1 కొరింతి 3:1-9, లూకా 4: 38-44
పిదప యేసు ప్రార్ధన మందిరమును వీడి, తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అపుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసికొనిరి. అపుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగపీడితులైన వారినందరిని వారి వారి బంధువులు యేసు వద్దకు తీసికొనివచ్చుచుండిరి. అపుడు ఆయన వారిలో ఒక్కొక్కనిమీద తన హస్తమునుంచి వారినందరిని స్వస్థపరచెను. అనేకులనుండి దయ్యములు "నీవు దేవుని కుమారుడవు" అని ఆర్భటించుచు వదలి పోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వానిని గద్దించి మాటాడనీయలేదు. వేకువనేలేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్లెను. ప్రజలు ఆయనను వెదకుచు వచ్చి, తమను విడిచిపోవలదని అనగా, ఆయన వారితో "నేను ఇతర పట్టణములలోకూడ దేవుని రాజ్యమును గురించి బోధింపవలసివున్నది. అందులకే నేను పంపబడితిని" అని పలికెను. పిమ్మట యేసు యూదయా ప్రార్ధనా మందిరములలో బోధించుచుండెను.
ధ్యానము: యేసు ప్రభువు ప్రార్థన మందిరము వీడటం అంటూ జరిగితే అది దేవుని సంకల్పం నెరవేర్చడానికి మాత్రమే ప్రార్థన మందిరమును , లేక ప్రార్థనను వీడుతుంటాడు. ప్రార్ధన అంటే దేవునితో సంభాషించుట, దేవునితో సఖ్యత పడుట, దేవునితో సంభందమును దృఢపరచుకొనుట.యేసు ప్రభువు ప్రార్ధనలో దేవునితో అంటే తన తండ్రితో ఉన్న ఆ బంధమును దృఢపరచుకొనుట ఎలా అనే విషయం తెలుసుకోవచ్చు. యేసు ప్రభువు వలే ప్రతి రోజు ప్రార్ధన చేసుకోనట్లయితే నాకు దేవునితో ఉన్న ఆ సంభందం దృఢ పడుతుంది. యేసు ప్రభువు ఎల్లప్పుడు దేవుని సంకల్పము నెరవేర్చే పనిలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు తండ్రికి ఉన్న సంభందము ఎప్పుడు సన్నగిల్లలేదు. కాని మానవ జీవితంలో నేను కొలది సమయము మాత్రమే దైవ చింతన గురించి లేక నా ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచిస్తున్నాను కనుక నేను ఎక్కువగా దేవునితో సంభందం లేకుండా ఉన్నాను. కాని ప్రతిరోజు ప్రభువు వలె ప్రార్ధిస్తే, తండ్రితో దృఢ బంధం ఏర్పరుచుకుంటే ఎంత బావుండును. అపుడు మన జీతం మొత్తం ప్రభువుతో మిళితం అయ్యివుంటుంది.
యేసు ప్రభువు ప్రార్ధన మందిరమును వీడి సీమోను ఇంటికి వెళుతున్నాడు. అక్కడ జ్వరముతో బాధపడుతున్న పేతురు గారి అత్తను స్వస్థ పరుస్తున్నారు. యేసు ప్రభువు జీవితం మొత్తం తండ్రి సంకల్పం నెరవేర్చడం మరియు మానవునికి సహాయపడడంతో నిండి ఉన్నది. తండ్రితో సంభాషించిన తరువాత తన జీవితం మొత్తం మానవునికి తోడుపడటమే. అందుకే జ్వరముతో భాదపడుతున్న పేతురు అత్తను గురించి తెలుపగానే ఆయన ఆ జ్వరమును గద్దించాడు. అది వెంటనే తొలగిపోతుంది. యేసు ప్రభువు మనతో ఉంటె మనలో ఉన్న అనారోగ్యాలు, అపవిత్రత అనేవి మననుండి వెళ్లిపోతాయి. యేసు ప్రభువు చెప్పిన వెంటనే అనారోగ్యం వదిలిపోతుంది. మనము కూడ ప్రభువు దగ్గరకు వచ్చి మనకు ఉన్న సమస్యను చెప్పినట్లయితే ప్రభువు ఏమి చేస్తాడో ఈ సువిశేష భాగంలో మనం తెలుసుకుంటున్నాం.
యేసు ప్రభువు కేవలం పేతురు అత్తగారిని మాత్రమే కాక అనేక రోగాలతో ఉన్నవారిని ప్రభువు దగ్గరికి తీసుకొనివస్తున్నారు. వారి అందరిని ప్రభువు స్వస్థ పరుస్తున్నారు. ప్రభువు దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని స్వస్థత పొందకుండ వెళ్లనివ్వలేదు. ప్రభువు మాట వినిన తరువాత అందరు కడుపు నింపబడిన తరువాతనే ప్రభువు వారిని పంపుతాడు. అదేవిధంగా వారు అస్వస్థతతో ఉన్నట్లయితే వారు స్వస్థత పొందిన తరువాతనే ప్రభువు దగ్గర నుండి వెళ్లడం గమనించవచ్చు. ప్రభువు వద్దకు రావడం లేక తీసుకోరాబడటం అంటే మన సమస్యాలు, రోగాలు, ఇబ్బందులు, బానిసత్వాలు వంటి వాటి నుండి విముక్తి పొందడం. అందుకే సాతానుచే పీడించబడేవారు, రోగాలతో ఉన్నవారు అందరు విముక్తి పొందుతున్నారు. తిరిగి వారి ప్రదేశాలను సంతోషంగా ఆరోగ్యంగా వెళుతున్నారు. ప్రభువు దగ్గరకు వచ్చిన వారి నుండి సాతాను వెళ్ళిపోతుంది. ప్రభువు వాటిని మాటాడనియ్యలేదు. లోకములోని అన్ని శక్తులు కూడా ప్రభువుకు లోబడే ఉంటాయి. మనిషే ప్రభువు మాట మీరి తప్పుచేస్తుంటాడు.
సంభాషణ : ప్రభువా! మీరు తండ్రితోటి సంభాషించుటకు ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చారు. తండ్రితో మాట్లాడటం మీ దైనందిన జీవితంలో భాగం అయ్యింది. అందుకే కాబోలు మీరు ఎల్లప్పుడు ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడము మీ ఆహారము చేసుకున్నారు. మీరు తండ్రితో మాటలాడిన తరువాత ఇతరుల బాగుకోసము పాటు పడ్డారు. మీరు ఎలా మీ జీవితాన్ని తండ్రితోటి బాంధవ్యం కోసం, మానవ శ్రేయస్సు కోసం ఉపయోగించారో, మీలా జీవించడం మాకు ఎలా సాధ్యపడుతుంది. ప్రభువా! మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వారికి కావలసిన వాటిని మీరు అందిస్తున్నారు. వ్యాధులు, బాధలు అన్ని కూడా మనుషులను వీడిపోయేలా చేస్తున్నారు. మా జీవితాలలో కూడా ప్రభువా ఇటువంటివి వ్యాధులు, బాధలు వస్తున్నవి. మేము అనేక సార్లు మేము మీ వద్దకు రావడానికి ప్రయత్నిస్తున్నాము కాని కొన్ని సార్లు మీ దగ్గరకు రావడానికి ప్రయత్నించినా రాలేక పోతున్నాము. మేము మీ వద్దకు ఎలా రావాలో నేర్పించండి. ప్రభువా లోకములోని అన్ని శక్తులు మీకు సహకరించాయి. మీ మాటకు అన్ని లోబడుతున్నాయి.
ప్రార్ధన: ప్రభువా! ఈనాటి సువిశేషంలో మీరు ఎలా ఎప్పుడు తండ్రితోటి సంబంధం కలిగి ఉన్నారో మేము తెలుసుకుంటున్నాము. మీరు ఏవిధంగా అయితే తండ్రితోటి సంబంధం కలిగి ఉన్నారో మేము కూడా మీతోటి తండ్రి తోటి సంబంధం కలిగి జీవించేలా చేయండి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు వారి వారి సమస్యల నుండి విముక్తిని చేస్తున్నారు. ప్రభువా! మాకు అనేక బాధలు ఉన్నవి, మేము అనేక అలవాటులకు బానిసలుగా ఉన్నాము. మీరు అనేక మందికి విముక్తిని ప్రసాదించిన విధంగా మా సమస్యల నుండి మాకు చేయమని వేడుకుంటున్నాము. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి