పెంతికొస్తు మహోత్సవం
యోహాను 20:19-23
అది ఆదివారము సాయంసమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొనియుండిరి. యేసు వచ్చి వారిమధ్య నిలువబడి, "మీకు శాంతి కలుగునుగాక!" అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను, ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, "మీకు శాంతి కలుగునుగాక! నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను" అని పలికెను. అటుల పలికి, ఆయన వారి మీద శ్వాస ఊది "పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించినయెడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపనియెడల అవి క్షమింపబడవు" అని చెప్పెను.
ప్రియ మిత్రులారా పెంతికోస్తు అంటే 50 వ అని అర్ధం. మనం క్రీస్తు పునరుత్థానము అయిన 7వ ఆదివారం ఈ పండుగను కొనియాడుతాము. ఇది యేసు ప్రభువు చెప్పిన విధముగా పవిత్రాత్మను తన శిష్యులకు పంపిన రోజు. యూదులు ఈ పండుగను పాస్క పండుగ అయిన 7 వారములకు అంటే 50 రోజున జరుపుకుంటారు. వారికి ఇది పంట కోయు పండుగ. దీనినే వారాల పండుగ అని కూడా అంటారు. అంతె కాదు ఇది దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చిన రోజును గుర్తు చేసుకొనే రోజు.
క్రైస్తవులకు ఈ పెంతుకోస్తు పండుగ చాలా ముఖ్యమైన పండుగ ఎందుకంటే ఈ రోజున యేసు ప్రభువు పవిత్రాత్మను ఆయన శిష్యుల మీదకు పంపుతున్నారు. ఒక్క సారిగా అతికొద్దిమందిగా ఉన్న క్రైస్తవులుగా అనేక మంది మారిపోతున్నారు. అపోస్తులుల కార్యాలు 2 వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఒక్కసారిగా 3000 మంది విశ్వాసంలోనికి వస్తున్నారు. యేసు ప్రభువు తండ్రి దగ్గరకు వెళ్ళిన తరువాత తన శిష్యులు కోత పండుగ సంధర్భంగా ఒక చోట గుమికుడారు. వారు కూర్చన్న ఇంటిని పవిత్రాత్మ అవరించింది. అపో 2:2 . వారు అందరు పవిత్రాత్మతో నింపబడి అనేక భాషలలొ మాట్లాడే విధంగా చేసింది. ఈ అద్భుతం అనేక మందిని ఆకర్షించింది. అప్పడు పేతురు మారు మనస్సు గురించి, క్రీస్తు సువార్తను గురించి వివరించారు. చివరకు ఒకే రోజు 3000 వేల మంది క్రీస్తు అనుచరులు అయ్యారు. అపో 2:41. ఇది పెంతికొస్తు రోజు జరిగిన సంఘటన.
పవిత్రాత్మను మన జీవితాలలోనికి ఆహ్వానిస్తే ఆయన ఏమి చేస్తారు ?
యేసు ప్రభువే పవిత్రాత్మ గురించి కూడా మనకు తెలియజేస్తున్నాడు. కేవలం తెలియజేయడమే కాకుండా ఆ ఆత్మను తన శిష్యులతో ఉండుటకు పంపుతున్నాడు. పవిత్రాత్మ మనతో ఉంటూ, మనలో పని చేసి, మనలను యేసు ప్రభువువలే మార్చుతున్నది. ఆపో. కార్య 1:8. పవిత్రాత్మ మనకు శక్తిని ఇచ్చి మనం యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండేలా చేస్తుంది. పవిత్రాత్మ మనలను సత్యము వైపు నడిపిస్తుంది.
పవిత్రాత్మ శిష్యుల మీదకు దిగిరావడం చాలా గొప్ప ఘటన. అక్కడ ఉన్నవారందరు పవిత్రాత్మ పొందుతున్నారు. దాని తరువాత వారు అనేకమందికి బోధిస్తున్నారు. వారు యేసు ప్రభువు వలె అవుటకు పవిత్రాత్మ ఎంతగానో ఉపయోగ పడుతుంది. యేసు ప్రభువు పవిత్రాత్మతో నిండిన వాడై తన ప్రేషిత కార్యమును ప్రారంభించాడు. అనేక అద్భుతాలు చేశాడు. అలానే శిష్యులుకూడా తమ ప్రేషిత కార్యమును ప్రారంభిస్తున్నారు. విశ్వాసులందరి జీవితాలలో పవిత్రాత్మ పెద్ద మార్పు తీసుకు వస్తాడు. (యోహాను 14:16; 15:26) . పరిత్రాత్మను మన జీవితాలలోకి అనుమతిస్తే, అతను మన హృదయాలలో నివాసం ఏర్పరుచుకుంటారు. అందుకే పునీత పౌలు గారు మీరు పవిత్రాత్మ ఆలయాలు అని చెబుతున్నారు. అంటే ఆయన మనలో ఉండి మనం ఆయన ఉనికిని తెలుసుకునేలా చేస్తాడు, శక్తిని ఇస్తాడు, మనలను శుద్ధి చేస్తాడు, శిష్యులను ఐక్య పరుస్తారు. మార్గనిర్దేశం చేస్తాడు, బోధిస్తాడు, నూతన జీవాన్ని ఇస్తాడు. అతను విశ్వాసుల హృదయాలు, క్రీస్తును పోలి ఉండేలా చేస్తాడు. ఆయనను మన జీవితాలలోనికి ఆహ్వానిస్తే దేవుని గొప్ప ప్రేమకు నిజమైన సాక్షులుగా ఉండగలము. అందుకే యేసు ప్రభువు ఆయన నాకు సాక్షమిస్తాడు అని చెబుతారు మరియు మీరు కూడా నాకు సాక్షులుగా ఉంటారు అని చెబుతారు. యోహను 15:25.
మనం పవిత్రాత్మను ఎలా పొందగలం ?
పేతురు వాక్యాన్ని బోధిస్తూ మారుమనసు పొందండి, యేసు క్రీస్తు నామములో జ్ఞాన స్నానం పొంది పాప క్షమాపణకు పొందండి తద్వారా మీరు పవిత్రాత్మ పొందుతారు అని బోధిస్తారు. అపో 2:38-39 . మనం పవిత్రాత్మను పొందడానికి పెద్ద పెద్ద పనులు చేయనవసరం లేదు. దేవుని కృప వలన ఆయనను విశ్వసించి , జ్ఞాన స్నానం పొందితే మనం పవిత్రాత్మను పొందుతాము. మనం స్వీకరించే ప్రతి దివ్య సంస్కారం ద్వారా మనం పవిత్రాత్మను పొందుతాము.
పవిత్రాత్మ వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది?
శిష్యులు ఆత్మతో నింపబడ్డారు- పునీత పౌలు గారు ఆత్మతో నింపబడితే ఏమి అవుతుందో రాస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖలో 5 వ అధ్యాయం 18-21 వరకు అందులో వివరించబడింది. " ఆత్మ పూరితులుకండు ఒకరితో ఒకారు కీర్తనలతోనూ , స్తోత్రములతోనూ , పవిత్ర గీతములతోను సంభాషింపుడు. హృదయ పూర్వకముగ పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు . మన ప్రభువగు యేసు క్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. "
ఆత్మతో నింపబడిన వారు దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటారు. తరువాత ఆయనకు సర్వదా కృతజ్ఞతలు తెలియ చేస్తారు. పిలిప్పీయులకు రాసిన లేఖ రెండవ అధ్యాయంలో 4 వ వచనం చెబుతుంది పరస్పరం ఒకరికొకరు ఉపకారులై ఉండవలెను అని. అంటే ఇవన్నీ ఆత్మతో నింపబడిన వారు చేస్తారు. అపో కార్యములు 2 వ అధ్యాయం 4 వ వచనం వారందరు పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్చక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలొ మాట్లాడసాగిరి. అంటే పవిత్రాత్మ వారిని దేవుని వాక్కు బోధించడానికి ప్రేరేపిస్తుంది. పవిత్రాత్మ మనం వాక్య పరిచర్య చేయుటకు సహాయ పడుతుంది. పవిత్రాత్మ వారికి ధైర్యాన్ని ఇస్తుంది. శిష్యులు సహజముగా చాలా పిరికివారిగా ఉన్న శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ధైర్యంగా ప్రకటిస్తున్నారు. అపో 4:31.
పవిత్రాత్మ విశ్వాసిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఆయన వారికి నూతన జీవాన్ని ఇస్తాడు. యోహాను 3:5. మనలను పవిత్రాత్మ కొత్త సృష్టిగా మారుస్తుంది. 1 కొరి.5:17 . పవిత్రాత్మ క్రీస్తును మహిమపరుస్తాడు.యోహాను 16:14, పవిత్రాత్మ మనలను క్రీస్తు కొరకు సాక్షులుగా చేస్తాడు యోహాను15:26; అపొస్తలుల కార్యములు 1:8. క్రీస్తు బోధనలను మనకు తెలియ పరుస్తాడు. లూకా. 12:11-12. పవిత్రాత్మ శిష్యులకు పరిచర్యలో మరియు ఇతర విషయాలలో సహాయకునిగా ఉంటాడు. అందుకే యేసు ప్రభువు మీకు ఒక ఆదరణ కర్తను పంపుతాను అని చెబుతారు. యోహను. యోహాను సువార్త 14 నుండి 16 అధ్యాయాలలో పవిత్రాత్మను యేసు ప్రభువు దేవుని సత్యమును తెలిపేవానిగా, యేసు ప్రభువు మాటలను గుర్తుచేసేవానిగా, యేసు ప్రభువు తరుపున మాటలాడే వానిగా, పాపములను క్షమించే వానిగా, భవిష్యవానిని తెలిపేవానిగా తెలియజేస్తున్నాడు.
పవిత్రాత్మ ఒక వ్యక్తి పొందాడు అని ఎలా చెప్పగలం ?
పవిత్రాత్మ ఫలాలు గురించి పౌలుగారు గలతీయులకు రాసిన లేఖలో చెపుతున్నారు. అవి ఏమన ప్రేమ, ఆనందము , శాంతి, సహనము, దయ , మంచితనము, విశ్వసనీయత , సాత్వికత , నిగ్రహము ఇవి మనలో ఉన్నప్పుడు ఖచ్ఛితముగా మనకు పవిత్రాత్మ మనలో ఉంది అని చెప్పగలం. (గల. 5:22, 23). క్రైస్తవ ఎదుగుదల, పరిపక్వత అతనిలో ఆత్మ యొక్క ఫలాలు అభివృద్ధి చెందిన తీరును బట్టి తెలుసుకోవచ్చు.
ప్రేమ : క్రైస్తవ ప్రేమ అనేది ఈ లోకంలో చూసే ప్రేమకు వ్యత్యాసం ఉంది క్రైస్తవ ప్రేమ పవిత్రాత్మ యొక్క ఫలం. ఇది మనలను ప్రేమించే వారిని , లేక మనకు ఇష్టం ఉన్న వారిని ప్రేమించే ప్రేమ కాదు. మన శత్రువులను ప్రేమించే ప్రేమ.
ఆనందం : . క్రైస్తవ ఆనందం, క్రైస్తవుడు దేవుని ముఖాముఖీగా చేసేటప్పుడు వుండే ఆనందం. మరియు దేవుని వాక్కును పంచినప్పుడు ఆయన పొందే ఆనందం. ఇది తాను కష్టలు బాధలు పొందే సమయంలో కూడా తాను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను అని ఉండే ఆనందం. యేసు ప్రభువు మోక్ష రోహణం అయిన తరువాత వారు క్రీస్తు కోసం పొందిన కష్టాలలో ఆనందం పొందారు. (రోమా. 5:3).
శాంతి: నిజమైన శాంతి దేవుని నుండి వస్తుంది, “నా శాంతిని మీకు ఇస్తున్నాను” అని యేసు చెప్పాడు. (యోహాను 14:27). కష్టాలు మనకు వచ్చినప్పుడు అతీంద్రియ ప్రశాంతత, దేవుని శాంతి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది మరియు ఆయనపై నమ్మకం ఉంచుతుంది.
సహనం: పవిత్రాత్మ మనకు అనుగ్రహించె మరియొక గొప్ప ఫలం ఏమిటి అంటే సహనం. యేసు ప్రభువు వలె సహనం కలిగి జీవించే విధంగా పవిత్రాత్మ చేస్తుంది. అందరు ఆయనను దూషిస్తున్నా ప్రభువు సహనం కోల్పోలేదు. సహనం మనలను ఇతరుల తప్పులను క్షమించకలిగే శక్తివంతులను చేస్తుంది. ఇతరులను అంగీకరించే వారిగా చేస్తుంది.
దయ : దయ , కనికరం అనేవి క్రైస్తవ సహజ లక్షణాలు. ఇది ప్రేమకు మరియొక రూపం. ఎవరు అయితే వీటిని కలిగి ఉంటారో వారికి అందరు ఆకర్శింపబడుతారు. మదర్ తెరెసా కు అనేక మంది ఆకర్శింప బడ్డారు అంటే కారణం ఆమెకు ఉన్న ఈ దయ హృదయ. ఇది పవిత్రాత్మ ఫలం. ప్రతి క్రైస్తవుడు కలిగిఉండాలి.
మంచి తనం: ప్రతి వ్యక్తి మంచి వ్యక్తిని ఇష్టపడుతారు, అలా ఉండాలని కోరుకుంటారు. వీరిలో ఎటువంటి చెడు ఉద్దేశ్యాలు , ఆలోచనలు ఉండవు. అందరి మంచిని కోరుకుంటారు. అందరికి సహాయం చేస్తారు. ఇది పవిత్రాత్మ మనకు ఇచ్చే మరియొక ఫలం.
విశ్వసనీయత: ఇది విశ్వాసానికి మరియు పవిత్రాత్మకు సంబంధించినది. విశ్వసనీయత మనలను నమ్మదగిన వారిగా చేస్తుంది. మనం దేవునికి మరియు మానవునికి నమ్మదగిన వారినిగా చేస్తుంది. ఎటువంటి అపనమ్మకం లేక అనుమానలకు తావు వుండదు.
సాత్త్వికత : ఇది కష్టమైన వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు బాగా అవసరమయ్యే గుణం. మనలను ఇష్టపడని వ్యక్తుల పట్ల , అదే విధంగా మనలను ద్వేషించే వారి పట్ల కూడా మనం మృదువుగా ఉండగలగటం.
నిగ్రహణ : ఈ లోకం యొక్క ఆశలకు , కోరికలకు తలొగ్గక దేవునికి ఇష్ట పూర్వకమైన జీవితం జీవించడం. ఎవరెన్ని శోదనలకు గురిచేసిన యేసు ప్రభువు వలె జీవించగలగడం. ఇది పవిత్రాత్మ ఇచ్చే గొప్ప ఫలం.
పవిత్రాత్మ దైవ విషయాలను తెలుసుకోవడానికి, దైవ సంబంధవిషయాలలో నిమగ్నం అవ్వడానికి ప్రేరణ ఇస్తుంది. పవిత్రంగా జీవించడానికి ప్రేరణ కలుగజేస్తుంది. పవిత్రాత్మ ఆదిలో సృష్టిని ఏర్పాటుచేసినప్పుడు జలముల మీద తిరుగాడుట మనం చూస్తాము. పవిత్రాత్మ మానవునకి శక్తిని ఇస్తుంది. దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు సహాయపడుతుంది. సంసొనును, దావిదును నడిపింది. నిర్గమ కాండంలో పెద్దలకు తోడుగా ఉంటుంది. నూతన నిబంధనలో పవిత్రాత్మను ఎల్లకాకాలం మనకు తోడుగా ఉండుటకు మరియు మనలను నడిపించుటకు మరియు ఆధారణకర్తగా తెలియజేస్తున్నాడు. ఈ ఆత్మ శిష్యులు దేవుని వాక్కును వ్యాపింపజేయుటకు సహాయపడుతుంది. శ్రీ సభ మరియు శ్రీ సభ సభ్యులు ఈ పవిత్రాత్మ ద్వారా నడిపించబడాలి అనిప్రార్ధించుదాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి