పేజీలు

28.1.24

యొహ్ోషువా

యెహోషువ చరిత్ర  
 
మోషే తరువాత ప్రజలను నడిపిన నాయకుడుయెహోషువ. మోషేకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఈ భాధ్యతను తీసుకున్నాడు. మోషే మరణించిన తరువాత యావే   నూను కుమారుడైన యెహోషువ మరియు  ప్రజలతో యొర్దాను నది దాటి వారికి  ఇస్తాను అని చెప్పిన దేశమునుకు వెళ్ళమని చెప్పాడు. నీ జీవితకాలంలో నిన్ను ఎవరు ఎదురింపలేరు అని చెప్పాడు. మోషే వలే నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. 

దేవుని సహాయం పొందుటకు ధర్మశాస్త్రము అనుసరించాలి 

 దేవుడు యెహోషువతో ధైర్యముగా  ఉండమని, నేను ఈ ప్రజల పితరులకు ఇస్తానని చెప్పిన భూమిని నీవు పంచి ఇస్తావని, ధైర్యస్తైర్యము కోల్పోకుండా ఉండమని చెప్పాడు. మోషే ఇచ్చిన ధర్మ శాస్త్రము తప్పక పాటించిన మీరు కృతార్థుడవగుదురని  అంటున్నాడు. ధర్మ శాస్త్రమును నిత్యము పఠించి, దానిని అహోరాత్రులు మననం చేయాలి,  దానిలో చెప్పిన అన్ని న్యాయములను పాటించినప్పుడు, అతని కార్యములు పూర్తిగా నెరవేరుతాయి.  అప్పుడు నీకు నేను ఎప్పుడు  తోడుగా ఉంటానని  అభయమిచ్చాడు. 

యెహోషువ వాగ్దత్తభూమిని పొందుటకు ప్రజలను సిద్ధం చేయుట 

యెహోషువ నాయకులను పిలిచి ఆహారపదార్థములు సిద్దముచేసుకోనండి,  యావే  ఇస్తాననిన  దేశమును స్వాధీనంచేసుకొనుటకు  యోర్ధాను  దాటలని చెప్పాడు.  రూబెను, గాదు , మనష్హె  సంతతిలో సగం మందిని పీలిచివారికీ చెప్పగా  వారు నీవు చెప్పినట్లు చేయుదుము మీకు ఎదురుతిరిగిన వారికి మరణ శిక్ష విధించుము అని చెప్పారు. అప్పుడు యొహోషువ ఇద్దరు వేగులను పిలిచి షిత్తిము నుండి వారిని రహస్యముగా యెరికో పట్టణమును పంపాడు. వారు అక్కడ రాహబు అనే ఒక వేశ్య ఇంటిలో బసచేశారు. ఈవిషయం  తెలిసిన రాజు  రాహాబు ఇంటికి సైనికులను  పంపాడు. రాహాబు వారిని  దాచి,  వారు వచ్చిన మాట నిజమే కాని నగరద్వారం మూయువేళకు  వెళ్లిపోయారు, ఎక్కడకి వెళ్లారో  తెలియదు,  వారిని వెంబడించినచో మీరు  పట్టుకొనవచ్చని చెప్పి ఆ భటులను పంపి, వేగులను  దాచిపెట్టిన చోటుకు వెళ్ళి వారితో యావే చేసిన అధ్బుత కార్యములను జ్ఞప్తికి తెస్తూ మీరన్న మాకు భయం. నేను  దయచూపిన విధముగా  నా తండ్రి ఇంటి వారిపై కనికరము చూపిస్తామని యావేపై ప్రమాణము చేయమనగా వారు యావే ఈ దేశమును మాకి చ్చినప్పుడు ఖచ్ఛితముగా మీమ్ము ఆదరించుదుమని చెప్పి, మాకు గురుతుగా  ఆ ఇంటినుండి దింపిన కిటికీకి ఎర్రటి తాడును కట్టమని  మీ కుటుంబ సభ్యులం దరిని దానిలోనే ఉండమని చెప్పారు. తరువాత వేగులు కొండలు, నదిని దాటి యెహోషువకు , జరిగినదంత చెప్పి, యావే మనకు ఆ దేశమును ఇవ్వబోతున్నాడని ఆ  ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. 

యొర్దాను నదిని దాటుట 

యొహోషువ ఉదయాన్నేలేచి  యిస్రాయేలియులతో షిత్తిము నుండి బయలుదేరి యొర్ధాను చేరి  నది ఒడ్డున  మూడు రోజులబస చేసి తరువాత  లెవీయులు దేవుని మందసమును తీసుకొని పోవుట చూసినప్పుడు మీరు మందసము వెనుక వెళ్ళమని, మందసముకు రెండువేల మూరల దూరంలో నడవాలని, యావే మీ మధ్య అద్భుతకార్యములు చేయును కనుక మిమ్మును పవిత్రపరచుకొనమని చెప్పాడు.  యాజకులతో నిబంధనమందసమును తీసుకొని ప్రజల ముందు నడవమని చెప్పాడు. 

యావే యొహోషువతో నెను మోషే వలె నీకును తోడుగా ఉన్నానని ప్రజలు తెలుసుకుంటారు నేను నిన్ను ప్రజల ముందు గొప్పవాన్నిగా చేస్తానని, నీవు యాజకులతో నిబంధనమందసమును యొర్దాను గట్టును సమీపించి నిలబడమని చెప్పమన్నారు. యొహోషువ ప్రజలతో దేవుడు మీతో వున్నాడని తెలుసుకొమ్మని చెప్పాడు. అప్పుడు మందసమును ఎత్తుకొనిన వారి పాదాలు నీటిలో పెట్టగానే పైనుండి వచ్చు నీరు దిగువ నుండి వచ్చే నీరు వేరుపడి ఒకచోటనిలుచును అని వారికి చెప్పాడు. ఆవిధముగానే యొర్ధాను నదిని దాటుటకు వారి పాదాలు తాకగానే పై నుండి పారు  నీరు ఆగిపోయి  ఒక రాశిగా పొగయాయి. యిస్రాయేలు ప్రజలు యెరికో నగరమునకు ఎదురుగా నదిని దాటారు. వారు అందరు నదిని దాటెవరకు  నిబంధనమందసమును మోయు యాజకులు నడిమద్యలో ఆరిన నేలపై నిలబడ్డారు. తరువాత యాజకులు నిలబడిన చోటనుండి  యావే అజ్ఞ ప్రకారం పన్నెండు రాళ్ళను తీసుకొని వచ్చి  బస చేయుచోట పెట్టారు . వారి  పిల్లలు ఈ రాళ్ళు ఏమిటని అడిగినప్పుడు ఈ నదీప్రవాహము ఎలా ఆగిపోయింది వారు చెప్పాలని వారికి చెప్పాడు.
 
 రూబెనియులు, గాదీయులు మనస్షే తెగలలోని వారు ఆయుధములు ధరించి యుద్దమునకు సిద్దమై నదిని దాటారు. నిబంధనపు మందసమును మోయుయాజకులు బయటకు రాగానే నది పూర్వ స్థితికి వెళ్ళింది.  యొర్ధాను నుండి బయటకు వచ్చి యెరికోకు తూర్పున ఉన్న గిల్గాలులో దిగారు. యొహోషువ యొర్ధాను నది నుండి తెచ్చిన రాళ్ళను అక్కడ నిలిపి రాబోవు కాలములో వారి పిల్లలకు దిని గురించి మరియు యావే రేళ్లు సముద్రమును కూడా ఎండు నట్లు చేసినది తెలియపరచాలని అప్పుడు యావే బాహూబలమును అన్ని జాతులు గుర్తిస్తారు అని చెప్పాడు. 

వాగ్దత్తభూమిని భాగాలుగా స్వాదినపరుచుకొనుట 

యొర్ధానుకు పడమటన ఉన్న అమోరియ రాజులు, సముద్ర తీరాన ఉన్న కనానీయ రాజులు యొర్ధానులో జరిగిన విషయాలు తెలుసుకొని భయపడ్డారు. గిల్గాలు వద్ద యొహోషువతో యావే రాతి కత్తులు చేయించి  యిస్రాయేలు ప్రజలకు మరల సున్నతి చేయింపమని చెప్పగా యొహోషువ గిబియెత్ హారలోత్ కొండ వద్ద సున్నతి చేయించాడు. ఐగుప్తు దాటి వచ్చే సమయంలో పుట్టిన వారు ఎవ్వరూ సున్నతి పొందలేదు. అందరు సున్నతి చేసుకొని ఆరోగ్యం కుదుటపడువరకు అక్కడే  విశ్రాంతి తీసుకున్నారు. ఆ నెల 14 వ రోజు సాయం కాలం యెరికో మైదానంలో పాస్కపండుగ చేసుకున్నారు. ఆ తరువాతి రోజున ఆ దేశపు పంటను  రుచి చూశారు. అప్పటినుండి మన్నా ఆగిపోయింది. 

యొహోషువ యెరికోలో ఉన్నప్పుడు ఒక మనిషి కత్తి దూసి నిలబడియున్నాడు. అతన్ని యొహోషువ, నీవు మాకు చెందినవాడవా లేక శత్రువు చెందినవాడవా అని అడుగగా అతను నేను యావే సైన్యమునకు నాయకుడుగా  వచ్చాను అని చెప్పగా యొహోషువ అతని ముందు సాగిలపడి దేవుని వర్తమానం ఏమిటని అడుగగా నీవు నిలబడిన ఈ ప్రదేశం పవిత్రమైనది పాదరక్షలను తీసివేయమనగానే యొహోషువ అలానే చేశాడు. 

యెరికో ప్రజలు యిస్రాయేలియులను చూసి భయపడి నగరాన్ని మూసివేశారు. అప్పుడు యావే యొహోషువతో మీ యోధులు పట్టణమును ఒకసారి చుట్టిరావాలని అలా ఆరు రోజులు చేయాలని, ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బాకాలను ఊదుతు మందసము ముందు పోవాలని, అప్పుడు మీ ప్రజలందరు యుద్దనాదం చేయగా ఆ కోటగోడ దానికి అదే కులీ పోవును అప్పుడు మీరు వెళ్ళి ఆ నగరమును మీ వశం చేసుకోవాలని చెప్పాడు. యొహోషువ యావే చెప్పినట్లే చేశాడు. ఆ విధంగా వారు ఆరురోజులు చేసిన తరువాత 7 వ రోజు కోట చుట్టు ఏడుసార్లు తిరిగారు.ఆ పట్టణమును స్వాధీనపరచుకున్నారు.   

 ఆ పట్టణములోనికి వెళ్ళి అక్కడ శాపమునకు గురైన దేనిని ముట్టవద్దని చెప్పాడు.  పట్టణములోనికి వెళ్ళి దానిని ఆక్రమించుకొని శ్వాసించు దానిని సంహరించి శాపము పాలుచేశారు. రాహాబును ఆమె కుటుంబమును, ఆమె బంధువులను మాత్రము కాపాడారు. యావే అజ్ఞాపించినట్లు ఉండక ఆకాను కొన్ని వస్తువులను తీసుకున్నాడు. దాని పర్యవసానంగా హాయి నగరమును ఆక్రమించుకొనుటకు వెళ్ళినవారు అక్కడ సంహరించబడ్డారు. అప్పుడు యొహోషువ తన వస్త్రములను చించుకొని, యిస్రాయేలు పెద్దలతో కలసి తలపై దుమ్ము పోసుకొని చీకటి పడువరకు మందసము ముందు సాష్టాంగపడి ఉన్నారు. . అప్పుడు యావే లెమ్ము ,  యిస్రాయెలియులు పాపము చేశారు, శపింపబడిన వస్తువులను తీసుకొని, వారి సరకులలో కలుపుకున్నారు అందుకే మీరు ఓడిపోయారు, శాపగ్రస్తులైనవారు మీ మద్య ఉండగ నేను మీకు తోడుగా ఉండను అని ప్రభువు చెప్పాడు. 

చేసిన తప్పును ఒప్పుకొనుట శిక్షకు గురియగుట 

 యొహోషువా మరుసటి రోజు ప్రొద్దునే అన్ని తెగలవారిని వరుసగా రప్పించినప్పుడు యూద తెగవారు పట్టుపడ్డారు.  యూదా తెగలోని సెరా కుటుంబంలోని సబ్ది మనుమడు కర్మి కుమారుడు ఆకాను పట్టుపడగా,  ఆయన దొంగిలించిన వెండి బంగారము, మరియు ఉత్తరియములను ఎలా పాతి పెట్టిన విషయము చెప్పాడు. వారు వాటిని తీసుకొనివచ్చి ఆకాను కుమారులను, కుమార్తెలను ఆకోరు లోయలోనికి తీసుకొనిపోయి అతనిని రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చి వేశారు. అప్పుడు యావే యొహోషువతో భయపడవద్దు హాయిని మీ వశము చేస్తాను అని చెప్పారు. 

హాయిని వశపరచుకొనుట 

యొహోషువ 30 వేలమంది వీరులను రాత్రివేళ పంపి పట్టణ పడమర ఉండమని,  కొంతమందితో పట్టణము సమీపమునకు వెళ్ళి వారి ఎదుట నిలువలేక పొరిపోయినట్లుగా చేసి వారిని తరుముతున్నామనే బావనలో పట్టణమును వీడుతుండగా పడమర ఉన్న వారు పట్టణమును ఆక్రమించుకొనేలా చేసుకొని దానిని వెంటనే తగులపెట్టమని ప్రణాళిక వేసుకొని మరుసటి రోజు అదేవిధంగా చేయగా హాయి , బేతేలు ప్రజలు యిస్రాయెలును తరుముతూ వారు అందరు ఆ పట్టణమును విడిచి వెళ్లిపోయారు.  యావే చెప్పినట్లు యొహోషువ ఈటెను  పట్టణము వైపు చూపగా అక్కడ పొంచివున్న వారు ఆ పట్టణమును ఆక్రమించుకొని దానిని తగులపెట్టారు. హాయి ప్రజలు వెనుకకు చూడగా వారి పట్టణము తగులపడుతుండగా యిస్రాయెలియులు వారిమీద తిరగబడ్డారు వారికి ఎక్కడకి వెళ్లాలో తెలియలేకుండిరి.  రాజును మాత్రము ప్రాణముతో యొహోషువవద్దకు తీసుకొని వచ్చి మిగిలినవారిని  సంహరించారు. యొహోషువా హాయి రాజును చెట్టుకు వ్రేలాడదియించాడు. హాయి శాపము పాలైనది. అక్కడి పశువులను, కొల్లగొట్టిన సొమ్మును యావే ఆజ్ఞ ప్రకారం యిస్రాయేలు తీసుకున్నది. యొహోషువ ఏబాలు కొండమీద యావేకు ఇనుము తాకని, చెక్కని ముడి రాళ్ళతో బలి పీఠము కట్టించి యవేకు దహనబలులు, సమాధాన బలులు సమర్పించారు. మోషే ఇచ్చిన ధర్మ  శాస్త్రమును యొహోషువ రాళ్లపై చెక్కించి దానిని చదివించాడు. 

గిబ్యోనీయులు భయపడి సంధిచేసుకొనుట-  ఇతర దేశాల రాజులు ఏకమగుట - 

జరుగుతున్న విషయాలను తెలుసుకున్న హిత్తియులు, అమోరియులు, కనానియులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యొబూసీయులు  యొహోషువాతో యుద్దము చేయడానికి ఒకటయ్యారు. ఈ సంగతలును విన్న గిబ్యోనీయులు కపటోపాయంతో యోహోషువ వద్దకు వచ్చి మేము దూరం నుంచి వచ్చాము మీ దేవుని గురించి, ఆయన ఎలా మీ శత్రువులమీద విజయం చేకూర్చినది విన్నాము కనుక మీరు మాతో శాంతి పాటించుతమని మాతో ఒడంబడిక చేసుకోమని అడుగగా యిస్రాయెలు పెద్దలు మీరు ఈ ప్రాంతము వారేనేమో అని అనుమానాన్ని వెల్లడిచేయగా  వారు మేము దూరము నుండే వచ్చామని చెప్పగా పెద్దలు వారు ఇచ్చిన ఆహరమును యావేను సంప్రదింపకుండానే తిన్నారు, యొహోషువ వారితో ఒడంబడిక చేసుకొనిన మూడురోజులకు గిబ్యోనీయుల పట్టణములు చెరుకొనిరి, ఆ పట్టణములను ముట్టడింపలేదు కాని ప్రజలు వారి నాయకుల మీద గొణుగుకొన్నారు. యొహోషువా వారిని శపించి వారికు నీటిని వంటచెరకు తెచ్చుటకు నియమించేను.

పాలస్తీనా దక్షిణ భాగమును జయించుట 

యెరుషలెము రాజైన అదోనిసెదెకు యెరికో, హాయిలకు పట్టినగతి తెలుసుకొని, గిబ్యోను వంటి నగరమే వారితో సంధిచేసుకున్న విషయం తెలిసి, హెబ్రోను రాజు, యార్మూతురాజు, లాకిషురాజు ఏగ్లోను రాజులను తీసుకొని గిబ్యోను మీదకు యుద్దమునకు పోయాడు. అప్పుడు  యొహోషువ రాత్రి మొత్తం తన వీరులతో ప్రయాణం చేసి యావే అనుగ్రహంతో వారిని ఎదుర్కొన్నాడు. బెత్హహోరోను పల్లము వారిని తరిమివేశారు. యావే వారికి తోడ్పడిన విధం ఎంత గొప్పది అంటే శత్రువుల మీద వడగండ్ల వాన కురిపించాడు. ఈ వాన వలననే ఎక్కువ మంది చనిపోవడం జరిగినది.  యొహోషువ ఆ రోజు   సూర్యుడా నీవు గిబ్యోను పట్టణముపై నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయమీద ఆగుము అని ప్రార్ధించిన విధముగా సూర్యుడు, చంద్రుడు వారు గెలుచు వరకు ఆగిపోయారు. సూర్యుడు ఒక రోజువరకు అస్తమించలేదు.  శత్రురాజులు మక్కేడా గుహలో దాగుకొనియున్నారని ఆ గుహకు అడ్డుగా పెద్ద రాళ్ళను దొర్లించి భటులను కాపలాగా పెట్టారు. ఆ రాజులను తీసుకొని వచ్చి  నాయకులతో ఆ రాజుల మెడలపై పాదములను మోపించి మీరు యుద్దము చేయువారిని ఈ రీతిగానే నాశనం చేయునని చెప్పి ఆ రాజులను వధించి చెట్లకు వ్రేలాడదియించాడు. ఆ సాయంత్రం వారిని దించి ఆ గుహలో పడవేశారు. 

కనాను దేశం దక్షణ భాగం చేయించుట

అదే రోజు మక్కెడను యొహోషువ జయించాడు. మక్కెడ రాజుకు కూడా యెరికోకు పట్టిన గతే పట్టింది. యొహోషువ అతని అనుచరులు మక్కెడ నుండి లిబ్న వచ్చి ఆ పట్టణమును ముట్టడించారు.  యావే ఆ పట్టణమును యిస్రాయేలుకు అప్పగించాడు. అక్కడనుండి యొహోషువ లాకిషును రెండురోజులలో  వశము చేసుకున్నారు. గేసేరు రాజు, వారికి తోడుగా వచ్చిన వారు యిస్రాయేలును ఏమి చేయలేకపోయారు. తరువాత వారు లాకిషు నుండి 
ఏగ్లోనుకు వెళ్ళి ఆ పట్టణమును తరువాత హెబ్రోను స్వాధీనం చేసుకున్నారు.  అక్కడ నుండి  దెబీరుకు వచ్చి దాన్ని  ఆక్రమించుకున్నారు. ఆ విధంగా కాదేషుబార్నెయా  నుండి గాసావరకు గిబ్యోను వరకు ఉన్న గోషే  వరకు స్వాధీనం చేసుకున్నారు. 

ఉత్తర దేశమును జయించుట

హసోరురాజు  యాబీను యొహోషువ గురించి విని మాడోను రాజు యోబాబు, షిమ్రోను రాజు, అక్షాపు రాజు, ఉత్తరదేశపు పీఠభూములయందు రాజులకు, కిన్నెరోత్తుకు దక్షిణమున లోయలలోని రాజులకు డోరుసీమకు   ప్రక్క పల్లములో రాజులకు, కనానీయులకు, పెరిస్సీయులకు, ఆమోరియులకు, హివ్వీయులకు, యొబూసియులకు, మిస్ఫలోని హర్మోనులో ఉన్నవారికి  కబురు పంపి అందరు యిస్రాయేలు మీద యుద్దమునకు వచ్చారు. వారు అందరు మేరోము వద్ద దిగి యిస్రాయేలుతో యుద్దమునకు సిద్దంకాగా, యావే యొహోషువతో భయపడకు వారిని నీకు అప్పగిస్తానని చెప్పి, అలాగే చేశాడు. యొహోషువ అతని అనుచరులు అకస్మాత్తుగా వారి మీద పడి వారిని ఓడించారు. హసోరు, ఉత్తర దేశ పట్టణములు యిస్రాయేలు వశం అయ్యాయి. హసోరులోని మెట్ట పట్టణములనుండి వచ్చిన సొమ్మును, పశువులను యిస్రాయేలుతీసుకొని మిగిలన ప్రాంతములలో మొత్తాన్ని నాశనం చేసినది. యొహోషువ మోషే ఆజ్ఞలను మీరకుండ  పాటించాడు. తరువాత పీఠభూముల మీద ఉన్న అనాకీయులను నాశనం చేశారు. యొహోషువ యొర్ధానుకు తూర్పున ఉన్న రాజులను, పడమర ఉన్న రాజులను  జయించారు. 

పన్నెండు తెగలు కనాను పంచుకొనుట 

యొహోషువ ముసలి వాడు అయ్యాక, యావే అతనితో నీవు ముసలివాడవు అయ్యావు. ఇంకా జయించవలసిన దేశములు ఉన్నవి. ఆ దేశములలో ఉన్న వారినందరిని యిస్రాయేలు కన్నుల ముందునుండి తరిమివేస్తానని చెప్పి, నేను అజ్ఞాపించినట్లే ఈ నేలను వారసత్వభూమిగా యిస్రాయేలుకు పంచిఇవ్వమని, తొమ్మిది తెగలకు, మనస్షే అర్ధ తెగకు పంచిఇవ్వమని చెప్పాడు.రూబెను, గాదు తెగల వారికి తూర్పున యొర్ధానుకు అవ్వతల నేల వారికి ఇచ్చాడు. లెవీ తెగకు మాత్రము వారసత్వభూమి ఏమి లభింపలేదు. దేవునికి బలులు అర్పించుటయే వారి వారసత్వం. గాదు తెగకు  వారి వారి కుటుంబములను అనుసరించి మోషేచెప్పినట్లుగా   భూములు పంచి ఇచ్చాడు. తరువాత మనస్సే అర్ధతెగ వారికి వారివారి కుటుంబములను అనుసరించి  వారసత్వ భూమిని పంచి ఇచ్చాడు. యోర్ధానుకు తూర్పున ఉన్న రెండున్నర తెగలకు ముందుగానే భూమిని పంచి ఇచ్చాడు. లెవీ తెగకు మాత్రము ఇవ్వలేదు.కానీ వారు వసించుటకు కొన్ని పట్టణాలు, మందలు మేపుటకు కొన్ని బయళ్ళు ఇచ్చారు.  యేసేపు కూమరులు మనస్సే , ఏఫ్రాయిము అను రెండు తెగలగా ఏర్పడిరి. 

కాలెబు భాగము 

యూదీయులు గిల్గాలులో ఉన్న యోహోషువను చూచుటకు వచ్చారు, అపుడు యెపున్నే కుమారుడు కెనిస్సీయుడగు  కాలెబు యోహోషువతో మోషే వారికి చెప్పిన మాటలను గుర్తు చేసి, మోషే వాగ్ధానం చేసినట్లు ఆ కొండ సీమలను తనకు ఇవ్వమని అడిగాడు. యోహోషువ హెబ్రోను సీమను వారసత్వ భూమిని కాలెబుకు ఇవ్వడం జరిగింది. 

యూదాకు వారి కుటుంబాల ప్రకారం వారికి ఇచ్చిన భూమి ఏదోము సరిహద్దున ఉంది. అది శీను ఎడారి నుండి కాదేషు వరకు వ్యాపించి ఉంది. కాలెబుకు కూడా యూదా తెగవారు ఆక్రమించిన నేలలో భాగం ఇచ్చారు. కాలెబు తన కుమార్తె అక్సా కు వివాహం చేయగా ఆమె తన తండ్రిని నన్ను నెగెబు ఎడారి సీమకు ఇచ్చితివి కదా నాకు నీటి బుగ్గలు గల నేలను ఇప్పింపుము అని అడుగగా అతను ఆమెకు ఎగువ నీటి బుగ్గలు దిగువ నీటి బుగ్గలు ఇచ్చాడు. అది యూదా తెగల వారికి వచ్చిన వారసత్వ భూమి. 

ఎఫ్రాయీము తెగ :  యోసేపు తెగవారికి  యోర్ధాను నుండి ఏరికో వరకు తూర్పు వైపున ఉన్న నేల వచ్చింది. వారి   సరిహహద్దులు ఏరికో నుండి బేతేలు వరకు, బేతేలు లూసు నుండి ఆటారోతున వున్న ఆర్కి వరకు అక్కడనుండి పడమట బెత్ హొరోను వరకు గేసెరునుండి సముద్రం వరకు ఉన్నది. ఎఫ్రాయీము జనులు గేసెరున నివసించు కనానీయులను వెడలకొట్టక పోవడంతో వారు అక్కడే జీవించారు మరియు వారిచేత చాకిరి చేయించుకున్నారు. 

మనష్హె తెగ : యోసేపు పెద్దకుమారుడు మనష్హె. మనష్హె పెద్దకుమారుడు మాకీరు పోరాట వీరుడు. అతనికి గిలాదు, బాషాను మండలాలు ఇవ్వబడ్డాయి.  మనష్హె ఇతర కుమారులకు వారివారి కుటుంబములను అనుసరించి భూమినిచ్చారు. వారు అబిఏజెరు, హేలేకు, ఆస్రియెలు, షేకెము, హేఫెరు, షెమిదా. గిలాదు మాకీరు కుమారుడు గిలాదుకు హేఫెరు కుమారుడు, హేఫెరుకు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారు మహ్ల, నోవా, హొగ్లా, మిల్కా, తీర్సా.  వీరు యోహోషువ, ఎలియాజరు , మరియు పెద్దల  వద్దకు వచ్చి  యావే ఆజ్ఞను అనుసరించి మాకును ఇవ్వమని అడుగగా అటులనే వారికి భాగము ఇచ్చారు. కనుక మనష్హెకు గిలాదు , బాషాను మండలలే కాక పది వంతులు ఎక్కువ భూమి వచ్చినది. దక్షిణమున ఎఫ్రాయీము ఉత్తరమున మనష్హె ఉన్నారు. వారికి ఉత్తరమున ఆషేరు తూర్పున యిస్సాఖారు ఉన్నారు. ఈ మండలలలో మనష్హెకు పట్టణాలలు ఉన్నవి. 

యోసేపు సంతతి వారు యోహోషువతో మేము యావే దీవెనల వలన చాలమందిమి అయ్యాము అని చెప్పగా యోహోషువ వారితో మీకు ఎఫ్రాయీము ప్రాంతము చాలనిచో అరణ్య ప్రాంతమునకు వెళ్ళి పెరిస్సీయులు  రేఫీయులు నివసించు దేశంలో అడవులను నరికి అక్కడ నేలను ఆక్రమించుకొనమని చెప్పారు. అక్కడ కనానీయులు బలవంతులైయన మీరు వారిని వెడలగొట్టగలరు అని చెప్పాడు. 

యిస్రాయేలీయులు షీలో  వద్ద చేరి సమావేశపు గుడారము ఏర్పాటు చేశారు. వారు ఆ ప్రాంతమును స్వాదినము చేసుకున్నప్పటికి ఏడుతెగలవారికి  వారసత్వ భూమి లభింపలేదు. యోహోషువ వారితో ఇంకా ఎంత కాలం యావే మీకు ఇచ్చిన భూమిని స్వాదినం చేసుకోకుండా  జాగుచేస్తారు, ఒక్కో తెగ నుండి ముగ్గురిని ఎన్నుకొండి వారు ఈ నేల మొత్తం తిరిగి దానిని ఎట్లు విభజింపాలో నిశ్చయించి, నా దగ్గరకు వచ్చేదరు అని చెప్పాడు. వారు ఈ భూమిని ఏడు భాగాలుగా విభజించాలని యూదా తెగవారికి దక్షిణ భాగమున, యోసేపు ఉత్తర భాగమున ఉంటారని చెప్పారు. లెవీయులకు మీతో భాగము లేదు.  యావే యాజకులుగా పనిచేయుటయే వారి వారసత్వం. గాదు, రూబెను, మనష్హె అర్ధ తెగవారు యొర్ధాను ఆవలిదరిని తూర్పు వైపున  తమ వారసత్వ భూమిని తీసుకున్నారు. 

మిగిలిన తెగలవారు వారసత్వ భూమి పొందుట 

అక్కడకు వచ్చిన తరువాత చీటి వెయ్యగా మొదటి వంతు బెన్యామీను కుటుంబమునకు వచ్చెను అది యూదా యోసేపుల భాగముల మద్య ఉన్నది. షిమ్యోను తెగ: తరువాత చిట్లు వెయ్యగా రెండవ వంతు షిమ్యోను వారికి వచ్చినది. అది యుదీయుల వారసత్వ భూమి మద్యలో ఉన్నది. యూదాకు వచ్చిన భాగము చాలా పెద్దది. కనుక షిమ్యోను వారసభూమి యూదా నుండి పంపిణిచేయబడెను. సెబూలూను తెగ : తరువాత చిట్లు వెయ్యగా వచ్చిన మూడవ చీటి సెబూలూనుకు వచ్చినది. వారినేల సరీదు వరకు వున్నది. యిస్సాఖారు: నాలుగవ సారి చీట్లు వేయగా   యిస్సాఖారుకు వచ్చినది. ఆషేరు తెగ:ఐదవ వంతు ఆషేరు తెగకు వచ్చింది. 
నప్తాలి తెగ: ఆరవ వంతు నఫ్తాలి తెగవారికి వచ్చినది. దాను తెగ: ఏడవ వంతు చీటి దాను తెగ వారు పొందారు. దానీయులు వారి భూభాగం కోల్పోవడంచే వారు లెషెము మీద యుద్దము చేసి దానిని స్వాధీనపరుచుకొని దాను పేరును ఆ నగరమునకు పెట్టారు. 

యోహోషువకు కూడా వారు వారసత్వ భూమి ఇచ్చారు . యోహోషువ అడిగినట్లు ఎఫ్రాయీము పీఠభూములలోని తిమ్నాత్ సెరా  పట్టణమును ఇచ్చారు. ఆయన దానిలొనే నివసించాడు. ఆవిధముగా యిస్రాయేలు ప్రజలు వారసత్వ భూమిని పంచుకున్నారు. 

ఆశ్రయ పట్టణాలు 

ముఖ్య నరగరాలు : యావే యోహోషువతో యిస్రాయేలీయులను ఆశ్రయపట్టణములను ఎన్నుకొనమని చెప్పాడు. తెలియక ఎవరినైన చంపినవారు ఈ పట్టణములలో తలదాచుకోవచ్చు. పగ తీర్చుకొనగోరే వారి నుండి ఈ నగరాలు రక్షణ కల్పిస్తాయి. ఇతరులను చంపినవాడు ఇక్కడ శరణు పొందవచ్చు, అతడు మొదట నగరద్వారం వద్ద నుండి అతడు పెద్దలకు ఆ విషయం చెప్పాలి. వారు అతనికి ఆశ్రయం ఇవ్వాలి.  పగ తీర్చకొనేవారు ఎవరైన అతనిని వెదకి వచ్చినట్లయితే మీరు అతనిని పట్టి ఇవ్వరాదు అని చెప్పాడు. అతడు పగతోటి కాక తెలియకనే చంపాడు. ఆ వ్యక్తి  తాను వచ్చినప్పుడు ఉన్న ప్రధాన యాజకుడు మరణించువరకు ఆ నగరమునే ఉండవచ్చు.  తరువాత అతను తన సొంత నగరమునకు కాక నప్తాళి  లోని  కొన్ని నగరాలలో కేదెషు, ఎఫ్రాయీము మున్నేములోని షెకెము, యూదా లోని హెబ్రోను, ఏరికో తూర్పున ఉన్న బేసెరును , రామోత్ గిలాదును, గోలానును    ఆశ్రయపట్టణములుగా నిర్ణయించారు. 

తరువాత లెవీయ పెద్దలు  యోహోషువ, ఎలియెజరు యిస్రాయెలు పెద్దల వద్దకు వచ్చి మేము నివసించుటకు పట్టణములు, మా  గొడ్లు మేపుకొనుటకు గడ్డి బీళ్లను ఇవ్వాలని యావే అజ్ఞాపించిన విధంగా ఇవ్వమని అడగడం జరిగినది. వారికి యిస్రాయెలు ప్రజలు వారి వారి వారసత్వ భూములనుండి లేవీయులకు ఇవ్వడం జరిగినది. 

యొర్దాను అవతలి తెగల వారు వెళ్లిపోవుట - వారికి యెహోషువ సందేశం 
 
యోహోషువ రూబెనియులను గాదియులను , మనశ్శె అర్ధ తెగవారిని యావే సేవకుడు మోషే మీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించారు మీరు ఇన్ని రోజులు ఈ సోదరులను వీడి పోలేదు. మీ సోదరులకు ఇప్పుడు విశ్రాంతి లభించినది. కనుక మీరు మీ నివాసముల ఉన్న యొర్దాను అవతల ఉన్న మీ నివాసములకు వెళ్ళమని, యావే ఇచ్చిన ఆజ్ఞలను పాటింపమని వారికి చెప్పాడు.  అలా తూర్పు తెగలవారిని యెహోషువ పంపించాడు. రూబేనీయులు గాదీయులు, మనస్సే తెగవారు గిలాదు మండలమునకు వెళ్లిపోయారు. 

వారు యొర్దాను నందలి రాళ్ళ గుట్ట వద్ద యిస్రాయేలీయుల వైపున బలిపీఠము ఏర్పాటు చేశారు అది  తెలిసి యిస్రాయేలీయులు షిలో వద్ద నుండి వారి మీద దండెత్తుటకు సిద్ధపడ్డారు. ఎలీయెజెరు కుమారుడైన ఫీనెహాసును పది తెగల నుండి   పదిమందిని పంపగా వారు మీరు యావేమీద తిరుగుబాటు చేయనేలా , పెయోరు వద్ద మనం చేసిన పాపములకు ప్రభువు మనలను అంటురోగములతో పీడింపలేదా, మరల ప్రభువు మనమీద మండి పడడా అని చెప్పడం జరిగినది. యావే బలి పీఠమునకు వ్యతిరేకముగా మరియొక  దానిని ఏర్పాటు చేసి మీ తిరుగుబాటులో మమ్మును భాగస్వాములను చేయవద్దు అని చెప్పడం జరిగింది. అప్పుడు వారు మేము చేసినది  దేవాధిదేవుడైన యావేకు తెలుసు. రేపు మీ సంతతి వారు యిస్రాయేలు దేవుడైన యావేతో మీకు ఏమి సంబంధం అని వాధించవచ్చును, మేము యొర్దాను అవతల ఉంటాము. అప్పుడు ఇది మీ సంతతికి మా సంతతికి సాక్షముగా నిలువగలదు అందుకే దీనిని నిర్మించితిమి కాని ఇక్కడ బలులు, దహన బలులు సమర్పించుటకు కాదు అని చెప్పారు.  ఆ మాటలకు ఫీనెహాసు మరియు యిస్రాయేలీయుల పెద్దలు సంతృప్తి చెందారు. వారు వెళ్లి జరిగినదంతటిని తమ వారికి చెప్పారు. ఆ పీఠము యావే దేవుడు అనుటకు సాక్షముగా ఉండునని దానికి సాక్షము అని పేరు పెట్టారు. 

యెహోషువ ఎడ్లు గడచి వృద్ధుడై యిస్రాయేలీయులలో పెద్దలను నాయకులను న్యాయాధిపతులను, ముఖ్యులను పిలిచి యావే ఎలా వారి శత్రువులను అణగద్రొక్కినది , వారు చూచిన దానిని వారికి జ్ఞప్తికి తెచ్చి, వారి తరుపున యుద్ధము చేసిన యావే గురించి తెలిపి ధర్మశాస్త్రమున వ్రాయబడిన అన్ని నియమాలను ఏ మాత్రము మార్చకుండ పాటించమని చెప్పాడు. ఇతర దేవతలను ఆశ్రయించవద్దని, ఆ జాతులతో కలసిపోవద్దని, వారి దేవతల పేరుమీద ప్రమాణములు చేయడం, పేరు ఉచ్చరించడం, సేవించడం, పూజించడం చేయక యావేనే అంటిపెట్టుకొని  ఉండండి. ఆయనను అంటిపెట్టుకొని ఉండుటవలనే మహాబలముగల గొప్ప జాతులను మీ ఎదుటినుండి వెడల గొట్టాడు. కనుక ప్రభువును పూర్ణ హృదయముతో సేవింపుము అని వారికి చెప్పాడు. అట్లుకాక మీరు వారితో కలసిపోవుదురేని, ప్రభువు వారిని వెడలగొట్టక వారు మీరు చిక్కుకొని గోతులుగా, వలలాగా పరిణమిత్తురు అని చెప్పాడు. యావే మీకు చేసిన వాగ్దానములు అన్ని నెరవేరినవి. ప్రభువు మీతో చేసుకొన్న నిబంధనను మీరుదురేని మీకిచ్చిన నేలమీదనుండి మీరు అడపొడ  కానరాకుండా పోవుదురు అని అతని కోపం మీమీద వస్తుంది అని చెప్పాడు.  

యావే  చేసిన మేలును గుర్తుచేస్తూ  వారిని యావేను ఆజ్ఞలను అనుసరించమని కోరుట 

యెహోషువ యిస్రాయేలు తెగలన్నింటినీ షెకెము వద్ద సమావేశపరచి యావే పలుకులను వారికి వినిపించాడు. పూర్వం అబ్రాహాము,నాహోరు వారి తండ్రి తేరా అన్యదైవములను కొలిచారు, యావే అబ్రాహామును పిలిచి కనాను మొత్తము సంచరించునట్లు చేసి, అతని సంతానాన్ని వృధ్ది చేయుటకు ఇస్సాకును ఇచ్చినది, ఇస్సాకుకు ఏసావు , యాకోబులను ఇచ్చినది, సేయిరు పర్వతమును ఏసావు సంతతికి వారసత్వ భూమిగా ఇచ్చినది. యాకోబు అతని కుమారులు ఐగుప్తుకు వలస పొగ మోషే అహరోనును పిలిచి వారిని ఇక్కడకు తీసుకొని వచ్చిన విషయం చెప్పడం జరిగింది. 

యావే చేసిన అన్ని అద్భుతకార్యములను వివరిస్తూ ప్రభువు చేసిన కార్యములకు వారు  చూచిన విషయం తెలియజేశాడు. ఎలా ప్రభువు వారికి తోడుగా ఉంటూ అన్ని సమకూర్చినది తెలియజేశాడు. ఇవన్నీ తెలియజేసిన తరువాత యెహోషువ వారితో యావేకు భయపడి చిత్తశుద్ధితో ఆయన్ను కొలవండి. అన్యదైవములను విడనాడి యావేను కొలవండి. మీరు యావేను కొలవనిచో ఎవరిని కొలుస్తారో ఇప్పుడే తేల్చుకోండి. నేను నాకుటుంబం మాత్రము యావేను మాత్రమే ఆరాధిస్తాము  అని చెప్పాడు. అప్పుడు వారు ఎంతమాట మాకు ఇంత మేలుచేసిన యావేను విడనాడి వేరు దైవములను ఎలా కొలుస్తామా? మేము కూడా యావేను మాత్రమే సేవింతుము అని చెప్పారు. అప్పుడు యెహోషువ వారితో మీరు యావేను సేవింపజాలరేమో! ఎందుకంటే ఆయన పరమ పవిత్రుడు, అసూయపరుడు. ఆయన  మీ తిరుగుబాటులను సహించడు, మీరు అన్యదైవములకోసం ఆయన్ను పరిత్యజింతురేని మిమ్ములను నాశనం చేయును అని హెచ్చరించగా వారు మేము యావేను మాత్రమే సేవింతుము అని యావేను ఎన్నుకొని, ఆయన ఆజ్ఞలను పాటింతుము అని చెప్పారు. 

యెహోషువ చివరి మాటలు మరియు మరణం 

యెహోషువ అప్పుడు ప్రజలతో నిబంధనచేసి వారికి ఒక శాసనం చేసాడు. యెహోషువ తన అను శాసనములను ధర్మ శాస్త్రంలో రాయించి, పెద్దరాతిని తెప్పించి సింధూర వృక్షం క్రింద దానిని పెట్టి ఈ శిల మనకు సాక్ష్యముగా ఉండును, యావే మనతో చెప్పిన మాటలు అన్ని విన్నది. మీరు యావేను విస్మరిస్తే ఈ శిల మీకు వ్యతిరేఖంగా సాక్ష్యము ఇస్తుంది అని చెప్పిన తరువాత  యెహోషువ మరియు ప్రజలు వెళ్లిపోయారు. తరువాత యెహోషువ నూటపది సంవత్సరాల ప్రాయంలో కన్నుమూయగా అతన్ని తిమ్నాత్ సెరా వద్ద ఖననం చేశారు.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...