పేజీలు

5.12.23

మత్తయి 15:29-37

మత్తయి 15:29-37

యేసు అక్కడ నుండి గలిలీయ సముద్ర తీరమునకు వచ్చి, కొండపైకి  ఎక్కి కూర్చుండెను. అపుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగగును అనేకులను తీసికొనివచ్చి, ఆయన పాదసన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థ పరచెను. అపుడు మూగవారు మాటాడుటయు, వికలాంగులు అంగపుష్టి  పొందుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి, విస్మయమొంది, యిస్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరం యేసు తన శిష్యులను పిలిచి, "ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. అపుడు శిష్యులు, "ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచటనుండి. కొనిరాగలము?" అని పలికిరి. అంతట యేసు "మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి?" అని వారిని అడిగెను. "ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి" అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ ఏడు రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి, త్రుంచి, తన శిష్యులకు ఈయగా వారు ఆ జనసమూహమునకు పంచి పెట్టిరి. వారు అందరు భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండ ఎత్తిరి. 

ధ్యానం: యేసు ప్రభువు గలిలీయా ప్రాంతానికి వస్తున్నాడు. ఆయన అంతకు ముందు కననీయ స్త్రీ విశ్వాసము గురించి చెప్పి ఆమె కుమార్తెను కాపాడాడు. అది చూసిన ప్రజలు, యేసు ప్రభువు అద్భుతాల గురించి తెలిసిన ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. యేసు ప్రభువు అక్కడ నుండి గలిలీయా ప్రాంతానికి వచ్చి, అక్కడ  కొండను ఎక్కి కూర్చొని ఉన్నారు. ఆయన అద్భుతాలు చూసిన వారు, ఆయన మాటలను విన్నవారు అందరు ఆయనను వెంబడిస్తున్నారు. అద్భుతాలు చూసిన వారు అనేక మందిని గ్రుడ్డివారిని , కుంటివారిని, మూగవారిని, వికలాంగులను తీసుకొని వస్తున్నారు. ఎందుకు వారందరిని తీసుకొని వస్తున్నారు? వీరు అందరిని తీసుకొనిరావడానికి గల కారణం ఏమిటి అంటే వారు అందరు స్వస్థత పొందాలని, యేసు ప్రభువుని శక్తి తెలుసుకొని వారు ఆయన ద్వారా స్వస్థత పొంది మంచి జీవితం వారు పొందాలని, వారిని తీసుకొని వస్తున్నారు. కేవలం యేసు ప్రభువు ద్వారా స్వస్థత పొందాలని మాత్రమే కాదు, ఆయన మాటలను వినాలని వారు అందరు వస్తున్నారు. ఆయన చేసే అధ్భుతాలు మాత్రమే కాక ఆయన మాటలు జీవమైన మాటలు, అంతకు ముందు వారు ఇటువంటి జీవమైన మాటలు  వినలేదు. శిష్యులు , యేసు ప్రభువు మాటలు వినిన వారు, అధ్బుతాలు చూసిన వారు,  మిగినలిన వారందరు అక్కడకు రావడానికి ఉపయోగపడ్డారు. మనం కూడా ఆయన అనుచరులుగా కష్టాలు, బాధలలో ఉన్నవారిని, రోగులను, జీవవాక్కు అవసరంలో ఉన్నవారిని ప్రభువు ప్రభువు దగ్గరకు తీసుకొని రావాలి. అది వారు బాగుపడుటకు, పరిపూర్ణులు అవుటకు ఉపయోగపడుతుంది. 

వారి అందరిని ప్రభువు స్వస్థ పరిచారు. యేసు ప్రభువు అక్కడకు వచ్చిన ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తున్నారు. ఇక్కడ స్వస్థ పరచడం అంటే వారిలో ఉన్న లోపాలను తీసువేసి వారిని  పరిపూర్ణమైన వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, ఆయన అనుగ్రహం పొంది వెళుతున్నారు అంటే, అతను పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతున్నారు అని మనకు అర్ధం అవుతుంది. అక్కడ జరుగుతున్న విషయాలను చూస్తున్న, యిస్రాయేలు ప్రజలు దేవున్ని స్తుతిస్తున్నారు. ఇది కేవలం అప్పటి ప్రజలు మాత్రమే కాదు, యేసు ప్రభువును నమ్మిన వ్యక్తులు జీవించే జీవితవిధానం కూడా, ఇతరులను  దేవున్ని స్తుతించేలా చేస్తుంది. అపోస్తులుల కార్యాలలో ఇది మనం చూస్తాము. అంతే కాదు ఇది  క్రీస్తు ప్రభువు అనుచరుల జీవిత విధానం, వీరి ప్రార్ధన ద్వారా ఇతరులు పొందే స్వస్థత కూడా మిగిలినవారు  దేవున్ని స్తుతించడానికి ఉపయోగపడుతుంది. అది చేయవలసిన బాధ్యత ప్రభువు అనుచరులుగా మన మీద ఉన్నది. 

"ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. యేసు ప్రభువు మన ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాదు, ఆయన మానవుల  భౌతిక అవసరాలను గురించి  కూడా ఎంతగానో శ్రద్ద కలిగి ఉంటారు. యేసు ప్రభువు అంతమందిని స్వస్థ పరచడం ఇది మనకు తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు అందరు మూడు రోజుల నుండి ఉన్నారు. వారు ఏమి తినలేదు. ఒకవేళ వారు అక్కడ నుండి వెళితే, మార్గ మధ్యలో శక్తిలేక పడి పోతారు ఏమో అని ప్రభువే వారికి భోజన వసతిని కలిపిస్తున్నారు. వారిని అలా పంపించి వేయడం ప్రభువుకు ఇష్టం లేదు అంటే మనం లేమితో ఉండాలి అని ప్రభువు కోరుకోవడం లేదు. ప్రభువునకు మనం అంటే చాలా ఇష్టం అందుకే మానవునికి సంభందించిన ప్రతి చిన్న విషయమును కూడా ప్రభువు అంత శ్రద్ద తీసుకుంటున్నారు. మన తల్లి, తండ్రి వలె ప్రభువు మనలను చూస్తున్నారు. 

అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలను చేపలను తీసుకొని దేవునికి అర్పించి వాటిని అందరికీ పంచుతున్నారు. ఇక్కడ మనం చూసే ఈ అధ్భుతం మనకు ఒక విషయం తెలియజేస్తుంది. మన దగ్గర ఉన్నది అందరం పంచుకుంటే, దేవుని దీవెన అక్కడ ఉంటుంది. అక్కడ ఎవరికి కోదువ ఉండదు.మరియు ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. యేసు ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యమును, మొదటి క్రైస్తవ సంఘము అవలంభించినది. వారి వద్ద ఉన్నదానిని వారు తీసుకొన వచ్చి, పంచుకొని బ్రతికారు, అందరికీ సమృద్దిగా లభించినది. ఎవరికి తక్కువ కాలేదు. ఇది మనం ప్రభువు వద్ద నుండి నేర్చుకోవాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ఓ ప్రభువా! మీరు ఎంత ఉన్నతులు. అనేక మందిని వారికి ఉన్న వైకల్యం నుండి బయటకు తీసుకువచ్చి వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తున్నారు. వారిలో ఏ లోపం లేకుండా వారిని అందమైన దేవుని సృష్టిగా చేస్తున్నారు. మీ ఓర్పుకు, అనేక రకాలైన లోపాలతో బాధ పడేవారిని, పరిపూర్ణ వ్యక్తులుగా చేసిన మీ మంచి హృదయానికి కృతజ్ఞలు తెలుపుతున్నాను ప్రభువా. ప్రభువా! నాలో  కూడా అనేక లోపాలు ఉన్నవి, అవి మిమ్ములను చూచుటకు, మీ మాటలను వినిపాటించుటకు ఆటంకముగా ఉన్నవి, నాలో ఉన్న ఆ లోపాలను తీసివేయండి. నన్ను కూడా పరిపూర్ణమైన  వ్యక్తిగా మార్చుము. అలానే నేను కూడా మీ వద్దకు ఇతరులను తీసుకువచ్చేలా , ముందు నన్ను మీ నిజమైన అనుచరుడను చేయండి.  ప్రభువా! మీకు ప్రజలు పస్తులు ఉండి మీ వద్ద నుండి వెళ్ళడం ఇష్టం లేక వారికి కావలసిన అహరం ఇవ్వడానికి మీరు సిద్దపడ్డారు. వారికి కావలసిన అహరం వారికి ఇచ్చారు. ప్రభువా! నా జీవితంలో అనేక విషయాలలో మిమ్ములను నమ్మి మీ మాటలను వినాలని,  మీతో ఎప్పుడు ఉండాలని కోరికతో ఉన్నాను. ఆ ప్రజల ఆకలి తీర్చిన విధంగా నాకు ఏమి అవసరమో మీరే ప్రసాదించండి. ఆమెన్. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...