పేజీలు

27.10.22

జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట (లూకా 19: 1-10 )

 జక్కయ్య యేసు ప్రభువు కలుసుకొనుట 

లూకా 19: 1-10 

యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దానిగుండ వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలెనని యత్నించేను. కాని పొట్టివాడగుటచేతను, జనసమూహాము  ఎక్కువగా ఉండుటచేతను  చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగుదీసి , దారిన పోవనున్న యేసును చూచుటకై, ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి , అతనితో "జక్కయ్య! త్వరగా దిగిరమ్ము. దినము నేను నీ ఇంటిలోనుండ తలంచితిని" అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరు "ఈయన పాపియొద్దకు అతిధిగా వెళ్ళెను" అని సణుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, "ప్రభూ! నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును" అని చెప్పెను. అందుకు యేసు "నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయన, ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు"అని అతనితో చెప్పెను.  

ఎవరు జక్కయ్య ?

జక్కయ్య అంటే నీతిమంతునిగా పరిగణింపబడినవాడు అని అర్ధం. మొదటిగా తన పేరుకు తగిన వాడిగా జీవించకపోయినప్పటికి తరువాత తన నామ సార్ధకం చేసుకున్నవాడు.   అతను ఒక  సుంకరి, మరియు ధనవంతుడు.  అనేక మంది సుంకం వసూలు చేసే వారికి ఒక అధిపతి లాంటి వాడు. అటువంటి వాడు యేసు ప్రభువుకోసం తన ధనం దానం చేసినవాడు. ఆస్తి అంతస్తులు కోసం మోసం చేయడం, ఎక్కువ పన్నులు వసూలు చేయడం వృత్తిగా ఎంచుకున్న వ్యక్తి. కాని తన ఆస్తిపాస్తులను తృణప్రాయంగా యేసు కోసం వదులుకున్నాడు.  అంటే యేసు ప్రభువును అతను ఎంతగా అభిమానించాడో, ప్రేమించాడో  మనం తెలుసుకోవచ్చు, ఊహించవచ్చు.    జక్కయ్య యేసుప్రభువును కలుసుకోవడానికి, ఆయన మాటలను వినటానికి  తనకు వచ్చే అన్ని ఆటంకములను అదిగమించి, ధృడ నిశ్చయంతో యేసు ప్రభువును చూసిన వ్యక్తి, యేసు ప్రభువు తన ఇంటికి వస్తాను అనగానే ఎంతో ప్రేమగా విందు తన ఇంటికి  తీసుకువెళ్లాడు. తనకు తన కుటుంబమునకు రక్షణ తెచ్చుకున్నాడు. తన జీవితంలో యేసు ప్రభువు కంటే ఏమి గొప్పది కాదు అని,  తన దాతృత్వాన్ని బాహాటంగా ప్రకటించిన వ్యక్తి.  తన ఆస్తిని ఇతరులకు  దానం చేసిన వ్యక్తి. కాని మొదటి నుండి ఆయన అటువంటి వాడు కాదు. యేసు ప్రభువు రాకతోటి తన జీవితాన్ని మార్చుకొని యేసు అనుచరునిగా జీవించిన వ్యక్తి.

యెరికో పట్టణ ప్రాముఖ్యత ఏమిటి?

యేసు ప్రభువు యెరికో పట్టణము మీదుగా యెరుషలేము వెళుతున్నారు. యేసు ప్రభుని చివరి ప్రయాణం ఇది. ఆయన యెరుషలేము పోవాలనే నిర్ణయంతో ఉన్నారు. అక్కడ రక్షణ కార్యాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకొని వున్నారు. మరల ఇక్కడకు రాకపోవచ్చు. యెరికో యెరుషలేముకు సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కనుక త్వరగా అక్కడనుండి వెళ్ళాలి అని  ప్రభువు అనుకొనుచున్నాడు. యెరికో నగరమునకు   యేసు ప్రభువు వచ్చారని తెలుసుకొని చాలా మంది అక్కడకు వచ్చారు, వారిలో ఒకరు జక్కయ్య అనే ఒక సుంకరి.

ఏమిటి యెరికో యొక్క ప్రాముఖ్యత అంటే అది యిస్రాయేలు మొట్ట మొదటిగా కైవసం చేసుకున్న వాగ్దాన భూమిలో భాగం. ఇక్కడ నుండి వారు మిగిలిన ప్రాంతమును కైవసం చేసుకున్నారు. యేసు ప్రభువు కాలంలో కూడా ప్రాంతం చాలా ముఖ్యమైనది. ప్రాంతం వేసవి కాలంలో రోమా పౌరులలో ధనవంతులకు నగరం విడిది ప్రదేశంగా ఉండేది. వాణిజ్య పరంగా యెరికో చాలా ముఖ్యమైన పట్టణం ఎందుకంటే జేరికో నుండే , అక్కడ ఉన్నటునవంటి ఓడరేవు ద్వారా ఎన్నో రకాలుగా ఉత్పత్తులను ఎగుమతి చేసేవారు.  మరియు అక్కడ ఉన్నటువంటి మూడు ప్రధాన పన్నులు వసూలు చేసే కేంద్రాలలో యెరికో ఒకటి. ఇక్కడ ఉండేటువంటి జక్కయ్య పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి సుంకరులకు నాయకుడు. మరియు పట్టణములోని ఒక ప్రముఖ ధనవంతుడు, ఆవిధంగా ఆయన యెరికోలో ప్రముఖుడు.   యెరికో చాలా ముఖ్యమైన గొప్ప నగరముగానే కాక యిస్రాయేలు చరిత్ర ప్రకారముగా కూడా ముఖ్యమైనది కనుక  వారు ఎలా మొదటగా వాగ్ధాన భూమిలో అడుగుపెట్టి యెరికోలో మొదటి విజయం పొందారో యేసు ప్రభువు మొదటిగా యెరుషలేములో రక్షణ కార్యం పూర్తి చేసేముందుగా, ఒక తప్పి పోయిన వానిని వెదకి రక్షించడం ద్వారా తాను లోకంలోనికి వచ్చిన పనికి  యెరుషలేము వెళ్ళే ముందుగానే మొదటి విజయమును జక్కయ్య రక్షణ ద్వారా చూస్తున్నారు.   

ఒక సుంకరికి ప్రజలు ఇచ్చే గౌరవం ఏమిటి

సుంకరి యేసు ప్రభువు దగ్గరకు రావడం చాలా  అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే అతడు పన్నులు వసూలు చేసేవాడు. ప్రజలు అందరు యేసు ప్రభువును చూడటానికి , ఆయన మాటలు వినడానికి వస్తుంటారు. అప్పుడు అక్కడ సుంకరిని చూసినట్లయితే వారిని అగౌరవంగా చూస్తారు. కనుక చాలా అవసరం అయితేనే వారు ఇతరులను కలవడానికి , మరి ముఖ్యంగా పది మందిలో కలవడానికి సిద్ధపడుతారు తప్ప అవసరం లేకుండా ఎవరిని కలువరు.  సుంకరులు సాధారణంగా ధనికులు, ఆస్తిపాస్తుల కోసం ఎటువంటి పనులనైన చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. సంపాదనే ధ్యేయంగా జీవించే ఒక వ్యక్తులు. వీరిని దేశద్రోహులుగా చూసేవారు, వీరు రోమా సామ్రాజ్యం తరుపున  చాలా కఠినముగా పన్నులు వసూలు చేసేవారు, పేదవారు , విధవరాలు అని కూడా చూడకుండా, దయకనికరం లేకుండా పన్నులు వసూలు చేసేవారు. రోమా సామ్రాజ్యం వారికి ఎంత వసూలు చేయాలో ముందుగా ముందుగానే వారికి ఒక లక్ష్యం పెడుతుంది. ఇది వారు ముందుగానే కత్తి తరువాత వారికి ఇష్టమైన విధంగా  వారు వసూలు చేస్తూనే వుండేవారు. విధంగా వీరు ధనికులు అయ్యారని ప్రజలను పీడిస్తున్నారని , వీరి మీద ప్రజలకు కోపం ఉండేది.  అటువంటి ఒక వ్యక్తులకు నాయకుడు అయిన జక్కయ్య యేసు ప్రభువును చూడటానికి వస్తున్నాడు.

ఎందుకు జక్కయ్య యేసు ప్రభువును చూడాలి అని అనుకుంటున్నాడు

జక్కయ్య యేసు ప్రభువు గురించి, ఆయన సుంకరులను కూడా చేరదీయడం గురించి విని వుంటాడు. యేసు ప్రభువు యొక్క అద్భుతాలను గురించి విని ఉంటాడు. తాను కూడా పాపిని అని, తాను ఆయన దగ్గరకు వెళితే, తనను అంగీకరిస్తాడో లేదో, ఒకసారి ఆయన మాటలను విని ఆయనను  కలవడానికి  వెళ్లాలా, లేదా అని నిర్ణయించుకోవడానికి వెళ్ళి వుండవచ్చు. ఒకసారి తనను కలసి తన పాప స్థితి గురించి చెప్పి, తనను క్షమించమని వేడుకోవడానికి వెళ్ళి వుండవచ్చు. తాను దేవుని నుండి దూరముగా ఉన్నాను, ఇక పాప జీవితం జీవించలేను అని తనకు పాప క్షమాపణ ఇవ్వమని అడగడానికి వెళ్ళి ఉండవచ్చు.

జక్కయ్య యేసు ప్రభువును కలువుటకు గల ఆటంకములు ఏమిటి

జక్కయ్య ఇటువంటి ఆలోచనలతో యేసు ప్రభువును కలవాలి అని వెళుతునప్పటికి ఆయన యేసు ప్రభువును వెంటనే  కలవలేక పోతున్నాడు. ఆయనకు చాలా ఆటంకములు ఎదురు అవుతున్నాయి. వాటిలో కొన్ని ఏమిటి అంటే మొదటిగా తన పొట్టితనం పెద్ద ఆటంకం అవుతుంది. జక్కయ్య  పొట్టివాడు కావడం వలన యేసు ప్రభువును చూడటానికి అది పెద్ద ఆటంకం అయ్యింది. తనలో యేసు ప్రభువును చూడాలి అనే ఆశ ఇంకా ఎక్కువ అవడం వలన తన పొట్టితనంను అధిగమించడానికి ఆయన మెడి  చెట్టును ఎక్కుచున్నాడు. తన పొట్టితనమును పట్టించుకోవడం లేదు, దీనిని అధిగమించడానికి ఒక ఆయుధముగా చెట్టును చూస్తున్నాడు. వెంటనే చెట్టును ఎక్కుచున్నాడు. తనకు ఉన్న మరో ఆటంకం ఏమిటి అంటే అక్కడ ఉన్న సమూహం. ప్రజలు అందరు ఒక గుంపుగా ఉండుట వలన, ముందుకు వెళ్లలేక పోయాడు. గుంపులో ఉన్నవారు ఎవరు అంటే వారు కూడా యేసు ప్రభువును చూడాలనుకున్న వారే. వీరు అందరు జక్కయ్య కంటే ముందు ఉన్నారు. అనేక సార్లు యేసు ప్రభువును చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనుకున్నవారు లేక ఆయనతో వున్నవారే ఆయనను కలవటానికి ఇతరులకు ఆటంకం అవుతున్నారు.  ఇంకా ఉన్న ఆటంకములు ఏమిటి అంటే తనకు ఉన్న పేరు ప్రఖ్యాతలు. ఒక వేళ యేసు ప్రభువు దగ్గరకు ఇంత ధనవంతునిగా ఉండి, ఒక సాదారణ వ్యక్తిలా ఆయనను  చూడటం కోసం చెట్లు ఎక్కడం ఏమిటి ? అని ఇతరులు అనుకుంటారు ఏమో అనే భావన కూడా ఒక ఆటంకం. తన బంధువులు స్నేహితులు తన గురించి ఏమి అనుకుంటారో అని ఆటంకం , ఇంకా మనకు కనపడే మరియొక ఆటంకం ఏమిటి అంటే తాను సుంకరి కాబట్టి తనను చూచిన ప్రజలు తనను హేళన చేస్తారు అని ఆయనకు భయం ఉండి ఉండవచ్చు.  ఇవి అన్ని జగ్గయ్యకు ఉన్నటువంటి ఆటంకములే. కాని జక్కయ్య ఆటంకాలు మొత్తం అధిగమించి యేసు ప్రభువును కలుస్తున్నారు.  

మన జీవితంలో యేసు ప్రభువును కలుసుకోవడానికి గల ఆటంకములు ఏమిటి?

మన జీవితములో యేసు ప్రభువును కలువటకు మనకు ఉన్నటువంటి ఆటంకం ఏమిటి అని మనం గుర్తించి దానిని అధిగమించి ఆయనను కలుసుకోవాలి. అది ఎంత వరకు మనం చేశాము. ఒక సారి ఆత్మ పరిశీలన చేసి చూసుకోవాలి. ఆటంకాలను అధిగమిస్తూ ప్రభువును కలుసుకొనుటకు ప్రయత్నించాలి. మనలను ప్రభువు దగ్గరకు పోవుటకు  ఏమి ఆటంక పరుస్తుందో ముందుగా మనం గ్రహించాలి. ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో, అప్పుడు దానిని  అధిగమించుటకు సులువుగా ఉంటుంది. 

జక్కయ్య గొప్పతనం

జక్కయ్య యేసుప్రభువు తన ఇంటికి వస్తాను అని అన్నందుకు చాలా ఆనందపడుతున్నాడు. యేసు ప్రభువును చూడాలి అని మాత్రమే అనుకున్న వ్యక్తికి, చాలా గొప్ప అవకాశం  వచ్చినందుకు దానిని సద్వినియోగం చేసుకోవాలని  జక్కయ్య, ఆయన  ఏమి చేయబోతున్నాడో మొత్తం చెబుతున్నాడు. తన ఇంటికి వచ్చిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు అని ఆయనకు తెలుసు. తనను అందరు అసహ్యంగా చూస్తున్నారు అని తెలిసి,  అటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన యేసు ప్రభువుకు తాను ఎవరినైన మోసము చేసినట్లయితే వానికి నాలుగు రేట్లు ఇస్తాను అని చెబుతున్నాడు. తన ఆస్తిలో సగం పేదవారికి ఇస్తాను అని అంటున్నాడు. తన దగ్గరకు వచ్చినది రక్షకుడు అని, రక్షణ పొందటానికి జక్కయ్య తనను అర్హునిగా చేసుకుంటున్నాడు.

ప్రభువు ఎందుకు లోకానికి వచ్చారు? ఆయన ఏమి చేస్తున్నారు

యేసు ప్రభువును చూచుటకు జక్కయ్య చేసిన అన్ని పనులను ప్రభువు గమనిస్తున్నాడు. అందుకే జగ్గయ్యతో, ‘జక్కయ్య దిగిరమ్ము నేను మీ ఇంట రోజు ఉండదలచానుఅని అంటున్నాడు. “మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు" అని అతనితో చెప్పెను. అంటే యేసు ప్రభువు జక్కయ్య కోసం వచ్చాడు, జక్కయ్య లాంటి వారికోసం వచ్చాడు, నీకోసం నాకోసం వచ్చాడు. “మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు" మాటలు సువిశేష భాగంలోనే కాదు, బైబిల్ మొత్తంలో కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే యేసు ప్రభువు లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశ్యం గురించి చెపుతున్నాయి.  దేవుడు ఎవరో మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మనలను వేదకుతున్నారు, మనలను కనుగొన్నప్పుడు ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు.  దేవుడు వెదకటం ఆరంభిచిన తరువాత మనం ఆయనను వెదకుతున్నాము కనుక ఆయనను వెదికే వారికి ఆయన దర్శనం ఇస్తారు. 

వివేకవంతుడు అవుతున్న జక్కయ్య

జక్కయ్య యొక్క జీవితం ఒకసారి మనం చూడాలి ఎందుకంటే జక్కయ్య యేసు ప్రభువు తన ఇంటికి వచ్చిన తరువాత కొన్ని మాటలు చెపుతున్నాడు. అవి ఏమిటి అంటే నేను ఎవరినైన మోసం చేసినట్లయితే వారికి నాలుగు రేట్లు ఇస్తాను, మరియు నా ఆస్తిలో సగం పేదవారికి ఇస్తాను అని చెబుతున్నాడు. ఎందుకు మార్పు వచ్చింది అతనిలో  అంటే ఆయన ఎప్పటికీ ఊహించని సంఘటన తన జీవితంలో జరుగుతుంది. అది ఏమిటి అంటే అందరిని ఎంతో ప్రేమతో ఆదరించే వ్యక్తి, పాపులను క్షమించే వ్యక్తి, తన లాంటి సుంకరిని మత్తయిని తన శిష్యుడుగా చేసుకున్న వ్యక్తి, అనేక మంది పాపులను క్షమించిన వ్యక్తి , అందరు శిక్షించమని చెబుతున్న కాని, నేను నిన్ను శిక్షించను అని చెప్పిన ప్రభువు, మరణించిన వారిని కూడా మరల జీవమిచ్చిన ప్రభువు, అందరు ఆయనను ముట్టుకున్న చాలు ఆనుకొని చాలా మంది ప్రజలు ఉండగా, కరుణామయుడు నా యింటికి వచ్చాడు అనే ఆనందముతో, మరియు తాను పాపి అని , సుంకరి అని అందరిచేత ద్వేషింపబడే వాడినైన  నా యింటికి ప్రభువు వచ్చాడు అని ఆనందముతో , నాకు ఇక సంపదలు , లోక సౌఖ్యలు అన్నిటికంటే విలువైన ప్రభువు మార్గం కనుగొన్నాను అనే ఆనందముతో జక్కయ్య మాటలు చెబుతున్నాడు. 

పశ్చాతాపం మనలను ఎలా మారుస్తుంది? పశ్చాతాపం మనకు ఎలా కలుగుతుంది?

పశ్చాత్తాపం అంటే హృదయ పరివర్తనం. హృదయ పరివర్తనం మన జీవిత విధానం మరియు, లోకాన్ని మనం చూసే విధానంలో మార్పు తీసుకువస్తుంది. పౌలు గారి జీవితంలో ఇదే జరుగుతుంది, జక్కయ్య జీవితంలో ఈ మార్పు మనం చూస్తాము.   పశ్చాత్తాపం పొందిన ప్రతి వ్యక్తి జక్కయ్యలానే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే పశ్చాత్తాపం మనిషికి ఏది ముఖ్యమో తెలియచేస్తుంది. ఏది విలువైనాదో, ఏది విలువ లేనిదో తెలియజేసి, విలువైన దానిని  పొందడం కోసం ఎంతటి దానినైన  కోల్పోవడానికైనా సిద్ధ పడేలా చేస్తుంది. ఇక్కడ క్రీస్తు కోసం, రక్షణ కోసం తన సంపదను తృణప్రాయంగా భావిస్తున్నాడు జక్కయ్య. ఇది జక్కయ్య యేసు ప్రభువు తనకు ఇచ్చిన రక్షణకు, ప్రేమకు బదులుగా చేస్తున్నాడు. పశ్చాత్తాప పడటం లేక మారు మనస్సు పొందడం అనేది, ప్రతి నిత్యం క్రీస్తుకు అనుకూలముగా మనలను మనము సంస్కరించు కోవడం. క్రీస్తు ప్రేమకు అనుకూలముగా జక్కయ్య తనను తాను సంస్కరించుకుంటున్నాడు. మనకు మార్గం చూపుతున్నాడు. క్రీస్తు ప్రేమకు జక్కయ్య వలె మనము కూడా అదే విధంగా స్పందించాలి. ప్రతి నిత్యం మనల్ని మనం సంస్కరించుకోవాలి.

రక్షణ యొక్క ఫలాలు మన నిజ స్థితిని తెలియజేస్తాయా?

" నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయన, ఇతడును అబ్రహాము కుమారుడే." యేసు ప్రభువు జక్కయ్యను ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని అంటున్నాడు. ఇది జక్కయ్యకు చాలా గొప్ప ప్రశంస.  ఎందుకంటే సుంకరులను యూదులు ఎంత ఘోరముగా చూసేవారంటే హంతకులు, వ్యభిచారులు కంటే సుంకరులే ఘోరమైన పాపులుగా వారినిగా చూసేవారు. అటువంటి వ్యక్తిని యేసు ప్రభువు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని అనటం గొప్ప ప్రశంస. అబ్రహాము కుమారుడు అనడం అనే మాటకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. యోహను సువిశేషంలో 8: 39 వచనంలో యేసు ప్రభువు మీరు అబ్రహాము కుమారులు అయినచో ఆయన పనులే మీరు చేసేవారు అని చెబుతున్నాడు. అబ్రహాము కుమారులు లేక కుమార్తె అంటే మనం ఆయన వలె విశ్వాసం కలిగి, అబ్రహాము వలె దేవునికి చెందిన పనులు, విశ్వాస జీవితపు పనులు చేయడం.  అవి మనలను అబ్రహాము బిడ్డలను చేస్తాయి. ఇప్పుడు జక్కయ్య తన పశ్చాత్తాపం ద్వారం తన ఆస్తిని దానం చేయడం ద్వారా , తాను మోసం చేసిన వారికి  నాలుగు రేట్లు ఇవ్వడం ద్వారా, యేసు ప్రభువు చేత అబ్రహాము కుమారుడు అని అనిపించుకుంటున్నాడు. మనం నిజ జీవితం ఇదే మనం దేవునికి చెందిన వారము. ఆయన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...