మార్కు 1:40-45
కుష్టరోగి ఒకడు వచ్చి ప్రభువుఎదుట మోకరించి, "నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు" అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి, చేయిచాచి, వానిని తాకి "నాకు ఇష్టమే శుద్దిపొందుము"అనెను. వెంటనే అతని కుష్టరోగము తొలగిపోయెను. అతడు శుద్దుడయ్యెను. యేసు అపుడు "నీవు ఈ విషయమును ఎవరితోను చెప్పరాదు" అని గట్టిగా అజ్ఞాపించి, "నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము" అని వానిని పంపివేసెను. కాని వాడుపోయి, ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక, నిర్జనప్రాంతమునకు వేళ్ళను. కాని నలుదేసలనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.
ధ్యానము: నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ఒక కుష్టరోగి ప్రభువుతో అంటున్నాడు. కుష్టు రోగము అనే జబ్బును దేవుని శాపంగా ప్రజలు భావించేవారు. లేవియఖాండంలో 13 మరియు 14 అధ్యాయాలలో కుష్టురొగులును యాజకులు అశుద్దులుగా ప్రకటించారు. దీని పర్యవసానంగా కుష్టురోగంతో ఉన్నవారు మత పరమైన మరియు సామాజిక పరమైన విషయాలలో పాల్గొనడం నిషేదించబడింది. ఆనాటి సమాజం కుష్టురోగితో ఎటువంటి సాన్నిహిత్యం లేకుండా ఉండటానికి కోరుకున్నారు. కుష్టురోగం వారిని కలిసిన వారిని, వారితో మాటలాడిన వారిని కూడా అపవిత్రులను చేస్తుంది అని చెప్పడం వలన వారిని తాకడం లేక వారితో మాట్లాడటం కూడా ప్రజలు ఇష్టపడలేదు. మరియు కొన్ని సార్లు వారిని అశుద్దులుగా పరిగణించి రాళ్ళతో కొట్టేవారు. ఇది అంటురోగం కావడం వలన వారితో సాన్నిహిత్యం ప్రజలు హర్షించలేదు, ఒకరకంగా ద్వేషించారు. వారి పేరు ఉచ్చరించాలన్న భయపడేవారు. సమాజికంగా, సాంఘికంగా మత పరంగా కుష్టురోగి అవమానంతో రోజు మరణించేవాడు. జబ్బుతో మనిషి కృశించి పోయేదానికన్నా సామాజికంగా ఎడబాటు వారిని ఎక్కువగా బాధించేది.
యేసు ప్రభువు కేవలము దైవికమైన విషయాలు మాత్రమే బోధించలేదు. ఆయన దేవుడు కనుక సమాజంలో ఉన్న అన్ని సమస్యలు, అసమానతలు తెలిసినవాడు. ఒక సంఘ సంఘసంస్కర్త వలె ఆయన సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకు పరిష్కారం చూపడమే కాకుండా, ఇటువంటి సమస్యలతో బాధించబడే వారితో ఎలా ఉండాలో కూడా తన జీవితంతో నేర్పుతున్నారు. కనుక కుష్టురోగంతో ఉన్న వ్యక్తిని తాకుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క విలువ మానవ ఆకారంలో కాదు ఆయన వ్యక్తిత్వంలో ఉన్నది అని తెలియజేస్తున్నాడు. కుష్టు రోగం ఒక వ్యక్తిని అందవికారముగాచేయడమేకాక ఆ వ్యక్తిని అనేక విధాలుగా తింటుంది. యేసు ప్రభువు కుష్టు రోగికి మరల ఆ కోల్పోయిన భాగాన్ని అతనికి వచ్చే విధంగా చేస్తున్నాడు. కుష్టు రోగమునకు స్వస్థత అనేది లేదు, కాని ఆనాటి ప్రజలు ప్రతి చర్మ వ్యాధిని కూడా కుష్టు రోగముగానే పరిగణించేవారు. ఒక వ్యక్తి స్వస్థత పొందినట్లయితే దానికి దృవీకరించవలసినది యాజకుడు కనుక వారు యాజకుని దగ్గర దృవీకరించుకోవాలి. వారు శుద్దిపొందారు అని యాజకులు నిర్ధారించేవారు.
యేసు ప్రభువు ఆ వ్యక్తి మీద జాలి పడి, చేయి చాపి అతనిని తాకి నాకు ఇష్టమే. స్వస్థత పొందుము అని అంటున్నాడు. యేసు ప్రభువు బాధలలో, కష్టాలలో ఉన్న వారి పట్ల ఎంతో ఆధరణ చూపేవాడు. వారి బాధ తాను అనుభవించినంతగా వారి కోసం పరితపించేవాడు. అందుకే మన అందరి పాపలు మోయుటకు కూడా సిద్దపడ్డాడు. కనుకనే అడిగిన వెంటనే ఆ వ్యక్తి బాధను తీసివేయాలని చేయి చాపి, అతనిని తాకుతున్నాడు. ఆ వ్యక్తి వెంటనే స్వస్థత పొందుతున్నాడు. యేసు ప్రభువు మానవుడు అన్ని విధాలుగా సంపూర్ణతను పొంది వుండాలి అని కోరుకుంటాడు. మానవుడు ఎటువంటి లోపం లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ఆ వ్యక్తికి కోల్పోయిన సంపూర్ణతను ఇస్తున్నాడు. ఆ వ్యక్తి కోల్పోయిన ఆరోగ్యమును తిరిగి ఇస్తున్నాడు. అతడు సంపూర్ణమైన వ్యక్తిగా ఉండేటట్లు చేస్తున్నాడు. నీవు స్వస్థత పొందుట నాకు ఇష్టమే అని ప్రకటిస్తున్నాడు. కేవలం ఈ వ్యక్తి మాత్రమే కాదు ప్రతి వ్యక్తి కూడా అన్ని విధాలుగా ఎదగాలని, సంపూర్ణత కలిగిఉండాలని మరియు ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు.
"నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము" అని వానిని పంపివేసెను. యేసు ప్రభువు ఆ వ్యక్తి స్వస్థత పొందిన తరువాత ఆ వ్యక్తిని వెళ్ళి యాజకునికి కనిపించమని చెప్పుట వలన, యాజకుడు ఆ వ్యక్తిని శుద్దుడు అని దృవీకరించుట వలన సమాజంలోనికి అతను అధికారికంగా రాగలుగుతాడు. ఎవరు ఆయనను ఆటంకపరచరు. కాని అలా చేయకపోతే ఇది అతని మీద అనేక అనుమానాలకు దారితీస్తుంది. మరియు ఆ వ్యక్తి వివక్షకు గురిఅవుతూనే ఉంటాడు. కాని ప్రభువు ఆ వ్యక్తి ఎటువంటి వివక్షకు గురికాకూడదు అని అనుకుంటున్నాడు. అందుకే అతన్ని పోయి అర్చకునికి కనపడి, నీవు చట్టపరంగా చెల్లించవలనసినది చెల్లించమని సూచిస్తున్నాడు. ప్రభువుకు మానవుడు ఏ విధంగా కూడా అసమానతలకు, అవమానములకు, వివక్షకు గురికాకూడదు అని కోరుకుంటున్నాడు.
సంభాషణ మరియు ప్రభువుతో ప్రార్ధన: ప్రభువా ! మీ కరుణ ఎంత ఉన్నతమైనది. లోకం మొత్తం కూడా భయంతో కుష్టువారిని దగ్గరకు, రానివ్వప్పటికి వారిని దగ్గరకువారిని రాళ్ళతో కొట్టలేదు. వచ్చిన వారిని అసహ్యించుకోలేదు. మీరు మాత్రం వారిని తాకుతున్నారు. వారు స్వస్థత పొందాలని కోరుతున్నారు. అంతే కాకుండా వారిని స్వస్థపరుస్తున్నారు. కుష్టు రోగి స్వస్థ పడుట నాకు ఇష్టమే అని తెలియజేస్తున్నావు. ప్రభువా మీరు కోల్పోయిన ఆరోగ్యమును తిరిగిఇస్తున్నారు. సమాజంలో కోల్పోయిన గౌరవాన్ని ఇస్తున్నారు. మా జీవితంలో కూడా ప్రభువా అనేక అసమానతలకు మరియు వివక్షకుఅవుతున్నాము. కొన్నిసార్లు సమాజంలో జరుగుతున్న అసమానతనలను చూసి వాటిని తీసివేయడానికి మీవలె మేము కూడా కృషి చేసేలా చేయండి. ప్రభువా! మీరు స్వస్థత పొందిన వ్యక్తిని సమాజంలో గౌరవం పొందాలని, ఆ విషయం చట్టపరంగా దృవికరించబడాలని కోరుతున్నారు. మేము కూడ ప్రతి వ్యక్తి సమాజంలో వివక్ష లేకుండా ఉండుటకు చేయవలసిన పని చేయుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి