మత్తయి 11:28-30
భారముచే అలసిసొలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాదుశీలుడనియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి మీరు నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన, నా కాడి సులువైనది, నా బరువు తెలికైనది.
ధ్యానం : "భారముచే అలసిసోలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" యేసు ప్రభువు చెబుతున్న ఈ భారము ఏమిటి ? నా యొద్దకు రండు అని ప్రభువు చెబుతున్నాడు. యేసు ప్రభువు ప్రజలకు ఒక ఆహ్వానం ఇస్తున్నారు. ఆ ఆహ్వానం ఎందుకు? ఎందుకు ప్రభువు తన యొద్దకు రమ్మంటున్నారు? ఆయన ఏమి ఇస్తాను అంటున్నారు? ప్రజలు ఎందుకు అలసిసోలసియున్నారు? నా కాడి మీరు ఎత్తుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. ఆయన కాడి అంటే ఏమిటి? నేను సాదుశీలుడననియు, వినమ్రహృదయుడననియు అని నా నుండి నేర్చుకోండి అని ప్రభువు చెబుతున్నారు. ఆయన నుండి ఏమి నేర్చుకోమని ప్రభువు చెబుతున్నారు? నా కాడి సులువైనది, నా బరువు తెలికైనది అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి ఆయన కాడి? ఆయన బరువు ఎలా తేలికగా ఉంటుంది? ఈ సువిశేష భాగం చాలా చిన్నది అయిన మనకు చాలా ప్రశ్నలు, జవాబులు ఇక్కడ దొరుకుతాయి.
ప్రజలు భారముచే అలసిసొలసి ఉన్నారు. ఏమిటి ఈ భారము? పరిసయ్యులు , ధర్మ శాస్త్ర భోదకులు ఎలా ప్రజల మీద మోయలేని భారమును మోపుతున్నరో మనం పరిశుద్ద గ్రంధంలో చూస్తాము. మోయలేని భారం వారు ప్రజల మీద మోపుతున్నారే కాని, వారికి సహాయ పడుటకు వారి చిటికిన ఏలును కూడా వారు కదపరు అని ప్రభువు పలుకుతున్నారు. ఇక్కడ భారము అంటే వారి సాంప్రదాయాలు, నియమాలు మాత్రమే కాదు. వారి జీవితములో వారు అనుభవిస్తున్న అనేక మైన జీవిత బాధలు కూడా ఉన్నవి. ఇక్కడ ఇంకొక అర్ధం కూడా ఉన్నది, వారు అవలంభిస్తున్న తోరా , పవిత్ర గ్రంధం లోని మొదటి ఐదు గ్రంధాలు. వీటిని పాటిస్తున్నాము అనే అపోహలో, వారికి ఉన్న నియమాలను, అలివికాని విధంగా అనేక రేట్లు పెంచుకుంటూ పోయారు. ఈ భారము కూడా ఈ ప్రజల మీద ఉంది. ఈ భారములతో ప్రజలు అలసి పోయారు. అందుకే ప్రభువు భారముచే అలసిసోలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకి రండి అంటున్నారు.
"నా యొద్దకు రండు నేను మీకు విశ్రాంతి నొసగెదను" ఇది ఒక గొప్ప ఆహ్వానము, ఎవరికో ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి ఈ ఆహ్వానం ఇస్తున్నారు. ఇది సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంధంలో, వివేకవంతురాలైన స్త్రీ ఇచ్చిన, విందుకు ఆహ్వానం ఇచ్చినట్లుగా ఉన్నది. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారు, ఇప్పటివరకు పొందిన భారాన్ని వారు తొలగించుకోవచ్చు. అది ఎటువంటి భారం అయిన కావచ్చు. పాపం భారంతో ఉన్నవారు, ఆయన వద్దకు వస్తే వారి పాపముల భారం తొలగిస్తారు. ధర్మ శాస్త్ర భోదకుల నియమాలతో వారి చెప్పిన వాటిని చేయలేక నిరాశ, నిస్పృహలో ఉన్న వారు ఆయన వద్దకు వచ్చి సేదతీరవచ్చు. దేవుని అనుగ్రహం కోసం వెదకి వేసారిన వారికి ఇది ప్రభువును కనుకగొని ఆయనతో ఉండుటకు ఇది గొప్ప అవకాశం.
నా కాడిని మీరు ఎత్తుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. కాడి అంటే రెండు ఎద్దులను లేక పశువులను పొలం దున్నటకు లేక ఏమైనా మోయుటకు జత చేస్తూ ఉపయోగించేది. బండి బరువు మొత్తం కూడా కాడి మీదనే ఉంటుంది. యేసు ప్రభువు నాకాడి మీరు ఎత్తుకొనుడు అని అంటున్నప్పుడు, వారు ఎటువంటి కాడిని మోస్తున్నారో ఆయనకు తెసులు. కాడి దించేది కేవలం వారి గమ్యం చెరినప్పుడే. ఈ ప్రజలు సాంప్రదాయాలు, నియమాలు, బలులు అన్ని పాటిస్తున్నప్పటికి వారి గమ్యం అయిన దేవున్ని చేరడం లేదు. ఈ కాడి చాలా భారంగా ఉన్నది. ఇటువంటి కాడి కంటే యేసు ప్రభువుని కాడిని ఎత్తుకొనమని ప్రభువు చెబుతున్నారు. నా కాడి సులువైనది, నా బరువు తెలికైనది. అని ప్రభువు చెబుతున్నారు. ఎందుకు ప్రభువు కాడి సులువైనది? ఎందుకంటే ప్రభువు దేవుని ఆజ్ఞలను పెంచి ప్రజలకు ఇవ్వడంలేదు. వారిని కఠిన విధానాలు పాటించమని చెప్పడంలేదు. ప్రభువుని విధానం చాలా సులువైనది. సాంప్రదాయాలు, నియమాలు, బలులు, వీటి అన్నింటి కంటే సులువైనది. ఎందుకంటే ఆయన విధానం ప్రేమ, కరుణ, క్షమాపణ, మారు మనసు. ఈ కాడిని ఎత్తుకుంటే గమ్యం చేరడం సులభం. గమ్యం వారి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఆయనే ప్రతిఒక్కరి చివరి గమ్యం.
సాదుశీలుడనియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి మీరు నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. యేసు ప్రభువు దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన ఎంత కరుణామయుడు అనే విషయం తెలుస్తుంది. యేసు ప్రభువు ఉపమానాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన వద్దకు వచ్చిన వారిని, ఆయనను కాదు అన్నవారిని, ఆయనను కొట్టిన వారిని, ఆయనతో తిరిగి ఆయన ఎవరో తెలియదు అనిన వారిని, ఆయన క్షమించిన విధానం, వారికి ఆయన చూపించిన ప్రేమ, ఆయన సాదుశీలుడని, వినమ్రహృదయుడని తెలియజేస్తుంది. యేసు ప్రభువు మనలను ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోమంటున్నారు. తెలుసుకోవడమే కాక నేర్చుకోమంటున్నారు. ఇది మనం యేసు ప్రభువు వద్దకు వెళ్ళితే జరుగుతుంది. అపుడు మన ఆత్మల యందు విశ్రాంతి పొందుతాము అని చెబుతున్నారు. అంటే ఆయన దగ్గరకి వెళితే మనం నిశ్చింతగా ఉండవచ్చు. https://amruthavellaturi.blogspot.com/2022/11/blog-post.html
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు ఎంత కరుణామాయులు, అనేకమంది మిమ్ములను అవమానించిన కాని, వారిని క్షమించారు. మీ కారుణ్యం ఎంతో గొప్పది. మేము అనేక సమస్యలతో, బాధలతో ఉన్నాము. వాటి నుండి సేదతీరాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. సేద తీరాలని, విశ్రాంతి పొందాలని మేము చేసిన అనేక ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నిజమైన విశ్రాంతి మేము పొందలేకపోతున్నాము. ప్రభువా! నేను మీ ఆహ్వానాన్ని స్వీకరించి మీ వద్దకు వస్తున్నాను. మీ నుండి వినమ్రతను, సాదుశీలతను నేర్చుకొనే ఆవకాశం ఇవ్వండి. ప్రేమ, కరుణ, క్షమాపణ అనే మీ కాడిని మేము కూడా నేర్చుకొని అనుకరించేలా చేయండి. ప్రభువా మీరు చెబుతున్న ఆత్మ యందు విశ్రాంతిని మాకు చేయండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి