పేజీలు

13.3.23

వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ- యేసు ప్రభుని కరుణ

 వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ- యేసు ప్రభుని కరుణ

యోష 43:16-21 , పిలిప్పీ 3:8-14, యోహ8:1-11 

ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువు ఎవరు అనేది మనం చూస్తాం. యేసు ప్రభువు దైవ లక్షణాలు మనకు ఇక్కడ కనబడుతాయి. ఈ సువిశేషంలో కనబడే ప్రతి ఉపమానంఅద్భుతం లేక సంఘటనలు యేసు ప్రభువుని దైవత్వంను  తెలియజేస్తుంది.

నేపధ్యం : యెరుషలేములో గుడారాల పండుగ జరుగుతుంది. ఇది యిస్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో  గుడారాలలో ఉంటునప్పుడు,  ఏ విధంగా దేవుని కరుణ వారి మీద ఉన్నది అని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ.  ఈ పండుగ జరుపుకునే రోజులలో వారు దేవాలయం దగ్గరే చిన్న చిన్న గుడారాలు నిర్మించి దానిలో ఉంటారు. ఈ సందర్బంలో వారు ఒక స్త్రీని వ్యభిచారంలో పట్టుబడినది అని తీసుకొని వచ్చారు. ఆమెకు ఏ శిక్ష వేయాలి అని అడుగుతున్నారు.

ఎందుకు వారు యేసు ప్రభువు వద్దకు తీసుకొని వచ్చారు ?

వారు ఆమెను యేసు ప్రభువు దగ్గరకు తీసుకురానవసరం లేదు, ఎందుకంటే వారి ఇష్ట ప్రకారం ఆమెకు మరణ శిక్ష విధించాలి అంటే అది యూదయా పెద్దలు నిర్ణయించకూడదు. దానిని రోమా సామ్రాజ్య అధికారులు నిర్ణయించాలి. కానీ యేసు ప్రభువును ప్రజల ముందు, దేవుని నుండి వచ్చిన వాడు కాదు అని నిరూపించాలి,  అదేవిధంగా కుదిరితే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని నిరూపించాలి. ఎందుకు వీరు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు? కారణం స్పష్టమైనది. అది ఏమిటి అంటే యోహను శుభవార్ 5 వ అధ్యాయం నుండి 10 వ అధ్యాయం వరకు చాలా ముఖ్యమైన పండుగలు జరుపుకుంటున్నారు యూదులు, ఈ పండుగలు మొత్తం దేవుడు వారితో ఉండి ఏ విధంగా వారిని కాపాడాడు అని గుర్తు చేసుకుంటున్నారు. ఈ అన్ని పండుగలలో యేసు ప్రభువు అక్కడ ఉన్నారు, మరియు వారికి భోదించాడు, అంతే కాదు,  మోషేకు దేవుడు తాను ఉన్నవాడను లేక జీవించువాడను లేక జీవాన్ని అని ఎలా తెలియ పరిచాడో,  అదే విధంగా యేసు ప్రభువు కూడా ఈ పండుగ రోజులలో తాను ఎవరు అనేది తెలియ చేశారు ,  ముఖ్యంగా , నేనే జీవాహారం అని , జీవ వాక్కు అని వెలుగు అని వారికి తెలియచేశాడు. ఈ పండుగలలోనే మెస్సీయ్య వాస్తాడు అని వారి నమ్మకం కూడా,  కాని యేసు ప్రభువే ఆయన అని వారికి నమ్మడం ఇష్టం లేదు,  కనుక   ఆయనను నిందించడానికి వారికి ఒక కారణం కావాలి.  అందుకే  వారు  వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొని వస్తున్నారు.

ఈమె ఎవరు పరిసయ్యుల ,ధర్మ శాస్త్ర భోదకుల పక్షపాతం

ఆమె పెళ్లి చేసుకున్న స్త్రీ అయి వుండాలి ఎందుకంటే వారు చెప్పే నియమము పెళ్లి చేయబడిన,లేక ప్రధానం చేయబడిన వారికి సంబందిచ్చినది  , ద్వితీ 22:23-24 లో పెళ్లి చేసుకున్న స్త్రీ లేక ప్రధానం చేయబడిన యువతి వేరె వారితో శారీరక బందం కలిగివుంటే అటువంటి వారిని రాళ్ళతో కొట్టి చంపమని చెబుతుంది. లెవీయ కాండం 20:10 లో వ్యభిచారానికి మరణ శిక్ష విధించమని చెబుతుంది. యేసు ప్రభువు దగ్గరకు ఆమెను తీసుకొని వస్తున్నారు. వారికి తెలుసు ఆమె తప్పుచేసింది. లెవీ 20:10 , ద్వితీ 22:22. రెండు సందర్భాలలో ఆమెను చంపివేయాలి అని అంటున్నది.

ఇక్కడ ఒక స్త్రీ పాపం చేసినట్లయితే ఆమెతో పాటు భాగస్తుడైన  వ్యక్తిని కూడా అలానే శిక్షించాలి. కానీ ఇక్కడ జరుగుతుంది దానికి పూర్తిగా విరుద్దంగా వుంది. ధర్మ శాస్త్ర భోధకులు , పరిసయ్యులు కేవలం ఒక స్త్రీని మాత్రమే పాపం చేసిన వ్యక్తిగా చూపిస్తున్నారు. ఇక్కడ ఆమెను ఒక వ్యక్తిగా కూడా వారు చూడటం లేదు ఒకరకంగా ఆమెను యేసు ప్రభువుని పరీక్షించడానికి ఆయన దేవుని నుండి వచ్చిన వ్యక్తి కాదు అని చెప్పడానికి ఈమెను వాడుకుంటున్నారు.

 వారు ఏవిధంగా యేసు ప్రభువును  నిందించాలి అనుకున్నారు?

యేసు ప్రభువు వద్దకు  ఆ స్త్రీ ని తీసుకుపోతే వారికి  తెలుసు, ఆయన ఆమె పాపంను  చేసిన వ్యక్తిని క్షమిస్తాడు అని , కానీ దాని ద్వారా యేసు ప్రభువు  మోషే ధర్మ శాస్త్రాన్ని పాటించాడు, లేక దానికి విలువ ఇవ్వడు అని అందరికీ తెలియ చేయావచ్చు , అని వారి ఉద్దేశం. అంతే కాదు దేవుని నుండి వచ్చిన వాడైతే దేవుడిచ్చిన ధర్మ శాస్త్రాన్ని గౌరవించాలి కదా , దానిని గౌరవించడం లేదు, కనుక ఆయన దేవుని నుండి వచ్చిన వాడు కాదు అని చెప్పవచ్చు. ఇంతకు ముందే నేను ధర్మ శాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు దానిని పరిపూర్తి చేయడానికి. మత్తయి5వ అధ్యాయంలో నేను శిక్షించడానికి కాదు రక్షించడానికి వచ్చాను అని చెబుతున్నాడు. ఒక వెళ ఆయన రాళ్ళతో కొట్టాలి అని అంటే, ప్రజల ముందు ఆయన పాపులు, సుంకరుల స్నేహితునిగా వారితో ఈయన తిని త్రాగుతాడు ,కానీ వారిని కాపాడాడు అని చెప్పవచ్చు. మరియు నేను పాపులను వెదకి రక్షించడానికి వచ్చాను అని ఇతను చెప్పే మాటలు అని కట్టు కథలు అని చెప్పవచ్చు. అంతేకాదు చట్టాన్ని తన చేతులలోకి తీసుకున్నాడు అని రోమా సామ్రాజ్య అధికారులుకు వ్యతిరేకి అని చెప్పవచ్చు. రోమా సామ్రాజ్యానికి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేసిన ఆనాటి రోజులలో మరణ దండన ఉండేది. ఈ విధంగా యేసు ప్రభువును వారు తొలగించాలి అనుకున్నారు. ఆమెకు శిక్ష విధించాలి అనే వారి కోరిక కాదు, దానికి ముందుగా ఆయనను దేవుని  నుండి వచ్చిన వాడు కాదు  అని నిరూపించాలి అని అనుకున్నారు.  

 ఇక్కడ వారి ప్రధానమైన ఆరోపణ ఏమిటి అంటే ఒక స్త్రీ పాపంలో పట్టుబడింది. ఆమెను  శిక్షించాలి అని, వారు పట్టుబడితే లెవీయకాండం ప్రామాణికంగా 20:10 ని తీసుకుంటే ఆమెతోపాటు ఉన్న వ్యక్తిని కూడా వారు తీసుకురావాలి. లేదు ద్వితీ 17:6 లేక 19:15 ను ప్రామాణికంగా తీసుకుంటే వారికి ఎక్కువ మంది సాక్షులు కావాలి, ఇంకా వారు ఒకనికి మరణ శిక్ష విధించాలి అనుకున్నట్లయితే వారు రోమా సామ్రాజ్య అధికారుల దగ్గరకు వెళ్ళివుండాలి. యూదాయ అధికారులకు మరణ శిక్ష విధించే అధికారం లేదు కనుక. కానీ ఇవన్నీ నిజమైన కారణాలు కాదు యేసు ప్రభువును ఎలా పరీక్షించాలి. ఎలా తప్పు పట్టాలి, ఎలా ఆయన గొప్ప వాడు కాదు అనిచెప్పాలి అనేవే వీరి ప్రధాన ధ్యేయం.      

యేసు ప్రభువు ఏమి రాసి ఉండవచ్చు?

యేసు ప్రభువు తన వేలితో నేల మీద రాస్తున్నారు. ఏమి రాసిఉండవచ్చు ? వారి పాపాలనా? లేక యూదులలో గొప్పవారు  చేసిన పాపాలనా? ఏమి అయిన ఆయిఉండవచ్చు. ఈ ప్రశ్నకి జవాబు ఎవరికి తెలియదు, కానీ అనేకమంది దైవ శాస్త్ర పండితులు కొన్ని ఊహలు చేశారు, ఎవరైతే అక్కడ ఆ స్త్రీని నిందిస్తూన్నారో వారి పాపలను అని , లేకపోతే యూదులలో వ్యభిచారంలో పట్టుబడిన వారి పేర్లు అని , ఉదా . తామరు  మొదలగువారు. లేక కొన్నిసార్లు యూదులు మరణశిక్ష తప్పిస్తూ ఉంటారు వారి పేర్లు అయిఉండవచ్చు.లెవీయ కాండం లో అక్కడ  ఇద్దరినీ శిక్షించమని ఉంది , ఇక్కడ కేవలం ఆ స్త్రీ ని మాత్రమే తీసుకొని వచ్చే ఆ పురుషుడు ఎక్కడ ? ఎందుకు ఆయనను వడాలిపెట్టారు. 

యేసు ప్రభువు మీలో  పాపం లేనివారు మొదటి రాయి వేయమని అంటున్నారు.

సాక్షి యొక్క చేయి,  మొదటి రాయి వేయాలని ధర్మ శాస్త్రం చెబుతుంది. ద్వితీ 17:7 ఇక్కడ యేసు ప్రభువు , మొదటి రాయి వేసే వాడు  ఎటువంటి పాపం లేని వాడు అనగానే అందరు వెళ్ళిపోతున్నారు. అంటే వారీలో పాపం ఉంది. అని వారు తెలుసుకుంటున్నారు. మనం ఇక్కడ గుర్తించవలసినది వారు వారి నిజ స్థితి తెలుసుకుంటున్నారు. నేను కూడా దేవుని దయకు అర్హత పొందాలి అంటే ఇతరులు శిక్షింపబడాలి అని కోరుకోకూడదు.

ఆమె సిగ్గుతోటి అక్కడ ఉంది అని  యేసుప్రభువుకు  తెలుసు,  అందుకే ఆమెతో నీవు పాపం చేశావా అని కూడా ఆడగటంలేదు, ఆమె చేసింది పాపమే. కానీ ఆయన క్షమించడానికి సిద్దంగా ఉన్నాడు,  ఇక పాపం చేయకు అని  చెపుతున్నారు. యేసు ప్రభువుకి తెలుసు ఆమెను   వారు  ఏమి చేస్తారో  అని భయ పడనవసరంలేదు.అందరు వెళ్లిపోయారు. ఆమె ఇప్పుడు క్రీస్తు వద్ద ఉన్నారు, రక్షకుని దగ్గర ఉన్నారు అంటే ఆమెకు ఖండన లేదు. ఎందుకంటే క్రీస్తుతో ఉంటే వారికి తీర్పు ఉండదు అని మనం దేవుని వాక్యంలో వింటున్నాం. రోమి 8:1 క్రీస్తుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ధండన వుండదు. మీలో తప్పు చేయనివారు మొట్ట మొదటి రాయి వేయమని చెబుతున్నారు. అంటే ఆమెలానే మీరు కూడా తప్పు చేసినవారే, ఆయన మాత్రమే ఆమెను శిక్షించగలడు, ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు కానీ ఆయన ఆమెను శిక్షించకుండా పరివర్తనకు పిలుస్తున్నారు.

ఎందుకు వారు ఆమె మీద రాయి వేయలేక పోయారు?

పరిసయ్యులు వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని  యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆమెను శిక్షించడానికి వారు ఎంతో ఆనందంతో అక్కడకి వస్తున్నారు, కానీ వారిలో కూడా ఈ పాపం ఉంది అని అంటున్నారు యేసు ప్రభువు. వారిలో చెడు పెట్టుకొని ఇతరులను శిక్షించాలని వారు కోరుకుంటున్నారు, మనలో ఎప్పుడైతే ఇటువంటి పాపం ఉంటుందో అప్పుడే మనం ఇటువంటి శిక్షను ఇతరులకు  వేయించడానికి ప్రయత్నిస్తాం. దావీదు పాపం చేసిన తరువాత దేవుడు అతని దగ్గరకు నాతాను ప్రవక్తను పంపినప్పుడు, దావీదు ప్రవక్తతో పాపం చేసిన వాడు తప్పక మరణించాలి అంటున్నాడు.  కానీ అది నీవే అంటున్నప్పుడు ఎడుస్తున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు.  మనం అనేక సార్లు ఇలానే ఉంటున్నాము. యేసు ప్రభువు మీలో ఏ తప్పు లేని వాడు అని అన్నప్పడు వారి జీవితాలు, వారి ముందు కనపడుతున్నాయి. వారు ఏమి చేసింది, వారికి జ్ఞప్తికి వస్తుంది. యేసు ప్రభువు ఒక మాట అనగానే అది జరుగుతుంది. ఆయన దేని గురించి అంటున్నాడో అర్ధం అవుతుంది. జక్కయ్య వైపు చూడగానే ఆయన జీవితం మొత్తం తెలుస్తుంది ఆయన తాను సంపాదించినది మొత్తం ఇవ్వడానికి సిద్దపడ్డాడు. లెవీని రమ్మనగానే మొత్తం వదలి వెళుతున్నాడు. వీరిని మీలో ఏ తప్పు లేని  వారు అనగానే వారి తప్పులు మొత్తం వారికి తెలుస్తున్నాయి. పాపం చేసిన స్త్రీ కి మరణ శిక్ష వెయ్యాలి అని పరిసయ్యులు కోరుతున్నారు. అంటే వారికి అదే శిక్ష పడాలి.  యేసు ప్రభువు మనం నిజమైన పరిస్థితి ఏమిటి అని తెలుసుకోమని అంటున్నారు. మనం పాపులము అని తెలుసుకోమని చెబుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు ఆమెకు మరణ శిక్ష విధిస్తే అక్కడ ఉన్న వారికి కూడా అదే శిక్ష పడుతుంది అని చెబుతున్నారు. దానికి అందరు వెళ్ళి పోతున్నారు

ఎటువంటి ప్రశ్నలకు ఈ సువిశేష భాగం సమాధనం ఇస్తుంది?

లింగ వివక్ష గురించి , క్షమించడం గురించి , సమానత్వం గురించి కృప వరం గురించి మరణ తీర్పు గురించి మనకు ఉన్న అన్నీ ప్రశ్నలకు ఈ  సువిశేష భాగం సమాధానం ఇస్తుంది. అంతేకాదు మనం ఎలా ఉండాలి అనికూడా తెలియజేస్తుంది. మన చెడు ఆలోచనలు, మన నటన , మన ఆత్మ వంచన తెలియజేస్తుంది. ఈ స్త్రీని కాపాడాలి అంటే తప్పక వారి నటన, వంచన మొత్తం బయటపెట్టాలి. ఇది మనకు రక్షకుని గొప్ప మనస్సును , సామాజిక రుగ్మతల మీద ఆయన భావాన్ని  తెలియజేస్తుంది.

ధర్మ శాస్త్ర భోదకులు , పరిసయ్యుల ఆలోచన ఏవిధంగా ఉంది ?

ఆ స్త్రీ ని శిక్షించడం వారికి ముఖ్యం కాదు, అది ప్రధాన సమస్య కాదు , ఇద్దరు వ్యభిచారం చేసినప్పుడు వారిలో ఒకరు ఎక్కువ పాపం ఇంకొకరు  తక్కువ పాపం చేయారుగా? అప్పుడు ఇద్దరినీ తీసుకొని రావాలిగా? తప్పు ఎవరు చేశారు అని  నిర్ణయించేది ఇక్కడ ,ధర్మ శాస్త్ర భోదకులు మరియి పరిసయ్యులు. వారు మోషే ధర్మ శాస్త్రాన్ని వారి ఇష్టప్రకారం భోదించెవారు. అదే విధంగా దానికి వివరణ ఇచ్చేవారు. ఇతరుల పాపపుణ్యాల నిర్ణయించే మనం,  మనం ఎలా ఉండమో చూసుకోవాలి అని చెబుతుంది. అప్పుడు నీవు ఇతరుల పాపం గురించి మాటలాడవు. స్త్రీని వారు ఒక వస్తువులా చూస్తున్నారు.

మనం పాత నిబంధనం లో చూస్తే అక్కడ  యూద తన కోడాలితో పాపం చేసి ఆమెను శిక్షించాలి అంటాడు. నిజానికి ఇక్కడ కూడా జరుగుతుంది ఇదే తమకు కావాల్సినవాడిని తప్పించి వేరె వారిని శిక్షించడం వారికి అలవాటుగా మారిపోయింది. అటువంటి వాటికి ఆలోచనకు ముగింపు ఇవ్వాలని యేసు ప్రభువు చెబుతున్నారు.

పరిసయ్యుల , ధర్మ శాస్త్ర భోదకుల ప్రవర్తన ఇక్కడ పాపంలానే ఉంది.  యేసు ప్రభువు వారిని వారి అధికారాన్ని సవాలు చేస్తున్నారు అది తట్టుకోలేని వారు ఇవన్నీ చేస్తున్నారు. యేసు ప్రభువుకి శిక్ష  రోమా సామ్రాజ్యం చేత విధించాలి అని అనుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు వారు యేసు ప్రభువును పరీక్షించారు. అంతే కాదు ఆ స్త్రీని చంపాలని అనుకున్నారు.  యేసు ప్రభువు మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడం కోసం ఒక స్త్రీ ప్రాణాన్ని తీసి వేయుటకు వెనుకడుగు వేయుట లేదు.

యేసు ప్రభువు ఆలోచన ఏమిటి?

ఈ సంఘటనలో యేసు ప్రభువు ఒక సంఘ సంస్కర్త వలె కనిపిస్తారు. నిజానికి యేసు ప్రభువు మొదటి నుండి అలానే ఉన్నాడు.  స్త్రీని మాత్రమే పాప కారణం అన్నట్లు చూడటం మనకు అలవాటు అయింది, అటువంటి ఆలోచనలు మన నుండి తొలగించాలి అని అనుకుంటున్నారు..

వ్యభిచారంలో పట్టు బడిన స్త్రీ మీద   యేసు ప్రభుని  ప్రేమను చూడవచ్చు. యేసు ప్రభువు  ఆ స్త్రీని తీసుకొని వచ్చిన వారికి వారి జీవితాన్ని పరిశీలించుకోమని అడుగుతున్నారు.  ఆమె తప్పు చేయలేదు అనటం లేదు. ఇక నుండి చేయవద్దు అంటున్నారు.

 యేసు ప్రభువుతో  స్త్రీ మాటల ద్వార మనం అర్ధం చేసుకోవలసినది ఏమిటి అంటే ఆయనతో ఉంటే మనం పాపములను తొలగించుకునే మార్గం ఉంటుందిఎందుకంటే ఆయన మనం పాపములను తీసివేసి మనలను పవిత్రులను చేస్తాడుఆయనతో ఉండుటకు అర్హత పొందుతాము.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...