక్తి మమ్ములును తనను అనుసరించమని అడిగారని వారు తమ జీవనోఫాది అయిన వృత్తిని, వలలను, బంధువులను కూడా వదలి ప్రభువును అనుసరిస్తున్నారు. పూర్తిగా వారు యేసు ప్రభువు శిష్యులుగా మారిపోతున్నారు.
యేసు ప్రభువు శిష్యులుగా మారిపోయిన తరువాత వారి జీవితం ఎలా సాగుతుంది, ఎలా బ్రతకాలి అనే విషయాలను వారు ఆలోచించుట లేదు. అంటే ప్రభువు మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఎవరో వారికి తెలుస్తుంది. అయన మాటలు వినగానే వారు ఆయనను ఎందుకు అనుసరిస్తున్నారంటే ఆయన మాటలలో జీవం ఉన్నదిఅని వారికి తెలుసు . అయన చూపులో వారికి వారి జీవితము మొత్తం కనపడుతుంది. ఆయన స్పర్శ యొక్క శక్తి వారికి తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని రోగం కూడా ఆయన స్పర్శతో తొలగిపోతుంది. ఆ మోహోన్నతిని వ్యకిత్వం వారికి తెలుసు పాపంలో పట్టుబడిన స్త్రీని క్షమిస్తున్న గొప్ప మనసు ఆయనకే సొంతం. ఇంతటి శ్రేష్టమైన గురువు వారిని అనుసరించమని అడిగిన తరువాత వారిలో ఎటువంటి సందేహం లేదు, మరో ఆలోచన లేదు వారికి ఇది సుదినం. ప్రభువును అనుసరించడానికి సిద్ధపడుతున్నారు. సాదారణ వ్యక్తులు మనుషులను పెట్టె వారిగా మారుతున్నారు.
యేసు ప్రభువు సీమోను , అంద్రెయను తనను అనుసరించమని అంటున్నారు. వారు జాలరులు. సీమోను అంటే రెళ్ళుకాడ అని అర్ధం. గాలికి అటు ఇటు వీచే ఒక రెల్లును యేసు ప్రభువు గాలికి గాని తుపానుకు గాని తొణకని ఒక రాయిగా మారుస్తున్నారు. అంద్రెయ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. అంద్రెయ అంటే పౌరుషము అని అర్ధం. ఈయన మొట్టమొదట యేసు ప్రభువును పేతురుకు తెలియ పరుస్తున్నారు. యేసు ప్రభువును అనుసరిస్తూ మరణించడానికి సిద్ధపడ్డాడు కాని పాపంతో సఖ్యత పడుటకు ఇష్టపడలేదు ఫలితముగా ఇతనిని X రూపంలో సిలువ వేశారు. ఈ రోజు పునీత అంద్రెయ పండుగను జరుపుకుంటున్న మనము ఆయన మాధ్యస్త ప్రార్ధనను కోరుదాం. ఈ నలుగురు శిష్యులు జాలరులుగా వీరు బ్రతుకుతున్నారు. జాలరులుగా అనేక సంవత్సరాలు బ్రతికారు. యేసు ప్రభువు వారిని అనుసరించమని అడిగిన వెంటనే వారు వలలను అక్కడే వదలి యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. వారిని యేసు ప్రభువు మనుషులను పట్టేవానిగా చేస్తాను అని చెబుతున్నాడు. వీరు మనుషులను పట్టె అంతటి గొప్పవారా? వారు ఎన్నో సంవత్సరాలు జాలరులుగా పని చేసిన గాని వారికి ఎక్కడ చేపలు పడతాయో పూర్తిగా వారికి తెలియదు. అందుకే వారికి యేసు ప్రభువు ఎక్కడ వల వేయాలో చెబుతున్నాడు. అటువంటి ఈ జాలరులను మనుషులను పెట్టె వారినిగా యేసు ప్రభువుగా ఎలా చేస్తాడు, వీరు మనుషులను పట్టేంత గొప్పవారు ఎలా అయ్యారు మనము పరిశీలిస్తే, తిరుసభ ఇంతగా లోకమంతట వ్యాపించింది అంటే ఈ జాలరులు కారణం. అన్ని సంవత్సరాలు జాలరులుగా ఉన్న ఎక్కడ చేపలు ఉంటాయో తెలియని ఈ జాలరులు ప్రపంచ నలుమూలల దైవ రాజ్యాన్ని వ్యాపించడానికి వారు చేసిన కృషి ఎంతో గొప్పది. యేసు ప్రభువు ఆ శిష్యులను ప్రపంచ నలుమూలల తన వాక్కును ప్రకటించగల వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు ఈ సాధారణ వ్యక్తులను ఇంత గొప్ప వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు మాటలు మనము వున్నట్లయితే మనలో అన్ని గొప్ప లక్షణాలు లేకున్నా ప్రభువు మనలను గొప్పవారిగా చేస్తాడు అనుటకు ఈ శిష్యుల జీవితం ఒక ఉదాహరణ.
ప్రభువుతో సంభషణ మరియు ప్రార్ధన : ప్రభువా మీరు ఎంత గొప్పవారు, చాలా సాధారణ వ్యక్తులను , ఉన్నత వ్యక్తులుగా లోకాన్ని జయించే వారీగా చేస్తున్నారు. ఈ నలుగురు వ్యక్తులను పిలిచినట్లు నన్ను కూడా పిలవండి. వారు ఎలాగైతే మీ మాటకు మారుమాట్లాడకుండా, సర్వమును వదలి మిమ్ములను అనుసరిస్తున్నారో, నన్ను కూడా అలానే మిమ్ములను అనుసరించేలా చేయండి. ప్రభువా ! ఈ శిష్యులు మీములను అనుసరించడానికి తమ వారిని , వారికు ఉన్నదానిని, మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడ్డారు. కాని మిమ్ములను అనుసరించడానికి నేను ఈ శిష్యుల వలె ఏమి వదులుకోలేదు. నాకు ఉన్న ఈ లోక ఆశలు, కోరికలు, సంపదలు ఇవి అన్ని కూడా ఆటంకంగా ఉన్నవి. వీటిని వదులు కోవడానికి చాలా పర్యాయాలు నేను ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేక పోయాను. ప్రభువా ! నాకు పూర్తిగా మిమ్ములను అనుసరించాలి అనే కోరిక ఉన్నది, కాని నాలో ఉన్న ఇతర కోరికలు నన్ను మిమ్ములను అనుసరించుటకు సన్నద్ధం కానివ్వటం లేదు. వీటి మీద నేను విజయం సాధించేలా నాకు మీ అనుగ్రహాలు మీ పునీతులకు ఇచ్చినట్లు ఇవ్వండి తద్వారాఅప్పుడైన నేను మిమ్ము పూర్తిగా అనుసరించగలేనేమో. ప్రభువా మీరు ఈ శిష్యులను పిలిచినట్లు నన్ను కూడా ఒకసారి పిలవండి. నన్నును మీ సేవకునిగా, అనుచరునిగా చేయండి. ప్రభువా! మీ శిష్యులు వారికి జీవనోఫాది పోయిన , బంధువర్గాలు పోయిన మీరు మాత్రమే చాలు అనుకున్నారు. నేను కూడా ఆలా జీవించేలా చేయండి. ఆమెన్