క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం
యెషయా 60:1-6, ఎఫెసీ 3:2-3,5-6, మత్తయి 2:1-12
హెరోదురాజు పరిపాలన కాలములో యూదయ సీమయందలి బెత్లేహేము నందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు నుండి యెరుషలేమునకు వచ్చి, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పున చూచి మేము ఆరాధింప వచ్చితిమి" అని అనిరి. ఇది విని, హెరోదు రాజు, యెరుషలేము నగర వాసులందరు కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మ శాస్త్ర బోధకులను సమావేశ పరచి "క్రీస్తు ఎచట జన్మించును" అని ప్రశ్నించేను. "యూదయ సీమ యందలి బెత్లేహేము నందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమ యందలి బెత్లేహేమా!నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలన నా యిస్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను." అంతట హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి, నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలిసికొనెను. పిమ్మట అతడు వారిని బెత్లేహేమునకు పంపుచు "మీరు వెళ్ళి, జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నెను వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను." రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్లిపోయిరి. అదిగో !తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శినియై , ఆ శిశువు వున్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రము చూచినప్పుడేంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి, సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువుకు బంగారము, సాంబ్రాణి పరిమళ ద్రవ్యములను కానుకలుగ సమర్పించిరి. హెరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు హెచ్చరింపగా, వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి.
హేరోదు రాజు యూదయ ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం 37వ సంవత్సరం నుండి 4వ సంవత్సరం వరకు పాలించాడు. ఈ హేరోదు పాలన కాలంలో యేసు ప్రభువు పాలించాడు. మికా గ్రంధం ప్రకారం ( 5:1-3 ) బేత్లెహేము రక్షకుని జన్మ స్థలం. అంతే కాదు అది దావీదు రాజు జన్మ స్థలం కూడా.
హేరిడేటస్ ప్రకారం ఈ ముగ్గురు రాజులు మేదియాన్ తెగకు చెందినవారు. మెదియా పర్షియా రాజ్యంలో భాగంగా ఉండేవారు. వారు పర్షియా పాలనకు ముగింపు పలికి వారు పాలించాలి అని అనుకున్నారు. కాని అది సాధ్యం కాకపోవడంతో పాలన వ్యవహారాలను వదలివేసి అధికార వ్యామోహం లేకుండా యాజకులుగా స్థిరపడ్డారు. పర్షియాలో వారిని జ్ఞానులుగా మరియు పవిత్రులుగా చూసేవారు. వారు ప్రవచనాలు చెప్పడంలో, వైద్య శాస్త్రంలో మరియు అంతరిక్ష శాస్త్రంలో ప్రసిద్ధులు. అంతరిక్షంలో వేర్పడే మార్పులను పట్టి భవిష్యత్తును చెబుతారని అందరు వీరిని నమ్మేవారు. వీరిని మనం మరియు అప్పటి ప్రజలు కూడా జ్ఞానులు అనే చెబుతున్నాం. అసలు జ్ఞాని అంటే ఏమిటి పవిత్ర గ్రంధంలో అని అంటే, మంచి చెడులను తెలుసుకొని, మంచిని మాత్రమే అనుసరించ గలిగిన శక్తి గలిగిన వారు అని అర్ధం. మంచి చెడులను తెలుసుకొనే విచక్షణ ఉండి కూడా మంచిని అనుసరించ లేని వానిని బైబుల్ జ్ఞాని అని చెప్పదు. తెలుసుకోవడం మాత్రమే జ్ఞానానికి కొలమానం కాదు. అది ఆచరణకు సంభందించినది.
ఈ అన్యుల రాక తూర్పు నుండి వస్తున్నారని మనము వింటున్నాము. యేసు ప్రభువు అబ్రహము కుమారుడు అని అయన ద్వారా అందరు దీవించబడతారు అని తెలియచేస్తుంది. ఆదికాండము 22:18. .ఈ ముగ్గురు రాజులు లేక జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం దేవుని యొక్క ప్రణాళికే ఎందుకు అంటే ఆది కాండం 22 వ అధ్యాయం 18 వ వచనం లో అబ్రహాము సంతతి ద్వార జాతులన్నీ దీవించ బడుతాయి అని మనం తెలుసుకుంటాం. అది ఈ రోజు ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం ద్వార జరుగుతుంది. యేసు ప్రభువును దేవునిగా మొదట ఆరాధించిన ప్రజలు అన్యులు, యూదులు కాదు. ఈ ముగ్గురు రాజులు దేవుని అర్పించే వాటిని యేసు ప్రభువుకి అర్పించి ఆయనను దేవునిగా గుర్తించి, తెలుసుకొని, ఆయనను ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 8:11 లో మనం తూర్పు పడమరల నుండి ప్రజలు అబ్రహాము తో కూర్చుంటారు అనే వింటున్నాం. అది ఇక్కడ నెరవేరుతుంది.
ఈ ముగ్గురు రాజులు ఒక నక్షత్రం చూసి , ఒక గొప్ప వ్యక్తి యిస్రాయేలులో జన్మించారని తెలుసుకున్నారు. వారు నిజానికి ఆ నక్షత్రం ద్వారా ఎదో ఎదుకుతున్నారు. ఇన్నాళ్ళు వారిని బానిసలుగా చూసిన పర్షియా రాజ్యమ నుండి స్వతత్రం వారు వెదుకుతున్నారు. వారి బానిసత్వాన్ని తీసువేసే రాజు కోసం వారు వెదుకుతున్నారు. అందుకే వారు యేసు ప్రభువును రాజుగా గురించి రాజుకు బాహుమానంగా ఇచ్చే బంగారం వారు ఇస్తున్నారు. వీరు యాజకులు అని మనం చెప్పుకున్నాం. యాజకులు దేవునికి సాంబ్రాణి దూపము వేయాడం వారి కర్తవ్యం. వీరు యేసు ప్రభువుకు సాంబ్రాణిని అర్పిస్తున్నారు. వారి దేవునిగా మరియు వారి ప్రధాన యాజకునిగా వారు యేసు ప్రభువును గుర్తిస్తున్నారు. వారు సుగంధ ద్రవ్యాలను అర్పిస్తున్నారు. ఇవి చనిపోయిన వారికి అభ్యంగణం చేయడానికి వాడేవి. ఎందుకు ఇవి వారు అర్పిస్తున్నారు అంటే యేసు ప్రభువు తన మరణం, శ్రమలు అన్నీ వారి కొరకు అని తెలియజేయుటకు ఇవి వారు ఇస్తున్నారు.
వీరి అన్నీ సమస్యలకు సమాధానం యేసు ప్రభువే అని వారు నమ్మారు. ఈ నక్షత్రం వారి సమస్యలను తీర్చే వారిని చూపిస్తుంది అని వారు ఆ నక్షత్రాన్ని అనుసరించారు. కాని వారు అక్కడ ఏమి చూస్తున్నారు. చిన్నారి బాలయేసుని మాత్రమే. వీరు జ్ఞానులు , గొప్పవారు వీరు తెలివిగలవారు. చిన్నారి బాల యేసును, సరిగా లేని ఒక పశువుల పాకను, చూసి కూడా వారికి ఎటువంటి అపనమ్మకం కలగలేదు. ఆయనను ఆరాధించారు. అక్కడ వారు దేవుని మహిమను చూసారు , వారు అంత దూరం కేవలం కొన్ని బహుమతులు ఇవ్వడానికి వెళ్ళలేదు. అక్కడ వారు ఎదో చూస్తున్నారు , వారు ఆ చిన్న బిడ్డను ఆరాధిస్తున్నారు. వారి మోకాళ్ల మీద ఉన్నారు. దేవుడు మానవుని రూపంలో వారు చూసారు. వారు ఆనందముగా కృతఙ్ఞతలు చెప్పి వెళుతున్నారు.
అందుకే మనము ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగగా పిలుస్తాము అంటే దేవుడు తనను తాను తెలియ చేసుకోవడం. ఒక నక్షత్రం ద్వారా దేవుడు ఆయనను వారికి తెలియ పరుచుకున్నాడు. వారు జ్ఞానులు కనుక నక్షత్రం ద్వారా యేసు ప్రభువు దేవుడు అని గుర్తించారు. నీవు ఆయన చేసిన పనులు గురించి వినివున్నావు కనుక ఆయనను తెలుసుకొని ఆయనను వారు ఆరాధించినటులా నీవు కూడా ఆరాధించాలి.
పునీత సిలువ యోహనుగారు ప్రకారం మానవుని విషాదకర పరిస్తితి ఏమిటి అంటే దేవుడు అనేక విధాలుగా మనకు తనను తాను తెలియపరుచుకుంటున్న మనం అది గుర్తించలేకపోతున్నాము ఈరోజు.
ఇక్కడ మనం మరియమాత, యోసేపు వారిని చూస్తున్నాము. ఈ రాజులు ఎక్కడ నుండి వచ్చారు, వారు ఏమి చేయబోతున్నారు. ఏమి అడుగుటలేదు. వారిని రావద్దని వారించడం లేదు. ఇది తీరుసభ ఉండవలసిన తీరు గురించి తెలియజేస్తుంది. యేసు ప్రభువు అందరిచేత ఆరాధించబడటానికి, తెలుసుకొనబడటానికి మౌనంగానే సహకరిస్తున్నారు. అది ఒకరకంగా తీరుసభ లేక నివు నేను ఇతరులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు చేయవలసిన పని.
ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం మనకు దేవున్ని ఎరుకపరచుట మాత్రమే కాక మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ముగ్గురు రాజులు యేసు ప్రభువుని తెలుసుకొని ఆయనకు తమ ఆర్పణలతో పాటు తామని తాము అర్పించుకొని ఆయనకు విధేయత చూపుతున్నారు. ఆయన వారికి ఎటువంటి అనుగ్రహాలు ఇవ్వనప్పటికి వారు ఆయనను గుర్తించి ఆనందంతో దేవుని దర్శించము అని వెళుతున్నారు, మనం దేవుని గుర్తించి ఆయనను ఆరాధించి మన విధేయతను చూపాలి. మరియమాత, యోసేపు వలె అందరికి ఆహ్వానించి ఎవరిని దేవుని దర్శించటానికి మనం ఆటంకం కాకుండా ఉండాలి. హెరోదు వలె దేవుని తన అధికారమునకు ఆటంకం అనుకోకుండా ఆయనతో కలిసి ఉండటానికి ప్రయత్నించాలి. ఆవిధంగా జీవించాడానికి ప్రయత్నించుదాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి