పేజీలు

23.10.22

ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? (లూకా 18:9-14)

 ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు?

లూకా 18:9-14

పిమ్మట యేసు తాము నీతిమంతుల మనియు, తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను: “ప్రార్ధనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు. మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను ‘ఓ దేవా!నేను ఇతరులవలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను ఈ సుంకరివంటివాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు రెండుమారులు ఉపవాసముందును. నా ఆదాయము అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను’ అని ప్రార్థించెను. కాని సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ‘ఓ దేవా!ఈ పాపాత్ముని కనికరింపుము’ అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగ పరిగణింపబడి , ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తనను తాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడును.

 ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేషంలో ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అనే ప్రశ్నకు జవాబును చూస్తున్నాము. మనము మనకై   దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మన యొక్క శక్తి సామర్ధ్యలు అందుకు సరిపోవు. దేవుని దయ, కృప చాలా అవసరము, వాటి ద్వార మాత్రమే ఇది సాధ్య పడుతుంది. అప్పుడు ఎవరికి, ఎటువంటి వారికి దేవుడు ఈ అనుగ్రహం దయ చేస్తారు? ఈ అనుగ్రహం పొందేవారు ఎలా ఉండాలి? అనే విషయాలను  మనం ఈనాటి సువిశేషంలో చూస్తున్నాము. ఈ అనుగ్రహాన్ని ఇవ్వడానికి మననుండి ఎటువంటి ప్రవర్తనను ఆయన ఆశీస్తున్నారో ఈ సువిశేషం ద్వారా తెలియజేస్తున్నారు.  

ఎటువంటి ప్రవర్తనను దేవుడు మన నుండి కోరుకోరు అనే ప్రశ్నకు పరిసయ్యుని యొక్క ప్రార్థనలో  మనం  సమాధానం చూస్తున్నాము. మనలను మనం పొగుడుకున్నప్పుడు దేవుడు దానిని అంగీకరించడు. ఇద్దరు దేవాలయానికి ప్రార్ధనకు  వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. “పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను ‘ఓ దేవా!నేను ఇతరులవలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను ఈ సుంకరివంటివాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు రెండుమారులు ఉపవాసముందును. నా ఆదాయము అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను’ అని ప్రార్థించెను.”   పరిసయ్యుని ప్రార్థన మనకు అతను  గర్విష్టి అని మరియు అహంకారి అని మరియు ఇతరుల తప్పులేన్నే వాడని తెలియజేస్తుంది. అంతేకాదు తాను చేసే ప్రతి పనిని పొగుడుకుంటున్నాడు. అతని ప్రార్థన దేవుని ఆనందింప చేయలేదు. 

దేవుడు పరిసయ్యుని నుండి ఏమి కోరుకున్నాడు?

ఇతను చెప్పేనటువంటివి అన్ని నిజమే కాని వీటి కంటే కూడా ముఖ్యమైనది ఏమిటి అంటే దేవుడు ఆయన నుండి ఆశించినది ఏమిటి? అంటే ఇతను దేవుని ప్రతినిధి వలె ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఏ విధంగా దేవునికి ప్రతినిధిగా ఉండాలి అంటే దేవుని ప్రేమ కరుణ , లోభి తనంలో ఉన్న వారికి , వ్యభిచారులకు , అన్యాయము చేయువారికి కూడా దేవుని కృప చూపించడంలో ఇతను దేవుని ప్రతినిధి వలె ఉండాలి. యూదుల ఆచారాలకు సంభందించి మిష్నఅనే ఒక నియమావళి ఉండేది. దానిలో ఒక వ్యక్తి మత పరమైన నాయకుడు కావాలి అంటే అతను వారానికి రెండు సార్లు ఉపవాసం చేయాలి, తనకు వచ్చిన ఆదాయంలో 10 శాతం దేవాలయానికి ఇవ్వాలి. తాను మత నాయకుడు కావడానికి ఇవ్వన్ని చేస్తున్న, మత నాయకుడు అయ్యేది దేని కోసం, దేవుని గురించి తెలియ జేయడం కోసం.  మరి ఎందుకు ఆయన ప్రతినిధిలా దేవుని కరుణను, కృపను ఆ సుంకరికి చూపించడంలో విఫలం అవుతున్నారు, దానికి కారణం ఏమిటి అంటే  దేవున్ని సరిగా అర్ధం చేసుకోక, అధికారం అంటే కేవలం ఇతరుల మీద పెత్తనం అనుకోవడం వలన, పాపంలో ఉన్న వారి పరిస్థితులను అర్ధం చేసుకోలేక పోవడం వలన వారిని హేళన చేస్తామే కాని వారిని దేవుని వద్దకు తీసుకురావడానికి మనము ఏమి చేయడం లేదు. ఇక్కడ పరిసయ్యుడు అదే చేస్తున్నాడు.    

ఈ ఉపమానము  యేసు ప్రభువు తమను తాము నమ్ముకునేవారు, తాము నీతిమంతులము అనుకునేవారు, మిగిలిన వారిని పాపులుగా పరిగణించేవారి గురించి  చెప్పడం జరిగింది. మేము నీతిమంతులము లేక మాలో ఏ తప్పు లేదు అని అనుకునే ప్రతి వ్యక్తికి, ఇతరులు చేసే ప్రతి పనిని తప్పు పడుతూ, మేము మాత్రమే మంచి వాళ్ళము అనుకునే వారికి అందరికి చెప్పబడిన ఉపమానం.

ఈ ఉపమానం మనకు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది. అవి ఏమిటి అంటే , దేవుని కృప,  దయ మీద కాకుండా మన స్వశక్తి మీద నమ్మకం ఉంచి మనం మాటలాడుతున్నామా? మిగిలిన వారిని విమర్శించకుండా మనం జీవిస్తున్నామా? లేక ఇతరులు చేసిన పనులను మనం విమర్శిస్తూ వారు  ఇటువంటి వారు, వీరు ఇటువంటి వారు అని అనుకుంటున్నమా? ఒక సారి లోతు భార్యకు ఏమి జరుగుతుందో చూడండి. ఆమె ఇతరులకు ఏమి అవుతుందో చూడాలి అని అనుకున్నది, ఒక ఉప్పు స్తంభంగా మారిపోతుంది. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటే మనం మన పనులను , మన కర్తవ్యాన్ని మరచిపోతాం, మరియు మనల్ని మనం కోల్పోతాము.  దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో నీ గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను నిందిస్తున్నమా? పరిసయ్యుడు యూదుయా ప్రజలలో అత్యంత భక్తి  విభాగానికి చెందిన వాడు, సుంకరి అత్యంతగా తిరస్కరణకు, ప్రజల అయిష్టతకు కారణమయిన పని చేస్తున్నటువంటి  వాడు.  

అసలు ఎవరు ఈ పరిసయ్యులు అని ఒక సారి మనం ఆలోచించినట్లయితే, వీరు ఆనాటి సమాజంలో విశ్వాస జీవితానికి మరియు భక్తియుతమైన జీవితానికి  కారకులు, దేవుని చట్టమును పూర్తిగా అవగాహన చేసుకొని పాటిస్తున్నటువంటి వారు. యేసు ప్రభువు కాలంలో పరిసయ్యులు నిజముగా గొప్పవారు. వారి భక్తి కావచ్చు లేక వారు చేసే పనులు కావచ్చు ఇవన్నీ చాల గొప్పగా ఉండేవి. వారిని అందరు గొప్పవారుగా గౌరవిస్తూ వుండేవారు. వారి మత పరమైన ఆచార వ్యవహారాలు అందరికి ఆసక్తి దాయకంగా మరియు ఇతరులకు  ఇంత కష్టతరమైన జీవితాలు సాధ్యం కాదేమో అనేలా వారు జీవించేవారు.  జీవిస్తే వీరిలా  జీవించాలి అనే కోరికను పుట్టించే విధంగా ఉండేవి. వారి నైతిక జీవితం కూడా అంతే గొప్పగా ఉండేది. వారు రోజులో గంటల తరబడి ప్రార్థన చేసేవారు. వారానికి రెండు సార్లు ఉపవాసం చేసేవారు. పవిత్రత మరియు ధర్మ శాస్త్రాలతో  వారి జీవితం అంత ముడి పడి ఉండేది. మిగిలిన ప్రజలు వీరిలా జీవించడం మనకు సాధ్యపడదు అనే ఆలోచనలో ఉండేవారు. ఒక యుదుడు  ఎవరైన పరలోకంలో ఉన్నాడు అంటే అది పరిసయ్యుడై ఉండాలి అనుకునేవాడు. 

సుంకరులను ఎందుకు నీచులుగా చూసేవారు 

సుంకరులు రోమియులకు పని చేస్తూ, యూదులను పన్నులు అడుగుతూ , యూద సమాజ ద్రోహులుగా పరిగణించబడినవారు. వీరు వారి సొంత ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేసి రోము సామ్రాజ్యానికి పంపేవారు. సంవత్సరానికి ఇంత పన్ను అంటూ వారికి రోమా సామ్రాజ్యం నుంచి ఆదేశాలు ఉండేవి అవి చెల్లించిన తరువాత మిగిలినవి వీరు వారు ధనవంతులు కావడంకోసం వసూలు చేసేవారు.  అందుకే వీరిని ప్రజలు  ద్రోహులుగా చూసేవారు. ప్రజలు వారిని అనేక రకాలుగా అసహ్యంగా చూసేవారు. వారు వారి సొంత దేశాన్ని మోసం చేశారు అని భావించేవారు . వారు ఎక్కువ పన్నులు పేదల దగ్గర పన్నులు వసూల్లు చేసి   ధనవంతులుగా ఎదిగారని వారిని అసహ్యించుకొనేవారు. యూదయ చట్టం మిష్ణ ప్రకారం వారు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి అర్హులు కారు. ఎందుకంటే వారు అబద్ధికులని అందరు పరిగణించేవారు. వీరిని ఒకరకంగా అంటారనివారిగా చూసేవారు. వీరిని దొంగలు హంతకులను చుసినట్లు చూసేవారు. వారిని కుటుంబానికి ఒక అమంగళంగా చూసేవారు. ఎవరైన దేవుని రాజ్యం బయట ఉన్నారు అంటే అది మొదటగా ఒక సుంకరి అని అనుకునేవారు.అటువంటి ఒక సుంకరి దేవుని దృష్టిలో నీతిమంతునిగా పరిగణించబడటం ఏమిటి? ఎందుకు దేవుడు అతనిని నీతి మంతినిగా చూస్తున్నాడు? వారు చేసిన ప్రార్ధన వారి మనస్తత్వాన్ని, ఎందుకు దేవుడు పరిసయ్యున్ని అంగీకరించ లేదో చెబుతుంది. 

ప్రార్ధనలు

పరిసయ్యుడు నిలుచొని ఈ విధంగా ప్రార్థించాడు. దేవా నేను ఇతని లాంటి వాడిని కానందుకు కృతజ్ఞతలుఅవినీతి పరుడును కానువ్యభిచారిణి కాను. నేను వారానికి రెండు సార్లు ఉపవాసం చేసెదను నాకు వచ్చిన ప్రతి దానిలో నేను మీకు పదవ వంతు చెల్లిస్తున్నాను. కాని సుంకరి దూరముగా నిలువబడి తన కళ్లను కూడా ఎత్తుటకు సాహసించక తన రొమ్ము బాదుకొనుచు దేవా ఈ పాపిని కరుణించుము అని ప్రార్థిస్తున్నారు. పరిసయ్యుడు ప్రార్ధనను చాలా భక్తితో ప్రారంభించాడు కాని వెంటనే అది తనను తాను పొగుడుకునే వేదిక అయ్యింది. తనను గురించి  తాను రెండు వాక్యాలలోనే  5 సార్లు చెప్పుకున్నాడు. కాని ఇవ్వి ఏమి ఆయనను గొప్ప వాడిని చెయ్యవు. తనను తాను మంచి వాడిని అని అతను అనుకుంటున్నాడు. ఒకడు తనను తాను పొగుడుకున్నట్లయితే అది అతనికి వున్న గర్వం మరియు అహంకారంతోటి మాత్రమే అటువంటి మాటలు వస్తూ  ఉంటాయి. తాను చేసే ప్రతి పనిని ఆయన సమర్ధించుకుంటున్నాడు. తనకు ఉన్న క్రమ శిక్షణను కూడా తాను చేసిన గొప్ప పని అనుకుంటున్నాడు. తన కుటుంబ జీవితం కూడా తన గొప్పతనం అన్నట్లుగా ఉంది. అతను సుంకరిని కించ పరుస్తూ నేను ఇతని లాంటి వాడిని కాదు అని చెబుతూ తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. 

ఇతను మొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుతూ మొదలు పెట్టాడు. కాని తనను పొగుడుకొనుటతోటి ప్రార్థన ముగిస్తున్నాడు. దేవునికి తాను కృతజ్ఞత తెలియచేసేది పరిసయ్యుడుకి  ఉన్న సుగుణాల గురించి కాదు , సుంకరిలా లేనందుకు.  పరిసయ్యుడు తనను ఇతరులతో పోల్చుకొని గొప్పవాడిని అనుకుంటున్నాడు. అతను దేవునితో పోల్చుకోవడం లేదు. లేక దేవుని వాక్కుతోటి పోల్చుకోవడం లేదు. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే అతను తనను తాను తగ్గించుకోవాలి అని అనేక సార్లు యేసు ప్రభువు చెప్పారు, దేవుని వాక్యము గొప్పతనం గురించి ఏమి చెబుతుందో తెలుసుకొని ఎవరితో పోల్చుకోవాలో తెలుసుకున్నట్లయితే అతడు ఎంత గొప్పవాడో తెలిసేది. అప్పుడు మాత్రమే నిజమైన గొప్పతనం తెలుస్తుంది. ఇతను చివరికి తనతో పాటు ఉన్నటువంటి ఉన్నత జీవిత విధానానికి సంబంధిచిన వారితో కూడా పోల్చుకోవటం లేదు. అతను సమాజంలో అధమునిగా పరిగణించిబడే ఒక వ్యక్తితో పోల్చుకుంటున్నాడు. మరియొక పరిసయ్యునీతో కూడా పోల్చుకోవడం లేదు. అంతే కాకుండా ఆయన ఏమేమి చేయలేదో, ఎటువంటి పాపం చేయడం లేదో దానికి గురించి చెపుతున్నాడు. కాని దేవుని ప్రేమను పంచడం కోసం ఏమి చేసాడో చెప్పడం లేదు. ఇతను ఎంత గర్వంతో ఉన్నాడు అంటే ఇతరులు  చేసే ప్రతి పనిని  గురించి ఆలోచిస్తూ వారిని   అల్పులు అని కేవలం అతను మాత్రమే గొప్పవాడు అని  అనుకుంటున్నారు.

 ఎప్పుడైతే ఒక వ్యక్తి తనే గొప్పవాడను అని అనుకుంటాడో, అతను ఇతరుల మంచిని చూడలేడు అంతేకాదు తాను తప్ప ఇతరులు మంచి వారు అంటే ఒప్పుకోలేడు. ఇటువంటి వారు  తమ కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూడలేరు. తనను ఇతరులతో పోల్చుకున్న తరువాత తనని తాను పొగుడుకుంటూ తనను తాను ఆరాధించు కొంటున్నారు. ఆయన వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తాను అని అంటున్నాడు. కాని లెవీయ కాండం  16:29 ఒకసారి మాత్రమే  ఉపవాసం చేయమని అడుగుతుంది. ధర్మ శాస్త్రం అతని పంటలలో , ఉత్పత్తిలో మాత్రమే 10 శాతం అడుగుతుంది. కాని ఇతను ఆదాయంలో 10 శాతం ఇస్తున్నాడు. యేసు ప్రభువు ఇతను ఒక అహంకారి అని  తనకు తాను నీతిమంతుడని చెబుతున్నాడని  అంటున్నాడు. దేవునికి అహంకారం , గర్వం ఉన్న వారు నచ్చరు.సామెతలు 6: 16-19  వచనాలలో మనం ఇదే చూస్తూ ఉంటాము. సోలోమోను దేవునికి నచ్చని 6 విషయాల గురించి మనం వింటాం. అవి గర్వం తోనే మొదలవుతాయి.

 వినయము యొక్క ఔన్నత్యం

దేవుడు మనము   ఎప్పుడు వినయంతో ఉంటామో అప్పుడే  మనలను అనుగ్రహిస్తాడు. ఇదే మనం లూకా 18:13-14 లలో చూస్తున్నాము. అందుకే ఆ సుంకరిని దేవుడు నీతిమంతునిగా పరిగణిస్తున్నాడు. సుంకరి దూరముగా నిలుచొని తన కన్నులనైనా పైకి ఎత్తుటకు సాహసించక తన రొమ్ము బాదుకుంటూ నన్ను క్షమించు, నా మీద దయ చూపించండి అని వేడుకుంటున్నాడు. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. పరిసయ్యుని వలె సుంకరి కూడా ప్రార్ధన చేస్తున్నాడు, కాని అతని ప్రార్ధన విధానం వేరుగా ఉంది. ఎంతో  వినయంతో ఉన్నాడు, అంతే కాక తాను క్షమాపణ కోరుకుంటున్నాడు. దేవాలయం రావడం అతనికి తెలుసు కాని ఆయనకు  అక్కడ ఉండటానికి  అర్హత లేదని తెలుసు. తన గురించి గొప్పగా ఏమి అతను చెప్పుకోవడం లేదు.  తన రొమ్ముల మీద బాదుకుంటున్నాడు. ఎందుకు అంటే  అక్కడ హృదయం ఉంది. దాని నుండి అన్నీ రకాల చెడు గుణాలు వస్తున్నాయి. తాను ఘోర పాపిని అని అతను గుర్తిస్తున్నాడు.  హృదయం మీద బాదుకోవడం వలన తన పాప కారణమైన హృదయాన్ని శిక్షించుకుంటున్నాడు.  ఈ సుంకరి ఇతరుల గురించి అసలు ఏమి అనుకోవడం లేదు. వీరి  ఇద్దరిలో ఎవరు నీతిమంతుడు అని అడిగితే యేసు ప్రభువు  సుంకరి అని చెబుతున్నాడు.

 మనం  ఎలా ఉన్నాము? పరిసయ్యుని వలె ఉన్నమా? అందరినీ తప్పు పడుతూ, వారి వలె ఉండనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నమా? లేక  మన తప్పులను తెలుసుకొని ఇతరులను నిందించకుండా జీవిస్తున్నమా? ఇక్కడ  మన  వినయానికి దేవుడు పట్టం కడుతున్నాడు.  అహంకారిని శిక్షిస్తున్నాడు. కాని ఈ లోకం వినయాన్ని ఎప్పుడు  ఒక చేతకాని తనంగా చూస్తుంది. పరిసయ్యులు తమ సొంత నీతివంతమైన జీవితం ద్వారా వారు దేవుని దగ్గరకు రావచ్చు అని అనుకుంటున్నారు. ఈ ఉపమానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అహంకారాన్ని, స్వీయ ప్రకటిత నీతిమంతులను దేవుడు కోరుకోవడం లేదు అని తెలియజేస్తుంది.  తనను తాను తగ్గించుకునే వారు దేవునికి ప్రీతి కలిగినవారు అని చెబుతుంది. సుంకరి తాను పాపం చేసానని  తన హృదయాన్ని బాదుకోవడం మనం చూస్తున్నాము, హృదయము నుండే పాప కారణమైన అన్ని ఆలోచనలు వస్తుంటాయి. కనుక హృదయాన్ని బాదుకొనుచున్నాడు. ప్రార్థన ఒక వినయాత్మ హృదయంతో మనం అర్పించాలి. వినయం యేసు ప్రభువును మెప్పించే ఒక సుగుణం.

 ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు?

ఎవరు అయితే తమను తాము నీతిమంతులమని భావిస్తూ మిగిలిన వారు నీతిమంతులు కారు అనే వారిని హెచ్చరిస్తూ చెప్పిన ఉపమానం ఇది. ఇక్కడ మనం పరిసయ్యుని గురించి అతను స్వయం ప్రకటిత నీతిమంత జీవితం గురించి మనం చెప్పుకుంటున్నాము.  కాని మన అందరిలో ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఇతరులను నిందించే మనస్తత్వం ఉంది, మన సొంత నీతి, మంచి  మీద మనం ఎక్కువ నమ్మకం కలిగి ఉంటాము. మనకు ఎప్పుడు మనం మంచివారిగానే కనపడుతాము, ఇతరులు మాత్రం మంచి వారు కాదు అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. మనము పాటించే నియమ నిబంధనలు మనలను అహంకారులను చేయకూడదు. నిజమైన వినయం మనకు కలిగించాలి. పునీత ఆవిలా పురి తెరేజమ్మకు వినయం అంటే నిజమైన ఆత్మ జ్ఞానం అంటే నన్ను గురించి నేను తెలుసుకోవడం. నన్ను గురించి నేను ఎప్పుడైతే నిజముగా తెలుసుకుంటానో అప్పుడు నాలో నన్ను నేను పొగుడుకునే అంత గొప్పతనం లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే నేను దేవుని యొక్క కానుకనే, మరియు ఆయన యొక్క దయ ఫలితమే అని తెలుసుకుంటాను. క్రైస్తవ జీవితం దేవుని దయతోనే మొదలవుతుంది. ఇది ఎలా మొదలాయిందో అలానే కొనసాగుతుంది. 

ఎవరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు? ఒక సమాధానం నీ మీద  నివు నమ్మకం వుంచుకోవడంతో  దానిని సాధించుకోవడం ఒక విధానము  కాని క్రైస్తవం చెప్పేది ఏమిటి అంటే నిన్ను నివు నమ్ముకోవడం ఆపి దేవుని దయ మీద నమ్మకం వుంచమని చెపుతుంది. అప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...