యోహాను 17:1-11
యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్ధించెను: "తండ్రి ! గడియ వచ్చినది. నీకుమారుడు నిన్ను మహిమపరుచుటకు నీవు నీ కుమారుని మహిమ పరుపుము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి. ఏకైక సత్య దేవుడవగు నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును వారు తెలిసికొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి, నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. ఓ తండ్రీ! లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనొ, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమ పరుపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీ వారు. నీవు వారిని నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియేనని వారు ఇపుడు గ్రహించిరి. నీవు నాకోసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి, నేను నిజముగ నీ యొద్ద నుండి వచ్చితినని తెలిసికొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి. నేను వారి కొరకు ప్రార్ధించుచున్నాను. లోకము కొరకుకాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్ధించుచున్నాను. ఎలయన వారు నీ వారు . నా సర్వస్వము నీది. నీది అంతయు నాది. నేను వారి యందు మహిమపరుపబడితిని. నేను ఇక ఈ లోకమున ఉండను. కాని, వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రీ!మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము.
ధ్యానము: ఈ సువిశేష భాగం యేసు ప్రభువు తన శిష్యుల కోసం ప్రార్ధన చేసిన భాగం. యేసు ప్రభువు ఒక యాజకునిగా ఇక్కడ ప్రార్దన చేశాడు. తండ్రి దేవుడు తనకు అప్పగించబడిన వారి కోసం యేసు ప్రభువు ప్రార్ధన చేస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యుల కోసం తన తండ్రికి చేసిన ప్రత్యేకమైన విన్నపాలు వింటున్నాము. యేసు ప్రభువు ప్రార్ధన చేసిన ప్రతిసారి ఆయన ఆకాశమువైపు కనులేత్తి ప్రార్ధిస్తారు. తండ్రి నా గడియ వచ్చినది అని చెబుతున్నారు. ఏమిటి ఈ గడియ? గడియ అనే మాట అనేక సార్లు యేసు ప్రభువు చెబుతున్నారు. కానా అనే ఊరిలో జరిగిన పెళ్లిలో ఈమాట చెప్పారు. ఆయన గడియ ఇంకనూ రాకపోవుటచే ఎవరు ఆయనను ఏమి చేయలేకపోయారు అని మనం వింటున్నాం. కాని ఇప్పుడు యేసు ప్రభువు మరణించవలసిన సమయం వచ్చినది. ఇప్పుడు యేసు ప్రభువు రెండు విషయాలను వెల్లడి చేస్తున్నారు. మొదటిగా నీ కుమారుడు నిన్ను మహిమ పరిచినట్లు నీ కుమారుని మహిమ పరుపుము అని అంటున్నారు. యేసు ప్రభువును, తండ్రి మహిమ పరిచాడు యేసు ప్రభువు అడిగిన విదముగానే , ఎలా అంటే ఆయనను సమాధి నుండి లేపి మహిమ పరిచాడు. ఇది యేసు ప్రభువు చేసిన పనులు, చెప్పిన మాటలు మొత్తం కూడా నిజమే అని ఇది నిరూపిస్తుంది.
రెండవదిగా ఇక్కడ యేసు ప్రభువు శిష్యులు ఎవరు ? వారు ఎలా ఉండాలి అని తెలియ జేస్తూ వారి మీద ఆయనకు ఉన్న ప్రేమను వెల్లడి చేస్తున్నారు. " నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి." యేసు ప్రభువు అందరికీ ఈ నిత్యం జీవం ఇవ్వగలడు ఇందుకంటే ఆయనకు మాత్రమే ఆ అధికారం ఉంది.
యేసు ప్రభువుకు వీరి అందరికీ నిత్య జీవితం ఇవ్వుటకు అధికారం ఇవ్వబడింది. ఆయన సిలువ మరణం పొందడం వలన అది జరుగుతుంది. మనము ఇక్కడ యేసు ప్రభువు గొప్ప మనసును చూస్తాము ఎందుకంటే , తన శిష్యులలో ఉన్న పాపం , అవిశ్వాసం , ఏమి ఆయన చెప్పడం లేదు. తండ్రి ఎదుట వారిని గొప్ప వారిగా వారిని తీర్చిదిద్దుతున్నాడు. దేవుని గురించి వారికి పూర్తిగా ఆయన తెలియ పరిచాడు. దేవుడు ఎలాంటి వాడో ఆయన మాటల ద్వారా మరియు పనుల ద్వారా తెలియ జేశాడు. ఇక్కడ యేసు ప్రభువు తన, శిష్యులను వారు నీవారు అని చెబుతున్నారు. తనకు తండ్రి వారిని ఇచ్చాడు అని వారు ఆయనకు చెందిన వారని, వారిని ఎవరిని కోల్పోవకూడదు అని యేసు ప్రభువు ఎప్పుడు కోరుకుంటారు.
తండ్రి అయిన దేవుడే వారిని యేసు ప్రభువుకు ఇచ్చాడు. శిష్యులు అందరు ఈ లోకమునుండి వచ్చిన వారే. విశ్వాసులు అయిన వీరు తండ్రిచె కుమారునికి ఇవ్వబడిన బహుమానం. వారు క్రీస్తుకు చెందిన వారు. వారు అందరు పరలోకము చేరుట కుమారుని అభిలాష. ఎవరిని ఆయన పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే వారికోసం ప్రత్యేకంగా ప్రార్దన చేస్తున్నారు.
ఈ శిష్యులు దేవుని వాక్యమును పొందారు. ఈ విషయమును తండ్రికి కుమారుడు తెలియజేస్తున్నాడు. వారిలో లోపాలు ఉన్నప్పటికి వారు యేసు భోదను నమ్మి విధేయత చూపించారు. యేసు ప్రభువు వారి తప్పిదములను, ఎలా ఆయనను విడిచిపెట్టేది ఏమి చెప్పకుండా వారిలో మంచిని మాత్రమే తండ్రికి తెలియజేస్తున్నారు. వారు విధేయులు అని చెబుతున్నాడు. యేసు ప్రభువు అందరి కోసం కాక కేవలం తన శిష్యుల కోసం మాత్రమే ఈ ప్రార్దన చేస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువు తన శిష్యుల కోసం ఇంతగా తపిస్తున్నారు అంటే ఎలా తండ్రి మరియు కుమారుడు ఏకమై ఉన్నారో వీరు కూడా అలానే ఉండాలి అని కోరుకుంటున్నారు.
ప్రార్ధన : ప్రభువా ! మీరు తండ్రితో మాకోరకు ప్రార్ధించారు. మీ జీవితం మొత్తం కూడా మీరు మీ గడియ కోసం ఎదురు చూశారు. ఆ గడియ మీ మరణం మరియు పునరుత్థానం. దీని ద్వారా మీరు తండ్రి మీకు ఇచ్చిన భాధ్యతను సంపూర్ణంగా పూర్తి చేస్తున్నారు, మరియు మమ్ములను మీరు రక్షిస్తున్నారు. ఈ గడియ ద్వారా మీ తండ్రి మిమ్ములను మహిమపరుస్తున్నారు. మీరు చేసినది మరియు చెప్పినది మొత్తం నిజము అని మిమ్ములను తండ్రిని తెలుసుకోవడం నిత్య జీవం అని తెలుసుకుంటున్నాము. మేము మీ వాక్కును పొందామని, మీ మాటను పాటించామని, మేము మీరు తండ్రి చేత మీకు ఇవ్వబడ్డామని, మేము తండ్రికి చెందిన వారిమని నీవు తెలియజేస్తున్నావు. మా కోసం ప్రార్ధిచుచున్నావు , మేము మీరు కోరుకుంటున్నట్లు, మీతోనూ తండ్రితోనూ ఐక్యమై జీవించేలా మమ్ము దీవించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి