లూకా 1:39-45
ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయానమైపోయెను. ఆమె జెకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిశబేతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిశబేతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిశబేతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను: "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు!"
ధ్యానము: ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయానమైపోయెను. గాబ్రియేలు దేవదూత, ఎలిశబేతమ్మ గర్భము ధరించినదని చెప్పిన మాటలను విశ్వసించి, ఎలిశబేతమ్మను చూచి ఆమెకు తోడుగా ఉండుటకు, మరియమాత అక్కడకు వెళుతుంది. మరియమాత చేసిన ఈ ప్రయాణం చాలా కష్టమైనది. ఆమె నజరేతు నుండి ఒక పర్వత ప్రాంతం వైపు వెళుతుంది. ఈ ప్రయాణం, మరియమాత మరియు యోసేపులు జనాభా లెక్కలకు వెళ్లినంతటి కష్టమైనటువంటిది. ఎందుకంటే ఆమె పర్వతప్రాతంవైపు వెళ్ళాలి. అది ఒక రోజు కంటే ఎక్కువ ప్రయాణమే. ఆ రోజులలోఅటువంటి ప్రాతమునకు ఆ ప్రయాణం ఒక సాహసం లాంటిదే. ఎందుకు మరియమాత అటువంటి నిర్ణయం తీసుకుంటుందంటే ఎలిశబేతమ్మ గర్భవతి అయిన విషయం అప్పటికి మరియమాతకు, జెకర్యాకు మాత్రమే తెలుసు. ఎలిశబేతమ్మ వారి చుట్టము, వయసు మళ్లిన వ్యక్తి. గర్భవతిగా ఉన్న ఆమెకు సహయం చేయుటకు వెళుతుంది. మరియమాత అవసరంలో ఉన్నవారిని ఆదుకోనుటకు ఎటువంటి కష్టము అయిన భరిస్తుంది. మరియమాతలో ఉన్న ఈ సుగుణం మనం ఇతర సమయాలలో కూడా చూస్తాము. కానా అనే ఊరిలో పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి సహాయం చేయుటకు ప్రభువుకు విన్నవిస్తుంది. శిష్యులందరు యూదుల భయంతో పై గదిలో ఉన్నప్పుడు వారితో కలిసి, వారికోసం ప్రార్ధన చేస్తుంది.
మరియమాత మరియు ఎలిశబేతమ్మ మధ్య సంభాషణ ఇక్కడ యేసు ప్రభువు ఎవరు అనే విషయం తెలియజేస్తుంది. ఇక్కడ బాప్తిస్మ యోహను యేసు ప్రభువు సాన్నిధ్యాన్ని గాంచి ఎంత ఆనందించాడో మనకు తెలుస్తుంది. యోహాను తన తల్లి గర్భమున ఉండి కూడా, యేసు ప్రభువును గుర్తిస్తున్నాడు. గాబ్రియేలు దేవ దూత చెప్పినట్లుగా ఆయన తన తల్లి గర్భమున ఉండగానే పవిత్రాత్మతో నింపబడ్డాడు. అందుకే ఆయన తల్లి గర్భమున ఉన్న గాని, యేసు ప్రభువును గుర్తించగలుగుతున్నాడు. గుర్తించడమే కాదు, యేసు ప్రభువు సాన్నిధ్యం ఎంత మధురమైనది అనె అనుభూతిని అనుభవించి తల్లి గర్భములో ఉండి గంతులు వేయడం వలన తెలియజేస్తున్నాడు. ఎలిశబేతమ్మకూడా, యేసు ప్రభువును గురించి తెలియ చేస్తుంది. ఆయన ప్రభువు అని గుర్తిస్తుంది.
"స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను" మరియ మాత స్త్రీలందరిలో ఆశీర్వదించబడినదని, ఆమెను గురించి ఎలిశబేతమ్మ పవిత్రాత్మ ప్రేరణతో చెబుతున్నది. మనలో ప్రతి ఒక్కరినీ దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మరియమాతను ఎందుకు అంతా గొప్పగా ఆశీర్వదించారంటే, ఆమె దేవుని చిత్తమునకు తన జీవితాన్ని అంకితం చేసిన విధానం అంత గొప్పది. అందుకే తన కుమారున్నీ ఆమె ద్వారా ఈ లోకానికి తీసుకువస్తున్నాడు. ఎలిశబేతమ్మకూడా దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఆమెకు ప్రభువును ఇతరులకు తెలియజేసే, ప్రభువును గుర్తుపట్టకలిగే, ఆయన సాన్నిధ్య మాధుర్యాన్ని అనుభవించ కలిగే కుమారున్నీ ఇస్తున్నాడు. ఆమెకు ఉన్న పేరును పోగొడుతున్నారు. వీరి ఇద్దరి కలయిక దేవుని శక్తిని శంకించని ఇద్దరి కలయిక. ఇక్కడ పరమ పవిత్రుడైన దేవుని సాన్నిధ్యాన్ని, పాప కళంకం లేని యోహాను ఆనందిస్తున్నాడు.
ఎలిశబేతమ్మ ఒక ప్రవక్త వలె పవిత్రాత్మతో ప్రేరేపించబడి, మరియమాత గర్భముతో ఉన్నానని చెప్పకపోయిన కాని మరియమాత గురించి నా ప్రభువుని తల్లి నా దగ్గరకు రావడం నాకు ఎలా ప్రాప్తించేను అని చెబుతుంది. ఆమె రావడం తనకు దేవుని అనుగ్రహంగా ఆమె చెబుతుంది. మరియమాత మరియు ఆమె గర్భ ఫలమగు యేసు ప్రభువును ఆశీర్వదింపబడినవారు అని చెబుతుంది. మరియమాత గర్భమున ఉన్న శిశువు తన ప్రభువు అని చెప్పడం వలన ఎలిశబేతమ్మ పవిత్రత కూడా మనకు తెలుస్తుంది. మరియమాత దేవుని కుమారుని తన గర్భమున మోసినందుకు మాత్రమే ధన్యురాలు కాదు, ఎలిశబేతమ్మ చెప్పిన విధముగా ప్రభువు వాక్కులు నెరవేరునని నమ్మినందుకు ఆమె ధన్యురాలు. ఎందరో గొప్పవారు కొన్ని దేవుని నుండి వచ్చిన ప్రవచనములను నమ్ముట లేదు. కాని దేవునికి వ్యతిరేకముగా మాటలాడకుండా వుండవచ్చు. కాని మరియమాత ఒక సాధారణ యువతి దేవుని నుండి వచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది అని నమ్ముతుంది. గాబ్రియేలు దూత ఎలిశబేతమ్మ గర్భం గురించి చెప్పగానే ఆమెకు సపర్యాలు చేయడానికి వెళుతుంది. మరియమాత విశ్వాసులందరికి తల్లి. ఎలా దేవుని విశ్వాసించాలో ఆమెను చూసి నేర్చుకోవాలి. దేవుని మీద ఆమె వలె నమ్మకం కలిగిఉండాలి. https://www.daivavaakkudhyaanam.com/2023/12/126-38.html
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా! మీ ప్రేమ ఎంత ఉన్నతము. మీ ప్రణాళికకు తన జీవితమును అంకితం చేసిన మరియమాతను ఎంతో మిన్నగా ఆశీర్వదించారు. మీరు చెప్పిన ప్రతి మాట జరుగుతుంది అని నమ్మిన మరియమాత జీవితం మాకు ఆదర్శం. మేము కూడా మీ ప్రణాళికకు మా జీవితాలను అంకితం చేసేలా చేయండి. మరియ మాతను ఆశీర్వదించిన విధముగా మమ్ము కూడా ఆశీర్వదించండి. ప్రభువా! మీ సాన్నిధ్యాన్ని యోహాను ఎంతగానో ఆనందిస్తున్నాడు. మీ పవిత్రతను యోహాను తెలుసుకున్నట్లు మేము కూడా పవిత్రత కలిగి మీ సాన్నిధ్యా మాధుర్యం అనుభవంచే అనుగ్రహం దయచేయండి. ప్రభువా! మీ అనుగ్రహాలు, ఆశీర్వాదాలు తెలుసుకొని వాటిని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేలా మమ్ము దీవించండి. ప్రభువా! మరియమాత వలె మీ యడల ఎప్పటికీ సన్నగిళ్ళని విశ్వాసాన్ని ఇవ్వండి. ఆమెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి