పేజీలు

29.12.23

దేవుని సన్నిదిలో జీవించే వారి జ్ఞానం

 లూకా 2:36-40 

అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరాలు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరాలుగా  విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. 

ధ్యానం: అన్నమ్మ ఒక ప్రవక్తి , తన జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఆమె విధవరాలుగా, దేవలయంలోనే ఉన్నది. ఆమె ఫనుయేలు కుమార్తె అని చదువుతున్నాము.  అంటే తన భర్త పేరు కాకుండా తండ్రి పేరుతో ఆమెను పరిచయం చేస్తున్నారు అంటే ఆమె భర్త కన్నా ఆమె తండ్రి ఎక్కువ కాలం బ్రతికిఉంటాడు. ఆ రోజులలో యుక్త వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకునేవారు కనుక ఆమె 15 సంవత్సరాల ప్రాయంలో పెళ్లి చేసుకొని వుండవచ్చు. ఆమెకు పెళ్లయిన ఏడుసంవత్సరాలకు ఆమె భర్త చనిపోయాడు. అంటే రెండు పదుల వయసులోనే ఆమె విధవరాలుగా మారింది. సుమారు 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉన్నది. అప్పటి నుండి ఆమె దేవాలయంలోనే, దేవునికి సేవ చేస్తూ ఆమె జీవితాన్ని గడుపుతుంది.  ఆమె గురించి చెప్పిన మాటలు చాలా లోతైన భావాలు కలిగియున్నవి. ఆమె ఆషేరు వంశస్తురాలు. ఆషేరు అంటే భాగ్యం, సంతోషం అని అర్ధము. ఆమె పొందిన భాగ్యం ఏమిటి అంటే దేవుని సన్నిదిలో తన జీవితం మొత్తం కూడా గడపటం. అదే విధంగా ఆమె ఫనుయేలు కుమార్తె ఆదిఖాండంలో ఫేనుయేలు అని ప్రదేశం గురించి మనం వింటాము. పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్ధం. పనుయేలు అనే మాట దైవ సాన్నిద్ధ్యం అనే భావం వుంది. ఆ విధముగా ఆమె దేవుని సాన్నిధ్యంలో అనగా దేవాలయంలో తన జీవితాన్ని మొత్తం కూడా గడిపింది. 

ఆమె దేవాలయమును వదలలేదు, అంటే దేవాలయం తెరచినప్పటి నుండి మూసేవరకు దేవలయంలోనే ఉండేది. పాతనిబంధంలో యేస్సీయ్యా రాజుగా ఉండగా   ప్రవక్తీ గా ఉన్న ఉల్దకు దేవాలయంనే ఒక గదిని ఇవ్వడం జరిగినది. అటులనే అన్నమ్మకు కూడా ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈమె రేయింబవళ్ళు ప్రార్ధన మరియు  ఉపవాసంతో ఆమె దేవున్ని  స్తుతించుచు బ్రతికినది. ఆమె దేవాలయమునకు వచ్చి దేవునికి వందనములు అర్పించి, యెరుషలెము విముక్తి కోసం ఎదురుచూచుచున్న వారికి యేసు ప్రభువు గురించి ఆమె చెప్పసాగిందంటే, ఎప్పుడు దేవాలయ పరిసరాలలోనే ఉండేది.  https://www.daivavaakkudhyaanam.com/2023/12/blog-post_29.html

ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. యెరుషలెము విముక్తికై నిరీక్షించు వారు ఎవరు? ప్రార్ధనలు, ఉపవాసాలు చేస్తూ అనేక మంది మెస్సీయ్యా కొరకు నిరక్షించుచున్నారు. మెస్సీయ్యా రాక కోసం ఆనాటి యిస్రాయేలు ప్రజలు చాలామంది నిరీక్షించుచున్నారు. కొంత మంది ఎడారిలో ఉండి, కొంత మంది సమూహాలుగా ఉండి మెస్సీయ్యా కోసం ప్రార్దన, ఉపవాసంతోటి ఎదురుచూస్తున్నారు. వీరు అందరు పవిత్రతతో  ప్రత్యేక విధంగా మెస్సీయ్యా కోసం సిద్దపడుతున్నారు. సాధారణ ప్రజలు కూడా చాలా మంది మెస్సీయ్యా కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరకి మరియు యెరుషలెము విముక్తి గురించి ఎదురుచూచే వారికి మరియు రక్షణ కొరకు చూచే వారి అందరికీ కూడా అన్నమ్మ యేసు ప్రభువును గురించి చెబుతున్నది. వారి ఎదురుచూపులకు, వారికి ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారంగా ,  సమాధనముగా దేవుడు ఇచ్చిన సమాధానం ఈ చిన్న బాలుడే అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 

వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. యోసేపు మరియమ్మల విశ్వాస జీవితం ఉన్నతమైనది. వారి జీవితంలో దేవుని ఆజ్ఞలకు ప్రధమ స్థానం వుంది. వారు ఇరువురు కూడా దేవుని చిత్తమును నెరవేర్చడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారు. అందుకే వారి విధులను పూర్తిగా నెరవేర్చి తమ పట్టణానికి వెళుతున్నారు.  యేసు ప్రభువు గురించి వారికి తెలిసిన విషయాలు ఎలిశబేతమ్మ, జ్ఞానులు, సిమియోను, అన్నమ్మల నుండి వినినప్పుడు వారికి యేసు ప్రభువు మీద ఇంకా ఎక్కువ మక్కువ కలిగిఉండాలి. యేసు ప్రభువును చిన్నప్పటి నుండి దేవుని యందు, దైవ కార్యములందు నిమగ్నమయేలా వారి జీవితాలు ఉన్నాయి. వీరి పెంపకంలో పెరిగిన యేసు ప్రభువు దృడకాయుడై పరిపూర్ణ  జ్ఞాని అవుతున్నాడు. యేసు ప్రభువు జీవితమే పరిపూర్ణతను పొందుటకు ఆధారము. అటువంటి ప్రభువు పరిపూర్ణ జ్ఞాని అవుట సహజమే. దేవుని అనుగ్రహము ఆయన మీద ఎప్పుడు ఉంటుంది. ఆయనే దేవుడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా! మీ సన్నిదిలో ఉన్న అన్నమ్మ అనేక సంవత్సరాలు ప్రార్దనలతో ఉపవాసంతో జీవిస్తున్నారు. మీ సన్నిదిలో నివసించిన వారికి మిమ్ములను తెలుసుకునే భాగ్యమును అనుగ్రహిస్తున్నారు. మిమ్ములను తెలుసుకోవడమే కాకుండా మీగురించి ప్రకటించే అనుగ్రహం ఇస్తున్నారు. ప్రభువా! మేము కూడా ఎల్లప్పుడు మీ సన్నిదిలో నివసించుటకు కావలసిన అనుగ్రహం ఇస్తున్నారు. ప్రభువా! మరియమ్మ యోసేపులు వారి జీవితం మొత్తం మీ చిత్తమును నెరవేర్చడానికి అంకితం చేశారు. ప్రభువా మీ చిత్తము నెరవేర్చుటకు వారు ఎన్నో కష్టాలు అనుభవించిన మీకు దూరంగా ఉండకుండా, మీకు ఎల్లప్పుడు సేవచేయుటకు మీకు దగ్గరగా ఉన్నారు. ప్రభువా మేము కూడా మీ చిత్తం నెరవేర్చుటకు, మా జీవితాలలో మీ పట్ల మేము చేయవలసిన బాధ్యతను నెరవేర్చునట్లు మమ్ము దీవించండి. మీ వలె జ్ఞానమందు ఎదిగే అనుగ్రహం మాకు దయచేయండి. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...