యేసు క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవం
అదికాండం 14:18-20 1కోరింథీ 11:23-26 లూకా 9:11-17
సువిశేషం: జనసమూహములు ఈ విషయమును తెలిసికొని వారిని వెంబడించేను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్ధుగ్రుంక నారంభిచినప్పుడు పన్నిద్దరు శిష్యులు ఆయన వద్దకు వచ్చి , "ఇది నిర్జన ప్రదేశము. ఇక వీరిని పంపివేయుడు; పల్లె పట్టులకు వెళ్ళి, వారికి కావలసిన భోజనవసతులను చూచుకొందురు." అని ఆయనతో చెప్పిరి. "మీరే వీరికి భోజనము పెట్టుడు" అని ఆయన పలుకగా "మా యొద్ద ఉన్నవి అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే. మేము పోయి, వీరికి అందరకు కావలసిన ఆహార పదార్ధములు కొనితెత్తుమా?" అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి అయిదువేలమంది పురుషులుండిరి . వారిని పంక్తులుదీర్చి, పంక్తికి ఏబది మంది చొప్పున కూర్చుండ బెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ అయిదు రొట్టెలను, రెండు చేపలను తీసికొని, ఆకాశమువైపు చూచి , వానిని ఆశీర్వదించి , త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరు భుజించి , సంతృప్తిపడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు పండ్రెండుగంపలకు ఎత్తిరి.
చారిత్రక నేపధ్యం: బెల్జియం దేశానికి చెందిన జులియాన అనే ఒక సన్యాసిని తనకు కలిగిన ఒక దర్శనం ద్వారా యేసు ప్రభువు యొక్క దివ్య శరీర రక్తముల మహోత్సవాన్ని జరపాలి అని కోరారు. 1230 వ సంవత్సరంలో తన దర్శనాన్ని కొంతమంది పండితలుకు తెలియజేసిన అది బయటకు పొక్కి ఆమెను అనేక మంది హేళన చేశారు. కాని 1246 వ సంవత్సరంలో లియేజ మెత్రాసనం ఈ పండుగ జరుపడానికి ఆమోదం తెలిపింది. జులియానకు సహాయంగా ఉన్న జకేస్ పంటలోన్ 1261 లో 4 వ ఉర్బన్ పోపు గారు అయ్యారు. 1264 లో తిరుసభ మొత్తనకి ఈ పండుగను వ్యాపింపచేశారు.
దివ్య సత్ప్రసాదం మానవ కోరిక : దివ్య సత్ప్రసాదం అంటే ఏమిటి యేసు ప్రభువు మానవునితో కలిసి ఉండటానికి పవిత్ర పూజలో అప్ప ద్రాక్ష రసంలను తన శరీరం , రక్తంగా మార్చి తన సాన్నిధ్యాన్ని మనం అనుభవించే విధంగా చేసి మనలోనికి రావడానికి మనతో ఉండటానికి దేవుడే ఏర్పరిచిన ఒక దివ్య సంస్కారం. శ్రీ సభలో అనేక పండుగలు ఉన్నాయి కాని యేసు ప్రభువు యొక్క దివ్య శరీర రక్తముల మహోత్సవం ఒక ప్రత్యేకం అయినది. ఎందుకంటే యేసు ప్రభువు యొక్క నిజమైన సాన్నిధ్యానికి ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి పండుగ ఇది. ఇది దివ్యసత్ప్రసాద దైవ సంస్కారానికి సంభందించిన పండుగ. ఈ పండుగ యేసు ప్రభువుని దివ్య సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడు అనుభవించాలి అనే ఒక కోరికతో , ఆయన సాన్నిధ్యానికి మరియు దేవుడు మనకు దివ్య సత్ప్రసాద రూపంలో తోడుగా ఉన్నందుకు కృతజ్ఞత తెలియచేసే పండుగ.
ఈ పండుగలో మనము ముఖ్యముగా ఏమి నేర్చుకోవాలి అంటే యేసు ప్రభువు సాన్నిధ్యాన్ని ఎలా అనుభవించాలి అని నేర్చుకోవాలి. యేసు ప్రభువు కడరా బోజన సమయంలో రొట్టెను తీసుకోని ఇది నా శరీరము మీరందరు దీనిని తీసుకోని భుజించండీ అని చెప్పడం వలన తన శిష్యులను యేసు ప్రభువు అర్హులుగా చేస్తున్నారు అంటే వారిని పవిత్ర పరుస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆయనను స్వీకరించలేరు. ఆయనను స్వీకరించడానికి నీవు అర్హుడవు కావాలి ముందు.పాత నిబంధనలో అపవిత్రంగా దివ్య మందసాన్ని తాకిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు. కాని ఇక్కడ మనం పాపులుగా ఉన్న యేసు ప్రభువు మనలను పవిత్ర పరచి ఆయనను స్వీకరించడానికి అర్హులుగా చేస్తున్నారు. ఇది మనం ఊహించలేని ఒక వరం. అందుకే పునీతులు దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్న యేసు ప్రభువును స్వీకరించడానికి ఎంతో ఇష్టపడేవారు.
పునీతులు ఎలా దివ్య సత్ప్రసాదంను గౌరవించారు
ఆరోజులలో ప్రతి రోజు దివ్య బలి పూజ ఉండేది కాదు. వారనికి ఒక సారి ఉండేది. పునీత చిన్న తెరజమ్మ గారు యేసు ప్రభువును స్వీకరించాలి అనె గొప్ప కోరిక కలిగి ఉండేది. తాను అనారోగ్యంతో ఉన్న సమయంలో తన గది నుండి దివ్య పూజ బలి జరిగే ప్రదేశానకి రావడానికి చాలా సమయం పట్టేది. ఆమె తన గది నుండి క్రిందకు దిగి వచ్చే సమయాంలో ప్రతి మెట్టు దగ్గర ఆగవలసి వచ్చేది. అప్పుడు ఆమె అసమాతో బాధపడుతూ ఉండేది. అవి ఒకరకముగా ఆమె చివరి రోజులు. వారానికి ఒక సారి అయిన నేను యేసు ప్రభువును నాలోనికి స్వీకరించాలి అని ఆమె ప్రొద్దున్నే తన గది నుండి దివ్య పూజ బలి జరిగే ప్రదేశం వచ్చే సరికి మూడు గంటలు సమయం పట్టేది. అది చూసిన ఆ మఠ పెద్ద గారు , ఆమెను నీవు రావద్దులే అనినా కాని యేసు ప్రభువును తనలోనికి స్వీకరించాలి అని ఆమె వచ్చేది.
ఆవిలాపూరి తెరేసమ్మ గారు తాను నూతన మఠాలను స్థాపించడానికి గల కారణం ఏమిటి అని చెబుతున్నప్పుడు శ్రీ సభకు వ్యతిరేకముగా ఉద్యమం జరిగినప్పుడు అనేక చర్చిలలో దివ్య సత్ప్రసాదంను నేల మీద పడవేసి అగౌరపరిచారు. అది యేసు ప్రభువును అగౌరపరచడం అని ఆమె అనుకునేవారు. ఆ అగౌరవానికి పరిహారముగా తాను నూతన మఠాలను ఏర్పరిచేవారు. ఆ మఠాలలో సన్యాసినులు ప్రతి నిత్యం దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్న యేసు ప్రభువును ఆరాధించేవారు, ఆ విధంగా యేసు ప్రభువుకు జరిగిన అగౌరవాన్ని, తాను ఈ నూతన మఠాల ద్వారా పరిహారం చేయాలనుకున్నాను అని ఆమె చెబుతుంది.
ఇది మన రక్షకుడు అయిన యేసు ప్రభువు తన సాన్నిధ్యాన్ని మన మధ్య ఏర్పారుచుకున్నందుకు కృతజ్ఞతగా జరుపుకునే పండుగ అని చెప్పుకున్నాం. అసలు యేసు ప్రభువు ఎందుకు యేసు ప్రభువు మన మధ్య ఉండాలి అని తన సాన్నిధ్యం ఏర్పరుచుకున్నారు? దీనికి సమాదానం ఆయన శిష్యులు ఎక్కువ తెలివి గలవారో , ఇతరులను ప్రభావితం చేయగలవారో అని కాదు, కానీ వారు చాలా బలహీనులు అని , ఆయన వారితో ఉన్నట్లైయితే వారు మంచి వారీగా , చేడుకు దూరముగా అదే విధముగా దైవ నిబంధనలకు అనుకూలమైన వారీగా జీవిస్తారు అని. యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నప్పుడు వారు చాలా ధైర్యంగా ఉన్నారు. యేసు ప్రభువు వారి మధ్య లేనప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభువుకు తెలుసు. వారు అందరు భయ భ్రాంతులకీ గురి అవుతున్నారు. పారిపోతున్నారు. అందుకే ఆయన వారి మద్యనే ఉండాలి. ప్రభువు దివ్య పూజ బలి ద్వారా, దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించడము ద్వారా ఇది సాధ్యపడుతుంది. కాబట్టి మనం ఈనాడు ఆయన శరీరరక్తాలను స్వీకరిస్తూ ఆయన సాన్నిధ్యం అనుభవిస్తున్నాం.
దైవ సాన్నిధ్యం - దివ్య బలిపూజ
యేసు ప్రభువు రొట్టెను విరుచుటతోటి ఎమ్మావు మార్గాన పోయే శిష్యులు ఆయనను గుర్తు పడుతున్నారు. అంతకు ముందు వారు దేవుని వాక్కుని విన్నారు. కాని అప్పుడు వారు గుర్తించలేని దైవ సాన్నిధ్యాన్ని ఆయన రొట్టను విరిచినప్పుడు గారు గుర్తిస్తున్నారు. యేసు ప్రభువు సాన్నిధ్యము వారి మధ్యనే ఉంది అని ఆయన రొట్టె విరిచినప్పుడు వారు ఆయనను కనుగొన్నారు. దీనినే శిష్యులు కూడా చేయడం ప్రారంభించారు. వారు వెళ్ళిన ప్రతిచోట దైవ వాక్కు బొదిస్తూ కలిసి రొట్టె విరవడం మొదలు పెట్టారు. కనుకనే మొదటి క్రైస్తవులు ఒకే హృదయము, మనసు కలిగి, కలిసి ప్రార్దన చేసి ,భుజించారు. ప్రభువు విందును తీసుకున్నారు. ఈనాటి సువిశేషంలో మనము చూస్తాము యేసు ప్రభువు రొట్టెను చేపలను తీసుకొని " ఆకాశమువైపు చూచి , వానిని ఆశీర్వదించి , త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను." ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు ఒక సంజ్ఞ. సంజ్ఞ అంటేనే అది మరి ఏదో చూపిస్తుంది అని. అది ఏమిటి అంటే దివ్య సత్ప్రసాదం. దివ్య బలి పూజలో రొట్టె , ద్రాక్ష రసం క్రీస్తు శరీర రక్తలుగా మారటాన్ని సూచిస్తున్నాయి.
శిష్యులు దైవ వాక్కు ప్రకటిస్తూ ప్రపంచ నలుమూలల వెళ్ళినప్పుడు అనేక చోట్ల క్రొత్త సంఘాలను ఏర్పాటు చేశారు. వారు ఒంటరిగా వెళ్ళక వారితోపాటు యేసు ప్రభువును తీసుకొనివేళ్లారు, వారు ఏ విధంగా ప్రభువుని తీసుకు వెళ్లారు అంటే వాక్యం ద్వారా మరియు రొట్టె విరవడం ద్వార. ఇది అనేక మందికి ఆదర్శం అయ్యింది. ఇది యేసు ప్రభువు వారికి నేర్పింది. నా జ్ఞాపకార్ధం చేయమని చెప్పినది. అంతె కాదు దీనికి ఎవరిని దూరం పెట్టేది కాదు. అందుకే పునీత పౌలు గారు ప్రభువు భోజనాన్ని మీరు అందరు కలసి తీసుకోవాలి అని కొంత మంది ధనికులు వేరుగా పేదవారు వీరుగా కూర్చున్న సందర్భం లో పౌలు గారు కోరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నారు.
శ్రీ సభ ఎదిగేకొద్ది దివ్యసత్ప్రసాధమునకు ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. దివ్య సత్ప్రసాదం తరచూ స్వీకరించడం అంటే క్రీస్తు ప్రభువుతో మనం సాన్నిహిత్యం పెంచుకోవడం. ఆయనతో వ్యక్తిగత సంభందం కలిగి ఉండటం. క్రీస్తుతో వ్యక్తిగత సంభందం కలిగి ఉండటం అంటే ఆయనతో స్నేహం కలిగి ఉండటం. దానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. పునీత చిలి దేశ తెరెసా గారు తాను మొదటి సారి యేసు ప్రభువు స్వీకరించే సమయంలో (మొదటి దివ్య సత్ప్రసాద స్వీకరణ) పవిత్రంగా యేసు ప్రభువును తన హృదయంలోనికి స్వీకరించాలి అని తన కుటుంబం మొత్తం దగ్గరికి వెళ్ళి వారి పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించినట్లు అయితే క్షమించమని ప్రతి కుటుంబ సభ్యుని ముందు మోకరించి అడిగారు , అంతె కాదు తన ఇంటిలో పని చేసే సేవకుల ముందు కూడా మోకరించి వారి పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించినట్లయితే క్షమించమని అడిగారు. యేసు ప్రభువుతో సాన్నిహిత్యం పెంచుకోవాలి అంటే, లేక వ్యక్తిగత సంబంధం పెంచుకోవాలి అంటే మనం పవిత్రంగా జీవించాలి.
దివ్య సత్ప్రసాద స్వీకరణ - అర్హత
యేసు ప్రభువును స్వీకరించడానికి మనం అర్హులమా అని మనం అనుకోవచ్చు. కాని యేసు ప్రభువే మనతో ఉండాలని, ఈ అప్ప ద్రాక్షరూపంలో మన దగ్గరకు వస్తున్నారు. మనలను ఆయన కేవలం ఆహ్వానించటంలేదు. ఆయనను స్వీకరించడానికి అర్హులను చేస్తున్నారు. అనేక అవకాశాలు ఇవ్వడం వలన ఆయన మనలను ఆయను స్వీకరించడానికి అర్హులను చేస్తున్నారు. జ్ఞాన స్నానం ద్వారా ఆయన మనలను శ్రీ సభ బిడ్డలుగా చేస్తున్నారు. భద్రమైన అభ్యంగనం ద్వార పవిత్రాత్మను ఇస్తున్నారు. పాప సంకీర్తనం ద్వార మన పాపములను క్షమిస్తున్నారు. దివ్య సత్ప్రసాదం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి శక్తిని ఇస్తున్నారు మనలోనికి రావడం ద్వారం మరియు మనతో వాసం చేయడం ద్వారా మనలను ఆయన మాతృకలుగా చేయడానికి , ఆయన వలె జీవించేలా చేయడానికి అన్నీ అవకాశాలు ఇస్తున్నారు. కనుక తరచూ ఆయనను స్వీకరిస్తూ ఆయన వలె మారుదాం. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి