పేజీలు

15.4.24

యోహాను 6 : 22-29

యోహాను 6 : 22-29 

మరునాడు, సరస్సు ఆవలితీరమున నిలచియున్న జనసమూహము, అచట ఉన్న ఒకే ఒక చిన్నపడవ తప్ప మరియొకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతోపాటు యేసు వెళ్లలేదనియు,  శిష్యులు మాత్రమే వెళ్ళుటను చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబెరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసుగాని, శిష్యులు గాని లేకుండటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి?" అని అడిగిరి. "మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా సూచక క్రియలను చూచికాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్యజీవమును చేకూర్చు శాశ్వత భోజమునకై శ్రమింపుడు. మనుష్యకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు" అని యేసు సమాధానమిచ్చేను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును? అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు  మీ నుండి కోరునది" అని చెప్పెను. 

 ధ్యానం: యేసు ప్రభువును ప్రజలు వెదకుచున్నారు, ఆయనను కనుగొన్న తరువాత ఆయన ఎప్పుడు అక్కడకు వచ్చిన విషయం అడుగుతున్నారు. వారు ఆయనను వెదకుచున్నది కేవలం భౌతిక ఆహారం దొరికినందుకే అని ప్రభువు వారితో అంటున్నారు. యేసు ప్రభువు వారికి భౌతిక అహరం మాత్రమే ఇవ్వలేదు. దానికి ముందు జీవము ఇచ్చే మాటలను వారికి తెలియజేశాడు. కాని దాని గురించి వారు పట్టించుకున్నట్లు లేదు. యేసు ప్రభువు వారి కడుపు నింపిన విషయమునకె  వారు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. యేసు ప్రభువు దృష్టిలో వారు ఈ భౌతిక, ప్రాపంచిక విషయములకంటే ఆయన చెప్పిన జీవము ఇచ్చే, శాశ్వత మైన వాటిగురించి ఎక్కువగా వారు శ్రమించాలి. ఎందుకంటే యేసు ప్రభువు ఇచ్చిన భౌతిక అహరం కంటే ఆయన సూచక క్రియలు చాలా గొప్పవి. యేసు ప్రభువు చూపించిన సూచక క్రియలు ఏమిటి అంటే ఆయన ఇప్పటికే నీటిని ద్రాక్ష రసముగా మార్చాడు. ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాత రోగముతో ఉన్నవాడిని కేవలం మాటతో స్వస్థ పరిచాడు. అసహాజముగా నీటిమీద నడిచాడు. తన మాటే క్రియతో సమానం అని తెలియజేశాడు. ఆదిలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇది మనం పవిత్ర గ్రంధంలో చదువుతాము. ఒక వ్యక్తిని మొట్ట మొదటిసారి చూడగానే ఆమె జీవితం మొత్తం ఆమెకు తెలియజేశాడు. ఎక్కడ దేవున్ని ఆరాధించాలి?, ఎలా ఆరాధించాలి? మరలా జన్మించడం అంటే ఏమిటి ఇటువంటి ప్రశ్నలకు యేసు ప్రభువు సమాధానం చెప్పడం జరిగినది. 

యేసు ప్రభువు చేసిన అన్నీ పనులు ఆయన దేవుడని, దేవుడు నుండి వచ్చిన వారు మాత్రమే ఆయన చేసే పనులు  చేయగలరు అని, అయన జీవ జలము ఇచ్చువారు అని, ఆయన ఇచ్చే జీవ జలము తీసుకున్నట్లయితే ఎప్పటికీ మరలా దప్పిక ఉండదు అని తెలుసుకుంటాం. యోహాను సువిశేషంలో మొదటి  అధ్యాయంలో ఆయనను విశ్వసించే వారికి ఆయన నిత్య జీవం ఇస్తారు అని తెలుసుకుంటాము. యేసు ప్రభువు మాత్రమే ఈ శాశ్వతమైన ఆహరమును, జీవమును ఇస్తారు. దీనికోసం ప్రతి ఒక్కరు శ్రమించాలి. యేసు ప్రభువు మాత్రమే దీన్ని ఇవ్వగలడు ఎందుకంటే తండ్రి ఆయనకు మాత్రమే ఈ అనుగ్రహం ఇచ్చాడు.  ఈ సువిశేషానికి భాగానికి ముందుగా యేసు ప్రభువు ఐదువేల మందికి ఆహారం ఇవ్వడం, నీటి మీద నడవడం,  సమరియా స్త్రీతోటి ఆమె చేసిన అన్ని పనులు చెప్పడం,  ఆమె ఏమి కోరుకోవాలో చెప్పడం, శతాధిపతి కుమారున్నీ చూడకుండా మాట వలనే స్వస్థపరచడం, ముప్ఫై  ఎనిమిది సంవత్సరాలుగా పక్షావాత రోగంతో బాధ పడుతున్న వ్యక్తిని కేవలం మాటతోటి  స్వస్థపరుస్తున్నారు, నీటిని ద్రాక్షరసముగా మారుస్తున్నారు. ఇవి అన్నియేసు ప్రభువు సాధారణ వ్యక్తి కాదని మనకు తెలియజేస్తాయి. ఆయనను మానవుని సమస్యలకు  కేవలం   భౌతికమైన లేక  తాత్కాలికమైన ఉపశమనము ఇచ్చే వానిగా కాకుండా శాశ్వతమైన పరిష్కారం ఇచ్చేవానిగా చూడాలి.  యేసు ప్రభువు చేసిన అన్ని కార్యాలు  ఆయన దేవుడు అనే విషయమును తెలుపుతున్నవి. 

అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయును? అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు  మీ నుండి కోరునది" అని చెప్పెను. మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభువు దేవుడు పంపిన వానిని  విశ్వసింపుడు అని చెబుతున్నారు. యేసు ప్రభువును విశ్వసించడం అత్యంత ముఖ్యమైనది. నిత్య జీవం యేసు ప్రభువును విశ్వసించు వారికి ఇవ్వబడుతుంది. ఈ మాట అనేక సార్లు మనం ఈ సువిశేషంలో వింటాము. ప్రభువును మానవులు విశ్వాసించాలి అని తండ్రి  దేవుడు కోరుకుతున్నారు. ప్రభువును విశ్వసించడం వలన మాత్రమే, ఎవరైనా ఆయన ఇచ్చే నిత్యజీవమునకు అర్హులు అవుతారు. యేసు ప్రభువును విశ్వసిస్తె, మనం దేవుని  కార్యములు ఎలా చేసినట్లు అవుతుంది అని ఆలోచిస్తే మనకు అర్ధం అయ్యేది ఏమిటి అంటే యేసు ప్రభువు రూపాంతరికరణ జరిగినప్పుడు తండ్రి దేవుడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన మాటలను ఆలకింపుడు అని చెబుతున్నారు. యేసు ప్రభువు మాటలను ఆలకించడం, వాటిని పాటించడం, విశ్వసించడం మానవుడు నిత్యజీవం పొందేలా చేస్తాయి. అంతేకాకుండా తండ్రి చిత్తమును, తండ్రి పనులను చేసినట్లు అవుతుంది. 

ప్రార్ధన: ప్రభువా! మీరు శాశ్వతమైన ఆహరమును ఇచ్చువారు. మా జీవితములో అనేక భౌతిక అవసరాలకోసం, అహరం కోసం, అశాశ్వతమైనవాటి కోసం కష్టపడుతూ, శాశ్వతమైన వాటిని మర్చిపోతున్నాము. నికోదెముకు, సమరియా స్త్రీకి మీరు అశాశ్వతమైన వాటిమీద ఆశ కలిగేలా చేస్తున్నారు. వారు వాటిని కోరుకుంటున్నారు. ప్రభువా! మేము కూడా వారి వలె ఆశాశ్వతమైన వాటిని కాంక్షించే విధంగా ప్రేరేపించండి. ప్రభువా ! మిమ్ములను విశ్వసిస్తూ , తండ్రి కోరుకున్నట్లు మీ మాటలను ఆలకిస్తూ, పాటిస్తూ, మిమ్ములను విశ్వసించి మీరు వాగ్ధానం చేసే ఆ నిత్యజీవం పొందుటకు అర్హులను చేయండి. దానిద్వార తండ్రి యొక్క పనులను మేము చేసేలా, తండ్రి చిత్తమును పాటించేలా మమ్ములను మలచండి. ఆమెన్. 
 

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...