పేజీలు

27.11.23

అనుదిన దైవ వాక్య ధ్యాన ప్రార్ధన, లూకా 21: 1-4

 లూకా 21: 1-4 

దేవాలయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి, "ఈ పేద వితంతువు అందరికంటెను ఎక్కువగా  ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి. కాని ఈమె తన  పేదరికంలో తన సమస్త జీవనమును సమర్పించినది" అని పలికెను. 

ధ్యానము: యేసు ప్రభువు దేవాలయంలో కానుకలను వేయుచున్న ధనికులను చూస్తున్నారు. అందరు వారి వారి సమృద్ధి నుండి అక్కడ కానుకలను వేయుచున్నారు. ఆ ధనము వారు దానం చేయడం వలన వారి జీవితంలో ఏమి లోటు ఉండదు. కానీ అక్కడ ఒక పేద వితంతువు ఉన్నది. ఆమె కూడా ఆ కానుకల పెట్టెలో రెండు కాసులను వేస్తుంది. యేసు ప్రభువు ఆ పేద వితంతువు వేసిన రెండు కాసులను గురించి  అందరి కంటే ఎక్కువ ఆమె ఇచ్చినది  అని చెబుతున్నారు.  ఈ రెండు కాసులు ఎందుకు ఎక్కువ అంటే, ఈ పేద విధవురాలు ఎన్నో అవరోదాలను అధిగమించింది అయినా తన భక్తిని కోల్పోలేదు. ఈమెకు స్త్రీగా ఆనాటి కాలం అనేక విధాలుగా అసమాజం ఆమెను బాధించింది. మరియు ఆమెకు ఆదరువు ఎవరు లేరు కారణం ఏమిటి అంటే ఆమె ఒక వితంతువు. అంతే కాక ఆమె పేదరాలు ఇన్ని అవరోధాలు ఆమెకు ఉన్నకాని ఆమె కానుకను ఇవ్వడానికి సిద్దపడింది. ధనికులు వేయుచున్న కానుకలు వారి జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాదు. కానీ ఈ స్త్రీ వేసిన కానుక ఆమె జీవితంలో మార్పు తీసుకువస్తుంది. ఎందుకు అంటే ఆ రెండు కాసులను వేయడం వలన మరుసటి రోజు ఆమెకు ఏమి లేదు. 

యేసు ప్రభువు ఆమె గురించి తన సమస్త జీవనమును సమర్పించినది అని చెప్పారు. ఈ రెండు కాసులు ఆమె యొక్క సమస్త జీవనము. ఈ రెండు కాసులు మాత్రమే ఆమెకు ఉన్నటువంటి ఆస్తి ,  అయినట్లయితే , వాటిని ఆమె ఎందుకు సమర్పించినది? ఆమెకు జీవితము మీద ఆశ లేదా? లేక ఆమె తనకు ఉన్నటువంటిది మొత్తం దేవునికి సమర్పించి చనిపోవాలనువుకున్నదా? ఆమె దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎలాగంటే ఆమె పేదరాలు , పేదరాలిగా ఆమె దేవుని మీద ఆధారపడి జీవిస్తుంది. ఆమె ఒక స్త్రీగా ఆనాటి సమాజం తనను ఒక బలహీనురాలుగా ఉన్నది , బలహీనురాలిగా ఒక పురుషుని మీద ఆధారపడి జీవించవలసి ఉన్నది. ఆమె ఒక వితంతువు అవుట  వలన తన ఆధారపడుటకు ఎవరు లేరు. కనుక తన సమస్తం దేవుడే అవుతున్నాడు. అందుకే ఆ రెండు కాసుల మీద ఆధారపడకుండా వాటిని కూడా ఆ దేవాలయంలో కానుకల పెట్టెలో వేసి దేవుడే తన సమస్తము అని చాటుచున్నది. ఆమెకు దేవుని మీద ఉన్న నమ్మకం ఇక్కడ మనము చూడవచ్చు. ఈ రెండు కాసులను దేవునికి సమర్పిస్తే మరుసటి రోజు ఎలా గడుస్తున్నది అనే చింత లేదు. దేవుడు తనను ఆదుకుంటాడు అనే దానికంటే అయన ఇప్పుడు ఎలా ఆదుకుంటున్నాడు అనే విషయంలో నిమగ్నమయ్యింది. అంతేకాకుండా ఆమె దేవునికీ పూర్తిగా అంకితమైనది. దేవున్ని తన ఆస్తిగా చేసుకున్నది. 

సమృద్ధి నుండి అనేక మంది ధనికులు కూడా అక్కడ అర్పణ ఇచ్చారు, అవి ఇవ్వడం వలన వారికి ఎటువంటి లోటు ఏర్పడలేదు. ఆ ధనము వారి దగ్గర లేక పోవడం వలన వారికి ఎటువంటి ఇబ్బంది కలుగుటలేదు. మనం అర్పించే అర్పణ కేవలం మన దగ్గర ఉన్న మిగులు మాత్రమే అయితే అది నిజమైన అర్పణ కాదు. మనము అర్పించే ప్రతి అర్పణ అది మన జీవితంలో భాగం అయిఉన్నట్లయితే అది గొప్ప అర్పణ అవుతుంది. ధనికులు తమ జీవితంలో ఉన్నటువంటి మిగులును అర్పించారు. పేద విధవరాలు తన సమస్తము అయిన రెండు కాసులను అర్పించింది. ధనికులు ఎక్కువ అర్పించిన అది వారికున్న సమస్తము కాదు, కానీ పేద విధవరాలు రెండు కాసులే అర్పించిన అది తన సమస్తము. అందుకే యేసు ప్రభువు ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చినది అని చెబుతున్నారు.  ఆమె తన సమస్తము సమర్పించి దేవున్ని తన సమస్తం చేసుకున్నది. 

ఈ సువిశేషభాగం  మనము మనకు ఉన్న మిగులును మాత్రమే దేవునికి సమర్పిస్తూ , ఆ మిగులు ఇవ్వడం వలన మనకు ఎటువంటి లోటు లేదులే అని ఆనందపడుతున్నామా? లేక కొంత బాధకు గురి అయినా మనకు ఉన్న మిగులుకాకుండా, ఉన్నదాని దేవునికి సమర్పించి దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామా ? అని మనలను మనం పరిశీలించుకోవాలి అని తెలియజేస్తుంది. పేద వితంతువు వలే పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచి జీవించే గొప్ప జీవితం మనకు కావాలి. దేవుడే మన సమస్తము కావలి. 

ప్రార్ధన  : ప్రభువా మీరు , మీ వాక్కుద్వారా మీ సంకల్పాన్ని మాకు తెలియజేస్తున్నారు. మాలో ఉన్న లోపాలను తెలియజేస్తున్నారు. మేము ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు, మాలో ఉన్న లోపాలను ఎలా అధికమించాలో , మీ వలె ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు.ఈ జీవితమునకును , మీరు ఇచ్చిన ప్రతి అనుగ్రహమునకును మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  పేదరాలి దిన కానుకను చూచిన ప్రభువా! నేను నా జీవితంలో ధనికుల వలె , నాకు ఉన్న మిగులును ఇతరులతో పంచుకొని గొప్ప ఉదార స్వభావం కలిగిన వాడి వలే చెప్పుకొనుచున్నాను, నాకు మీరు ఇచ్చిన అని వరాలను అనుభవిస్తూ కూడా ఇతరులకు సహాయపడుటకు లేక మీకొరకు వినియోగించుటకు చిన్న ఇబ్బంది కూడా సహించలేకుండా ఉన్నాను.నాకు ఉన్నటువంటి ఆస్తి పస్తులు , నా సర్వస్వం అనే భావనలో ఉన్నాను.  ఇటువంటి ఆలోచనలతో చేసిన అనేక తప్పులకుగాను  నన్ను క్షమించండి. నాలో ఉన్న ఈ లోపాలను తీసివేయుటకు నాకు సహాయం చేయండి. పేద విధవరాలి వలె నేను కూడా నాకు ఉన్న సమస్తాన్ని మీకు అర్పించి, మీరే  నా సమస్తము అని తెలుసుకొని మిమ్ము  నా సమస్తముగా పొందే అనుగ్రహము దయచేయండి. ప్రభువా ! నిన్ను తెలుసుకొనుటకు మరియు అర్ధం చేసుకొనుటకు , మీ వలె మారుటకు సహాయం చేయండి. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...