పేజీలు

28.1.23

అష్ట భాగ్యాలు

నాలుగవ సామాన్య ఆదివారం 

 మత్తయి 5:1-12 

యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూచేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు దైవ రాజ్యము వారిది.  శోకార్తూలు ధన్యులు వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు వారు భూమికి వారాసులగుదురు. నీతినిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు వారు వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. శాంతి స్తాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బాహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహనందపడుడు. 

యేసు ప్రభువు ప్రసంగాలలో చాలా ముఖ్యమైన ప్రసంగం ఈ అష్టభాగ్యాల ప్రసంగం.  అనేక మందిని ప్రభావితం చేసిన ప్రసంగం మరియు అనేక మంది చేత ప్రశంసించబడిన ప్రసంగం కూడా ఇదే. ఈ అష్టభాగ్యాలు ఒకరకముగా క్రైస్తవుని విధులు, లేక ప్రతి క్రైస్తవుని భాధ్యతలు  అని చెప్పవచ్చు.   ధన్యులు అనే మాట ఇక్కడ  అనేక సార్లు వింటున్నాం. ఇక్కడ వాడిన పదం మారికోస్  అనే పదం. ఇది  దేవునికి మాత్రమే వాడే పదం.  ధన్యులు అనే పదం నూతన నిబంధనలో దేవుని రాజ్యంలో పాలుపంచుకొనుటలో వచ్చే ఆనందం వ్యక్తం చేయడానికి వాడటం జరిగింది.  యేసు ప్రభువు చెప్పే ధన్యత ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇది మానవుని యొక్క పూర్తి ఆనందం గురించి చెబుతుంది.  సంపూర్ణమైన  ఆనందం ఏమిటి అనేది ఇక్కడ మనము చూస్తున్నాము. ఈ ధన్యత ఎనిమిది  విధాలుగా మనం చూస్తున్నాము. ఎనిమిది అనేది స్వర్గీయ సంపూర్ణతను  తెలియచేస్తుంది. 

 ధన్యత అనే పదం మూడు విధాలుగా చెప్పవచ్చు.   మొదటిగా ధన్యత అనేది సంపూర్ణంగా ఆనందంతో  ఉండే స్థితి. రెండవదిగా మానవుని భావాలు, మరియు పరిస్తితులు ఎల్లప్పుడు పవిత్రంగా ఉండే విధం. మూడవదిగా దేవుని పని. కొన్ని దేవుడు భవిష్యత్తులో మానవునికి ఇచ్చే ఒక అనుగ్రహం గురించి తెలియజేస్తుంది. 

దీనాత్ములు ధన్యులు దైవ రాజ్యము వారిది. దీనాత్ముములు అనే  పదం ఆర్ధికంగా ఒక వ్యక్తిని యాచించె విధంగా చేయబడటం గురించి చెప్పేది. వీరు వారి జీవనం కోసం  వేరె వారి మీద ఆదారపడి జీవించేవారు.  పేదవారు అంటే జీవనం కోసం ఇతరుల మీద అదరపడేవారు. పాత నిబంధనలో పేదవారు వినయం కలిగిన వాడు. సహాయం లేనివాడు అనే అనేక అర్ధాలు ఉన్నాయి.  దీనాత్ములు అని అన్నప్పడు దేవుని యందు తమ నమ్మకం ఉంచిన వారు అని అర్ధం. పేదవారిగా ఉన్నకాని వారి నమ్మకమును ఇహలోక వస్తువుల, లేక మనుషుల  మీద ఉంచినట్లయితే వారిని పేదవారు అంటారు కాని దీనాత్ములు అని అనరు. ఎవరు పేదవారు అయిన ధనికులు అయిన దేవుని మీద ఆధారపడి జీవించె వారిని దీనాత్ములు అని అంటారు.  ఇక్కడ  వీరికి దేవుని రాజ్యం ఇవ్వబడుతుంది అని చెప్పడం లేడు. దేవుని రాజ్యం వీరిది అని చెప్పబడుతుంది. అంటే వీరు దేవుని రాజ్యానికి వారసులు అది వారి సొంతం అనే అర్ధం ఇక్కడ మనం చూస్తున్నాం.  ఇహలోక  వ్యక్తులు , వస్తువులు కాకుండా దేవుని మీద ఆదారపడి జీవించడానికి ఇది నాంది పలుకుతుంది. 

శోకార్తూలు ధన్యులు వారు ఓదార్చబడుదురు.  అష్ట భాగ్యాలలో రెండవదిగా మనం చూసేదీ శోకార్తులు ధన్యులు అని వారు ఓదార్చబడుతారు అని మనం వింటున్నాం. ఇక్కడ ఓదార్చేది దేవుడే ఎందుకంటే ఈ శోకం ఎందుకు వస్తుంది అని  మనం అర్ధం చేసుకున్నప్పుడు మనకు ఇది రెండు విషయాలు తెలియజేస్తుంది.  సహజంగా శోకానికి కారణాలు రెండు కారణాలు.  మొదటిది మరణం . ఎప్పుడైతే మనకు చాలా దగ్గరి వారు మరణిస్తారో, అప్పుడు మనం శోకానికి గురి అవుతాము. అది వారికి మనకు మధ్య ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అప్పటినుండి మనకు వారితో ఉన్న సాన్నిహిత్యం తెగిపోతుంది అని గ్రహించినప్పుడు శోకానికి గురి అవుతాము. ఒక వేళ మరణించిన వారితో మనకు ఉన్న సాన్నిహిత్యం గొప్పది అయినచో మన శోకం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవ కారణం పాపం. ఒక వ్యక్తి పాపం చేయడం వలన శోకం  కలుగుతుంది. మరణం లో వలె ఇక్కడ కూడా సంబంధం దెబ్బతింటుంది. ఎవరితో ఈ సంబంధం దెబ్బతింటుంది అని అంటే దేవునితో ఉన్న సంబంధం దెబ్బతింటుంది. దేవునితో ఉన్న ఈ సంబంధం పాపకారణముగా దెబ్బతిన్నప్పుడు, దానిని గ్రహించిన వ్యక్తి బాధ పడుతాడు, పశ్చాత్తాప పడుతాడు, అప్పుడు సహజముగా ఆ వ్యక్తి శోకానికి గురి అవుతాడు. ఇటువంటి పరిస్తితిలో ఉన్న వారిని దేవుడే ఓదారుస్తాడు. దీనినే మనం యోషయా గ్రంధంలో చూస్తాము. పాప కారణముగా దేవునితో వున్న సంబంధాన్ని పోగొట్టుకొనిన వారు శోకానికి గురి అయినచో అది చూసిన దేవుడే వారికి ఓదార్పు ఇస్తారు. 

వినమ్రులు ధన్యులు వారు భూమికి వారాసులగుదురు. వినమ్రతను బైబుల్లో రెండు అర్ధాలు వచ్చే విధంగా వాడటం మనం చూస్తాము. మొదటిగా ఈ పదాన్ని వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఉన్న ఒక సుగుణం వలె వాడటం జరిగింది. రెండవదిగా  సాంఘీక అసమానతలకు  గురిఅయిన వారికి కూడా దీనిని వాడటం చూస్తాము. పాత నిబంధనలో రెండవ దానికి ప్రతీకగా ఈ పదాన్ని వాడటం జరిగింది. దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల లక్షణం కూడా ఈ వినమ్రత కలిగి ఉండటము మనం గమనించవచ్చు. కేవలం వినమ్రత కలిగిన వ్యక్తి మాత్రమే శక్తి గలవాడు అనేటువంటి సందర్భాలు కనబడుతాయి. మోషే ఇటువంటి వ్యక్తి. సంఖ్యా 12:3 మోషే వినమ్రత కలిగిన నాయకునిగా దేవుడు చేస్తున్నాడు. యేసు ప్రభువు వినమ్రత మనకు చాలా ముఖ్యం ఎందుకంటే ఆయనే  చెబుతున్నాడు నెను వినమ్ర హృదయుడను అని,  కనుక దాని పర్యావసానం వారి భూమికి వారసులు అవుతారు. దీనినే  మనం 37 వ కీర్తనలో చూస్తున్నాం. 

నీతినిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరుపబడుదురు.  నీతి నిమిత్తము ఆకలిదప్పులు కలిగినవారు ధన్యులు అని మనం ఇక్కడ వింటున్నాం. ఒక రకముగా ఈ మాటలు ఆకలి, దాహంల గురించి మాటలాడిన విధముగా ఉన్నాయి. యేసు ప్రభువు నెను నిజమైన ఆహారము , నన్ను భుజించువారు ఎన్నటికిని ఆకలిగొనడు అని , నన్ను విశ్వాసించువాడు ఎన్నటికిని దప్పికగొనడు అని చెబుతారు. యోహను 4:14. ఎందుకు, ఎవరి కోసం మనం  ఆకలిదప్పులు కలిగిఉండాలి అనే ప్రశ్నకు మనం ఇక్కడ నీతి నిమిత్తము అనే జవాబు చూస్తున్నాము. నీతి నిమిత్తము అన్నప్పుడు మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి బాప్తిస్మ యోహనుగారు. మత్తయి సువార్త 3:15 వ వచనంలో ఈ మాటలు గురించే మనం వింటాము. యోహను చేత జ్ఞాన స్నానం పొందటం దేవుని సంకల్పం అయినట్లయితే ఆ విధంగా జరగనివ్వు అని యేసు ప్రభువు అంటారు. దేవుని సంకల్పం నెరవేర్చడమె నీతి అనే అర్ధం ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఎవరు పెద్ద లేక చిన్న అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. దీనినే మత్తయి 21:32 లో చూస్తాము. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటె దేవుని నిర్ణయాన్ని పాటించుటకు మనం సిద్ధపడి ఉండటం. ఎవరు అయితే ఈవిధంగా చేయడానికి సిద్దముగా ఉంటారో వారు సంతృప్తి పరుపబడుతారు. ఈ ఆకలిదప్పులు అన్నీ తీరిపోతాయి. 

దయామయులు ధన్యులు వారు వారు దయను పొందుదురు. దయామయులు ధన్యులు  అనే మాటను వింటున్నప్పుడు, మనకు యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలు గుర్తుకు వస్తాయి, ఎందుకంటే మనం దేవుని దయను పొందుటకు  ఖచ్ఛితముగా ఇతరులకు ఈ దయను మనం చూపించగలగాలి. ఎపుడైతే దేవుని దయను , కృపను పొంది ఆ దయను ఇతరులకు చూపించకుండా ఉన్నప్పుడు మనం దేవుని నుండి దయను పొందుటకు అర్హులము కాము అని మనకు యేసు ప్రభువు తెలుపుతున్నారు. ఇక్కడ మాత్రమే కాదు , పరలోక ప్రార్ధనలో , తన తోటి పని వానిని క్షమించలేనివాని ఉపమానం ద్వారా యేసు ప్రభువు మనకు దీనిని తేటతెల్లం చేస్తున్నారు. దేవుడు ఎంత దయమయుడు అనే విషయం కూడా మనం ఇక్కడ  తెలుసుకోవచ్చు, పాత నిబంధనలో దేవుడు దయమయుడు అని త్వరగా కోపపడు వాడు కాదు అని మనం తెలుసుకుంటాం. నూతన నిబంధంలో యేసు ప్రభువు ఎంత దయమయుడో మనం చూస్తాము. ఈ భాగ్యం దేవుని దయను పొందగోరు వారు ఏ విధంగా  ఇతరులకు  దయను చూపాలో తెలియజేస్తుంది. మరియు దేవుని దయ పొందటం మనం ఇతరులకు చూపించే దయ  మీద ఆధారపడి ఉంటుంది అని తెలియజేస్తుంది. 


నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. హృదయం అనేది ప్రేమ అప్యాయతలకు  నిలయం.  మానవ భావాలు అన్నీ ఇక్కడనుండే వస్తాయి. అన్నీ నిర్ణయాలు ఇక్కడ నుండే మనకు ప్రారంభమవుతాయి. పరి వర్తన కూడా ఇక్కడ నుండే వస్తుంది. వీటి అన్నింటికీ కూడా  నిర్మల హృదయ అనేది చాలా ముఖ్యమైనది,  24 కీర్తన మనకు దిని యొక్క ముఖ్యమైన ఫలితాన్ని తెలియజేస్తుంది. ప్రభుని పర్వతము ఎక్కుటకు అర్హుడేవడు ? పవితం హృదయం కలవాడు అని మనకు బైబుల్ నేర్పుతుంది. వీరు ఎవరు అంటే   వీరి జీవితములో ఎటువంటి నాటకీయత ఉండదు. వీరి బాహ్య జీవితం , ఆంతరంగిక జీవితం మధ్య వ్యత్యాసం ఏమి ఉండదు. మొత్తం కూడా ఒకే రకముగా ఉంటుంది. కీర్తన 51:10-11 మనకు ఇది తెలియజేస్తుంది. నిర్మల హృదయం , కళంకం లేని చేతులు గలవారు దేవుని చూచుటకు అర్హులు.  వారు దేవుని చూస్తారు అని మనం వింటున్నాము.  కాని ఇక్కడ పవిత్ర అనేది దేవుని చూడుటకు ఒక షరతులా ఉంది. మరియ మాత, యోసేపు వారు , చిన్ని బిడ్డలు వీరు పవిత్రులు అందుకే వారి సాన్నిధ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దర్శన గ్రంధంలో తెల్లని వస్త్రములు ధరించిన వారు యేసు ప్రభువు ఎక్కడకి వెళ్ళిన అక్కడకు వెళ్లారు. ఎందుకంటె వారు పవిత్రులు కనుక. దేవుని దగ్గర ఉండుటకు, పవిత్రత చాలా ముఖ్యమైనది. పవిత్రులు దేవుణ్ణి దర్శిస్తారు. 


శాంతి స్తాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు. శాంతి అనే మాటకు అనేక రకాలైన అర్ధాలు ఉన్నాయి. ఇక్కడ ఇది కేవలం ఎటువంటి గొడవలు లేక సమస్యలు , యుద్దాలు లేకపోవడం మాత్రమే కాదు. మానవుడు పూర్తిగా ఆనందమును అనుభవించేలా చేయడం. ఇక్కడ యేసు ప్రభువు ధన్యత ప్రకటిస్తుంది , శాంతిని ప్రేమించెవారికి కాదు, ఎవరు అయితే శాంతిని స్థాపించడానికి ప్రయత్నిస్తారో వారికి ధన్యత చేకూరుతుంది అని తెలియజేస్తున్నాడు. వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెబుతున్నారు. ఈ అష్ట భాగ్యాలలో మనం చూసేదీ ఏమిటి అంటే ఎవరు అయితే ఈ పనులు చేయడానికి సిద్దమవుతారో పూర్తిగా దేవునికి చెందినవారిగా ఉంటున్నారు అని , అంటే ఆయన వారిని తనతో గడిపే విధాముగా లేక తన కుమారులు అయ్యే విధముగా లేక తన రాజ్యంలో పాలుపంచుకొనే వారినిగా చేస్తున్నాడు.   

ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది. ఇక్కడ   దేవుని నిమిత్తము, ఆయన వాక్కు నిమిత్తము హింసించబడే వారు ధన్యులు అని చెప్పబడుతుంది.  అనేక మంది ఈ విధంగా హింసించబడ్డారు. వీరికి పరలోకంలో గొప్ప బహుమానం కలదు అని యేసు ప్రభువు చెబుతున్నాడు. ఈలోకంలో ఉండగా ఆయన నిమిత్తము హింసించబడినప్పుడు మనము ధన్యులమే. హింసించే వానికి ఆయన గురించి తెలియదు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలను పాటిస్తామో మనం నిజమైన యేసు ప్రభువు  అనుచరులం అవుతాము. ఆయన శిష్యులుగా జీవిస్తాము కనుక అటుల జీవించుటకు ప్రయత్నించుదాం. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...