తపస్సు కాల మూడవ ఆదివారం
యోహాను 4:5-42
యేసు సమరియాలోని సిఖారు పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరీయ స్త్రీ నీటికొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను "నాకు త్రాగుటకు నీరు ఇమ్ము" అని అడిగెను. అయన శిష్యులు ఆహార పదార్ధములు కొనితెచ్చుటకు పట్టణమునకు వెళ్లియుండిరి. ఆ సమరీయ స్త్రీ యేసుతో, "యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు?" అని అనెను. ఏలయన, యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తునులేదు. అప్పుడు యేసు "దేవుని వరమును గ్రహించియున్న యెడల, 'త్రాగుటకు నీరు ఇమ్ము, అని అడుగుచున్నది ఎవరు అని తెలిసికొని ఉన్నయెడల, నీవే ఆయనను అడిగి ఉండెడిదానవు. అపుడు అయన నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు" అని సమాధాన మిచ్చెను. అపుడు ఆ స్త్రీ "అయ్యా! ఈ బావి లోతైనది. నీరు చెదుటకు నీయొద్ద ఏమియు లేదు. జీవ జలమును నీవు ఎక్కడినుండి తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతనికంటే గొప్పవాడవా? అని అడుగగా , యేసు సమాధానముగా ఆమెతో "ఈ నీటిని త్రాగువాడు మరల దప్పికగొనును. కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును" అని చెప్పెను. అపుడు ఆమె "అయ్యా! నేను మరల దప్పికగొనకుండునట్లును,నీటికై ఇక్కడకు రాకుండునట్లును, నాకు ఆ నీటిని ఇమ్ము" అని అడిగెను. అప్పుడు యేసు "నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము" అనెను. అందుకు ఆమె "నాకు భర్త లేడు" అని చెప్పెను. నాకు భర్త లేడు అని నీవు యధార్ధముగా చెప్పితివి. నీకు ఐదుగురు భర్తలుండిరి. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్తకాడు నీవు యధార్ధము చెప్పితివి అని యేసు పలికెను. ఆ స్త్రీ ఆయనతో అయ్యా! నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి. కాని , దేవుని ఆరాధించవలసిన స్ధలము యెరుషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు" అని పలికెను. స్త్రీ నామాట నమ్ముము. సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీదకాని, యెరూషలేములో కాని తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలయన రక్షణ యూదులనుండియే వచ్చును. కాని నిజమైన ఆరాధకులు ఆత్మ యందును, సత్యమందును తండ్రిని ఆరాధించు సమయమిప్పుడే వచ్చి యున్నది. అది ఇపుడే వచ్చియున్నది. నిజముగ తండ్రి ఆశించునది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును, సత్యమునందును ఆరాధింపవలయును" అని యేసు చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ "క్రీస్తు అనబడు మెస్సయా రానున్నాడని నేను ఎరుగుదును. అయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియజేయును" అని పలికెను. "నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను!" అని యేసు చెప్పెను. అంతలో శిష్యులు వచ్చి, అయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడిరి. కాని, ఎవడును నీకేమి కావలయును" అని గాని "నీవు ఎందుకు ఈమెతో మాటాడుచున్నావు " అనిగాని అడుగలేదు. ఆమె తన కడవను అక్కడే వదలి పెట్టి పట్టణములోనికి వెళ్లి ప్రజలతో, "ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన క్రీస్తు ఏమో! అని చెప్పెను. ప్రజలు పట్టణమునుండి బయలుదేరి ఆయనవద్దకు వెళ్లిరి. ఈలోగా అయన శిష్యులు "బోధకుడా! భోజనము చేయుడు" అని బ్రతిమాలిరి. యేసు వారితో "భుజించుటకు మీరు ఎరుగని ఆహారము నాకు కలదు" అని చెప్పెను. ఎవరైన ఈయనకు భోజనము తెచ్చిపెట్టిరా?అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి. యేసు వారితో, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటయు, అయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము. నాలుగు మాసముల పిమ్మట కోతలు వచ్చునని మీరు చెప్పుదురుకదా! పొలములవైపు కన్నులెత్తి చూడుడు. అవి పండి, కోతకు సిద్ధముగా ఉన్నవి. కోత కోయువాడు కూలి తీసుకొని నిత్య జీవమునకై ఫలము సేకరించుకొనుచున్నాడు. ఇందువలన విత్తువాడు, కోయువాడు ఇద్దరును సంతసింతురు. విత్తువాడు ఒకడు, కోయువాడు మరొకడు అని లోకోక్తి ఇక్కడ సార్ధకమైనది. మీరు శ్రమింపదానిని కోయుటకు మిమ్ము పంపితిని. ఇతరులు శ్రమించితిరి. వారి ఫలితము మీకు లభించినది అని చెప్పెను. "నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను" అని ఆ స్త్రీ చెప్పినదానిని బట్టి ఆ పట్టణములోని సమరీయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆ సమరీయవాసులు వచ్చి ఆయనను తమయొద్ద ఉండమని వేడుకొనగా, అయన అచట రెండు రోజులు ఉండెను. అయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు. మేము స్వయముగా అయన ఉపదేశమును వింటిమి. వాస్తవముగ ఆయన లోక రక్షకుడని మాకు తెలియును అని వారు ఆమెతో చెప్పిరి.
సమరియా స్త్రీతోటి యేసు ప్రభువు జరిపిన సంభాషణ సువిశేషలలో యేసు ప్రభువు జరిపిన సంభాషణలలోముఖ్యముగా స్త్రీలతో ఇది అతి పెద్ద సంభాషణ. ఈ స్త్రీ యేసు ప్రభువును ఎవరు అడగనటువంటి ప్రశ్నలు అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలు అన్ని విశ్వాసము గురించి మరియు ఆరాధన గురించియే. ఆమెను ఒక ఆధ్యాత్మిక వేత్తగా , అపోస్తురాలిగా, నాయకురాలిగా, సాక్షిగా మరియు భోదకురాలిగా చూడవచ్చు. ఆమెకు పాత నిబంధన మీద మరియు వారి సంప్రాదాయాల మీద ఉన్న అవగాహన అమోఘం. అందుకే యేసు ప్రభువును ఆమె ఒక ప్రవక్త వలె గుర్తించింది. యేసు ప్రభువు ఒక గొప్ప గురువు. ప్రపంచం ఎన్నడు చూడనటువంటి ఒక గురువు. ఆయన ప్రతి వ్యక్తికి గుర్తింపు ఇచ్చారు మరియు గౌరవం ఇచ్చారు.
యాకోబు బావి వద్ద సమరియా స్త్రీతో యేసు ప్రభువు జరిపిన సంభాషణ కొన్ని గొప్ప విషయాలను మనకు తెలియచేస్తుంది. ఇక్కడ ఆమెకు ఒక పేరు ఏమి ఇవ్వలేదు. సమరియా స్త్రీకి పేరు లేదు. యోహాను సువార్తలో ఇది సర్వసాధారణం. చాలా మంది పేరులేని వ్యక్తులు ఉన్నారు. పేరు లేకపోతే అప్పుడు ఆ వ్యక్తి ప్రతి వ్యక్తిని పోలి ఉన్నట్లు, ప్రతి వ్యక్తి లోని భావాలకు ప్రతీక అని అర్ధం వస్తుంది. ఆమె కథ ప్రారంభ క్రైస్తవ సమాజాలలో మహిళల ప్రాముఖ్యత గురించి స్పష్టమైన భావాన్ని తెలియచేస్తుంది. స్త్రీ మౌనంగా లేదు, స్త్రీలు కేవలం పురుషులకు సహాయం చేయుటకే పరిమితం కాలేదు. ఆమె తన మాటల ద్వారా యేసు ప్రభువుతో ఆసక్తి కలిగించే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మరియు ప్రశ్నల గురించి సంభాషింది. ఆమె యేసు ప్రభువుతో మాట్లాడటానికి అనుమతి కోసం వేచి చూడలేదు, కానీ చొరవ తీసుకుంది. ఆమెకు యేసు ప్రభువు పై ఉన్న విశ్వాసం దశల వారీగా పెరుగుతూ వచ్చింది. ఎలా అంటే మొదట అయన దగ్గర నీరు తోడుటకు ఏమి లేదు అనే స్థితి నుండి అయన రక్షకుడు అని గుర్తించే స్థాయికి ఆమె ఎదుగుతుంది, యేసు ప్రభువుతో మనకు ఉన్న సాన్నిహిత్యం , అయనతో గడిపే కొద్దీ పెరుగుతుంది అని ఇది మనకు తెలియజేస్తుంది.
క్లుప్తంగా ఆమె యొక్క జీవితం ఏమిటి అంటే, యేసు ప్రభువును కలుసుకొని; ఆయన గురించి తెలుసుకొని, అయనను విశ్వసించి ఎలా ఆ విశ్వసాన్ని వెల్లడించింది అనేది ఆమె జీవితం. ఆమె వెళ్లి అతని గురించి ఇతరులకు చెప్పింది. మనము చేయవలసినది కూడా ఇదే. నిజానికి ఇది యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడం. ఆమె ఇచ్చిన సాక్షం ద్వారా అనేక మంది యేసు ప్రభువును రక్షకుడు అని తెలుసుకోవడమే కాదు అనుభవపూర్వకంగా సాక్షం ఇస్తున్నారు.
సమరియా స్త్రీని యేసు సమీపించుట
ఒక స్త్రీ నీళ్ళు తోడుటకు మధ్యాహ్నపు వేళ నీరు తోడుటకు వచ్చింది. (యోహాను 4:7). యేసు ప్రభువు కూడా ఆ బావి వద్దకు వచ్చాడు. ప్రయాణ బడలికచే అలసిపోయి వున్నాడు. అటువంటి పరిస్థితిలో ఆమెను యేసు ప్రభువు త్రాగుటకు నీరు ఇవ్వమని అడుగుతున్నారు. యూదయ పురుషులు సాధారణంగా స్త్రీలతో బహిరంగంగా మాట్లాడరు (యోహాను 4:27). వారు ఉదయాన్నే ప్రార్థన చేస్తూ, ఆరోజు వారు అన్యులును, స్త్రీలను, సమరియులను కుష్టువారిని చూడకూడకుండా ఉండాలని కోరుకుంటారు. అటువంటి ఒక యూదయ వ్యక్తి అయిన యేసు ప్రభువు, ఒక సమరియా స్త్రీని త్రాగుటకు నీరు ఇవ్వమని అడుగుతున్నాడు. దేవుని కుమారునిగా యేసు ప్రభువు ఇక్కడ ఆ సమాజంలో ఉన్న కొన్ని రకాల అసాంఘిక అసమానతలను తీసివేస్తున్నాడు. ఒకరిని దేవునికి దూరం చేసే అసాంఘిక కార్యక్రమాన్ని తొలగిస్తున్నారు. ఎందుకంటే సమరియులు దేవునికి దూరంగా ఉన్నారు అని వారితో ఎటువంటి సాన్నిహిత్యం ఉండకూడదు అని యూదులు అనుకునేవారు. కానీ యేసు ప్రభువు ఈ స్త్రీతో మాటలాడి రెండు రకాలుగా స్త్రీని తక్కువ చేసి చూడటాన్ని మరియు సమరియులు దేవునికి దూరంగా ఉన్నారు, వారితో ఎటువంటి బంధం ఉండకూడదు అనే రెండు సాంఘిక అసమానతలు తొలగిస్తున్నారు.
యేసు ప్రభువు ఆ స్త్రీని నీరు అడిగిన వెంటనే ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. అతనితో యూదుడవైన నీవు సమరియా స్త్రీ అయిన నన్ను త్రాగుటకు నీరు అడుగుటయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. యేసు ప్రభువు చెప్పిన సమాధానము అంతకంటే ఎక్కువ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అది ఏమిటి అంటే నిన్ను అడిగినది ఎవరో నీవు తెలుసుకొని ఉంటే ఆయననే నీవు అడిగేదానవు అని అంటున్నాడు. ఆయన నీకు జీవ జలం ఇచ్చేవాడు అని చెబుతున్నాడు.
ప్రభువు మాటలు ఆమెకు వింతగా అనిపించాయి. అందుకే ఆమె తన స్వరం మార్చి గౌరవపూర్వకంగా, అయిన నీరు తోడుటకు నీ దగ్గర ఏమిలేదు, నీవు ఎలా జీవ జలం ఇవ్వగలవు అని అంటుంది. ఈమెకు అయన మాటలు చాలా కుతూహలానికి గురిచేసాయి. ఆమె ఈ జీవ జలం ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఆ జీవజలం ఎక్కడ లభిస్తుంది? అనేక ప్రశ్నలు ఆమెలో వస్తున్నాయి.
అందుకే మీరు మా తండ్రి యాకోబు కంటే గొప్పవారా ? అని అడుగుతుంది. సమరియుల దృష్టిలో ఆ బావి , దానిలోని నీరు చాలా గొప్పవి. ఎందుకంటే తమ పూర్వీకుడు యాకోబు ఇచ్చిన బావి నీటి నుండి అనేక తరాల వారు, వారి పశువులు మొత్తం, ఆ నీటిని త్రాగి బ్రతుకుతున్నారు. ఇది ఒకరకంగా వారికి జీవ జలం లాంటిది. కాని ఆమెలో యేసు ప్రభువు చెప్పిన మాటలు ఆసక్తిని రేపుతున్నాయి. అవి ఏమిటి అంటే నేను ఇచ్చే నీటిని త్రాగితే మరల దప్పిక గొనరు అని. కాని ఈ బావి నుండి త్రాగిన వారికి మరల దప్పిక కలుగుతుంది. ఈ మాటలు ఆమెను నూతన ఆశను నెలకొల్పాయి, ఆ జీవ జలం కావలనిపించింది. అందుకే ఆ నీటిని నాకు ఇవ్వండి అని అడుగుతుంది.
జీవజలం కోసం ఆమెలో ఉన్న ఆసక్తిని గమనించిన యేసు ప్రభువు ఆ నీటిని ఇవ్వడానికి ఒక షరతును పెడుతున్నారు. నీ భర్తను తీసుకొని రమ్మని అడుగుతున్నారు. ఆమెకు భర్త లేడు అని ఆమె చెబుతుంది.
పాపం బహిర్గతమవుతుంది
యేసు ప్రభువు ఆమెతో మాటాలాడుతున్నప్పుడు, ఆమె వ్యక్తిగత జీవితం ఎంత ముఖ్యమో వివరిస్తున్నాడు. ఆమె జీవ జలం కోసం అడుగుతున్నప్పుడు నీ భర్తను తీసుకురమ్మని చెబుతున్నాడు. అలా చేయడం ద్వారా, ఆమె మనస్సాక్షిని మేలుకొలుపుతున్నాడు. ఆమె ఎటువంటి జీవితం జీవిస్తుందో తెలియజేస్తున్నాడు. ఆమె వినయముగా అయ్యా! నాకు భర్త లేడు అని చెబుతుంది. దానికి యేసు ప్రభువు ఆమెను అభినందిస్తున్నారు. అమ్మా, నీవు నిజం చెప్పావు. కాని నిజానికి నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, మరియు ఇప్పుడు నితో ఉన్న వ్యక్తి ని భర్త కాదు. (యోహాను 4:18) యేసు ప్రభువు చెప్పిన మాటలు ఆమెను భయానికి మరియు ఆశ్చర్యానికి గురిచేసాయి. ఎందుకంటే యేసు ప్రభువు ఆమెకు అపరిచితుడు, కాని తన జీవితానికి సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టాడు. ఆ స్త్రీ తెలివైనది కాబట్టి, ఆ స్త్రీ అయ్యా మీరు ఒక ప్రవక్త అని నాకు తోచుచున్నది అని చెప్పింది. ( యోహాను 4:19 ).
నిజమైన ఆరాధన
ఆయన ప్రవక్త అని తెలుసుకున్న ఆమె వెంటనే, సమరీయుల మరియు యూదుల ఆరాధన మరియు అర్చన సంబంధించిన విషయాలు గురించి అడుగుతుంది. యూదుల దేవాలయం యెరుషలేములో ఉన్నట్లే, సమరియుల దేవాలయం గెరిజీము పర్వతము మీద ఉంది. సమరియులు మరియు యూదులు ఎల్లప్పుడూ ఈ రెండు దేవాలయాలలో ఏది నిజమైన ఆరాధన స్థలం అని వాదించుకునేవారు. అందుకే నిజముగా ఎక్కడ దేవునికి ఆరాధన చేయాలి యెరుషలేములోనా? లేక గెరిజీములోనా? ఇటువంటి ప్రశ్నలు యేసు ప్రభువును ఈమె మాత్రమే అడుగుతుంది. యూదులు, సమరియులు ఇద్దరి వాదనలు ఏవి ముఖ్యమైనవి కాదు. మెస్సియ్య ఇవి అన్ని మారుస్తాడు. ఏమిటి ఆ మార్పు అంటే నిజమైన ఆరాధకులు దేవున్ని సత్యమందును మరియు ఆత్మయందును ఆరాధించాలి. అంటే స్ధలం కాదు ముఖ్యం మరి ఏమిటి అంటే మన స్థితి. ఆమె ఇంకా అనేక ప్రశ్నలు ప్రభువును అడుగుతుంది. ఆరాధన ఏదో ఒక బాహ్య స్థలానికి సంబంధించినది కాదు. (అపొస్తలుల కార్యములు 17:24). అది ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటుంది. దేవునికి ఆమోదయోగ్యమైన ఆరాధన సత్యానికి అనుగుణంగా ఉంటుంది, ఇది ఒక వ్యక్తి భావించే సత్యం కాదు, పవిత్రాత్మతో కూడిన సత్యము.
మెస్సియా వస్తున్నాడు
ఈ మహిళ యేసు ప్రవక్త అని నిర్ధారించింది. మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు: ఆయన వచ్చినప్పుడు, మాకు అన్ని విషయాలు తెలియజేస్తాడు, అని చెబుతుంది. ఇవే ప్రశ్నలు ఈమె యేసు ప్రభువును అడిగి తన ఇంటికి వెళ్లిన తరువాత, అయన నాకు అన్ని విషయాలు తెలియజేశాడు అని గ్రహించి ఈయన మెస్సియ్య ఏమో అని తన పట్టణ ప్రజలకు తెలియచేస్తుంది. (యోహాను 4:25).స్త్రీ ఇంటికి తిరిగి వస్తుంది, అంతటితో ఆమె దేవునితో చేసిన సంభాషణ, దేవున్ని కలుసుకోవడం, ఆమెను పాత సాధారణ జీవితంలోనే ఉండనివ్వలేదు. తన ఊరి ప్రజలందరికి చెబుతుంది. నేను చేసినదంతా నాకు ఒక వ్యక్తి చెప్పాడు, అతను మెస్సియా ఏమో చుడండి అని చెబుతుంది. ఆ నగర ప్రజలు తమ పనులను వదలి ఆయనను చూడటానికి వచ్చారు.
ఆ స్త్రీ తన నీటి కుండను విడిచిపెట్టి నగరంలోకి ప్రవేశించింది. నేను చేసినదంతా నాకు చెప్పిన వ్యక్తిని కలిసినట్లు ఆమె వారికి చెప్పింది. ఇది యేసు యొక్క అతీంద్రియ స్వభావాన్నీ తెలియజేస్తుంది. ఓక స్త్రీ సాక్షం వారు ఒప్పుకోరు అని ఆమెకు తెలుసు. కాని తన సాక్షం చెప్పాలి, అందరికి యేసు ప్రభువు గురించి ఆమె వారికి చెప్పాలి అని అనుకున్నది. అందుకే అతను క్రీస్తు ఏమో ఒకసారి చుడండి అని ఆమె చెబుతుంది. క్రీస్తును చూసి, ఆయనతో మాట్లాడి, ఆయన్ను తెలుసుకొని ఆయనే ఎవరో మీరే నిర్ణయించండి అని తెలియజేస్తుంది.
సమరియా ప్రజలు యేసు ప్రభువును నమ్మట
చాలా మంది సమరియులు యేసు ప్రభువును విశ్వసించారు, అని వింటున్నాం. సమరియులు మొదట్లో ఆ స్త్రీ చెప్పిన మాటల ఆధారంగా విశ్వసించారు. ఈ స్త్రీ యొక్క సాక్ష్యం చాలా శక్తివంతమైనది. ఆమె యేసు ప్రభువు మెస్సీయ కావచ్చునని సూచిస్తూ, యేసు గురించి అందరికీ చెప్పింది. యేసు మరణం మరియు పునరుత్థానం తర్వాత, యేసు ప్రభువు శిష్యులు వచ్చి యేసు గురించి ప్రజలకు చెప్పారు. సమరియా స్త్రీ కూడా అదే చేసింది, ఆమె తన సొంత చొరవతో యేసు ప్రభువు గురించి అందరికి తెలియచేస్తుంది.
సమరియా స్త్రీ: ఒక అపొస్తురాలు
ఆ స్త్రీ యేసుప్రభువుతో ఉన్నది. మరల అయన గురించి ఇతరులకు చెపుతుంది. అపోస్తులు అంటే ప్రభువుతో ఉంది అయన చేత పంపబడి అయన గూర్చి చెప్పేవాడు. ఇక్కడ ఆమె అపొస్తలురాలిగా ప్రవర్తించింది. యేసు ప్రభువు గురించి ప్రజలకు చెప్పడానికి వెళ్లి, వారిని ఆయన వద్దకు నడిపించింది. "నేను చేసినదంతా అతడు నాతో చెప్పాడు" అనే స్త్రీ సాక్ష్యాన్ని బట్టి ఆ పట్టణంలోని చాలా మంది సమరియులు అతనిని విశ్వసించారు, కాబట్టి సమరియులు అతని వద్దకు వచ్చినప్పుడు, వారు అతనిని తమతో ఉండమని అడిగారు మరియు అతను రెండు రోజులు అక్కడ ఉన్నాడు. యోహాను 4: 39-42. చాలా మంది ప్రజలు యేసును నమ్మారు, కేవలం స్త్రీ వల్ల మాత్రమే కాదు, యేసు రక్షకుడని వారు స్వయంగా చూశారు. ఇది వారి యొక్క అనుభవం కూడా అయినది.
ఆమె సందేశం ఏమిటి? "నేను చేసినదంతా అతను నాకు చెప్పాడు." యేసుతో సంభాషణలో, రాబోయే మెస్సీయ "మాకు ప్రతిదీ చెబుతాడు" అని ఆమె చెప్పింది. తరువాత నేను చేసినదంతా అయన నాకు చెప్పాడు, కనుక అయన రక్షకుడు ఏమో వచ్చి చుడండి అని చెబుతుంది. ఇదే మాటలను ఆమెకు యేసు ప్రభువు చెప్పాడు. రానున్న రక్షకుడను నేనే అని ఆమెతో మాత్రమే యేసు ప్రభువు చెప్పినది. యేసు ప్రభువు తాను రక్షకుడను అని బహిర్గతం చేసినది ఇక్కడ మాత్రమే.
సమరియా స్త్రీ తనమాటల ద్వారా యేసుతో ఆమెకు ఉన్న అనుభవం ద్వారా సిఖారు పట్టణంలోని ప్రజలను ప్రేరేపించి, వారు యేసు వద్దకు వెళ్లేలా చేసింది. ఆమె ఇతను క్రీస్తు , రక్షకుడు అయి ఉంటాడు ఏమో అని ఆ ప్రజలకు చెబుతుంది. వారిని బలవంతంగా నిమ్మించ ప్రయత్నం చేయలేదు. ఆమె తన జీవితం గురించి యేసు చెప్పిన మాటలను బయట చెప్పుటకు సిగ్గుపడలేదు.
సమరియా స్త్రీ ఇతరులను యేసు ప్రభువు దగ్గరకు తీసుకురావడానికి కృషి చేస్తుంది. తాను యేసు ప్రభువు వద్ద పొందిన , తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకొనుట ద్వారా యేసు ప్రభువును ఇతరులకు తెలియజేస్తుంది. ఆమె చెప్పిన దానిని బట్టి ఆయనను చూడాలి అని అయన దగ్గరకు వచ్చారు.
ముగింపు
సమరియా స్త్రీ జీవితంను పరిశీలించినయితే ఆమె అపొస్తల కర్తవ్యాన్ని చేస్తుంది, ఎందుకంటే అపొస్తలుడు అంటే క్రీస్తుతో ఉన్నవాడు మరియు క్రీస్తుని సువిశేషం ప్రకటించినవాడు. ఈ రెండు పనులు ఆమె చేస్తుంది. ఆమె క్రీస్తుతో ఉండి , విశ్వాసం మరియు ఆరాధన గురించి క్రీస్తుతో మాట్లాడింది. పాత నిబంధనలో యేసే మెస్సీయ అని గ్రహించగలిగే అనేక మంది దీర్ఘదర్శలు మరియు ప్రవక్తలను మనం చూస్తాము. చాలా మంది ప్రజలు యేసును వేర్వేరు ప్రశ్నలు అడిగారు, కానీ ఈ స్త్రీ మాత్రమే విశ్వాసానికి మరియు ఆరాధనకు సంబంధిచిన ప్రశ్నలను అడిగి, వాటికీ సంబంధించిన సమాధానాలను పొందింది. ఆమె సిఖారు ప్రజలను ప్రేరేపించడంద్వారా వారు యేసు ప్రభువును చూస్తున్నారు. ఆమె నిష్ణాతులైన అపొస్తలురాలు మరియు బోధకురాలు. పవిత్ర గ్రంధంలో ఈమె వలె విశ్వాసం, ఆరాధన మరియు ప్రార్ధన విశ్వాసం అనే విషయాలపై యేసు ప్రభువుతో ఇంత గొప్ప సంభాషణ ఎవరు చేయలేదు. ఆమె క్రీస్తు గురించి ప్రకటించింది. క్రీస్తును కలుసుకోవడం ఆమెను మార్చింది ఆమెను బలపరిచింది. మనము కూడా ఆయన్ను కలుసుకొని ఆయనతో మనము గడిపితే మన జీవితాలలో కూడా ఇదే జరుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి