లూకా 5: 33-39
"యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేల?" అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు "పెండ్లి కుమారుడు ఉన్నంతవరకు విందునకు వెళ్ళినవారు ఉపవాసము చెయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారిచేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయుకాలము వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు" అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను: "ప్రాత గుద్దకు మాసికవేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అటుల చేసిన యెడల క్రొత్త గుడ్డ చినిగి పోవుటయేకాక, అది ప్రాత గుద్దకు అతుకుకొనదు. అట్లే కొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరును పోయరు. అటుల పోసిన యెడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక, క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయును. ప్రాత రసమునకు అలవడినవాడు క్రొత్త రసమును తాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాతరసమే మేలు అనును".
ధ్యానము: దేవుని అనుగ్రహం కోసం పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేసేవారు. కేవలం దేవుని అనుగ్రహం పొందడం కోసమే కాక పశ్చాత్తాపమును వ్యక్తము చేయుటకు కూడా ఉపవాసం చేసేవారు. దేవుని పండుగలను కొనియాడేముందుగా ఆ పండుగ కోసం ఆయత్తపడుట లేక సిద్ద పడుట కోసం ఉపవాసం చేస్తారు. కొంతమంది మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, దానికి సిద్దపడుతూ ఉపవాసం చేసేవారు. ఈ విధంగా పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేయడం మనము చూస్తాము. యోహాను శిష్యులు చేసే ఉపవాసం మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, అందుకు సిద్ద పడుటకు చేసే ఉపవాసము. ఎందుకంటే యోహాను ఈ మెస్సియ్యా రాకడను గురించి అందరు సమాయత్తపడాలని బోధించాడు. అంతేకాక యోహాను కొమరను సంఘం గురించి తెలిసినవాడని వీరు మెస్సియ్యా రాకడకు సిద్దపడే సంఘం కాబట్టి వారితో కలసి జీవించాడు అనే నమ్మకం కూడ కొంత మందిలో ఉండేది. వీరు ప్రార్ధన, ఉపవాసములతో జీవించారు. యోహాను కూడా అతి స్వల్పమైన ఆహారముతోనే జీవించాడు. యోహాను జీవితం ప్రభువు రాకడకు సిద్ధపాటు జీవితంగా సాగింది.
యేసు ప్రభువు దగ్గరకు కొందరు వచ్చి యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు తరచుగా ఉపవాసం, ప్రార్థనలు చేస్తారు కాని మీ శిష్యులు తిని త్రాగుచున్నారేలా? అని ప్రభువును వారు ప్రశ్నించారు. అయితే ప్రభువు ఎందుకు ఆయన శిష్యులు ఉపవాసం చేయడం లేదో వారికి వివరిస్తున్నారు. యేసు ప్రభువు పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లికి వచ్చిన వారు ఉపవాసం చేయుదురా అని అడుగుతున్నారు. ప్రభువు ఎందుకు ఇలా అడుగుతున్నారంటే యేసు ప్రభువే మెస్సియా. యోహాను లేక అతని శిష్యులు ఉపవాసం చేసేది ఈ మెస్సియా కోసమే. అందుకే యోహాను శిష్యులలో కొంతమంది యేసు ప్రభువే మెస్సియా అనే సత్యం తెలుసుకున్న తరువాత యేసు ప్రభువు శిష్యులుగా మారిపోతున్నారు. ఒక వ్యక్తి మెస్సియా రాకడకొరకు, లేక రక్షకుని ఆహ్వానించడానికి ఉపవాసం చేసినట్లయితే ఇప్పుడు ఆ పని చేయనవసరం లేదు. ఆ రక్షకుడు వారి దగ్గరనే ఉన్నారు, ఆయనే యేసు ప్రభువు. శిష్యులు దేవుని అనుగ్రహం కోసం ఉపవాసం చేయవలసి వస్తే అది అవసరం లేదు, దేవుడే వారితో ఉన్నారు. కనుక ప్రభువు రూపంలో సమస్తము వారి దగ్గరనే ఉన్నవి. శిష్యులు పాప క్షమాపణ కోసమో లేక పశ్చాతాపము వ్యక్తపరచడానికో ఉపవాసము చేయవలసి వస్తే వారిని ప్రభువు తన సాన్నిధ్యంతో పవిత్రులను చేస్తున్నారు అందుకు కూడా వారు ఉపవాసం చేయనవసరం లేదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట మరియు దేవునితో సత్సంబంధము నెలకొల్పుకొనుట. ప్రభువే వారితో ఉంటున్నారు కనుక దేవునితో వారికి మంచి సంబంధము ఉంది. ప్రతి రోజు, ప్రతి నిముషం వారు ప్రభువు తోనే ఉంటున్నారు. ప్రభువుతో వారు మాట్లాడుతూనే ఉన్నారు.
పెండ్లి కుమారుడు వారి నుండి ఎడబాయు కాలము వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని ప్రభువు చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నంత కాలము వారు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు. వారు ఉపవాసము చేయనవసరం లేదు. కాని వారి వద్ద నుండి ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు వారు తప్పకుండా ఉపవాసం చేయవలసి వస్తుంది. పాత నిబంధనలో దైవ మందసము యిస్రాయేలు నుండి తీసివేయబడింది. అపుడు ఆ ప్రజలు బాధలలో నిండిపోయారు. అందుకే ఏలి కోడలు , ఏలి దేవుని మహిమ యిస్రాయేలును విడిచిపోయినది అని చెబుతున్నారు. ప్రభువు మనతో లేనప్పుడు మనము ఉపవాసం చేయవలసిన సమయం. అది శిష్యుల జీవితంలో కూడా వస్తుంది. ఆయన వారి వద్ద నుండి వెళ్ళిపోతారు. ఎప్పుడు ప్రభువు మన వద్ద నుండి వెళ్ళిపోతారు? పవిత్ర గ్రంథంలో దేవుని సాన్నిధ్యం ఎప్పుడు యిస్రాయేలు ప్రజలకు దూరం అవుతుంది అంటే యిస్రాయేలు ప్రజలు వారికి ఇష్టమైన విధంగా జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో అపవిత్రంగా ఉన్నప్పుడు, దైవ సన్నిధిలో ఉండి అక్కడ సేవ చేసేవారిని బాధించినప్పుడు, దైవ సాన్నిధ్యాన్ని అపవిత్ర పరచినప్పుడు, యిర్మీయా చెబుతున్నట్లు, గర్వంతో ఉంటూ, మంచి జీవితం జీవించకుండా నాకు ఏమి కాదు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకునే సమయాల్లో దేవుడు దూరమవుతారు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఉపవాసం చేయవలసి ఉంటుంది. ఆ ఉపవాసం మరల ప్రభువుతో కలసి ఉండుటకు.
సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు శిష్యులతో ఉన్నంత కాలం శిష్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. వారు మీతో కలసి ఉండటం వలన, మిమ్ములను పొందటం వలన, మీ సహచర్యంలో జీవించడం వలన వారి జీవితంలో ఒక మధురానుభూతిని పొందుతున్నారు. అనేక మంది దీర్ఘదర్శులు ఈ ప్రభువు సాన్నిధ్యం అనుభవించాలని కోరుకున్నారు. కాని వారందరికీ దొరకని ఈ గొప్ప అవకాశం మీ శిష్యులకు అనుగ్రహించారు. ఆ ధన్యతను మీ శిష్యులు పూర్తిగా తెలుసుకున్న, తెలుసుకోలేక పోయిన అది స్వర్గీయ అనుభూతి. అందుకే వారిలో కొందరైనా మీ సాన్నిధ్యం విలువ తెలుసుకొనవలెననేమో మీరు ముగ్గురితో రూపాంతరీకరణ చెందుతున్నారు. ప్రభువా! మీ సహాచర్యము మనిషిని ఎంత ఉన్నతునిగా తీర్చిదిద్దుతుందో సాధారణ జాలరులు, సుంకరులుగా ఉన్న వారు, ఎంతటి ఉన్నత కార్యాలు చేయగలిగారో తెలుసుకుకోవడం వలన తెలుస్తుంది. ప్రభువా! మీ సాన్నిధ్యం కోల్పోవడం అంటే మేము పాపంలో కూరుకుపోవడమే. మేము ఎల్లప్పుడు పవిత్రంగా ఉంటూ, చెడు క్రియల జోలికి పోకుండా, గర్వం దరిచేరనివ్వకుండ, మీ మహిమ మమ్ములను ఎప్పటికి విడిపోకుండా మమ్ము దీవించండి. అంతేకాక మా చెడు జీవితం వలన మిమ్ము దూరం చేసుకొన్న సమయాలలో మీతో కలసి ఉండాలనే కోరికతో మేము చేసే ఉపవాసమును, మీతో సత్సంబంధమును ఏర్పరుచుకొనుటకు మేము చేసే ప్రార్ధనను ఆలకించి మమ్ము అనుగ్రహించండి. ఆమెన్