పేజీలు

2.12.23

లూకా 21:34-36

 లూకా 21:34-36 

"తుఛ్చ విషయాసక్తితోను, త్రాగుడుతోను, చీకుచింతలతోను మీరు మందమతులు గాక, అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలె వచ్చిపడును. ఏలయన, ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటలనుండి రక్షింపబడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని  పొందుటకును ఎల్లప్పుడు జాగరూకులై ప్రార్ధన చేయుడు." 

ధ్యానం : యేసు ప్రభువు తన శిష్యులకు పాస్కా పండుగకు ముందుగా ఈ మాటలను చెబుతున్నారు. ఒకరకముగా యేసు ప్రభువు తన  చివర సందేశము ఇక్కడ బోధిస్తున్నారు. అందుకే యేసు ప్రభువు చాలా ముఖ్యమైన విషయాలు గురించి చెబుతున్నారు. శిష్యులను మందమతులు కాకుండా ఉండమని చెబుతున్నారు. ఎందుకు మందమతులు అవుతారు ? మంద మతులు కావడానికి అనేకకారణాలు ఉండవచ్చు. కాని యేసు ప్రభువు ,మనకై మనము మందమతులు కాకుడదు అని చెబుతున్నారు. ఒక వ్యక్తి ఆథ్యాత్మికంగా  తనకు  తాను ఎలా మందమతుడు అవుతాడు  అంటే ఈ మూడు విషయాలతో  చెబుతున్నారు.   తుచ్చ విషయాసక్తితో, త్రాగుడుతో, చీకుచింతలతో మందమతులు అవవద్దు అని యేసు ప్రభువు చెబుతున్నారు. తుచ్ఛవిషయాసక్తి అంటే ఏమిటి ? తుచ్ఛవిషయములు ఏమిటి? ఎటువంటి తుచ్ఛమైన విషయాల యందు మనము ఆసక్తి కలిగి ఉన్నాము, ఐహిక విషయాలు గురించి మనము ఎక్కువగా ఆలోచిస్తూ , ఇహలోకనికి సంభందించిన విషయములకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి , ప్రభువునకు సంబంధించిన విషయాలు పట్టించుకోకుండా మందమతులు అవుతున్నాము. అవివేకులుగా మిగిలిపోతున్నాము.  

రెండవ విషయము  త్రాగుడుతో మందమతులు కావద్దు అని ప్రభువు చెబుతున్నారు. త్రాగుడుతో మందమతులు అయినటువంటి వారు మన చుట్టుప్రక్కల కూడా  అనేక మంది ఉన్నారు. వీరు మత్తుకు బానిసలుగా మారి , వారి జీవితాల్లో ఏమి చేయలేక పోతున్నారు. వారు బ్రతికి ఉండగా కూడా వారిని, వారి కుటుంబాలే లెక్క  చేయని సంధర్భాలు మనకు కనబడుతూనే ఉంటాయి. మూడవ విషయం చీకు చింతలతో మనం మందమతులు కాకూడదు. ఏమి చీకు చింతలు మనకు ఉంటాయి. యేసు ప్రభువు ఏమి తినుదుమా , త్రాగుదామా అని చింతించకుడు అని చెబుతున్నారు.   అందుకే యేసు ప్రభువు అంటున్నారు. ఆకాశ పక్షులను చూడుడు అవి విత్తవు కోయవు , దాచుకోవు. మనము మాత్రమే వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము. లోక సంపద మొత్తం మనకే కావలి అన్నట్లు జ్,  ఇక  ఎవరికి చెందకూడదు అనే విధముగా జీవిస్తుంటాము. పవిత్ర గ్రంధంలో అనేక మంది మనకు వారి జీవితాలలో  ఇటువంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చి నిజమైన జ్ఞానాన్ని, ప్రభువుతో కలిసి ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నారు.   అభిమాలేకు, సౌలు , యరొబాము , ఎలి కుమారులు , నాబాలు ,మీకాలు , అననీయా, సఫీరా పరిసయ్యులు , మొదలగు వారు ఇంకా ఎక్కువ మంది ఈ విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చి దేవుడు ఇచ్చిన గొప్ప అనుగ్రహాలను పోగొట్టుకున్నారు. ప్రభువు ఇచ్చిన ఆహ్వానాన్ని అందుకోలేక పోయారు. 

ప్రభువు ఎందుకు ఈ విషయములను గురించి చెబుతున్నారు అంటే  ఆయన శిష్యులు ఎల్లప్పుడు అప్రమత్తముగా ఉండాలి అనిచెబుతున్నారు. అప్రమత్తత ఎందుకు అవసరము అంటే? ప్రభువు వచ్చిన రోజున మెలకువతో ఉండి ఆ ప్రభువుతో వెళ్ళుటకు. ఐదుగురు  అవివేకవతులైన  స్త్రీలు ఆయన వచ్చిన సమయంలో అక్కడలేక, ప్రభువుతో వెళ్లే అవకాశము పోగొట్టుకున్నారు. మనము ఈలోక  విషయాల్లో నిమగ్నమై ఉంటె, మనము కూడా ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటాము. 

మీరు రానున్న సంఘటలనుండి రక్షింపబడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని  పొందుటకును ఎల్లప్పుడు జాగరూకులై ప్రార్ధన చేయుడు.  యేసు ప్రభువు తన శిష్యులు అందరు రక్షింపబడాలి అని కోరుకుంటున్నారు. ఎవరు కూడా దేవుని రాజ్యంలోనికి పోవుటకు అనర్హులుగా ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ప్రభువు వచ్చినపుడు మనం అందరము మెలుకువ కలిగి ఉండటం ఎంతో అవసరం. ఈ మెలుకువ ఎందుకు అంటే ఆ రోజు ఎప్పుడు వస్తున్నది ఎవరికీ తెలియదు అందుకే మెలుకువగా ఉన్నపుడు మాత్రమే మనం ఆ రోజుకు సిద్ధముగా ఉంటాము. యేసు ప్రభువు చెబుతున్న తుచ్ఛవిషయాసక్తి , త్రాగుడు మరియు చీకుచింతలు మనలను పూర్తిగా సన్నద్ధం కనివ్వవు. అందుకే ముందు మనము వీటి నుండి బయట పడాలి. ఈ మూడు విషయాలకు మనం బానిసలుగా ఉండకూడదు. అపుడు మనము యేసు ప్రభువు ప్రక్కన ఉండుటకు అర్హులము అవుతాము. 

ఈ జాగురుకుతతో పాటు యేసు ప్రభువు మనలను ప్రార్ధన చేయమని చెబుతున్నారు. ప్రార్ధన మనలను దైవ చింతనలో ఎల్లప్పుడూ ఉండేలా చేస్తుంది. ప్రార్ధించే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఎప్పుడు పరిశీలించుకుంటాడు. ఒక వ్యక్తి ఎప్పుడు తన జీవితాన్ని పరిశీలించుకుంటూ ఉన్నట్లయితే అతడు అప్రమత్తముగా ఉంటాడు. ఈ విధంగా జీవించినప్పుడు ప్రభువే  అయన వచ్చే రోజున ఆయనతో  ఉండుటకు కావలసిన శక్తిని దయచేస్తాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా ! మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నపుడు కూడా మీ శిష్యులు అప్పుడు మీతో పాటు ఉండుటకు , మరియు వారు మందమతులు కాకుండా ఈలోకవిషయాలలో నిమగ్నమై మీ జీవితంలో ముఖ్యమైన వాటిని మర్చిపోకుండా వారి రక్షణ పోగొట్టుకోకుండాఉండటానికి కావలసిన వాటిని ముందుగానే తెలియజేస్తున్నారు. ప్రభువా మీకు ఎంత కృతజ్ఞతలు తెలియజేసిన అది తక్కువే అవుతుంది. ఎందుకంటే మీరు మా రక్షణ గురించి అంత శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రభువా నేను మాత్రం ఎప్పుడు ఈ లోకంలోని తుచ్చమైన వాటి మీదనే నా మనసును ఉంచి మీకు దూరంగా ఉన్నాను. నేను ఏమి చేయలేకున్నా , తినడం త్రాగడం గురించి ఎక్కువ సమయమిచ్చి మిమ్ములను అశ్రద్ధ చేసాను. ఇటువంటి సమయాలలో నన్ను క్షమించండి. నేను మిమ్ములనే కాంక్షిస్తూ , మీతో ఉండుటనే కోరుకునే మనసును దయచేయండి. ప్రభువా ! నేను ఎల్లపుడు అప్రమత్తముగా ఉండి, మీరు వచ్చే సమయానికి వివేకవంతులైన స్త్రీల వలె సంసిద్ధంగా ఉండే శక్తిని ఇవ్వండి. ఆమెన్ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...