లూకా 10:21-24
ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, "ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రీ! ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మారెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికీ ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు" అనెను. అపుడు యేసు శిష్యులవైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి: "మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి! ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి. కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవినగొరిరి, కాని వినజాలకపోయిరి" అని పలికెను.
ధ్యానం: యేసు ప్రభువు ఈ సువిశేష భాగంలో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. యేసు ప్రభువు కృతజ్ఞతలు తెలియజేయడానికి గల కారణం ఏమిట అంటే? ఆధ్యాత్మిక విషయాలు దైవ రాజ్యం కేవలం తెలివిగలవారికో, జ్ఞానులకో, పండితులకొ కాకుండా చిన్న పిల్లలకు , సాధారణ ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకు తండ్రికి, ప్రభువు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యూదయా మత నాయకులు కాని, ఈ లోకంలోని ఆధ్యాత్మిక వేత్తలుకాని దేవుడు వారి సొత్తు అన్నట్లు మాటలాడటం సర్వసాధారణం. కాని యేసు ప్రభువు, దేవున్ని, దైవ జ్ఞానాన్ని సాధారణ మనుషులకు తెలియజేస్తున్నారు. అందుకె యేసు ప్రభువు దైవ జ్ఞానాన్ని అందరికి పంచి దేవునికి ప్రతి వ్యక్తి ముఖ్యమే అని తెలియజేస్తున్నాడు.
ఈ విషయాల యేసు ప్రభువు పుట్టుకలో కూడా జరుగుతున్నాయి. యేసు ప్రభువుని జననం మొదటిగా తెలుసుకున్నది గొర్రెల కాపరులు, ఎవరు ఈ గొర్రెల కాపరులు అంటే వీరు ఒక ప్రదేశం నుండి మరియొక ప్రదేశంకు గొర్రెలను మేపుకుంటూ , పొలాలలోనే తిరుగుతూ ఉండే ప్రజలు. సహజంగా ఊరికి చివర పొలాల్లో ఉండేవారు. వీరిని దొంగలుగా భావించి ఎటువంటి శుభకార్యములకు ప్రజలు వీరిని పిలిచేవారు కాదు. ఇటువంటి వారికి రక్షకుని జనన విషయము మొదటిగా తెలియయజేయడం జరిగినది. యేసు ప్రభువు శిష్యులు కూడా ఎవరు పండితులు కాదు. సాధారణం వ్యక్తులు, జాలరులు, సుంకరులు. ఇటువంటి సాధారణ వ్యక్తులను యేసు ప్రభువు తన శిష్యులుగా ఎన్నుకుంటున్నారు. ప్రభువుతో కలిసి జీవించే అవకాశం ఇటువంటి సాధారణ వ్యక్తులకు ఇవ్వడము దైవ జ్ఞానాన్ని పామరులకు ఇవ్వడం ఇవ్వన్నీ కూడా మనకు ఇవ్వబడ్డ గొప్ప వరాలే. ఎవరు కూడా ఇది కేవలం పండితులు మాత్రమే పొందుతారు అని అనుకొనవసరం లేదు.
యేసు ప్రభువు తండ్రి గురించి తెలియపరచిన తరువాత మనం ఎవరుకూడా పరిసయ్యుల వలె దైవ జ్ఞానం, లేక దైవ రాజ్యం , ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం మనకు మాత్రమే ఉంటుంది. ఇతరులు దానిని పొందలేరు అనే గర్వం, అజ్ఞానం ఉండకూడదు అని తెలుసుకోవాలి. యేసు ప్రభువుతో కలిసి జీవించే గొప్ప అనుభూతి శిష్యులకు, చిన్న పిల్లకు ప్రభువు ఇస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది ఇవి అన్ని సాధారణ ప్రజలకు తెలియజేయడం తండ్రి సంకల్పం అని ప్రభువు తెలియ జేస్తున్నాడు. ఇది తండ్రి సంకల్పం అయితే తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అర్ధమవుతుంది.
నా తండ్రి నాకు సమస్తము అప్పగించి యున్నాడు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ మాట మరియొక చోట కూడా ప్రభువు చెబుతున్నారు. తండ్రి సమస్తం ఆయన కోసమే చేశాడు, ఆయనకే సమస్తాన్ని అప్పగించి యున్నాడు. సమస్తము మీద ప్రభువుకే అధికారము కలదు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, కుమారుడికి మాత్రమే తండ్రి తెలుసు మరియు తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు. తండ్రి గురించి మనకు అనేక మంది చెప్పారు కాని వాస్తవంగా ఈ లోకంలో ఎవరికి పూర్తిగా తెలియదు. అనేక మంది తండ్రి గురించి చెప్పారు. వారిలో ప్రవక్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కాని ఎవరు కూడా తండ్రిని పూర్తిగా ఎరుకపరుచలేదు. యేసు ప్రభువు మాత్రమే తండ్రిని, ఆయన యొక్క ప్రేమను, కరుణను, తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు తండ్రిని అందరికీ తెలియజేస్తున్నాడు. లోక మత పెద్దలు వలె కేవలం కొద్ది మందికి మాత్రమే దైవజ్ఞానం అని కొంతమందిని వేరుచేయడం లేదు. యేసు ప్రభువు శిష్యులకు వారు అనుభవిస్తున్న గొప్ప భాగ్యం గురించి తెలియజేస్తున్నాడు. అది ఏమిటి అంటే ప్రవక్తలు, రాజులు అనేక గొప్ప వ్యక్తులు క్రీస్తును చూడాలి అని అనుకున్నారు, కాని శిష్యులకు మాత్రమే ఇది ఇవ్వబడింది. అదేవిధంగా తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు అందుకే తండ్రి , యేసు ప్రభువును గురించి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను సంతసించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. అంతేకాక ఈయన చెప్పినట్లు చేయుడు అని చెబుతున్నాడు. ఆదే విధంగా కుమారుని జననం గురించి కూడా తండ్రి తన దేవదూతల ద్వారా తెలియజేస్తున్నాడు.
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు దైవ జ్ఞానాన్ని సాధారణమైన వ్యక్తులకు తెలియజేయటను మీరు ఎంతగానో ఆనందించారు. మీరు ఈవిషయమై పవిత్రాత్మ యందు కూడా ఆనందిస్తున్నారు. మాకు దైవ జ్ఞానాన్ని ఇచ్చి , మా మీద ఉన్న ప్రేమతో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభువా! మీరు తండ్రిని మాకు అందరికీ తెలియపరుస్తున్నారు. ప్రభువా ఎవరికి తెలియని విషయాలు ,గొప్ప వారు అందరు తెలుసుకోవాలనుకున్న విషయాలు మాకు తెలియ పరస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. తండ్రి గురించి మాకు తెలియజేయడం తండ్రి అభీష్టం అని తెలియజేస్తున్నారు, అందుకు కృతజ్ఞతలు. ప్రభువా ,మీ అనుచరులుగా ఉన్న మేము, ఎప్పుడు కూడా మీ గురించి మాకే తెలుసు ఇతరులకు తెలియదు, తెలియకూడదు అనే గర్వం మాలో ఉండకుండా మమ్ములను శుద్దిచెయ్యండి. ప్రభువా! అందరికీ దైవ జ్ఞానం ఉండాలనే కోరిక మీ వలె మేము కూడా ఉండేలా చేయండి. ప్రభువా ఎల్లప్పుడు మేము మీతో ఉండే భాగ్యం దయచేయండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి