యోహాను 17:11-19
పవిత్రుడవైన తండ్రి! మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్ట పుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు. కాని, నేను ఇపుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసితిని. కాని లోకము వారిని ద్వేషించినది. ఎలయన, నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్ధించుట లేదు. కాని, దుష్టుని నుండి కాపాడమని ప్రార్ధించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్టింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్టింపబడునట్లు వారి కొరకు నన్ను ప్రతిష్టించుకొనుచున్నాను.
ధ్యానము:
"పవిత్రుడవైన తండ్రి! మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము." తండ్రి దేవునకి కుమారునికి మధ్య ఉన్న అన్యోన్యత, ఐక్యతను గురించి ఈ సువిశేష భాగం చెబుతుంది. తండ్రి, కుమారుడు ఒకరియందు ఒకరు ఉన్నారు. కుమారుడు అడిగినది తండ్రి చేయడానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటాడు. తండ్రి చిత్తమును కుమారుడు సంపూర్తిగా చేయడానికి ప్రాణమును కూడా అర్పిస్తాడు. ఇద్దరు ఎప్పుడు ఐక్యంగా ఉంటారు. ఒకరి యందు ఒకరు ఉంటారు.
వీరి అన్యోన్యత, వీరి బంధం, శిష్యులకు ఆదర్శం, యేసు ప్రభువు శిష్యులు, అనుచరులు కూడా ఇదే విధంగా వారిలో వారు ఐక్యంగా ఉండాలని యేసు ప్రభువుని ఆకాంక్ష. శిష్యులు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉన్నది, వీరు ఐక్యంగా ఉండకపోతే వారు సాతాను యొక్క ప్రణాళికలకు గురి అవుతారు. కనుక యేసు ప్రభువు వారిని ఎల్లప్పుడు ఐక్యంగా ఉంచమని ప్రార్ధిస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులను ఐక్యముగ మాత్రమే ఉంచమని చెప్పడం లేదు. వారిని సురక్షితంగా ఉంచమని తండ్రిని అడుగుతున్నారు. వీరిని సురక్షితముగా తండ్రి మాత్రమే ఉంచాలి, యేసు ప్రభువు తాను వారితో ఉన్నప్పుడు వారిని అందరినీ నుండి కాపాడుకున్నాడు. యేసు ప్రభువు శిష్యులను పరిసయ్యుల, ధర్మ శాస్త్ర భోదకుల, భోదనల నుండి, శోదనల నుండి పాపము నుండి అన్ని విధాలుగా వారిని కాపాడుకున్నాడు. ఇప్పుడు ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత తండ్రే వారిని కాపాడాలి. శత్రువుల నుండి, లోకము నుండి, సాతాను నుండి దేవుడు వారిని కాపాడాలి. అందుకే వారిని సురక్షితముగా ఉంచమని ప్రార్ధిస్తున్నాడు.
"నేను నీ వాక్కును వారికి అందజేసితిని. కాని లోకము వారిని ద్వేషించినది. ఎలయన, నా వలె వారును లోకమునకు చెందినవారు కారు." యేసు ప్రభువు శిష్యులు దేవుని వాక్కును విశ్వసించారు, వారు ఆ వాక్కును అనుసరించడానికిని, మరియు ఆ వాక్కును పొందుటకు వారు సిద్ధముగా ఉన్నారు. దేవుని వాక్కు కేవలం శిష్యులకు మాత్రమే అందచేయబడలేదు. దేవుని వాక్కు అందరికీ అందచేయబడింది. కాని, శిష్యులు మాత్రమే దానిని అంగీకరించారు. ఇక్కడ శిష్యులు దేవుని వాక్కును అంగీకరించినవారు. వారు ఆ వాక్కును పాటించుటకు సిద్ధమైనవారు. వారిని ఈ లోకము ద్వేషించినది. వారు దేవునికి , దేవుని వాక్కుకు ఎంత దగ్గర అవుతున్నారో లోకము వారిని అంతగా ద్వేషిస్తుంది. శిష్యులు ఈ లోకములో ద్వేషించబడతారు, ఎందుకంటే వారు లోకము అనుసరించి జీవించుటలేదు. లోకములో ఉన్న కాని లోకమునకు వ్యతిరేకముగా, లోక ఆశలకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు. యేసు ప్రభువు ఈ లోకమునకు చెందిన వాడు కాదు. అందుకే ఈ లోకము ఆయనను ద్వేషించింది. ద్వేషించి, హింసించి, మరణానికి కారణమయ్యింది. యేసు ప్రభువుని చూచిన విధముగానే ఈ లోకము తన శిష్యులను చూస్తుంది.
"వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్ధించుట లేదు. కాని, దుష్టుని నుండి కాపాడమని ప్రార్ధించుచున్నాను." యేసు ప్రభువు తండ్రిని వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని చెప్పడం లేదు. ఎందుకు వారిని తీసుకొని వెళ్ళమని చెప్పడం లేదు అని అంటే, వారు ఈ లోకములో ఉండి, యేసు ప్రభువును ఎలా ఈ లోకమునకు తండ్రిని తెలియచేశారో అలానే యేసు ప్రభువు వెళ్ళిన తరువాత శిష్యులు తండ్రిని లోకమునకు తెలియజేయాలి. అందుకే యేసు ప్రభువు వారిని ఈ లోకము నుండి తీసుకొని వెళ్ళమని చెప్పుట లేదు కాని వారిని ఈ లోకములో కాపాడమని ప్రార్ధిస్తున్నాడు.
"సత్యమునందు వారిని ప్రతిష్టింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్టింపబడునట్లు వారి కొరకు నన్ను ప్రతిష్టించుకొనుచున్నాను" ఇక్కడ ప్రతిష్టించుట గురించి చెబుతున్నారు. ప్రతిష్టించుట అంటే ఒక ప్రత్యేక కార్యానికి ఉద్దేశించబడి వేరు చేయబడిన వారు. ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు దేవుని వాక్కు కోసం, సత్యము కోసం వారిని వేరు చేయమని అడుగుతున్నారు. తండ్రి , యేసు ప్రభువును ఎలా ఈ లోకమునకు పంపడం జరిగినదో అలానే యేసు ప్రభువు కూడా శిష్యులను పంపుచున్నారు. యేసు ప్రభువు వలె వారు ఈ లోకంలో జీవించాలి, వారు దేవుడు కారు , కాని వారి జీవితం ద్వారా దేవున్ని తెలియజేయవలసిన భాధ్యత వారి మీద ఉంది. అందుకే వారు యేసు ప్రభువు తండ్రి చిత్తమును చేయడానికి ఎలా ఉన్నారో , శిష్యులు కూడా యేసు ప్రభువును తెలియజేస్తూ ఉండాలి.
ప్రార్ధన : ప్రభువా మీరు ఈ లోకములో ఉన్నప్పుడు, మీ శిష్యులను ప్రతి ఆపద నుండి కాపాడారు, అన్ని రకాల శోదనల నుండి, సమస్యల నుండి , అవిశ్వాసం నుండి సాతాను నుండి , ఈ లోక ఆశల నుండి, చెడు గుణాల నుండి వారిని కాపాడారు. మేము ఇప్పుడు ఈ లోకములో జీవిస్తున్నాము, మిమ్ములను నమ్మి, మీ వాక్కు తెలుసుకొని పాటించే వారు మీ శిష్యులు, అనుచరులు అవుతారు అని తెలుసుకుంటున్నాము. మీ శిష్యులను మీరు అన్ని విధాలైన సమస్యల నుండి కాపాడిన విధముగా మమ్ములను కాపాడండి. మిమ్ములను అనుసరించినట్లయితే మిమ్ములను లోకము ద్వేషించినట్లే మమ్ములను కూడా ఈ లోకము ద్వేషిస్తుంది, అది మమ్ములను ద్వేషించిన మిమ్ములను విడనాడకుండా జీవించేలా మమ్ము దీవించండి. ప్రభువా మేము ఈ లోకములో జీవిస్తూ ఎలా అయితే మీరు తండ్రిని లోకమునకు తెలియ పరిచారో , మీ శిష్యులు ఎలా తండ్రిని లోకమునకు తెలియ పరచాలి అని మీరు కోరుకున్నారో మేము అలా చేసే విధముగా మమ్ము ఆశీర్వాదించండి. ఓ ప్రభువా మేము ఈ లోకములో మిమ్ములను, సత్యమును, నిత్య జీవమును తెలియజేయుటకు మమ్ములను ప్రతిష్టించండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి