లూకా 21:29-33
అయన వారికి ఒక ఉపమానమును చెప్పెను: "అంజూరపు వృక్షము, తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినపుడు, వసంతకాలం సమీపించినదని తెలిసికొందురు. అట్లే ఇవిఅన్నియు సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలిసికొనుడు. ఇవి అన్నియు జరుగునంతవరకును, ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమ్యాకాశములు గతించిపోవును. కాని నా మాటలు ఎన్నటికిని గతించిపోవు.
ధ్యానం : యేసు ప్రభుని మాటలు చాల స్పష్టముగా ఈ లోకము గురించి చెబుతున్నారు. చెట్లు కొత్త చిగురును తొడుగుకినునపుడు వసంతకాలం అని అందరికి తెలుసు. వాతావరణమార్పులను బట్టి మనము కాలాలను గుర్తిస్తాము. యేసు ప్రభువు మనలను ఏవిధముగా మనం వీటిని తెలుసుకుంటున్నామో అదేవిధముగా యేసు ప్రభువు చెప్పిన విషయాలు జరుగినపుడు దేవుని రాజ్యము సమీపించినది అని తెలుసుకోమని తెలియజేస్తున్నారు. యేసు ప్రభువు చెబుతున్న విషయాలు ఏమిటి అంటే భూకంపాలు, ఒక రాజ్యం మీద మరియొక రాజ్యం దండెత్తటము, అశాంతి మరియు హింసలు మొదలయినవి జరుగుతాయి అని చెబుతున్నారు. ఇవి అన్ని జరిగిన తరువాత యేసు ప్రభువు అక్కడ శాంతి నీలకోల్పబడే ఒక సందర్భం గురించే తెలియజేస్తున్నారు. యేసు ప్రభువు ఇక్కడ వసంత కాలం గురించి చెబుతున్నారు వేరే కాలం గురించి మాట్లాడలేదు. వసంత కాలం క్రొత్త జీవితానికి నాంది. అక్కడ ఒక నూతన జీవితం వస్తుంది. ఆకు రాలిన కాలం తరువాత క్రొత్త చిగురు వచ్చినట్లుగానే ప్రజలు ఇన్ని ఇబ్బందులు అనుభవించిన తరువాత శాంతియుతమైన కాలం ఉంటుంది అదే దైవ రాజ్యం. అందుకే యేసు ప్రభువు దైవ రాజ్యం సమీపమునే ఉన్నది అని తెలుసుకొనుడు అని చెబుతున్నారు.
యేసు ప్రభువు దైవ రాజ్యం గురించి ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. యేసు ప్రభువు ప్రేషిత కార్యం దైవ రాజ్య స్థాపన ప్రధాన అంశంగా మొదలైనది. దైవ రాజ్యం అనేది పాత నిబంధనలో మనము చూసే ప్రభుని రోజు , కొన్ని సందర్భాలలో తీర్పు తీర్చే రోజుగా వర్ణించబడింది. అది మానిషి చేసిన తప్పులకు విధించే శిక్షలా చూసారు. కాని యేసు ప్రభువు ఇక్కడ ప్రకటించే దైవ రాజ్యం ఒక శుభసూచకం. ఇది అందరు సంతోషించే రోజు. యేసు ప్రభువు తన ప్రేషిత కార్యం మొదలు పెడుతూ ప్రకటించిన విషయం ప్రభుహిత సంవత్సరం. ఇది దైవ రాజ్యంలో భాగమే. ఇది గ్రుడ్డివారికి చూపును, కుంటివారికి నడకను, చెరసాలలో ఉన్నవారికి విడుదలను తెలియజేస్తుంది. ఇది ఈ లోకంలో మనం చేసే అన్ని చెడు విషయాలు, సంఘటనలు, అశాంతి, వైకల్యం, కరువు, ఆకలి, పీడనం, లేమి, లోభితనం ఇటువంటివి ఏమి లేని ఒక రాజ్యం. యేసు ప్రభువు దీనికి ముందుగా చెప్పిన అన్ని సంఘటనలు, అశాంతి , అనారోగ్యం , భూకంపాలు, యుద్దాలు, హింసలు వీటి అన్నింటికీ ఇది ఒక సమాధానము చూపుతుంది. యేసు ప్రభువు దైవరాజ్యం సమీపమునే ఉన్నది అని చెబుతున్నప్పుడు, ప్రజలకు ఇది నిజమైన ఓదార్పు ఇస్తుంది.
మనకు ఇక్కడ వచ్చే ఒక అనుమానం ఇవి నిజముగా జరుగుతాయా? ఇది కేవలం ఒక ఊహాజనితమైన ఒక ఆలోచనగా మిగిలిపోతుందా!ఈ విషయం గురించి యేసు ప్రభువు మనకు ఒక అభయం ఇస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు ఇచ్చే అభయం కేవలం అహింసలు, భయంకరమైన పకృతి వైపరీత్యాలు గురించి మాత్రమే కాదు. దైవ రాజ్యం గురించి కూడా కనుక దైవ రాజ్యం గురించి యేసు ప్రభువే చెబుతున్నారు కనుక మనం దాని గురించి నిశ్చింతగా ఉండవచ్చు. "ఇవిఅన్నియు సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలిసికొనుడు. ఇవి అన్నియు జరుగునంతవరకును, ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమ్యాకాశములు గతించిపోవును. కాని నా మాటలు ఎన్నటికిని గతించిపోవు." ఇది ఎప్పుడు జరిగిన మనం సిద్ధంగా ఉండాలి. ఇది మనము బ్రతికి ఉండగా జరుగవచ్చు లేక మనం మరణించిన తరువాత జరుగవచ్చు. కాని తప్పక జరుగును అని తెలుస్తుంది.
దైవ రాజ్యం మూడు విధాలుగా ఉంటుంది అని దైవశాస్త్ర పండితులు చెబుతారు అవి ఏమిటంటే 1. మంచి జీవితం , దైవ ప్రణాళిక ప్రకారం జీవించి, దైవ సంకల్పానికి తమ జీవితనాలు అర్పించిన వారు దైవ సాన్నిద్ధ్యాన్ని వారి జీవితంలో అనుభవించారు. అది దైవ రాజ్యం అనుభవించడమే.
2. ఇప్పుడు ఇక్కడ అనుభవించే దైవారాజ్యం. ఇది కూడా దైవ రాజ్యంలో ఒక భాగం. మంచి పనులు చేస్తూ, దేవుని ప్రణాళిక ప్రకారం జీవిస్తూ దైవ సాన్నిధ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నవారు.
3. మనం మరణించిన తరువాత దేవుని ముఖాముఖిగా చూస్తూ దేవుని రాజ్యంను పూర్తిగా అనుభవించుట. ఇవి మూడు, మూడు రకాలు కాదు కానీ దైవ రాజ్యంను సంపూర్ణంగా అనుభవించేది మాత్రం మరణించిన తరువాతనే.
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా ఈ లోకంలో దైవ రాజ్యం స్థాపించబడాలని మీరు ఎంతగానో కాంక్షించారు. మీతో ఉండుటనే దైవ రాజ్యం పొందుట అని మీ శిష్యుల ద్వారా తెలుసుకుంటున్నాము. మీరు ఉన్న చోట అనారోగ్యంతో ఉన్నవారు, ఆరోగ్యవంతులవుతున్నారు. సమస్యలతో ఉన్నవారు బయటపడుతున్నారు. వైకల్యం ఉన్న వారు పరిపూర్ణత పొందుతున్నారు. ఏమి తెలియని వారు జ్ఞానవంతులు అవుతున్నారు. మీతో ఉంటె ఎంత గొప్పగా మా జీవితాలు మారుతాయో నేర్పించారు. ప్రభువా నాకు మీతో ఉండాలని ఉన్నది. ఆ దైవారాజ్యం అనుభవించాలని ఉన్నది. నేను కూడా మీ సంకల్పాన్ని నెరవేరుస్తూ, నాలో ఉన్న లోపాలను తొలగించుకుంటూ , మీ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ , దైవ రాజ్యాన్ని అనుభవించే భాగ్యం దయచేయండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి