తపస్సు కాల రెండవ ఆదివారం
మత్తయి 17: 1-9
ఆరు దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తనవెంట తీసుకొని, ఒక ఉన్నత పర్వతముపైకి ఏకాంతముగా వెళ్లెను. అచట వారి యెదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. అయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే, ఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు "ప్రభూ !మనము ఇచటనుండుట మంచిది. నీకు అనుమతియైనచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఎలియాకు మూడు శిబిరములను నిర్మింతును" అని పలికెను. అంతలో ఓక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి "ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైనవాడు. ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు", అను వాని వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకువచ్చి, వారిని తట్టి , "లెండు , భయపడకుడు"అని పలికెను. అంతట వారు కనులెత్తిచూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. వారు ఆ పర్వతమునుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో " మనుష్య కుమారుడు మృతులనుండి లేపబడువరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు" అని ఆజ్ఞాపించెను.
యేసు ప్రభువు రూపాంతరికరణ ప్రభువుని జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. రూపాంతరికరణకు మెటమోర్పో అనే గ్రీకు పదంని వాడటం జరిగినది. రూపంతరీకరణ అంటే ఒక రూపం నుండి మరియొక రూపం లోనికి మారటం. పేతరు గారు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నాను అని తన లేఖలో కూడా చెప్పారు. రూపంతరీకరణను పేతురుగారు యేసు ప్రభువు మహిమాన్విత రూపం అని చెబుతున్నారు. అంటే ప్రభువు తన దైవ రూపంలో ఉండటం . 1పేతురు 5:1 2 పేతురు 1:15-21.
యేసు ప్రభువు పునరుత్థానము తరువాత, అందరు ఆయన మహిమ పరుపబడిన శరీరం కలవాడు అని తెలుసుకున్నారు. ఆయన మానవునిగా జీవించి ఉండగానే ఆయనకు ఆప్తులుగా ఉన్న కొంత మంది శిష్యులు ఆయన ఏవిధంగా ఈ మహిమాన్వితమైన శరీరంలో ఉండారో తెలుసుకున్నారు వారు పేతురు ,యాకోబు మరియు యోహానులు.
యేసు ప్రభువు ఈ ముగ్గురు శిష్యులను తీసుకొని పర్వతం మీదకు ప్రార్ధన చేయుటకు వెళ్లారు. అక్కడ ఆయన ప్రార్ధన చేయుచుండగా ఆయన ముఖం కాంతివంతమైంది. మనం ప్రార్ధన చేయుటవలన దేవుని మహిమను చూడగలుగుతాం.
ఈ దివ్య రూపధారణకు ముందుగానే యేసు ప్రభువు తన శిష్యులకు తన శ్రమలు, మరణం మరియు పునరుత్థానం గురించి చెప్పారు. కాని అది శిష్యులకు రుచించలేదు. దాని తరువాత యేసు ప్రభుని రక్షణ కార్య చివరి ఘట్ట సమయంలో, తన తండ్రి యొక్క ఆమోదం కోసం, ప్రార్ధన చేసుకోవాలని పర్వతం మీదకు వెళ్లారు.
శిష్యులను వెంటబెట్టుకొని తీసుకెళ్లుట
తనతో యేసు ప్రభువు ముగ్గురుశిష్యులను తీసుకొని వెళ్లారు. వీళ్ళు ఎవరు? మొదటిగా పేతురు గారు శ్రమలు పొందడం ఇష్టం లేని వ్యక్తి. తరువాత యోహను, యాకోబులు వీరు యేసు ప్రభువు, కుడి ఎడమ స్థానాల కోసం అడిగిన వారు. ఎందుకు వీరిని యేసు ప్రభువు తీసుకొని వెళుతున్నారు? యేసు ప్రభువుని రక్షకునిగా గుర్తించిన తరువాతనే ఆయన తన మరణం గురించి మాటలాడారు.ఎందుకు ఈ రూపాంతరికరణ అనేది ముఖ్యం అంటే తన శిష్యులకు యేసు ప్రభువు ఎవరో? ఆయన చేసే పని ఏమిటో ముందుగా తెలియాలి. దాని ద్వారా వారిలో ఉన్న కొన్ని చెడు అభిప్రాయాలు మారిపోవాలి. ఆయన శ్రమలు, సిలువ మరణం వారు అంగీకరించి దానిని అర్ధం చేసుకొని, శ్రమలు ఉండకూడదు అనే మనస్తత్వం పోయి, గొప్ప ఆసనాలు కోరుకునే స్థితి పోయి దైవ ఇష్ట జీవితానికి వారు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోవాలి.
యేసు ప్రభువు కేవలం ఒక గొప్ప వ్యక్తి మాత్రమే అయితే ఆయన మరణానికి అంత ప్రాముఖ్యత వుండదు. ఆయన దేవుని మెస్సీయ్య, రక్షకుడు, సజీవుడైన దేవుని కుమారుడు అని వారు తెలుసుకున్న తరువాత ఆయన తన మహిమను చూపుతున్నాడు. తన సహజమైన స్వరూపాన్నిరూపాంతరికరణ ద్వారా వారికి చూపుతున్నారు.
పేతురు గారు ఆయనను దేవుని రక్షకుడు అని ప్రకటించిన తరువాత మీలో కొందరు దేవుని రాజ్యం చూసేవరకుమరణించరని యేసుప్రభువు చెప్పారు. నిజానికి అది ఇక్కడ జరుగుతుంది. యేసుప్రభువుని మహిమ సాక్షాత్కారం అవుతుంది ఇక్కడ. రూపాంతరికరణ ఏదో ఒక దర్శనం కాదు. వారు చూసిన యేసు ప్రభుని మహిమ. తన ముఖము సూర్యుని వలె వెలిగిపోతుంది. తన దైవత్వం వారికి చూపించబడింది. ఆయన దేవుని వెలుగు. హెబ్రీ 1:3.
శిష్యుల సాక్ష్యం
యేసు ప్రభుని రూపాంతరికరణ చాలా సమయం పట్టింది. యోహను గారు తన సువిశేషంలో దీనిని రాస్తున్నారు. యోహను 1:14 . మేము ఆయన మహిమను చూసాము. పేతరు గారు కూడా దీని గురించి చెప్పారు. 1పేతరు 1:16-17. యేసు పునరుత్థానం తరువాతనే వారు దీని ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు.
యేసు ప్రభువు రూపాంతరికరణ జరుగుతున్న సమయంలో శిష్యులు నిశబ్దంగా ఉన్నారు. నిశబ్దంగా ఉన్నారు అంటే మాటలాడకుండా ఉండటం కాదు, దేవుని సాన్నిద్ధ్యంలో మాటలకు అంతుపట్టని అనుభూతిని అనుభవించడం. లూకా 2:9 వ వచనంలో మరియ మాత కూడా ఈ సంగతులనెళ్ళా తన హృదయంలో మననం చేసుకుంటూ జీవించింది అని చూస్తాం. ఇక్కడ కూడా జరుగుతుంది ఇదే, వారు దైవనుభూతిలో నిమగ్నమైఉన్నారు. కైసరియా పిలిప్పీ ప్రాంతం లో యేసు ప్రభువు, మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చే వరకు మీలో కొంత మంది చనిపోరు అని చెప్పారు, ఆమహిమ ఇదే కావచ్చు.
మోషే మరియు ఏలియా కనబడుట
మోషే మరియు ఏలియా, యేసు ప్రభువుతో పాటు మహిమలో కనబడుతున్నారు. వారు యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారు. వారు ఎందుకు ఇక్కడ ఉన్నారు? దీనికి కారణం, పాత నిబంధన యొక్క సారాంశం యేసు క్రీస్తు మాటలకు అనుకూలంగా జీవించుటలోనే వుంది. యేసు ప్రభువు అనేక సార్లు ప్రవక్తల ప్రభోదం మరియు ధర్మ శాస్త్రం యొక్క సారంశం గురించి భోదంచి, వాటికి విలువ వివ్వడమే కాకుండ వాటిని వివరిస్తున్నారు.
ఈనాటి సువిశేషం లో ధర్మ శాస్త్ర మరియు ప్రవక్తల ప్రతినిధులుగా మోషే ఏలియాలు క్రీస్తు నాధుని మహిమాలో కనబడ్డారు. అంటే ధర్మ శాస్త్రానికి మరియు ప్రవక్తల ప్రభోదానికి విలువ, అర్దం వచ్చేది యేసు క్రీస్తులోనే, అంతే కాదు వాటికి పరిపూర్ణత చేకూరేది క్రీస్తు ద్వారానే.
ఇది ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల కలియక అని, లేక దేవుని రాజ్యం, చనిపోయిన పునీతులు మరియు చనిపోని పునీతులతో కలిసి ఉంటుంది అని చెబుతుంటారు, అక్కడ వారు ఆయన నిర్గమం గురించి మాటలాడుతున్నారు. వీరే ఎందుకు అంటే ? మోషే మరియు ఏలియా, యేసు ప్రభువు చేసే పనిమీద పూర్తిగా అవగాహన ఉన్న వారు. మోషే ద్వార నిర్గమ కాండం లో మనం చూస్తాము , నిర్గమ కాండం ప్రయాణం ద్వారా ఐగుప్తు నుండి వారికి విముక్తి లభించింది. అలానే క్రీస్తు ప్రభుని శిలువ శ్రమల ద్వార మానవాళికి రక్షణ వస్తుంది. ఏలియా ప్రవక్త అక్కడ ఉండటం, క్రీస్తు ప్రభువు రక్షకునిగా వచ్చు, విషయాన్ని సూచిస్తుంది. పాత నిబంధనలో చివరి ప్రవచనంలో ఇది మనం చూస్తున్నాం. మాలకి 4:5-6 . ఏలియా క్రీస్తు ప్రభుని రాకకు ముందు రావాలి అని మనం ఇక్కడ చూస్తాం.
ఏలియా దేవుని సన్నీది లో ఉన్నటువంటి వాడు. మోషే దేవున్ని సినాయి పర్వతం మీద చూసిన వాడు. వీరిద్దరూ ఒకరకంగా దేవున్ని చూసిన వారు. దేవుని మీద అత్యంత ప్రేమ కలిగిన వారు, దేవుని గురించి తప్పుగా మాటలాడితే తట్టుకోలేని వారు, బాలు దేవత పూజారులతో గొడవ పడ్డారు ఏలియా ప్రవక్త. అదే విధంగా దేవుని గురించి అందరు గొప్పగా చెప్పుకోవాలని కోరుకునే వారు మోషేగారు. దేవునికి ప్రజలు వ్యతిరేఖంగా జీవిస్తున్నపుడు, ఎడారిలో దేవుని మీద తిరుగబడినప్పడు దేవుడు వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు ఆయన దేవునితో మీరు అలా చేస్తే, ఇతర ప్రజలు మీ గురించి వీరిని దేవుడు తమ సొంత ప్రాంతానికి తీసుకెళ్లలేక పోయాడు అనుకుంటారు, అలా చేయవద్దు అని అడుగుతున్నారు. వీరు పవిత్రం గ్రంధం లో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలకు ప్రతినిధులు మోషే ధర్మ శాస్త్రం పొందారు దేవుని నుండి , ఏలియా ప్రవక్తల ప్రతినిది. మరియు దైవ సాన్నిద్యంలో జీవించేవాడు.
పరలోక స్వరం
పేతరు గారు, మనం మూడు గూడారాలను నిర్మించి ఇక్కడే ఉందాము అని చేప్పిన సందర్బంలో అక్కడ పరలోకం నుండి తండ్రి స్వరం వినబడుతుంది. మేఘం వారిని కప్పి వేస్తుంది. ఇది పాత నిబంధంలో ఉన్న దైవ సాన్నిధ్యంను గుర్తు చేస్తుంది. ద్వితీ 18:18. నిర్గ 24:15-18. అలానే ఇక్కడ కూడా మనకు దేవుని స్వరం వినబడుతుంది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను మిగుల ఆనందించితిని, ఈయనను ఆలకింపుడు అని ఆ స్వరం వినబడుతుంది. ఇక్కడ దేవుని వాక్కు శిష్యుల కొరకు వస్తుంది. వారు ఆయన మాట వినాలి. వారు అక్కడ ఆయనను ఆరాధించారు తెలియకుండానే. వారు కళ్ళు తెరచి చూడగా అక్కడ వారికి ఏమి కనబడలేదు.
దేవుని మాట "ఈయన నా ప్రియమైన కుమారుడు , ఈయనను ఆలకించండి". సువార్తలో ఇది మాత్రమే తండ్రి యొక్క స్వరం, చాలా అరుదుగా మనం తండ్రి మాట వింటాం. అదికూడా ఒకే ఒక మాట చెబుతుంది. తండ్రి స్వరం చెప్పేది ఈయనను వినండి అని. పేతరు, యోహను యాకోబులు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారు, ఎవరైతే శ్రమలు వద్దు అనే వారో, కుడి ఎడమలు ఆసనాలు అడిగేవారో , వింటున్నారు. శ్రమలు, మరణం
ఏమి వినాలి యేసు ప్రభువు దగ్గర నుండి, ఆయన మాటలు మొత్తం దేని గురించి? ఆయన మాటలు వింటే ఏమి ఉంటుంది ? అని ఒక సారి మనం ఆలోచిస్తే మన జీవితం ఎలా ఉండాలి అని ఆయన భోధిస్తున్నారు. ఆయన మాట విని జీవిస్తే దానిలో జీవం ఉంటుంది, వారికి నిత్య జీవం ఉంటుంది. ధర్మ శాస్త్రం మొత్తం ఇక్కడ పరి పూర్ణత సంతరించుకుంటుంది. ప్రవక్తల ప్రభోదంకు అర్ధం సమకూరుతుంది.
రూపాంతరికరణ ఏమి తెలియ జేస్తుంది
రూపాంతరికరణ యొక్క ఆవశ్యకత చాలా గొప్పది. మొదటిగా అది పన్నెండు మంది శిష్యులకు యేసు ప్రభువు ఇచ్చిన వాగ్దానం. మీలో కొంతమంది దేవుని రాజ్యం చూసినంత వరకు చనిపోరు అని వాగ్ధానం ఇచ్చారు. రూపాంతరికరణ దేవుని రాజ్యనికి ఒక చిన్న నమూనా లాంటిది. యేసు ప్రభువు తన మహిమలో వచ్చిన సమయంలో ఈ విధంగా ఉంటుంది.
ఈ రూపాంతరికరణ నిజంగా యేసు ప్రభువు ఎవరో,ఆయన నిజ స్వరూపం ఏమిటో , ఆయన ఏమి చేస్తారో అర్ధం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆయన దైవత్వం, మహిమ మరియు ఆయన రక్షణకుడు అని తెలుపుతుంది. ఇది అంతా ఒక ఎత్తు అయితే తండ్రి యొక్క స్వరం మరియొక ఎత్తు. తండ్రి స్వరం ఆయన్ను వినండి అని చెపుతుంది. ఆయనను వినడం వలన మన జీవితాలు పరిపూర్ణత సంతరించుకుంటాయి. కనుక ఎల్లప్పుడు మనం ఆయన మాటలను వింటూ పాటిద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి