పేజీలు

13.3.23

క్రీస్తు మోక్షరోహణ మహోత్సవం

 క్రీస్తు మోక్షరోహణ మహోత్సవం 

మత్తయి  28:16-20 

సువిశేషము: యేసు అజ్ఞానుసారము పదునొకండుగురు శిష్యులు గలీలియలోని పర్వతమునకు వెళ్ళిరి. అపుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కాని కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు  వచ్చి వారితో "ఇహపరములందు నాకు సర్వాధికారమీయబడినది. కనుక మీరు వెళ్ళి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు అజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును" అని అభయ మొసగెను. 

 క్రీస్తు ప్రభువుని పరలోకానికి మోక్ష రోహణ  అవ్వడం చాల ముఖ్యమైన ఒక మహోత్సవం. మత్తయి సువిశేషంలో యేసు ప్రభువు మోక్ష రోహణం అయిన పర్వతం మీద అంతిమ సందేశం ఇచ్చి మోక్ష రోహణం అవుతారు, ఆ భాగం మత్తయి రాయరు కాని అంతిమ సందేశం రాశారు. లూకాగారు దీనిని తన సువిశేషంలో మరియు అపోస్తుల కార్యాలలోకూడా ఈ సంఘటన గురించి రాస్తున్నారు. మార్కు గారు మోక్ష రోహణం గ్రంధస్తం చేశారు. యోహాను సువిశేషంలో చివరి దర్శనంలో ఆయన మరలా రావడం గురించి ప్రస్తావిస్తారు.  యేసు ప్రభువు పునరుత్థానం అయిన 40 రోజులు తన శిష్యులకు అనేక సార్లు  దర్శనం ఇచ్చారు. దీని తరువాత ఆయన దర్శనాలు ఆగిపోతున్నాయి. ఆయన తండ్రి దగ్గరకు వెల్లుతున్నారు. ఇప్పడు ఈ సందర్భంలో దేవదూతలు శిష్యులతో మాటలాడుతున్నారు. గలీలియ వాసులారా ! మీరు ఎందుకు ఇక్కడ నిలుచొని ఆకాశం వైపు చూస్తున్నారు, మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ  యేసుమరలా తిరిగి వచ్చును అని చెబుతున్నారు. అపో 1:11. అంటే యేసు ప్రభువు మరల తన శిష్యుల దగ్గరకు వస్తారు. వారిని విడిచి పెట్టుట లేదు. వారిని ఎన్నడూ ప్రభువు విడిచి పెట్టరు. ఇంకనూ మీరు ఇక్కడ ఉండవద్దు అని దేవదూత చెబుతుంది. అంటే యేసు ప్రభువుని పని ఏ విధంగా ముగుస్తుందో ఇప్పుడు శిష్యులు తమ గురువును గురించి, ఆయన చెప్పిన దైవ రాజ్యం గురించి బోధించడం ప్రారంభిస్తారు.  

మానవ రక్షణకు  తాను చేయవలసిన పని సంపూర్ణం అయ్యింది అని తెలియచేస్తుంది 

మోక్ష రోహణం యేసు ప్రభువు ఈ లోకంలో తన పరిచర్య ముగించుకొని తన తండ్రి దగ్గరకు  తన మహిమాలోనికి మరలా వెళ్ళడం. హెబ్రీయుల లేఖలో యేసు ప్రభువు మన ప్రధాన అర్చకుడు అని ఆయన తన తండ్రి కుడి ప్రక్కన  కూర్చొని వున్నాడు అని మనం చూస్తున్నాం. "క్రీస్తు సర్వ కాలమునకు సరియగు పాప పరిహారార్ధమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన  కూర్చుండెను" హెబ్రీ 10:12.   అంటే మన తరుపున  తండ్రిని వెడుకొనడానికి  మన ప్రధాన అర్చకుడు సిద్ధంగా ఉన్నాడు. తాను పరలోకం వెళ్ళడం అంటే తన పని పూర్తి అయ్యింది అని అర్ధం. మనలను పాప రహితులుగా చేయుటకు అన్నీ సమకూర్చాడు అని అర్ధం .  తన మానవునిగా ఈలోకానికి వచ్చిన  చేపట్టిన రక్షణ కార్యం పరిపూర్ణం అయ్యింది అని అర్ధం.  

ఈ మోక్షరోహణం చాలా ముఖ్య మైన విషయాలు తెలియచేస్తుంది. యేసు ప్రభువు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు తన శరీరంతో స్వర్గంలోనికి వెళుతున్నారు. అయన మరణాన్ని గెలిచిన మొదటి వ్యక్తి. ఎందుకు యేసు ప్రభువు మోక్ష రోహణం అవుతున్నారు. దాని యొక్క ఆవశ్యకత ఏమిటి అని అంటే గతం వారం నుండి మనం సువిశేషంలో వింటున్నాము. యేసు ప్రభువు తన తండ్రి దగ్గరకు వెళుతున్నాను అని  చెబుతూ దానికి ఆయన అనేక కారణాలు కూడా చెబుతున్నారు. 

యేసు ప్రభువు తన నిజ మహిమాలోనికి వెళుతున్నారు 

యేసు ప్రభువు తన ఈ లోక పనిని అంటే మానవ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసి తన పూర్వ స్థితికి , అంటే తన మహిమాన్విత రూపంలోనికి వెళుతున్నారు. యేసు ప్రభువు శిష్యులైన పేతురు , యోహను యకొబులు ఈ మహిమాన్విత క్రీస్తును ఆయన రూపాంతరికరణ చెందినప్పుడు చూసారు. మరల ఆయన మహిమాన్విత రూపాన్ని ఆయన తీసుకోబోతున్నారు ఈ మోక్ష రోహణం ద్వారా. "ఆయన చని పోయి జీవముతో లేవనెత్తబడి , దేవుని కుడి ప్రక్కన ఉంది మన మధ్య వర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయు వాడు."  రోమి 8:34. ఆయన ఎల్లప్పుడు తండ్రి తోనే ఉన్నాడు అని యోహను గారు తన సువిశేషంలో మొదటి అధ్యాయంలో చెప్పారు. ఆయన మహిమాన్విత రూపంలో ఉన్నప్పుడు ఆయన మన కోసం తన తండ్రికి విజ్ఞాపనలు చేస్తూ మనం కోసం పరితపిస్తున్నరు. 

ఆయన పవిత్రాత్మను పంపుటకు వెళుతున్నారు 

"నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు." యోహను 16:7.  యేసు ప్రభువు శిష్యులకు నేను వెళ్ళేది మీ మంచి కోసమే అని చెప్పారు. నేను వెళ్ళినచో మీకు పవిత్రాత్మను పంపుతాను అని చెప్పారు. యేసు ప్రభువు వెళ్ళి పవిత్రాత్మను పంపడం ద్వారా  పవిత్రాత్మ వారి మీదకు వస్తుంది. భౌతిక శరీరంతో ఉన్న యేసు ప్రభువుకు  తన శిష్యుల అందరితో ఉండటానికి సాధ్యం కాదు. పవిత్రాత్మను తన శిష్యులకు ఇవ్వడానికి, యేసు ప్రభువును పంపుతున్నారు. అందుకు యేసు ప్రభువు ఈ లోకంనుండి వెళ్ళి తను పరలోకం వెల్లుతున్నారు. 

 యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నప్పుడు వారు ఎల్లప్పుడు ఆయన నుండి అన్నింటిని స్వీకరించేవారు. తన శిష్యులు యేసు ప్రభువు వారి నుండి వెళ్ళిన తరువాత వారు యేసు ప్రభువును అందరికి అందిస్తున్నారు. ఆయన చేసిన పనులు వీరు చేస్తున్నారు. ఆయన మాతృకలుగా వీరు మారుతున్నారు. "అప్పుడు పేతురు నా దగ్గర వెండి , బంగారమేమియు లేదు. నాకు ఉన్నాడానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసు క్రీస్తు పేరిట నీవు నడువుము" అపో 3:6. అని పేతురు అంటున్నారు. అంటే శిష్యులును తన మాతృకలుగా చేసి వారు , ప్రభువును లోకామునకు అందించేవారినిగా చేస్తున్నారు. ఆ విధంగా శిష్యుల ఔన్నత్యాన్ని చాటుతున్నారు. 

మనకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేయడానికి వెళుతున్నారు 

"నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటులచెప్పను. నేను మీకోక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను." యేసు ప్రభువు తన శిష్యులకు నేను తండ్రి వద్దకు వెళ్ళి మీకు ఒక నివాసం స్థలం ఏర్పాటు చేస్తాను అని చెబుతున్నారు. నా తండ్రి దగ్గరఅక్కడ  లేకపోతే నేను ఆ మీకు చెప్పను అని చెబుతున్నారు. అంటే మనకు నివాస స్థలం ఏర్పాటు చేయడానికి ప్రభువు  అక్కడకు వెళుతున్నారు. ఇది శాశ్వత  నివాస స్థానము. ఎందుకంటే ఈలోకం శాశ్వతమైనది కాదు. ఇది తాత్కాలిక మైనది. పుట్టిన ప్రతి ఒక్కరు మరణిస్తారు. కాని యేసు ప్రభువును విశ్వసించిన ప్రతి ఒక్కరికీ ఆయన శాశ్వత స్థానము ఏర్పరచడానకి ఆయన తండ్రి దగ్గరకు వెళుతున్నారు. అక్కడ లేక పోతే నేను అలా చెప్పను అని ప్రభువు అంటున్నారు. అంటే మనలో కొంతమంది పరలోకం గురించి నమ్మడానికి సిద్దంగా లేము. యేసు  క్రీస్తు మోక్ష రోహణం కూడా మనం పరలోకం మీద అటువంటి అపనమ్మకం లేకుండా ఉండమని చెబుతుంది. 

ఆయన మరల వస్తాడు 

యేసు ప్రభువు యొక్క మోక్ష రోహణం,    ఆయన మరలా వస్తాడు అని తెలియ జేస్తుంది. యేసు ప్రభువు మోక్ష రోహణం మనకు ఆయన మరలా వస్తాడు అనే భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పినవన్ని చేస్తున్నారు.  ఆయన  చనిపోయిన మూడవ రోజు మరణాన్ని జయించి లేస్తాను అని చెప్పిన విధంగా లేచాడు. నేను తండ్రి దగ్గరకు వెళ్ళాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు. ఆయన అదే విధంగా తండ్రి దగ్గరకు వెళుతున్నారు.  నేను మరలా వస్తాను అని అంటున్నారు. నేను మరలా వచ్చినప్పుడు మిమ్ములను సంతోషంగా ఉండటాన్ని చూస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. అంటే ఆయన వెళ్ళినట్లయితే మరల ఆయన మన దగ్గరకు వస్తారు. మనం ఆనందంతో , నమ్మకంతో, విశ్వాసంతో ఆయన కోసం ఎదురుచూడాలి. 

మానవుడయిన యేసు పరలోక ప్రవేశం 

 యేసు ప్రభువు యొక్క మోక్ష రోహణం మనకు మరియొక ముఖ్యమైన విషయం తెలియజేస్తుంది. అది ఏమిటి అంటే ఈ రోజు మోక్ష రోహణం అవుతున్నది, మానవ రూపంలో ఉన్న యేసు ప్రభువు మన మానవ రూపం పరలోకానికి అర్హత సాదించడం ఇది. యేసు ప్రభువు తన తండ్రితో ఉండటం, పరలోకంలో ఉండటం క్రొత్త కాదు కాని మానవునిగా ఈలోకంలో ఉన్న ప్రభువు , మానవ స్వభావంతో, పాపం అనెది లేని ప్రభువు పరలోకం వెళ్ళడం ఒక ముఖ్యమైన విషయం. అంతే కాక ఇది మానవుని పొందగలిగే స్థితి తెలియజేస్తుంది. కనుక మనం అటువంటి జీవితం పొందడానికి అర్హులం అని తెలుసుకొని అందుకు యోగ్యులుగా  జీవించూదాం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...