యోహాను 6:22-29
మరునాడు, సరస్సు ఆవలి తీరమున ఉండిపోయిన జనసమూహము, అచటనున్న ఒకే ఒక పడవను చూసిరి. ఆ పడవలో శిష్యులతోపాటు యేసు వెళ్లలేదని శిష్యులు మాత్రమే వెళ్ళుట చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని, శిష్యులుగాని లేకుండుట చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి?" అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసిఉన్నాడు." అని యేసు సమాధానమిచ్ఛెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను? అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది." అని చెప్పెను.
ధ్యానము : యేసు ప్రభువును వెదకుచు తిబేరియా నుండి ప్రజలు వస్తున్నారు. వారు, అక్కడ యేసు ప్రభువు లేరని గ్రహించి, అక్కడ నుండి యేసు ప్రభువును వెదకుచు కఫర్నాము వెళ్లారు. వారు ఎందుకు యేసు ప్రభువును వేదకుచు వచ్చారు? వీరు అనేక కారణాలతో యేసు ప్రభువును వెదకుచు వచ్చి వుంటారు. కాని అన్ని కారణాలు కూడా తాత్కాలికమైనవే. వారు యేసు ప్రభువును చూసి "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి? అని అడిగిరి." అందుకు ప్రభువు మీరు నా అధ్భుతములు చూసి కాదు, మీరు సంతృప్తిగా భుజించినందుకు నన్ను వెదకుచున్నారు అని వారితో చెబుతున్నారు. ఆనాటి ప్రజలు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినది కూడా వారి యొక్క అవసరాలు తీరుస్తారని, లేక వారి కడుపు నింపుతారని లేక వారి తాత్కాలిక భాదల నుండి వారికి ఉపశమనం కలుగచేస్తారని వారు యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు. అంతేకాని ఆయన వారికి శాశ్వతమైనవి ఇస్తారు అనే ఆలోచన వారికి లేదు.
యేసు ప్రభువు నందు వారందరు కేవలం వారికి కావలసిన, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే వ్యక్తిని మాత్రమే చూశారు. వారికి అంతకంటే ఎక్కువుగా ఏమి ఉంటుంది అని తెలియదు. ఎందుకంటే వారి ఆలోచనలు ఎప్పుడు ఇహలోక విషయముల గురించి మాత్రమే. నేను కూడా ఈరోజు ఇటువంటి ఆలోచనలు మాత్రమే కలిగిఉన్నానా? అని ఒక సారి ఆలోచిస్తే ఈరోజు ఎక్కువగా దేవాలయము వచ్చేది మరియు ప్రార్ధించేది కూడా ఇటువంటి ఆలోచనలతోనే, తాత్కాలికమైన వాటికోసమే మనం దేవున్ని కోరుకుంటున్నాము. యేసు ప్రభువు స్వస్థ పరచిన అనేక మంది తరువాత ఆయన వెంట ఏమి లేరు, దాని తరువాత వారి పనులలో వారు నిమగ్నమైపోతున్నారు. కాని యేసు ప్రభువు ఎవరు ? ఆయన కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చేవాడేనా? లేక ఆకలి తీర్చే వాడు మాత్రమేనా? ఆయనను పూర్తిగా అర్ధం చేసుకోలేక పోతున్నాము. అయినప్పటికీ యేసు ప్రభువు అనేక సార్లు ఆయన ఎవరు ఆయన మనకు ఏమి ఇవ్వగలడు అని తెలియజేస్తూనే ఉన్నారు, కాని అది మనం అర్ధం చేసుకోలేకపోతున్నాము.
నా అధ్భుత కార్యములు చూసికాదు మీరు వచ్చినది అని యేసు ప్రభువు చెబుతున్నారు. యోహాను సువిశేషంలో యేసు ప్రభువు చేసిన ప్రతి అద్భుతం కేవలం ఆయన దేవుడు అని తెలియజేస్తుంది. ఆ అద్భుతాలలో ఇది ఏ మానవు మాతృడు చేయలేడు అనే అర్ధం వస్తుంది. యేసు ప్రభువు ప్రతి అధ్బుతం కూడా ఆయన దేవుడు అని తెలుపుతుంది. అటువంటి ప్రభువును మనము అర్ధం చేసుకోక ఆయన నుండి కేవలం ఇహలోక విషయములను మాత్రమే ఆర్ధిస్తున్నాం. ఆయన మనకు ఏమి ఇవ్వ గలడో మనం పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాము. ఇహలోక సంబంధమైనవాటిని కాకుండా ఆయన మనకు ఏమి ఇవ్వగలడు? అని ఒక సారి పరిశీలించనట్లయితే యోహాను సువిశేషం మొత్తం కూడా అదే మనకు ఆయన చెబుతున్నాడు.
"అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును." యేసు ప్రభువు మనకు ఏమేమి ఇవ్వగలడు మరియు మనము దేనికి శ్రమించాలి అనే విషయాలను ఇక్కడ యేసు ప్రభువు వెల్లడి చేస్తున్నారు. ఏమిటి శాశ్వతమైన భోజనం? ఆ భోజనము ఏమి ఇస్తుంది? యేసు ప్రభువు దీని గురించి తరువాత చెబుతారు , మోషే మీకు పరలోకము నుండి మన్న ఇవ్వలేదు. మనుష్య కుమారుడు మాత్రమే మీకు శాశ్వత భోజనము ఇస్తారు అని. ఆ శాశ్వత భోజనము ఏమి చేస్తుంది? అంటే నిత్య జీవనము ఇస్తుంది. యేసు ప్రభువు ప్రసాధించగలిగి మరలా ఎవరు ప్రసాదించలేనిది ఇదే. అదే నిత్య జీవము. ప్రభువు మనలను తన నుండి దానిని కోరుకోమని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన మాత్రమే అది ప్రసాదించగలడు. అంతే కాదు తండ్రి దేవుడు ఆయనకు ఆ అధికారమును ఇచ్చిఉన్నారు.
దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడిగినప్పుడు యేసు ప్రభువు వారికి తనను విశ్వసించమని చెబుతున్నారు. ఇక్కడ యోహాను సువిశేషం మనకు యేసు ప్రభువును విశ్వసించడం గురించి మనకు అనేక సార్లు గుర్తుచేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును విశ్వసించే వారు ఎలా నిత్య జీవం పొందుతారో ఈ సువిశేషం మనకు వివరిస్తుంది. యేసు ప్రభువును విశ్వసించే వారు, విశ్వసించుట వలన నిత్య జీవం పొందుతారు, వారికి దేవుని బిడ్డలగు భాగ్యమును ఆయన ప్రసాదించారు. తండ్రి దేవుడు మన నుండి ఆశించేది ఏమిటి అంటే మనం తన కుమారుడయిన యేసు ప్రభువును విశ్వసించాలి అని, ఆ విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందాలి దేవుడు ఆశిస్తున్నారు.
ప్రార్దన : ప్రభువా ! మీరు మా మీద ఎంతో ప్రేమతో మమ్ములను ఎల్లప్పడు మీతో ఉండేలా, నిత్య జీవితాన్ని మాకు ఇవ్వాలి అని మా దగ్గరకు వచ్చి , మీరు అనేక అధ్బుతలు చేసి మీరు మాకు ఏమి ఇవ్వగలరో చూపించన కాని మేము మిమ్ములను అర్ధం చేసుకోవడంలో విఫలం చెందాము, మా తాత్కాలిక భాదలు నుండి సమస్యల నుండి ఉపశమనాన్ని మాత్రమే మిమ్ము కోరుతూ ఉన్నాము. మా అజ్ఞానం మీకు తెలుసు ప్రభువా మేము ఏమి కోరుకోవాలో కూడా తెలుసుకోలేని పరిస్థితులలో మేము ఉన్నాము అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. మేము ఏమి అడగాలో , ఏది శాశ్వతమో అది అశాశ్వతమొ మాకు తెలియజేయండి. మేము ఎల్లప్పుడూ అశాశ్వతమైన వాటి కోసం పని చేసే వారిగా మమ్ములను మలచండి. మీరు మాత్రమే ఇచ్చే ఆ నిత్యం జీవం కోసం పని చేసే వారిగా , మిమ్ము ఎప్పుడు విశ్వసించే వారిగా మమ్ము చేయండి. తండ్రి మా నుండి ఆశించే పనిని చెసేలా మమ్ము ఆశీర్వదించండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి