పేజీలు

6.9.24

లూకా 5: 33-39

 లూకా 5: 33-39

"యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేల?" అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు "పెండ్లి కుమారుడు ఉన్నంతవరకు విందునకు వెళ్ళినవారు ఉపవాసము చెయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారిచేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయుకాలము వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు" అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను: "ప్రాత గుద్దకు మాసికవేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అటుల చేసిన యెడల క్రొత్త గుడ్డ చినిగి పోవుటయేకాక, అది ప్రాత గుద్దకు అతుకుకొనదు. అట్లే కొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరును పోయరు. అటుల పోసిన యెడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక, క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయును. ప్రాత రసమునకు అలవడినవాడు క్రొత్త రసమును  తాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాతరసమే మేలు అనును". 

ధ్యానము:  దేవుని అనుగ్రహం కోసం  పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేసేవారు. కేవలం దేవుని అనుగ్రహం పొందడం కోసమే కాక పశ్చాత్తాపమును వ్యక్తము చేయుటకు కూడా ఉపవాసం చేసేవారు. దేవుని పండుగలను కొనియాడేముందుగా ఆ పండుగ కోసం ఆయత్తపడుట లేక సిద్ద పడుట కోసం ఉపవాసం చేస్తారు. కొంతమంది మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, దానికి సిద్దపడుతూ ఉపవాసం చేసేవారు. ఈ విధంగా పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేయడం మనము చూస్తాము. యోహాను శిష్యులు చేసే ఉపవాసం మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, అందుకు సిద్ద పడుటకు చేసే ఉపవాసము. ఎందుకంటే యోహాను ఈ మెస్సియ్యా రాకడను గురించి అందరు సమాయత్తపడాలని బోధించాడు.  అంతేకాక యోహాను  కొమరను సంఘం గురించి తెలిసినవాడని వీరు   మెస్సియ్యా రాకడకు సిద్దపడే సంఘం కాబట్టి వారితో కలసి జీవించాడు అనే నమ్మకం కూడ కొంత మందిలో ఉండేది.  వీరు ప్రార్ధన,  ఉపవాసములతో జీవించారు.  యోహాను కూడా అతి స్వల్పమైన ఆహారముతోనే  జీవించాడు.  యోహాను జీవితం  ప్రభువు రాకడకు సిద్ధపాటు జీవితంగా సాగింది. 

యేసు ప్రభువు దగ్గరకు కొందరు వచ్చి యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు తరచుగా ఉపవాసం, ప్రార్థనలు  చేస్తారు కాని మీ శిష్యులు తిని త్రాగుచున్నారేలా? అని ప్రభువును వారు ప్రశ్నించారు. అయితే ప్రభువు ఎందుకు ఆయన శిష్యులు ఉపవాసం చేయడం లేదో వారికి వివరిస్తున్నారు.  యేసు ప్రభువు పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లికి వచ్చిన వారు ఉపవాసం చేయుదురా అని అడుగుతున్నారు. ప్రభువు ఎందుకు ఇలా అడుగుతున్నారంటే  యేసు ప్రభువే  మెస్సియా.  యోహాను లేక అతని శిష్యులు ఉపవాసం చేసేది ఈ మెస్సియా కోసమే. అందుకే యోహాను శిష్యులలో కొంతమంది యేసు ప్రభువే మెస్సియా అనే  సత్యం తెలుసుకున్న  తరువాత యేసు ప్రభువు శిష్యులుగా మారిపోతున్నారు. ఒక వ్యక్తి  మెస్సియా రాకడకొరకు, లేక రక్షకుని ఆహ్వానించడానికి ఉపవాసం చేసినట్లయితే ఇప్పుడు ఆ పని చేయనవసరం లేదు. ఆ రక్షకుడు వారి దగ్గరనే ఉన్నారు, ఆయనే యేసు ప్రభువు. శిష్యులు దేవుని అనుగ్రహం కోసం ఉపవాసం చేయవలసి వస్తే అది అవసరం లేదు, దేవుడే వారితో ఉన్నారు. కనుక ప్రభువు రూపంలో  సమస్తము వారి దగ్గరనే ఉన్నవి.   శిష్యులు పాప క్షమాపణ కోసమో లేక పశ్చాతాపము వ్యక్తపరచడానికో ఉపవాసము చేయవలసి వస్తే వారిని ప్రభువు తన సాన్నిధ్యంతో పవిత్రులను చేస్తున్నారు అందుకు కూడా వారు ఉపవాసం చేయనవసరం లేదు.   ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట మరియు దేవునితో సత్సంబంధము నెలకొల్పుకొనుట. ప్రభువే వారితో ఉంటున్నారు కనుక దేవునితో వారికి మంచి సంబంధము ఉంది. ప్రతి రోజు, ప్రతి నిముషం వారు ప్రభువు తోనే ఉంటున్నారు. ప్రభువుతో వారు మాట్లాడుతూనే ఉన్నారు.   

పెండ్లి కుమారుడు వారి నుండి ఎడబాయు కాలము వచ్చును అప్పుడు వారు  ఉపవాసము చేయుదురు అని ప్రభువు చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నంత కాలము వారు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు. వారు ఉపవాసము చేయనవసరం లేదు. కాని వారి వద్ద నుండి ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు వారు తప్పకుండా ఉపవాసం చేయవలసి వస్తుంది. పాత నిబంధనలో దైవ మందసము యిస్రాయేలు నుండి తీసివేయబడింది. అపుడు ఆ ప్రజలు బాధలలో నిండిపోయారు. అందుకే ఏలి కోడలు , ఏలి దేవుని మహిమ యిస్రాయేలును విడిచిపోయినది అని చెబుతున్నారు.   ప్రభువు మనతో లేనప్పుడు మనము ఉపవాసం చేయవలసిన సమయం. అది శిష్యుల జీవితంలో కూడా వస్తుంది.  ఆయన వారి వద్ద నుండి వెళ్ళిపోతారు. ఎప్పుడు ప్రభువు మన వద్ద నుండి వెళ్ళిపోతారు? పవిత్ర గ్రంథంలో దేవుని సాన్నిధ్యం ఎప్పుడు యిస్రాయేలు ప్రజలకు దూరం అవుతుంది అంటే యిస్రాయేలు ప్రజలు వారికి ఇష్టమైన విధంగా జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో అపవిత్రంగా ఉన్నప్పుడు, దైవ సన్నిధిలో ఉండి అక్కడ సేవ చేసేవారిని బాధించినప్పుడు, దైవ సాన్నిధ్యాన్ని అపవిత్ర పరచినప్పుడు, యిర్మీయా చెబుతున్నట్లు, గర్వంతో ఉంటూ,  మంచి జీవితం జీవించకుండా  నాకు ఏమి కాదు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకునే సమయాల్లో  దేవుడు దూరమవుతారు. అటువంటి  పరిస్థితిలో  ఉన్నప్పుడు మనం ఉపవాసం చేయవలసి ఉంటుంది. ఆ ఉపవాసం మరల ప్రభువుతో కలసి ఉండుటకు. 

సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు శిష్యులతో ఉన్నంత కాలం శిష్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. వారు మీతో కలసి ఉండటం వలన, మిమ్ములను పొందటం వలన, మీ సహచర్యంలో జీవించడం వలన వారి జీవితంలో ఒక మధురానుభూతిని పొందుతున్నారు. అనేక మంది దీర్ఘదర్శులు ఈ ప్రభువు సాన్నిధ్యం అనుభవించాలని కోరుకున్నారు. కాని వారందరికీ దొరకని ఈ గొప్ప అవకాశం మీ శిష్యులకు అనుగ్రహించారు.  ఆ ధన్యతను  మీ శిష్యులు పూర్తిగా తెలుసుకున్న, తెలుసుకోలేక పోయిన అది స్వర్గీయ అనుభూతి.  అందుకే వారిలో కొందరైనా మీ సాన్నిధ్యం విలువ తెలుసుకొనవలెననేమో   మీరు ముగ్గురితో రూపాంతరీకరణ చెందుతున్నారు. ప్రభువా! మీ సహాచర్యము మనిషిని ఎంత ఉన్నతునిగా తీర్చిదిద్దుతుందో సాధారణ జాలరులు, సుంకరులుగా ఉన్న వారు, ఎంతటి ఉన్నత కార్యాలు చేయగలిగారో  తెలుసుకుకోవడం వలన తెలుస్తుంది.  ప్రభువా! మీ సాన్నిధ్యం కోల్పోవడం అంటే మేము పాపంలో కూరుకుపోవడమే. మేము ఎల్లప్పుడు పవిత్రంగా ఉంటూ, చెడు క్రియల జోలికి పోకుండా, గర్వం దరిచేరనివ్వకుండ, మీ మహిమ మమ్ములను ఎప్పటికి విడిపోకుండా మమ్ము  దీవించండి. అంతేకాక మా చెడు జీవితం వలన మిమ్ము దూరం చేసుకొన్న సమయాలలో మీతో కలసి ఉండాలనే కోరికతో మేము చేసే ఉపవాసమును, మీతో సత్సంబంధమును ఏర్పరుచుకొనుటకు మేము చేసే ప్రార్ధనను ఆలకించి మమ్ము అనుగ్రహించండి. ఆమెన్  

4.9.24

లూకా 5: 1-11

 లూకా 5: 1-11

యేసు ఒక పర్యాయము గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట రెండు పడవలను చూచెను. జారరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డుననుండి లోనికి త్రోయమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో "మీరు పడవను ఇంకను లోతునకు తీసికొని వెళ్లి చేపలకై మీ వలలను వేయుడు" అనెను అందుకు సీమోను "బోధకుడా! మేము  రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము" అని ప్రత్త్యుత్తరము ఇచ్చెను. వల వేయగనే,  వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటి వారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది  చూచి యేసు పాదములపై పడి "ప్రభూ ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు" అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను, అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబదాయి కుమారులు యాకోబు, యోహానులును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అపుడు సీమోనుతో "భయపడవలదు. ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు"అనెను. ఆజాలరులు పడవలను ఒడ్డునకుచేర్చి తమ సమస్తమును విడిచి పెట్టి యేసును అనుసరించిరి. 

ధ్యానము: దేవుని వాక్కును ఆలకించుటకు ప్రజలు నెట్టుకొనుచు ప్రభువు వద్దకు వస్తున్నారు. ప్రభువు వాక్కు దేవుని వాక్కు. ఆయన వాక్కు అధికారముతోను, సూచక క్రియలతోను, అద్భుతాలతోను, జాలి, దయ మరియు విడుదలతోను కూడి  ఉన్నది. దేవుని వాక్కు ప్రజలకు అనేక సందర్భంలో వస్తుంది. కాని యేసు ప్రభువె దేవుని వాక్కు. ప్రజలకు అనేక సంవత్సరాలుగా దేవుని వాక్కును వినిపించే వారు లేరు. యేసు ప్రభువుతోటి మరల దేవుని వాక్కును వింటున్నారు. దేవుని వాక్కును వినుటకు ప్రజలు ఎంతో ప్రేమతో, ఆశతో వస్తున్నారు. ఏమిటి ఈ దేవుని వాక్కు? ఈ వాక్కు ఏమి చేస్తుంది? దేవుని వాక్కు జీవం అయి ఉన్నది. వాక్కు దేవుడే. ఈ వాక్కు కేవలం జీవం మాత్రమే కాదు మానవునికి భరోసాను ఇస్తుంది. వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యం వెలుగునిస్తుంది. ఈ వాక్యం వివేకాన్ని ఇస్తుంది. ఈ వాక్కు మానవుని వక్ర మార్గాలను సరిచేస్తుంది. ఈ వాక్కు మానవుడు చేసిన పాపాలకు ప్రశ్చాత్తాపము పొందేలాగా చేస్తుంది. ఈ వాక్కు మనలను పాపవిముక్తులను చేస్తుంది. ఈ  వాక్యం మనకు మంచినే అనుసరించే శక్తిని ఇస్తుంది. యేసు ప్రభువు దగ్గరకు   ప్రజలు ఈ వాక్కును వినడానికి, పొందడానికి వస్తున్నారు. 

ప్రజలను చూసి  వారికి ప్రభువు  దేవుని వాక్కును వినిపిస్తున్నారు. దేవుని వాక్కును వింటున్న ప్రజలు ప్రభువు దగ్గర నుండి జీవం పొందుతున్నారు. విశ్వాసం పొందుతున్నారు. వారి జీవితాలలో దేవునికి వారికి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మరియు నుత్నికరించుకుంటున్నారు. ప్రభువు మాటలు విన్న వారు దేవుని సాన్నిధ్యాన్ని  పొందుతున్నారు.   ప్రభువు వద్ద నుండి ప్రజలు వాక్కును పొందటం ద్వార మరియు  ఆయన వద్దకు రావడం ద్వారా దేవునితో సఖ్యతను ఏర్పరుచుకుంటున్నారు. ప్రభువు దగ్గర వాక్కు వినుట వలన ప్రజలు నూతన జీవాన్ని పొందుతున్నారు.  ప్రభువు వాక్కును వినడం వలన వారికి కలిగే ప్రయోజనాలు ఆ ప్రజలకు తెలుసు, వారు అనుభవపూర్వకంగాఇది  తెలుసుకున్నారు.  ఎంతో మందిని ఆయన స్వస్థ పరచడం జరిగింది. కనుకనే ఆయన మాటలు వినడానికి ప్రజలు వస్తున్నారు. 

అక్కడ ఉన్న జాలరులు ప్రభువుకు  తన వాక్కును అందించడానికి,  పడవనిచ్చి అక్కడ  కూర్చొనడానికి  సహాయం చేశారు. ప్రభువు వాక్కు ఆ జాలరులు కూడా విన్నారు. ప్రభువు గొప్పవారు అని వారికి తెలుసు. దేవుని వాక్కు వినిన వారికి ఆయన వాక్కు యొక్క శక్తి కూడా తెలుసు. వారు ఆ రాత్రి మొత్తం చేపల కోసం శ్రమించారు అయినప్పటికీ వారికి ఏమి  దొరకలేదు. అందరి అవసరాలను చూసే ప్రభువు, రోగాలను తగ్గించే ప్రభువు, జీవాన్ని ఇచ్చే ప్రభువు, వీరి అవసరాన్ని గురించలేరా? ఆ ప్రభువు    వారి అవసరమును, వారి  నిరాశను గుర్తించి, వారికి చేపలు పడుటకు వలను ఎక్కడ వెయ్యాలో  చెబుతున్నారు. కాని దానికి వారు ప్రభువుతో మేము రాత్రి మొత్తం శ్రమించాము కాని ఫలితము లేదు అని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రభువు మీద వున్న విశ్వాసంతో, సముద్రము మీద వారికి ఉన్న అనుభవాన్ని, ఇంతకాలం వారు పనిచేసిన పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి, ప్రభువు మాట ప్రకారం, ప్రభువు చెప్పినట్లు తమ వలలను వేస్తున్నారు. వారికీ ఆశ్చర్యకరంగా వారి వల చినుగునన్ని చేపలు పడుతున్నవి. 

ప్రభువు మాట వినుట వలన వచ్చే ప్రయోజము  ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రభువు మాట వినుట వలన మనకు ఎప్పుడు సమృద్ధి కలుగుతుంది. అది ఎటువంటి సమృద్ధి అంటే కేవలం వారికి మాత్రమే కాక అనేక మంది ప్రయోజనం పొందే విధంగా కలుగుతుంది. అందుకే తోటి వారు సహాయము చేయుటకు అక్కడకు వస్తున్నారు. పేతురు గారు ఇది చూసి ప్రభువు పాదములపై పడి నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని అంటున్నారు. ఎందుకు పేతురుగారు నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని అంటున్నారంటే, పేతురుకి తన అనుభవం మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ రోజు వరకు పేతురు గారు చేపలు పట్టే  వృత్తిలోనే ఉన్నాడు. ఎప్పుడు, ఎక్కడ చేపలు ఉంటాయో వారి అనుభవపూర్వకంగా తెలుసు. పేతురుకు తన అనుభవం మీద, తన వృత్తి మీద అపనమ్మకం లేదు. కాని తనకు తెలియని విషయం, తన అనుభవానికి మించిన జ్ఞానము ప్రభువు దగ్గర ఉన్నది అని ఆయనకు తెలుస్తుంది. ప్రభువు కేవలం ఒక ప్రవక్త కాదని, దేవుని రక్షకుడని , ప్రభువు పావనుడని ఆయనకు తెలుస్తుంది. తన పాప జీవితం లేక తన సాధరణ జీవితం, తాను జీవించే జీవితం ఆంధ్ పావనమైనది కాదని.   కనుక  ప్రభువు అంతటి పావనుని  సహచర్యంలో ఉండుటకు నేను అర్హుడను కాను అని తెలుసుకుంటున్నారు. అందుకే ప్రభువా నన్ను వదలి పొమ్ము అని   అంటున్నారు.  కానీ ప్రభువు మాత్రం పేతురుతో భయపడవలదు అని ధైర్యాన్ని ఇస్తున్నాడు. పేతురును ప్రభువు మనుషులను పట్టేవానిగా చేస్తాను అని అభయమిచ్చి పేతురును దీవిస్తున్నాడు. తరువాత పేతురు ప్రభువు శిష్యునిగా అనేక మందిని ప్రభువు అనుచరులుగా మారుస్తున్నారు. 

సంభాషణ : ప్రభువా! మీ వాక్కు ఎంత మధురమైనది. మీ వాక్కు వినుటకు ప్రజలు ఎంతో ఆశతో వస్తున్నారు. మీ వాక్కు వినుట వలన మాకు జరిగే ప్రయోజనము ఏమిటో మేము తెలుసుకుంటున్నాము. అందుకు మీ వాక్కు వినుటకు అందరు వస్తున్నారు. మీ మాట వినుట వలన మా జీవితంలో ఏమి కలుగుతుందో, మీ మాటను ఆలకించి చేపల కోసం వలను వేసిన వారి ద్వారా తెలుసుకుంటున్నాము. ప్రభువా మీరు ఓకే సాధారణ చేపలు పెట్టె వ్యక్తిని మనుషులను పట్టే వానిగా చేస్తున్నారు. 

ప్రార్థన : ప్రభువా! మీ వద్దకు ప్రజలు దేవుని వాక్కును వినడం కొరకు ఎంతో ఆశతో వస్తున్నారు. మీ దగ్గరకు వచ్చిన వారిని ఎంతో ఆనందంగా మీరు పంపుతున్నారు. వారు వారి వారి సమస్యల నుండి వారికి  విముక్తిని ఇస్తున్నారు. తండ్రితో వారి బంధాన్ని నుత్నికరించుకుంటున్నారు. అంతేకాక మీ మాటలు వినుట వలన ఎలా వలల నిండా చేపలు పడ్డాయో  చూసి పేతురు  మరియు జెబదాయి కుమారులు ఆశ్చర్యపోతున్నారు. మీరు పావనమూర్తి అని తెలుసుకుంటున్నారు. మేము మేము కూడా మిమ్ములను తెలుసుకొని, మా సమస్యల నుండి విముక్తి పొందేలా చేయండి. ఆ జాలరుల వలె మిమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి ఆమెన్. 


3.9.24

1 కొరింతి 3:1-9, లూకా 4: 38-44

 1 కొరింతి 3:1-9, లూకా 4: 38-44

పిదప యేసు ప్రార్ధన మందిరమును వీడి, తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అపుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసికొనిరి. అపుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగపీడితులైన వారినందరిని వారి వారి బంధువులు యేసు వద్దకు తీసికొనివచ్చుచుండిరి. అపుడు ఆయన వారిలో ఒక్కొక్కనిమీద తన హస్తమునుంచి వారినందరిని స్వస్థపరచెను. అనేకులనుండి దయ్యములు "నీవు దేవుని కుమారుడవు" అని ఆర్భటించుచు వదలి పోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వానిని గద్దించి మాటాడనీయలేదు. వేకువనేలేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లెను. ప్రజలు ఆయనను వెదకుచు వచ్చి, తమను విడిచిపోవలదని అనగా, ఆయన వారితో "నేను ఇతర పట్టణములలోకూడ దేవుని రాజ్యమును గురించి బోధింపవలసివున్నది. అందులకే నేను పంపబడితిని" అని పలికెను. పిమ్మట యేసు యూదయా ప్రార్ధనా మందిరములలో బోధించుచుండెను. 

ధ్యానము: యేసు ప్రభువు ప్రార్థన మందిరము వీడటం అంటూ జరిగితే అది దేవుని సంకల్పం నెరవేర్చడానికి మాత్రమే ప్రార్థన మందిరమును , లేక ప్రార్థనను వీడుతుంటాడు. ప్రార్ధన అంటే దేవునితో సంభాషించుట, దేవునితో సఖ్యత పడుట, దేవునితో సంభందమును దృఢపరచుకొనుట.యేసు ప్రభువు ప్రార్ధనలో దేవునితో అంటే తన తండ్రితో ఉన్న ఆ బంధమును  దృఢపరచుకొనుట ఎలా అనే విషయం తెలుసుకోవచ్చు. యేసు ప్రభువు వలే ప్రతి రోజు ప్రార్ధన చేసుకోనట్లయితే నాకు దేవునితో ఉన్న ఆ సంభందం దృఢ పడుతుంది. యేసు ప్రభువు ఎల్లప్పుడు దేవుని సంకల్పము నెరవేర్చే పనిలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు తండ్రికి ఉన్న సంభందము ఎప్పుడు సన్నగిల్లలేదు. కాని మానవ జీవితంలో నేను కొలది సమయము మాత్రమే దైవ చింతన గురించి లేక  నా ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచిస్తున్నాను కనుక నేను ఎక్కువగా దేవునితో సంభందం లేకుండా ఉన్నాను. కాని ప్రతిరోజు ప్రభువు వలె ప్రార్ధిస్తే, తండ్రితో దృఢ బంధం ఏర్పరుచుకుంటే ఎంత బావుండును. అపుడు మన జీతం మొత్తం ప్రభువుతో మిళితం అయ్యివుంటుంది. 

యేసు ప్రభువు ప్రార్ధన మందిరమును వీడి సీమోను ఇంటికి వెళుతున్నాడు. అక్కడ జ్వరముతో బాధపడుతున్న పేతురు గారి అత్తను స్వస్థ పరుస్తున్నారు. యేసు ప్రభువు జీవితం మొత్తం తండ్రి సంకల్పం నెరవేర్చడం మరియు మానవునికి సహాయపడడంతో నిండి ఉన్నది. తండ్రితో సంభాషించిన తరువాత తన జీవితం మొత్తం మానవునికి తోడుపడటమే. అందుకే జ్వరముతో భాదపడుతున్న పేతురు అత్తను గురించి తెలుపగానే ఆయన ఆ జ్వరమును గద్దించాడు. అది వెంటనే తొలగిపోతుంది. యేసు ప్రభువు మనతో ఉంటె మనలో ఉన్న అనారోగ్యాలు, అపవిత్రత అనేవి మననుండి వెళ్లిపోతాయి. యేసు ప్రభువు చెప్పిన వెంటనే అనారోగ్యం వదిలిపోతుంది. మనము కూడ ప్రభువు దగ్గరకు వచ్చి మనకు ఉన్న సమస్యను చెప్పినట్లయితే ప్రభువు ఏమి చేస్తాడో ఈ సువిశేష భాగంలో మనం తెలుసుకుంటున్నాం. 

యేసు ప్రభువు కేవలం పేతురు అత్తగారిని మాత్రమే కాక  అనేక రోగాలతో ఉన్నవారిని ప్రభువు దగ్గరికి తీసుకొనివస్తున్నారు. వారి అందరిని ప్రభువు స్వస్థ పరుస్తున్నారు. ప్రభువు దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని స్వస్థత పొందకుండ వెళ్లనివ్వలేదు. ప్రభువు మాట వినిన తరువాత అందరు కడుపు నింపబడిన తరువాతనే ప్రభువు వారిని పంపుతాడు. అదేవిధంగా వారు అస్వస్థతతో ఉన్నట్లయితే వారు   స్వస్థత పొందిన తరువాతనే ప్రభువు దగ్గర నుండి వెళ్లడం గమనించవచ్చు. ప్రభువు వద్దకు రావడం లేక తీసుకోరాబడటం అంటే మన సమస్యాలు, రోగాలు, ఇబ్బందులు, బానిసత్వాలు వంటి వాటి నుండి విముక్తి పొందడం. అందుకే సాతానుచే పీడించబడేవారు, రోగాలతో ఉన్నవారు అందరు విముక్తి పొందుతున్నారు. తిరిగి వారి ప్రదేశాలను సంతోషంగా ఆరోగ్యంగా వెళుతున్నారు.  ప్రభువు దగ్గరకు వచ్చిన వారి నుండి సాతాను వెళ్ళిపోతుంది. ప్రభువు వాటిని మాటాడనియ్యలేదు. లోకములోని అన్ని శక్తులు కూడా ప్రభువుకు లోబడే ఉంటాయి. మనిషే ప్రభువు మాట మీరి తప్పుచేస్తుంటాడు. 

సంభాషణ : ప్రభువా! మీరు తండ్రితోటి సంభాషించుటకు ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చారు. తండ్రితో మాట్లాడటం మీ దైనందిన జీవితంలో భాగం అయ్యింది. అందుకే కాబోలు మీరు ఎల్లప్పుడు ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడము మీ ఆహారము చేసుకున్నారు. మీరు తండ్రితో మాటలాడిన తరువాత ఇతరుల బాగుకోసము పాటు పడ్డారు. మీరు ఎలా మీ జీవితాన్ని తండ్రితోటి బాంధవ్యం   కోసం, మానవ శ్రేయస్సు కోసం ఉపయోగించారో, మీలా జీవించడం మాకు ఎలా సాధ్యపడుతుంది. ప్రభువా! మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వారికి కావలసిన వాటిని మీరు అందిస్తున్నారు. వ్యాధులు, బాధలు అన్ని కూడా మనుషులను వీడిపోయేలా చేస్తున్నారు. మా జీవితాలలో కూడా ప్రభువా ఇటువంటివి వ్యాధులు, బాధలు వస్తున్నవి. మేము అనేక సార్లు మేము మీ వద్దకు రావడానికి  ప్రయత్నిస్తున్నాము కాని కొన్ని సార్లు మీ  దగ్గరకు రావడానికి ప్రయత్నించినా రాలేక పోతున్నాము.  మేము మీ వద్దకు ఎలా రావాలో నేర్పించండి. ప్రభువా లోకములోని అన్ని శక్తులు మీకు సహకరించాయి. మీ మాటకు అన్ని లోబడుతున్నాయి. 

ప్రార్ధన: ప్రభువా! ఈనాటి సువిశేషంలో మీరు ఎలా ఎప్పుడు తండ్రితోటి సంబంధం కలిగి ఉన్నారో మేము తెలుసుకుంటున్నాము. మీరు ఏవిధంగా అయితే తండ్రితోటి సంబంధం కలిగి ఉన్నారో మేము కూడా మీతోటి తండ్రి తోటి సంబంధం కలిగి జీవించేలా చేయండి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు వారి వారి సమస్యల నుండి విముక్తిని చేస్తున్నారు. ప్రభువా! మాకు అనేక బాధలు ఉన్నవి, మేము అనేక అలవాటులకు బానిసలుగా ఉన్నాము. మీరు అనేక మందికి విముక్తిని ప్రసాదించిన విధంగా మా సమస్యల నుండి మాకు చేయమని వేడుకుంటున్నాము. ఆమెన్ 

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...