పేజీలు

5.1.24

ఫిలిప్పు, మరియు నతనయేలుల మనస్తత్వం

యోహాను 1: 43-51 

మరునాడు యేసు గలిలీయా వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో "నన్ను అనుసరింపుము" అని పలికెను. ఫిలిప్పు కూడఆంద్రెయ పేతురుల నివాసమగు బేత్సయిదా పుర నివాసియే. ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?" అని నతనయేలు  అడుగగా వచ్చి చూడుము" అని పిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువకపూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని"అని సమాధానమిచ్ఛెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు"అని నతనయేలు  పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నవా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. 

ధ్యానము: యేసు ప్రభువు గలిలీయాకు వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. యేసు ప్రభువు అనేక అద్భుతకార్యాలు ఈ ప్రదేశములోనే చేసినది. అంతేకాక ఈ ప్రదేశమున యూదులు మాత్రమే కాక అనేక మంది ఇతరులు అన్యులు కూడా ఉండేవారు. యేసు ప్రభువు పిలిప్పును చూసి నన్ను అనుసరింపమని అడిగాడు. పిలిప్పు యేసు ప్రభువును అనుసరిస్తున్నాడు. అంతేకాక పిలిప్పు జీవితంలో ఎంతో మందిని ప్రభువు దగ్గరకు తీసుకువచ్చిన ఉదంతమును సువిశేషంలో మనం చూస్తాము. ప్రభువుకు ప్రజలకు అనుసంధానం చేయడంలో పిలిప్పు చాలా నేర్పరిగా ఉండేవాడు. రెండు చేపలను ఐదు రొట్టెలను ఐదువేల మందికి పంచి పెట్టినప్పుడు ఒక పిల్లవాని దగ్గర ఉన్న చేపలను రొట్టెలను తీసుకొని వచ్చినది ఇతనే. మరియు కొంతమంది గలిలీయులు యేసు ప్రభువును కలుసుకొనుటకు వచ్చినప్పుడు కూడా ఈ పిలిప్పు వారిని ప్రభువు వద్దకు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు నతానియేలును ప్రభువు వద్దకు తీసుకొని వస్తున్నాడు. 

ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. పిలిప్పు కూడ ఆంద్రెయ వలె యేసు ప్రభువు గురించి అనుభవపూర్వకముగా తెలుసుకొని ఆయన మెస్సీయ్యా అని తెలుసుకుంటున్నాడు. అందుకే ధర్మశాస్త్రమునందు, ప్రవక్తల ప్రవచనములందు చెప్పబడిన వానిని కనుగొన్నాము అని చెబుతున్నాడు. యేసు ప్రభువుతో ఉండటం, ఆయనను కలవడం, ఆయనతో మాట్లాడటం ఒక వ్యక్తిని పూర్తిగా దైవ అనుభవంలోనికి తీసుకువెళ్తాయి. మిగిలిన ఎంత గొప్ప విషయంకూడ ఇటువంటి దైవ అనుభవాన్ని ఇవ్వలేవు. పిలిప్పు ఈ విషయము గురించి నమ్మకంతో ఉన్నాడు. ఫిలిప్పు సహాజముగానే దేవుని అన్వేషించే వ్యక్తి అందుకే ఆయనను యేసు ప్రభువే కనుగొంటున్నాడు. దేవున్ని మనం అన్వేషించినట్లయితే దేవుడే మనకు ఆవిష్కారం అవుతారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఫిలిప్పు ఇప్పుడు ఈ విషయములను నతనయేలుకు చెబుతున్నారు. 

"నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?" అని నతనయేలు  అడుగగా వచ్చి చూడుము" అని పిలిప్పు పలికెను. నతనయేలుకు మెస్సీయ్యా నజరేతు నివాసి అని చెప్పడం వలన ఆయన దానిని నమ్మలేకున్నాడు. ఎందుకంటే యిస్రాయేలులో నజరేతు ఒక తృణీకరింపబడిన పట్టణం. అక్కడ నుండి రక్షకుడు వస్తాడు అంటే నమ్మలేకపోయాడు. నజరేతు నుండి ఏదైన మంచి రాగలదా అని నతనయేలు అడిగిన కాని ఫిలిప్పు ఆయనతో వచ్చి చూడమని చెబుతున్నాడు. యేసు ప్రభువును  చూడడం వలన మనం ఆయనకు పూర్తిగా చెందినవారిగా మారిపోతాము. అందుకే ఫిలిప్పు వచ్చి చూడమని నతనయేలుతో అంటున్నాడు. "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువకపూర్వమే, నీవు అంజూరపు చెట్టుక్రింద ఉండుటను నేను చూచితిని"అని సమాధానమిచ్ఛెను. ఫిలిప్పు చెప్పినట్లుగానే యేసు ప్రభువు దగ్గరకు రాగానే నతనయేలు ఆశ్చర్యపోతున్నాడు. నతనయేలు గురించి యేసు ప్రభువు అతనిలో ఎటువంటి కల్మషం లేదు అని అంటున్నాడు. యిస్రాయేలు అంటేనే కల్మషం లేని వాడు అని అర్ధం. యాకోబు అంటే మోసగాడు కాని దేవునికి ఆ పేరు ఇష్టం లేదు. కనుక యాకోబు పేరు మారుస్తున్నాడు. అతనికి యిస్రాయేలు అని పేరుపెడుతున్నాడు. కానాను అంటే నైతిక విలువలు లేనిది కాని, ఆ భూమిని ప్రభువు తన సొంత ప్రజలకు ఇస్తున్నప్పుడు  ఆ భూమికి యిస్రాయేలు అని పేరు పెడుతున్నాడు. నతనయేలును చూసి ఆయనను నిజమైన యిస్రాయేలియుడు అని చెబుతున్నాడు. అతని గురించి పూర్తిగా తెలిసినట్లుగా ప్రభువు మాటలాడుతున్నాడు. అంజూరపు చెట్టుక్రింద ఉండటం నేను చూశాను అని తెలియజేస్తున్నాడు. అంటే జ్ఞానం కోసం ఎదుకుచున్నప్పుడు చూశాను అని అర్ధం. 

 "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు"అని నతనయేలు  పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నవా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను. వెంటనే నతనయేలు యేసు ప్రభువును దేవుని కుమారుడవు , యిస్రాయెలు రాజువు  అని సంబోధిస్తున్నాడు. ప్రభువును ప్రత్యక్షంగా చూసిన వారు, ఇలానే ప్రభువు గురించి తెలుసుకుంటారు.ప్రభువుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేలా మనకు ఉండేలా మనం ప్రయత్నించాలి అప్పుడు మనకు ప్రభువుతో ఉన్న అనుభవం మారిపోతుంది. ప్రభువు ఇక్కడ నతనయేలుతో ఇంతకంటే గొప్ప విషయాలు చూచెదవు అని చెబుతున్నారు. దేవదూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటను చూచెదరని చెబుతున్నాడు. యేసు ప్రభువు భూలోకమునుండి  పరలోకానికి  పోవుటకు నిచ్చెన ఆయన ద్వారానే మానవుడు పరలోకం పోవడం జరుగుతుంది ఇవి అన్ని కూడ చూడగలం అని ప్రభువు చెబుతున్నాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన:  ప్రభువా! మీరు మిమ్ము అన్వేషించే పిలిప్పును కనుగొని అతనికి రక్షకుడిని తెలుసుకునే అనుగ్రహమును ఇస్తున్నారు. ఫిలిప్పు ఏవిధముగా అయితే అనేక మందిని మీ వద్దకు తీసుకొని వస్తున్నాడో, మేము కూడా అలానే మీ  వద్దకు ఇతరులను తీసుకొని వచ్చేందుకు కావలసిన అనుగ్రహములను పొంది, ఇతరులను మీ వద్దకు తెచ్చేలా మమ్ములను మార్చండి. ప్రభువా ! మిమ్ములను అనుభవపూర్వకంగా తెలుసుకొనుటకు మేము చేయవలసినదంతయు ఎటువంటి లేమి లేకుండా చేసేలా మమ్ము దీవించండి. ప్రభువా! నతనయేలు మీరు నజరేతువాసి అంటే నమ్ముటకు సిద్దంగా లేడు, కాని మిమ్ము చూసిన తరువాత ఆయన అభిప్రాయం మొత్తం మారిపోయింది. మీరు నతనయేలును నిజమైన యిస్రాయేలు అని చెబుతున్నారు. ఆయనలో ఎలా కల్మషం లేకుండా ఉన్నారో మేముకూడా మేము కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఉండేలా మమ్ము దీవించండి. ఆమెన్.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...