మత్తయి 9:35-10:1,6-8
యేసు అన్ని పట్టణములను, గ్రామములను తిరిగి, ప్రార్ధనామందిరములలో బోధించుచు, పరలోకరాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధిబాధలనెల్ల పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొర్రెలవలే చెదరియున్న జనసమూహమును చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు" అని పలికెను. యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారమును ఇచ్చెను. కాని, చెదరిపోయిన గొర్రెలవలెనున్న యిస్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి, పరలోకరాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్టురోగులను శుద్దులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు.
ధ్యానం: నిన్ననే మనం నిష్కలంక మాత పండుగను జరుపుకున్నాం. ఈ పండుగ సందర్భంగా ఈ లోకానికి దేవుడు చెప్పిన మొదటి సువార్తను గురించి ధ్యానిస్తుంటాము. ఏమిటి ఈ మొదటి సువార్త అంటే స్త్రీ కి పుట్టబోయే మెస్సీయా. ఈ మెస్సీయ్యా ద్వారా మనం రక్షించబడుతాము. యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రకటించేది ఆయన గురించే. ఆయన గురించి ఆయన చెప్పే మాటలు వట్టి మాటలు కాదు, ఎందుకంటే ఆయన ద్వారా అందరు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమిటి ఈ పరలోక రాజ్యమును గురించిన సువార్త అంటే? అప్పటివరకు యిస్రాయేలు ప్రజలు మెస్సీయాను గురించి ఎదురుచూస్తున్నారు , ఇప్పుడు మెస్సీయా వారి దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభువు చేస్తున్న స్వస్థతలు, ఆయనే మెస్సీయా అని నిరూపిస్తున్నవి. అవి ఆయన మెస్సీయ్యా అనుటకు గుర్తుగా ఉన్నాయి.
యేసు ప్రభువుకు, ఆయన పనిలో పాలుపంచుకొనే వారు కావలి. ఆయనను అనుసరిస్తూ ఆయన వలె జీవించేవారు కావలి. వారు ప్రజల బాధలను చూసి , యేసు ప్రభువు ఎలా స్పందిచారో అలానే స్పందించే మనస్సు కలిగిన వారు అయిఉండాలి. ఇది కేవలం యేసు ప్రభువు శిష్యులు మాత్రమే కాదు, ఆయన అనుచరులు అందరు చేయవలసిన పని. ఎవరు అయితే ప్రభువుచేత అనుగ్రహాలు పొందుతున్నారో, స్వస్థతలు పొందుతున్నారో, వారు ఇతరులకు యేసు ప్రభువు చూపించిన ప్రేమను చూపించాలి. మనము ప్రభువు నుండి పొందిన దానికి ఇతరులతో పంచుకోవడానికి వెనుకడుగువేయకూడదు.
ప్రజలను చూచినప్పుడు యేసు ప్రభువు చాలా బాధ పడ్డారు. ఆ కారుణమయుని కడుపు తరుక్కు పోయింది అని చదువుతున్నాము. ప్రజలకు సరైన కాపరులు లేరు అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ప్రభువు తన శిష్యులను ఎలా బ్రతకాలో చెబుతున్నారు. ఎలా కాపరులుగా ఉండాలో నేర్పుతున్నారు. ఏహెజ్కెలు ప్రవక్త కూడా యిస్రాయేలు ప్రజలు కాపరి లేని వారి వలె ఉన్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు కేవలం కాపరిగా మాత్రమే రాలేదు. ప్రభువు మంచి కాపరి. ప్రభువే "నేను నా మంద కోసం నా ప్రాణామును కూడా ధారపోయుదును" అని చెబుతున్నారు. ఆయన ఎటువంటి కాపరి అనేది మనం ఈ సువిశేష భాగంలో చూస్తున్నాము. ప్రభువు కేవలం వారి అనారోగ్యాన్ని మాత్రమే చూడటం లేదు. వారి సమస్యలను చూసి, ప్రభుని కడుపు తరుక్కు పోయింది. అంటే ప్రభువు ప్రజల అన్ని సమస్యలను చూస్తున్నారు. వారి వ్యక్తిత్వాలు, వారి సంబంధాలు, వారి సమస్యలు అన్నింటినీ ప్రభువు చూస్తున్నారు. వాటి ద్వారా వారు పొందే అనేక బాధల నుండి వారిని కాపాడాలని ప్రభువు కోరిక. ఒక మంచి కాపరి మాత్రమే వారిని ఈ సమస్యల నుండి బయటకు తీసుకురాగలరు. ఆ కాపరి ప్రభువు వలె ఉండాలి. ప్రభువు వలె చూడాలి. ప్రభువు వలె వినాలి. ప్రభువు వలె వారి జీవితాలలో పాలుపంచుకోవాలి.
ప్రభువు చెప్పినట్లుగా నడుచుకోవడానికి అనేక మంది సిద్దముగా ఉన్నారు. కాని వారికి ప్రభువు మాటలను ఎవరు చెబుతారు. ఎవరు ప్రజలను తన సొంత వారినిగా చూస్తారు. ప్రభువు వలే ఎవరు తన మందను కాపాడుతారు. అందుకే యేసు ప్రభువు కోతగాండ్ర కోసం పార్థన చేయమని అడుగుతున్నారు. దేవున్ని, కోతగాండ్రును పంపించమని ప్రార్ధించమంటున్నారు. అంటే కోతగాండ్ర పని యేసు ప్రభువు వలె ఉండటం. ఇది ఈ లోకంలో ప్రతి కైస్తవుని పని. అప్పుడె లోకం నిజమైన కాపరులు కలిగి ఉంటుంది. అందుకె యేసు ప్రభువు తన శిష్యులను పిలుస్తున్నారు. వారికి అన్ని అధికారాలు ప్రభువు ఇస్తున్నారు. వారు చేయవల్సిన అన్ని పనుల గురించి ప్రభువు వారికి చెబుతున్నారు. వారికి ప్రజలను , అన్ని రకాలైన సమస్యలనుండి కాపాడే శక్తి ఇస్తున్నారు. .
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన : ప్రభువా! మీరు మా పరలోక రాజ్యమని మేము తెలుసుకున్నాము. మీరు ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ, వారి వ్యాధులను, తీసివేస్తూ, స్వస్థతనుఇవ్వడం వలన మీరు మెస్సీయ్యా అని మేము గుర్తిస్తున్నాము. ప్రభువా! ప్రజల బాధలు తట్టుకోలేక మీ కడుపు తరుక్కుపోయింది, ప్రభువా , ఆ ప్రజలను చూసినట్లు మమ్ములను కూడా ఒకసారి చూడండి. మాలో ఉన్న అన్ని సమస్యలను తొలగించండి. ప్రభువా మీ మాటలను పాటించుచు ఎల్లప్పుడు, మీమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి. ప్రభువా! మీ అనుచరునిగా, మీ వలె జీవిస్తూ , ఉండుటకు సిద్దంగా ఉన్న మమ్ము , మీ శిష్యుల పంపినట్లుగా మీ సందేశాన్ని ఇస్తూ, ప్రజల అవసరాలలో బాధలలో పాలుపంచుకొంటూ, ఎప్పుడు ప్రజలను మీ వైపు తీసుకువచ్చే కాపరులుగా మమ్ము మలచండి. ప్రభువా! ప్రజల సమస్యలు మీ సొంతవి అన్నట్లు మీరు భావించారు అందుకే , మీ కడుపు తరుక్కు పోయింది, తండ్రిని కాపరుల కోసం ప్రార్ధించమని చెబుతున్నారు. ఇతరుల పట్ల , మీరు కనపరచిన మనస్తత్వం, మాకు దయచేయండి. ఆమెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి