పేజీలు

9.12.23

ఆగమనకాలపు రెండవ ఆదివారం, మార్కు 1: 1-8

మార్కు 1: 1-8

దేవుని కుమారుడు యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. యెషయా ప్రవక్తవ్రాసిన విధమున: "ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. 'ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు. ఆయన  త్రోవను  తీర్చిదిద్దుడు'అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను." ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు  హృదయపరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకటించు చుండెను. యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యొర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చుచుండెను. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుమునకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. "నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను. నేను మిము నీటితో స్నానము చేయించితిని. కాని అయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను.  

మార్కు సువార్త బాప్తిస్త యోహానుగారి పరిచర్యతో మొదలవుతుంది. మార్కు సువిశేషకుని ప్రకారం  యేసు ప్రభువుని బాప్తిస్మము తోటి ఆయన పరిచర్య  మొదలవుతుంది. యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మము మారుమనసు కొరకు.  అంటే ఒక వ్యక్తి తన పాపములు తెలుసుకొని , ఇకనుండి అటువంటి పనులు చేయకుండా మారడం.  పరలోక రాజ్యం స్థాపన అనేది మానవుని మారు మనసుతొటి మొదలవుతుంది. 
 యోహాను ఎడారిలో ఎలుగెత్తి   ప్రభుని మార్గాన్ని సిద్దం చేయమని చాటుచున్నాడు. ఎడారి నివాస యోగ్యం కాని ప్రదేశం. ఎడారి అంటే ఎటువంటి పంటలకు అనుకూలంగా లేని ప్రదేశం.  ఎడారి అనేది మతపరమైన పనులకు  వాడబడుతుంది.   ఆరోజులలో  యోహను యూదయ దేశపు  ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము  సమీపించినది. మీరు హృదయ పరివర్తన చెందుడు చెబుతున్నాడు. . యోహను ఎందుకు ఏడారికి వెళ్ళాడు? ఆయన అక్కడ ఏమి చేస్తున్నారు? ఏడారికి దేవుని అనుగ్రహం పొందటానికి వెళుతుంటారు, దేవునితో మాటలాడటానికి  మరియు శోధించబడానికి వెళుతుంటారు. పరీక్షింపబడటానికి వెళుతుంటారు. బైబుల్లో అనేక మంది ఇటువంటి ఉద్దేశ్యములతోనే ఏడారికి వెళుతుంటారు. యోహను ఎడారిలో దేవుని అనుగ్రహం పొందివున్నాడు. అక్కడ ప్రజల కొరకు  ఒక  సందేశం దేవుని నుండి పొందుతున్నాడు. అదే ప్రభువు మార్గమును సిద్దము చేయడం. హృదయ పరివర్తన పొందటం.  దానికి గుర్తుగా ఆయన బాప్తిసం ఇస్తున్నాడు. యోహాను ఇచ్చే బాప్తిసం మారుమనస్సు పొందుటకు అని మనకు తెలుస్తుంది. ఇది పశ్చాత్తాపాన్నీ తెలుపుతుంది.

హృదయ పరివర్తనకు   పశ్చాత్తాపం మొదటి మెట్టు. పశ్చాత్తాపం మనకు ఎప్పుడు కలుగుతుంది?.   ఎప్పుడైతే మనం చేసిన పని, లేక చెప్పిన మాట, లేక ఆలోచించిన ఆలోచన పొరపాటని లేక తప్పు అని గ్రహించి, ఆ విధంగా చేయడం వలన,  మనలను ప్రేమించిన వ్యక్తి ని బాధ పేడుతున్నామని తెలుసుకొని ఆ మార్గము నుండి మరలినప్పుడు మాత్రమే అది పశ్చాత్తాపం అవుతుంది. పరివర్తనకు మార్గం అవుతుంది. 

ఈ పరివర్తన గురించి మనం పాత నిబందనలో కూడా   చూస్తాము. 1. సొదొమ , గోమర్రోలకు ప్రకటించిన హృదయ పరివర్తన, 2. నినేవేకు ప్రకటించిన  హృదయ పరివర్తన. ఇక్కడ మనం చూసేది వారు హృదయ పరివర్తన చెందినచో వారు క్షమించ బడుతారు. అందుకే నినివే ప్రజలు  బూడిద మీద పోసుకొని , గోనె తాల్చి వారు పశ్చాత్తాపం ప్రకటించారు, రక్షించబడ్డారు. కాని ఇక్కడ యోహను ప్రకటించే హృదయ పరివర్తన కేవలం గోనె తాల్చడం, బూడిద మీద పోసుకోవడం గురించి కాదు. వారు  చేసేపనులు పశ్చాతాపన్ని తెలియచేయాలని చెబుతున్నాడు. 

ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని  ఎడారిలో  ఒక వ్యక్తి ఎలుగెత్తి  పలుకుచుండెనని  ఈ యోహనును గూర్చియే యోషయా ప్రవక్త  పలికింది. యోహను హృదయ పరివర్తన గురించి మాటలాడుతున్నాడు అంటే వారు కేవలం బప్తిస్మం తీసుకోవడం మాత్రమే కాదు, వారు చేయవలసిన పనులను గురించి చెబుతున్నాడు. ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు అని అంటున్నాడు. ఏడారిలో మార్గమును సిద్ధం చేయడం ఏమిటి? ఎందుకు అంటే? ఎడారి అనేది ఒక గమ్యం అంటు లేకుండా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో మార్గమును సిద్ధం చేయడం అంటే అగమ్యగోచరంగా ఉన్న మన జీవితాలకు ఖచ్ఛితముగా మార్గాన్ని అలవరచుకోవడం అవసరం అని తెలుపుతుంది.  ఎప్పుడైతే  మన జీవితాలకు ఒక నిర్ధిష్టమైన మార్గంను సిద్ధం చేయగలుగుతామో, అప్పుడు మనం యేసు ప్రభువును ఆహ్వానించవచ్చు. 

యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుమునకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. కొన్ని వందల సంవత్సరాల తరువాత యిస్రాయేలు ప్రజలు ఒక ప్రవక్తను చూస్తున్నారు. వారు  ప్రవక్తల గురించి విన్నారు కాని ప్రవక్త ఎలా ఉంటారో చూడలేదు. ఇప్పుడు వారు యోహను రూపంలో ఒక ప్రవక్తను చూస్తున్నారు. మనం ఏలియా ప్రవక్త ఎలా ఉండేవాడో వింటాము. అదే విధంగా యోహనును చూడటం ద్వారా ఒక ప్రవక్తను వారు తెలుసుకున్నారు. యోహనులో మనం చూసేదీ కేవలం ఒక ప్రవక్తను మాత్రమే కాదు. దేవునికోసం పూర్తిగా సంసిద్ధంగా ఉన్న వ్యక్తిని. తన యొక్క వస్త్రధారణ , తన ఆహారం అన్నీ కూడా తాను ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 

యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యొర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చుచుండెనుమనం అందరు తప్పు చేయడం గురించి తెలుసు, మనం ఏమైనా పొరపాటు చేసినప్పుడు ఎవరిని అయిన బాధ పెట్టి ఉండవచ్చు. అది ఎప్పుడైతే మనకు అర్ధం అవుతుందో మనము బాధ పడుతుంటాము. నిజానికి అటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే మనం పశ్చాతాపం కలిగిఉన్నట్లు. యోహాను దగ్గర జ్ఞాన స్నానం పొందడానికి వచ్చిన వారు అందరూ వారి వారి పాపాలను తెలుసుకొని, దేవున్ని వారి పనుల ద్వారా బాధ పెట్టము అని తెలుసుకొన్నవారు. మారు మనస్సు పొందుటకు సిద్దంగా ఉన్నవారు. యోహాను ఇచ్చిన బాప్తిసం ద్వారా వారి పాపాలు తీసివేయబడటం లేదు. కానీ దేవునికి వారి మారు మనస్సు తెలియజేస్తున్నారు. వారి పాపాలు ఎలా క్షమించబడతాయి? దాని గురించి యోహాను చెబుతూ యేసు ప్రభవు రాకను ప్రకటిస్తున్నాడు. 

"నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను. నేను మిము నీటితో స్నానము చేయించితిని. కాని అయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను. యేసు ప్రభువు దైవత్వం గురించి యోహాను వివరిస్తూ ఎలా ఆయన మన పాపములను తీసివేయబోతున్నాడో వివరిస్తున్నారు. యోహాను గొప్ప ప్రవక్త అయినప్పటికీ ప్రభువు ముందు తాను ఏమిటో తెలిసిన యాదార్ధవాది. ఎప్పుడు తన వాస్తవ స్థితిని తెలుసుకొని జీవించిన వ్యక్తి. ఆయనే ప్రభువు గురించి " నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని చెబుతున్నారు. ఎంతో నిష్టతో,  పరిశుద్దత కోసం కఠినమైన దీక్ష జీవితం జీవిస్తున్న ఆయనే, ప్రభువు పాదరక్షల వారును కూడా విప్పుటకు నేను యోగ్యుడను కాను అంటున్నారు. 

ఇంత మహోన్నతుడైన ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏమి చేయబోతున్నాడు? మనకు పవిత్రాత్మతో జ్ఞాన స్నానం ఇస్తాడు. మన పాపములను ఆయన పవిత్రాత్మతో ఇచ్చే జ్ఞానస్నానం తీసువేస్తుంది. అంతే కాక పవిత్రాత్మ మనకు తోడుగా ఉంటుంది. పవిత్రాత్మ ప్రభావం వలన మనిషి పూర్తిగా మారిపోయి ప్రభువు చెప్పినట్లు జీవిస్తూ, పాప క్షమాపణ పొంది, ప్రభువు కోసమే జీవించేలా మారుతారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...