పేజీలు

19.12.23

లూకా 1:26-38

లూకా  1:26-38

తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రధానము చేయబడిన  కన్యక యొద్దకు  పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు"అనెను. మరియమ్మ ఆ పలుకులకు  కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవ దూత "మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని  అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ "నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?" అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్రశిశువు 'దేవుని కుమారుడు' అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినదిగదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవమాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును  లేదు" అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!" అనెను. అంతట ఆ దూత వెళ్ళి పోయెను

ధ్యానము:   పవిత్ర గ్రంధంలో గాబ్రియేలు దేవదూత, జెకర్యా, మరియమ్మ మరియు పాత నిబంధనలో దానియేలుకు దర్శనం ఇస్తున్నాడు. ఆయన దర్శనమిచ్చిన ప్రతిసారీ ఒక ముఖ్యమైన సందేశమును తీసుకొని వస్తున్నాడు. ఈ సువిశేషభాగంలో నజరేతునగరంలో ఉన్న మరియమాత వద్దకు వస్తుంది. నజరేతు ఒక వ్యాపార నగరం, రోమా సామ్రాజ్యం నుండి వర్తకానికి అనుకూలంగా ఉండే   నగరం.  ఇది మరియమ్మ, యోసేపుల నగరం. అక్కడ మరియ తల్లికి దేవదూత దర్శనం ఇస్తున్నాడు. మరియమ్మ కన్య మరియు యవనప్రాయంలో  ఉన్నది, పెళ్లి కాలేదు. నిశ్చితార్ధం జరిగినది.  దేవుడు ఒక గొప్ప కార్యనికి ఆమెను ఉపయోగించుకొనుటకు, ఆమెలో వున్న ప్రత్యేకత ఏమిటో ఆమె దేవదూతతో మాటలాడిన మాటలు తెలియజేస్తాయి. ఆమెకు ఉన్న పేదరికం, చిన్న వయస్సు ఇవి అన్ని కూడా దేవుని కార్యములో పాలుపంచుకొనుటకు ఆటంకం కాలేదు. దానికి ఆమె వ్యక్తిత్వం ఎంతగానో ఉపయోగపడింది. దేవున్ని మనం విశ్వసిస్తె మనకు ఉన్న బలహీనతలు ఏమి కూడ, దేవుని అనుగ్రహం పొందుటకు ఆటంకం కావు అని తెలుస్తున్నది. దేవుని అనుగ్రహం మనకు వెంటనే కీర్తిని తీసుకురాకపోవచ్చు. మరియమాత దేవునికి ఇచ్చిన మాట ఆమెకు వెంటనే కీర్తిని తీసుకురాలేదు. ఆమెకు అవమానాలు, తిరస్కారాలు కూడా తీసుకువచ్చింది. దేవుని ప్రణాళికకు ఆమే సహకారం, దేవునికి ఆమె విధేయత, దేవుని చిత్తమె ఆమె జీవితంలో జరగాలి అనే ఆమె కోరిక అన్ని కూడా ఆమె గొప్ప తనాన్ని చాటుతున్నవి. నేను దేవుని దాసురాలను అనే ఆమె మాట, ఆమెకు వ్యతిరేక  పరిస్థితిలో కూడా దేవుని ప్రణాళికా జరగాలి అనే ఆమె నిశ్చయించుకుంది. దేవుని ప్రణాళికకు ఆమె విధేయించడం వలన యేసు ప్రభువు ద్వారా రక్షకుడు ఈ లోకానికి మనలను రక్షించుటకు వస్తున్నారు. 

 యేసు అంటే దేవుడు రక్షించును అని అర్ధం. యేసు ప్రభువు తన ప్రజలను పాపముల నుండి రక్షిస్తారు. యోహోషువా యిస్రాయేలు ప్రజలను వాగ్ధాన భూమికి తీసుకుపోతున్నాడు. యేసు ప్రభువు నిత్య జీవానికి తీసుకెళుతారు. అందుకే యేసు ప్రభువు పేరు మీద ప్రజలు స్వస్థత పొందుతున్నారు. ఒక కన్యకకు  యేసు ప్రభువు పుట్టుక ప్రజలకు నమ్ముటకు కష్టముగా ఉండవచ్చు. విశ్వాసము మనకు ఈ విషయముల మీద వెలుగును ఇస్తుంది. గాబ్రియేలు దేవదూత ఈ విషయం వివరిస్తుంది. అది ఏమిటి అంటే దేవునికి అసాధ్యం అనేది ఏమి లేదు. యేసు ప్రభువు, మరియతల్లి కన్య గర్భము ద్వారా,  పాపమలినం సోకకుండా ఈ లోకమునకు వస్తున్నాడు.

మరియమాత ఔన్నత్యం ఏమిటి?  మరియమాత దేవుని ప్రణాళిక జరుగుటకు ఏమి చేసినదో ఆలోచిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, అని పలికిన మరియమాత చేసిన సాహసం చాలా గొప్పది. ఆమె పురుషుని ప్రమేయం లేకుండ బిడ్డను కన్నది అంటే, ఎవరు నమ్మక పోవచ్చు. తన భర్త తనను అర్ధం చేసుకోక, తనను విడిచిపెట్టిన, తను  ఘోరమైన  అవమానం పొందవచ్చు. తన తండ్రి, తల్లి పట్టించుకోక పోవచ్చు. అప్పుడు ఆమె ఒక అనాధలా మారిపోవచ్చు. యోసేపు ఈ విషయమును మత పెద్దల వద్దకు తీసుకువెళితే, ఆమెకు మరణ శిక్ష విధించె అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులు తన జీవితంలో వచ్చే అవకాశం ఉన్న కూడా దేవుని చిత్తము నా జీవితంలో జరగాలి అని ఆమె నిర్ణయించుకున్నది. 

దేవునికి అసాధ్యం అయ్యేది, ఏది లేదు అని గాబ్రియేలు దేవదూత చెప్పిన మాటలు మరియమాత నమ్మింది. సారా పెద్దావిడ అయినప్పటికీ ఆ వయసులో ఆమె గర్భం దాల్చబడుతుంది అన్ని చెప్పినప్పుడు, ఆమె దేవుని నమ్మక నవుతుంది. జెకర్యా దేవుని మాటను నమ్మక,  ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నాడు.మరియమాత మాత్రం, పురుషుని ప్రమేయం లేకుండా ఎలా సాధ్యం అనే  సందేహం వెల్లడిచేసిన, దేవునికి అసాధ్యం అయ్యేది ఏమి లేదని, ఎటువంటి అపనమ్మకం లేకుండా, నీవు చెప్పినట్లు నాకు జరుగునుగాక అని, నేను దేవుని దాసురాలనని, తాను దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏమి చేయడానికైనా సిద్ధం అని తెలియజేస్తుంది. దేవుని నమ్మే ప్రతి వ్యక్తి కూడా  ఇలా చేసినట్లయితె వారు గొప్ప వారిగా మిగిలిపోతారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు ఎంత ప్రేమమయులు, మీరు మమ్ములను రక్షించుటకు, మీ దూతను, మీ దాసురాలీ  దగ్గరకు పంపి, మీ ప్రణాళికను తెలుపుతున్నారు. మీరు ఎప్పుడు మానవుడు రక్షించబడాలి, ఉన్నత జీవతం జీవించాలని కోరుకుంటున్నారు. ప్రభువా! మీరు ఎప్పుడు మరియమాతతో ఉన్నారు. ఆమెతో ప్రతిక్షణం మీరు ఉన్నారు. ఆమెతో మీరు ఉండుట వలన ఎటువంటి తప్పు లేకుండా జీవించకలిగి, మీకు ఇష్టమైన జీవితం జీవించినది. ప్రభువా! మరియమాతతో ఉన్నట్లు మాతో కూడా ఎల్లప్పుడు ఉండండి. మేము కూడా మీకు ఇష్టమైన జీవితం జీవించేలా చేయండి. ప్రభువా! దేవదూత మరియమాత దగ్గరకు వచ్చి అనుగ్రహపరిపూర్ణురాల అని చెబుతుంది. ఆమె ఎలా అనుగ్రహ పరిపూర్ణురాలు అయ్యిందో, మమ్ములను కూడా మీ అనుగ్రహములతో నింపండి. ప్రభువా! మరియమాత,  గాబ్రియేలు దేవదూతతో, "నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక" అని చెబుతుంది. ఆ తల్లి దేవుని చిత్తము తన జీవితంలో జరుగుటకు తనను తాను, దేవుని దాసురాలుగ మార్చుకుంది. మీ చిత్తం చేయడమే తన జీవితంలా అనుకున్నది. మేము కూడా మీ చిత్తం నెరవేర్చడానికి, మమ్ములను మేము మీ దాసులుగా చేసుకునేలా చేయండి. ఆమెన్.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...