పేజీలు

20.10.24

29 సామాన్య ఆదివారం

మార్కు 10: 35-45


అంతట జెబదాయి పుత్రులగు యోహాను, యాకోబులు యేసును సమీపించి "బోధకుడా! మాదొక మనవి. అనుగ్రహింపుడు" అని వేడుకొనిరి. అందుకాయన "నేను మీకేమి చేయగోరుచున్నారు?" అని వారినడిగెను. వారు "మీరు మీ రాజ్యములో మహిమాన్విత  సింహాసనము పై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు" అని ప్రార్ధించిరి. అందులకు యేసు "మీరు కోరున దేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?" నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరా?" అనెను. "అవును" అని వారు పలికిరి. యేసు వారితో "నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేసెదరు. నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందెదరు. కానీ, నా కుడి ఎడమల మిమ్ము కూర్చుండబెట్టునది నేను కాదు. నా తండ్రి ఏర్పరచిన వారికే అది లభించును" అని పలికెను. తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను, యాకోబులపై కినుక వహించిరి. యేసు శిష్యులను కూడబిలిచి, వారితో ఇట్లనెను: " అన్యజాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలయన మనుష్యకుమారుడు  సేవించుటకేగాని సేవింపబడుటకు రాలేదు. అయన అనేకుల రక్షణార్ధము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను.  

జెబదాయి పుత్రులగు యోహాను, యాకోబులు యేసును సమీపించి "బోధకుడా! మాదొక మనవి. అనుగ్రహింపుడు" అని వేడుకొనిరి. యోహాను యాకోబులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరుకుంటున్నాను. వీరు మాత్రమే ఎందుకు ప్రభువును అడుగుతున్నారు? మిగిలిన వారు ఎందుకు అడుగుట లేదు అని ఆలోచిస్తే ఒక విషయం అర్ధం అవుతుంది. వీరు ఇరువురు మరియు   పేతురు  మిగిలిన శిష్యులకంటే ఎక్కువ సమయం ప్రభువు సాన్నిధ్యంలో ఉండేవారు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అంటే ప్రభువు పేతురు, యాకోబు యోహానులను తీసుకొని ప్రార్ధించుటకు ప్రత్యేకంగా పోవటం మనం సువిశేషంలో గమనించవచ్చు. ఎవరు అయితే ప్రభువుతో ఎక్కువసేపు ఉంటారో, లేక ఆయనతో సాన్నిహిత్యం ఎక్కువ ఉంటుందో వారు ప్రభువును కోరుకునే విషయాలను  గమనించినట్లైతే,, వీరి కోరికలకు, సాధారణంగా ప్రభువును వారి అవసరముల కొరకు వచ్చి కలిసిన వారి కోరికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పేతురు గారు ప్రభువుతో కలిసి తాబోరు పర్వతం మీద ఉన్నప్పుడు ప్రభువుతో  మనము ఇక్కడే ఉందాము అని అంటున్నారు.  యేసు ప్రభువుతో ఎక్కువ సాన్నిహిత్యం కలిగిన ఎవరు అయినా కానీ వారి మాటలు, కోరికలు ప్రభువుతోనే ఉండుటకు, ఆయనతో గడుపుటకు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాయి. సమరియా స్త్రీ కూడా ప్రభువుతో ఆధ్యాత్మిక విషయాల గురించే ఎక్కువగా మాట్లాడింది.  అందుకు  కారణము  ఏమిటిఅంటే ఆయనను వారు చాలా దగ్గరగా చూసారు. దాని ద్వారా అయన గురించి వారికి ఎక్కువగా తెలుసు. ఆయన వారికి ఇహలోకమైనవి కాకుండా పరలోకమునకు సంబందించిన  వాటిని కూడా ఇవ్వగలడు అని వారు తెలుసుకున్నారు. ప్రభువు నుండి మనము పొందాలనుకునేవాటిని పొందుటకు మనం తగిన విధంగా సిద్దపడినట్లైయితే ప్రభువు మనకు వాటిని ప్రసాదిస్తారు.  పేతురుగారు కూడా అయన గురించి తెలుసుకున్న తరువాత అందరు నిన్ను వదలిపెట్టిన నేను నిన్ను వదలి పెట్టను అని అంటున్నారు , కాని  ప్రభువును వదలి పెట్టకుండ ఉండుటకు తగిన విధంగా పేతురు సిద్దపడలేదు. 
"నేను మీకేమి చేయగోరుచున్నారు?" అని వారినడిగెను. వారు "మీరు మీ రాజ్యములో మహిమాన్విత  సింహాసనము పై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు" అని ప్రార్ధించిరి.  నేను మీకేమి చేయగోరుచున్నారని ప్రభువు వారిని అడుగుతున్నారు. వారు వెంటనే ప్రభువు రాజ్యంలో  ఆయన మమహిమాన్విత సింహాసనమున ఆసీనుడైనప్పుడు  ప్రభువు కుడి ఎడమల ప్రక్కన ఆసనములను అడుగుతున్నారు. వారికి ఎక్కడ నుండి ఈ ఆలోచన వచ్చి ఉండవచ్చు? ప్రభువు అనేకసార్లు పరలోక రాజ్యం గురించి చెప్పేవారు. చెప్పడం మాత్రమే కాక, దానిలోనికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తున్నారు. అనేక ఉపమానాలద్వారా కూడా ప్రభువు వారికి చెప్పారు. ప్రభువు మాటలను శ్రద్ధగా వీరు ఆలకించేవారు. ప్రభువు మాటలు విని పరలోక రాజ్యం మీద మక్కువ పెంచుకున్నారు. వీరికి ఐచ్చిక కోరికల కంటే పరలోకం మీద కోరిక కలిగేలా ప్రభువు చేశారు. దానిని పొందటమే కాదు, ప్రభువు ఇరుప్రక్కల ఉన్నత ఆసనములు కావాలని వీరు కోరుకుంటున్నారు. ప్రభువు మాటలు శ్రద్దగా ఆలకించిన ప్రతివారు ప్రభువును పరలోకం పొందడం గురించే అడిగారు. సమరియ స్త్రీ, పేతురు, నీకొదేము మొదలగువారు ఒకరకంగా ప్రభువుతో ఉండుటకు ఎక్కువగా   ఇష్టపడ్డారు లేక   ప్రభువు రాజ్యంలో స్థానము కోసం ఆశ పడ్డారు. యేసు ప్రభువు ప్రక్కన సిలువ వేయబడిన మంచి దొంగవాడు కూడా పరలోక రాజ్యంలో స్థానం అడిగారు. యాకోబు యోహానులు కేవలం పరలోక రాజ్యంలో స్థానం మాత్రమే కాదు  ఆయన కుడి ఎడమల ఆసనములను వారు అడిగారు. 
"మీరు కోరున దేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?" నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరా?" అనెను. యేసు ప్రభువు యాకోబు యోహానుల వేడుకోలును మీరు కోరునది ఏమో మీకు తెలియదు అని చెబుతున్నారు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని ప్రభువు వారితో అంటున్నారు. ఎందుకంటే ప్రభువు పొందబోయే శ్రమల స్నానము ఎంతో కఠినమైనది. అది భారంతో కూడినది. లోకపాపభారమునంతటిని మోసేటువంటిది. అందుకు వీరు ఎంతగానో సిద్ధపడాలి. కేవలం మేము చేయగలం  అని అన్నంత మాత్రమున వారు దానికి సిద్దమైనటువంటి వారు ఏమి కాదు. పేతురుగారు ప్రభువుతో వీరు అందరూ నిన్ను వీడిన  నేను మాత్రము నిన్ను వీడను  అని అన్నారు. కానీ ప్రభువు కష్టంలో ఆయనకు తోడుగా ఉండలేకపోయారు. మీరు పానము చేయు పాత్రము నుండి మేము పానము చేస్తాము అని వీరు అంటున్నప్పటికీ, వీరు ప్రభువుతో ఉండలేకపోయారు. తరువాత ప్రభువు నిమిత్తమై వారు  శ్రమలు అనుభవించారు. పరలోక రాజ్యంలో ప్రభువు తరువాత స్థానమును అడుగుతున్నారు  దానికి సరైన సిద్ధపాటు ఏ వ్యక్తి ఐన కలిగిఉన్నాడా?.  అది దేవుడు ఇచ్చేదే కానీ దానికి అర్హులు ఎవరు అని తండ్రి గుర్తిస్తారు. దానిని పొందుటకు ప్రభువు మార్గమును తెలియజేస్తున్నారు. ఆమార్గము ఏమిటంటే  ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెనని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇది పరలోక రాజ్యంలో గొప్పవానిగా కావాలనుకొనేవారు చేయవలసినది. ప్రభువు మనలను ఆయన వలె మారమని అడుగుతున్నారు. ఇది ఈనాటి సువిశేష సారాంశము. ప్రభువు రాజ్యంలో చేరాలన్న, ఆయన కుడి ఎడమల ఉండాలన్న మనము ఎంత వరకు ప్రభువు వలె మార్పు చెందాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. కనుక ఆయన వలె మార్పు చెందుటకు కావలసిన అనుగ్రహం కోసం ప్రార్ధించండి. ఆమెన్ 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...