పేజీలు

28.11.23

అనుదిన దైవ వాక్య ధ్యాన ప్రార్ధన, లూకా 21:5-11

 లూకా 21:5-11

కొందరు ప్రజలు ఆలయమును గురించి  ప్రస్తావించుచు "చక్కని రాళ్లతోను , దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు"అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో "ఈ కట్టడమును మీరు చూచుచున్నారుగదా! ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును"అనెను. అపుడు వారు "బోధకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి. అందుకు, అయన "మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలుకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని, మీరు వారివెంట వెళ్ళవలదు. యుద్ధములను, విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగితీరును. కాని, అంతలోనే అంతము రాదు." ఇంకను అయన వారితో ఇట్లనెను:"ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. 

ధ్యానం: యెరూషలేము దేవాలయం ఒక అద్భుత కట్టడం. ఆ దేవాలయం యిస్రాయేలు ప్రజల కీర్తిని చాటుచున్నది. అంతేకాక దేవాలయం మీద ఆ ప్రజలు ప్రేమను పెంచుకొని ఉన్నారు.  ఆ ప్రేమ ఎంతగా అంటే వారి జీవితంలో ప్రతి విషయం ఈ దేవాలయంతో ముడిపడి ఉండేది. యిస్రాయేలు ప్రజలు దేవాలయ అందం గురించి చెప్పుకుంటు గర్వించేవారు. ఇంతటి గొప్ప కట్టడం ఎక్కడ ఉండదు అనే భావం వారిలో ఉండేది. కేవలం కట్టడం గొప్ప తనమునే కాదు వారు ఈ దేవాలయం దేవుని సాన్నిధ్యానికి గుర్తు అని, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని , వారికి మరియు దేవాలయమును ఎప్పటికి ముప్పు వాటిల్లదు అనే భావనలో జీవించేవారు. దేవాలయం  పడగొట్టబడుతుంది అనే ఆలోచన వారి మనసులలో ఎప్పుడు వచ్చేది కాదు. అటువంటి ఆలోచన వారి ఊహకు అతీతము. కాని యేసు ప్రభువు వారి యెదుట వారి ఊహకందని విషయం చెబుతున్నారు. వారి దృష్టిలో యెరూషలేము ఎప్పటికి నిలిచిపోయే కట్టడం. 

యేసు ప్రభువు ఇక్కడ రాతిమీద రాయి నిలువని కాలము వచ్చును అని, అంతయు నాశనము చేయబడును అని అంటున్నారు. ఎందుకు ఈ ప్రజలు ఇంత ప్రేమగా చూసుకునే దేవాలయమును దేవుడు కాపాడలేదు? ఈ ప్రజలు కేవలం దేవాలయం బయట అందాన్ని మాత్రమే చూస్తున్నారు.  వారు ఎప్పుడు నిజమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన జీవితం ఎలా ఉండాలి అనే విషయాలను వారు పట్టించుకోలేదు. దేవునికి ఇష్టం లేని పనులను వారు చేస్తున్నారు. యిర్మీయా ప్రవక్త చెబుతున్న విధముగా దేవుడు వారి నుండి తన సాన్నిధ్యాన్ని తీసివేయుటకు వెనుకాడడు. దేవుడు తన సాన్నిధ్యాన్ని మొదట షిలోలో ఎరుక పరిచినప్పుడు వారు అనేక విధాలుగా వృద్ధి చెందారు. కాని  వారు ఆయనకు ఇష్టం లేని జీవితం జీవించినప్పుడు తన సాన్నిధ్యాన్ని అక్కడ నుండి తీసివేస్తున్నారు.  ఇక్కడజరుగుతున్నది ఇదే  యెరూషలేము ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు దేవుడు ఇక్కడ నుండి తన సాన్నిధ్యం తొలగిస్తారు.  కాని తన కుమారుని ఇక్కడకు పంపడం ద్వారా తన సాన్నిధ్యం పొందే అవకాశాన్ని మరల కలిగిస్తున్నారు. దేవాలయం ద్వారా కాకుండా యేసు ప్రభువు ద్వారా ప్రతి వ్యక్తి దేవుని సాన్నిధ్యాన్ని పొందుట జరుగుతుంది.  కనుక యెరూషలేము దేవాలయం పడగొట్టబడిన ప్రజలు దేవుని సాన్నిధ్యం పొందుట  యేసు ప్రభువులో జరుగుతుంది. 

యేసు ప్రభువు 'దేవాలయం ధ్వంసం చేయబడుతుంది' అని చెప్పగానే వారిలో కొంత భయం , బాధ కలిగి యేసు ప్రభువును ఇవి అన్ని ఎప్పుడు జరుగుతాయి అని అడుగుతున్నారు. వారు యేసు ప్రభువును సూచనలు అడుగుతున్నారు. దేవాలయం ద్వారా కాకుండా దేవుని కుమారుడు అయిన యేసు ప్రభువు ద్వారా మనము దేవుని సాన్నిధ్యం పొందవచ్చు కాని అయన పేరు చెప్పుకొని , అయన వలే ఉన్నామని, అనేక మంది దైవ సాన్నిధ్యం తమ ద్వారా పొందవచ్చు అని  చెబుతూవుంటారు. వారిని చూసి మోసపోవద్దు అని ప్రభువు చెబుతున్నారు. అనేక మంది యేసు ప్రభువు వలె వచ్చి మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. యేసు ప్రభువు వలె జీవించడం ఎవరికీ కుదరదు. నిజమైన క్రీస్తు అనుచరులు ఎవరు తామే క్రీస్తు అని చెప్పుకోరు. ఎందుకంటే వారి జీవితం మొత్తం ఆయనను అనుసరించడానికి వినయంతో వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. అబద్ధికుడు మాత్రమే అయన డాంభికము కోసం అయన వలె నటిస్తూ ఆ వినయమును చూపించలేక తమ కపటత్వాన్ని కొంతకాలానికి బయలుపరుస్తారు. మనము   యేసు ప్రభువు వలె సంపూర్ణంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. 

ప్రార్ధన: సర్వ సృష్టికి కారకుడవైన ప్రభువా , మీరు ఇచ్చిన తెలివి , జ్ఞానము  చేత మేము ఈ ప్రకృతిని, లోకమును సుందరముగా తీర్చి దిద్దుతున్నాము. వాటిని మా గొప్పతమునుగా భావిస్తూ, మీ అవసరం మాకు లేదు అన్నట్లు జీవిస్తున్నాము. అటువంటి పనులు చేస్తున్నందుకు మమ్ము క్షమించమని వేడుకుంటున్నాము. ప్రభువా మేము మీమమ్ములను కాదని ఈ లోకమును ఈ లోక వస్తువులను ప్రేమిస్తూ అవే ముఖ్యం అని జీవిస్తున్నందుకు మమ్ములను మన్నించండి. ప్రభువా మాకు ఏది సత్యమో , ఏది అసత్యమో తెలియక మేము అనేక మంది చేత చెడు మార్గాలలో నడిపించబడుతున్నాము.  అటువంటి సందర్భంలో మాకు సత్యాన్ని తెలియచేసి మిమ్ములను అనుసరించేలా చేయండి. ప్రభువా దేవాలయం లేకపోయినా మీ ద్వారా ప్రజలు దేవుని కనుగొన్నారు, మీద్వారా తండ్రిని చేరుకున్నారు. మీరు ఎలా దేవాలయం చేసే పనిని మీరు మీ జీవితం ద్వారా చేస్తున్నారో, మేము కూడా ముందు మిమ్ములను అనుసరిస్తూ , తండ్రిసాన్నిధ్యాన్ని పొందే అనుగ్రహం దయచేయండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...