లూకా 5: 1-11
యేసు ఒక పర్యాయము గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట రెండు పడవలను చూచెను. జారరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డుననుండి లోనికి త్రోయమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో "మీరు పడవను ఇంకను లోతునకు తీసికొని వెళ్లి చేపలకై మీ వలలను వేయుడు" అనెను అందుకు సీమోను "బోధకుడా! మేము రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము" అని ప్రత్త్యుత్తరము ఇచ్చెను. వల వేయగనే, వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటి వారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి "ప్రభూ ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు" అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను, అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబదాయి కుమారులు యాకోబు, యోహానులును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అపుడు సీమోనుతో "భయపడవలదు. ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు"అనెను. ఆజాలరులు పడవలను ఒడ్డునకుచేర్చి తమ సమస్తమును విడిచి పెట్టి యేసును అనుసరించిరి.
ధ్యానము: దేవుని వాక్కును ఆలకించుటకు ప్రజలు నెట్టుకొనుచు ప్రభువు వద్దకు వస్తున్నారు. ప్రభువు వాక్కు దేవుని వాక్కు. ఆయన వాక్కు అధికారముతోను, సూచక క్రియలతోను, అద్భుతాలతోను, జాలి, దయ మరియు విడుదలతోను కూడి ఉన్నది. దేవుని వాక్కు ప్రజలకు అనేక సందర్భంలో వస్తుంది. కాని యేసు ప్రభువె దేవుని వాక్కు. ప్రజలకు అనేక సంవత్సరాలుగా దేవుని వాక్కును వినిపించే వారు లేరు. యేసు ప్రభువుతోటి మరల దేవుని వాక్కును వింటున్నారు. దేవుని వాక్కును వినుటకు ప్రజలు ఎంతో ప్రేమతో, ఆశతో వస్తున్నారు. ఏమిటి ఈ దేవుని వాక్కు? ఈ వాక్కు ఏమి చేస్తుంది? దేవుని వాక్కు జీవం అయి ఉన్నది. వాక్కు దేవుడే. ఈ వాక్కు కేవలం జీవం మాత్రమే కాదు మానవునికి భరోసాను ఇస్తుంది. వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యం వెలుగునిస్తుంది. ఈ వాక్యం వివేకాన్ని ఇస్తుంది. ఈ వాక్కు మానవుని వక్ర మార్గాలను సరిచేస్తుంది. ఈ వాక్కు మానవుడు చేసిన పాపాలకు ప్రశ్చాత్తాపము పొందేలాగా చేస్తుంది. ఈ వాక్కు మనలను పాపవిముక్తులను చేస్తుంది. ఈ వాక్యం మనకు మంచినే అనుసరించే శక్తిని ఇస్తుంది. యేసు ప్రభువు దగ్గరకు ప్రజలు ఈ వాక్కును వినడానికి, పొందడానికి వస్తున్నారు.
ప్రజలను చూసి వారికి ప్రభువు దేవుని వాక్కును వినిపిస్తున్నారు. దేవుని వాక్కును వింటున్న ప్రజలు ప్రభువు దగ్గర నుండి జీవం పొందుతున్నారు. విశ్వాసం పొందుతున్నారు. వారి జీవితాలలో దేవునికి వారికి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మరియు నుత్నికరించుకుంటున్నారు. ప్రభువు మాటలు విన్న వారు దేవుని సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. ప్రభువు వద్ద నుండి ప్రజలు వాక్కును పొందటం ద్వార మరియు ఆయన వద్దకు రావడం ద్వారా దేవునితో సఖ్యతను ఏర్పరుచుకుంటున్నారు. ప్రభువు దగ్గర వాక్కు వినుట వలన ప్రజలు నూతన జీవాన్ని పొందుతున్నారు. ప్రభువు వాక్కును వినడం వలన వారికి కలిగే ప్రయోజనాలు ఆ ప్రజలకు తెలుసు, వారు అనుభవపూర్వకంగాఇది తెలుసుకున్నారు. ఎంతో మందిని ఆయన స్వస్థ పరచడం జరిగింది. కనుకనే ఆయన మాటలు వినడానికి ప్రజలు వస్తున్నారు.
అక్కడ ఉన్న జాలరులు ప్రభువుకు తన వాక్కును అందించడానికి, పడవనిచ్చి అక్కడ కూర్చొనడానికి సహాయం చేశారు. ప్రభువు వాక్కు ఆ జాలరులు కూడా విన్నారు. ప్రభువు గొప్పవారు అని వారికి తెలుసు. దేవుని వాక్కు వినిన వారికి ఆయన వాక్కు యొక్క శక్తి కూడా తెలుసు. వారు ఆ రాత్రి మొత్తం చేపల కోసం శ్రమించారు అయినప్పటికీ వారికి ఏమి దొరకలేదు. అందరి అవసరాలను చూసే ప్రభువు, రోగాలను తగ్గించే ప్రభువు, జీవాన్ని ఇచ్చే ప్రభువు, వీరి అవసరాన్ని గురించలేరా? ఆ ప్రభువు వారి అవసరమును, వారి నిరాశను గుర్తించి, వారికి చేపలు పడుటకు వలను ఎక్కడ వెయ్యాలో చెబుతున్నారు. కాని దానికి వారు ప్రభువుతో మేము రాత్రి మొత్తం శ్రమించాము కాని ఫలితము లేదు అని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రభువు మీద వున్న విశ్వాసంతో, సముద్రము మీద వారికి ఉన్న అనుభవాన్ని, ఇంతకాలం వారు పనిచేసిన పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి, ప్రభువు మాట ప్రకారం, ప్రభువు చెప్పినట్లు తమ వలలను వేస్తున్నారు. వారికీ ఆశ్చర్యకరంగా వారి వల చినుగునన్ని చేపలు పడుతున్నవి.
ప్రభువు మాట వినుట వలన వచ్చే ప్రయోజము ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రభువు మాట వినుట వలన మనకు ఎప్పుడు సమృద్ధి కలుగుతుంది. అది ఎటువంటి సమృద్ధి అంటే కేవలం వారికి మాత్రమే కాక అనేక మంది ప్రయోజనం పొందే విధంగా కలుగుతుంది. అందుకే తోటి వారు సహాయము చేయుటకు అక్కడకు వస్తున్నారు. పేతురు గారు ఇది చూసి ప్రభువు పాదములపై పడి నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని అంటున్నారు. ఎందుకు పేతురుగారు నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని అంటున్నారంటే, పేతురుకి తన అనుభవం మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ రోజు వరకు పేతురు గారు చేపలు పట్టే వృత్తిలోనే ఉన్నాడు. ఎప్పుడు, ఎక్కడ చేపలు ఉంటాయో వారి అనుభవపూర్వకంగా తెలుసు. పేతురుకు తన అనుభవం మీద, తన వృత్తి మీద అపనమ్మకం లేదు. కాని తనకు తెలియని విషయం, తన అనుభవానికి మించిన జ్ఞానము ప్రభువు దగ్గర ఉన్నది అని ఆయనకు తెలుస్తుంది. ప్రభువు కేవలం ఒక ప్రవక్త కాదని, దేవుని రక్షకుడని , ప్రభువు పావనుడని ఆయనకు తెలుస్తుంది. తన పాప జీవితం లేక తన సాధరణ జీవితం, తాను జీవించే జీవితం ఆంధ్ పావనమైనది కాదని. కనుక ప్రభువు అంతటి పావనుని సహచర్యంలో ఉండుటకు నేను అర్హుడను కాను అని తెలుసుకుంటున్నారు. అందుకే ప్రభువా నన్ను వదలి పొమ్ము అని అంటున్నారు. కానీ ప్రభువు మాత్రం పేతురుతో భయపడవలదు అని ధైర్యాన్ని ఇస్తున్నాడు. పేతురును ప్రభువు మనుషులను పట్టేవానిగా చేస్తాను అని అభయమిచ్చి పేతురును దీవిస్తున్నాడు. తరువాత పేతురు ప్రభువు శిష్యునిగా అనేక మందిని ప్రభువు అనుచరులుగా మారుస్తున్నారు.
సంభాషణ : ప్రభువా! మీ వాక్కు ఎంత మధురమైనది. మీ వాక్కు వినుటకు ప్రజలు ఎంతో ఆశతో వస్తున్నారు. మీ వాక్కు వినుట వలన మాకు జరిగే ప్రయోజనము ఏమిటో మేము తెలుసుకుంటున్నాము. అందుకు మీ వాక్కు వినుటకు అందరు వస్తున్నారు. మీ మాట వినుట వలన మా జీవితంలో ఏమి కలుగుతుందో, మీ మాటను ఆలకించి చేపల కోసం వలను వేసిన వారి ద్వారా తెలుసుకుంటున్నాము. ప్రభువా మీరు ఓకే సాధారణ చేపలు పెట్టె వ్యక్తిని మనుషులను పట్టే వానిగా చేస్తున్నారు.
ప్రార్థన : ప్రభువా! మీ వద్దకు ప్రజలు దేవుని వాక్కును వినడం కొరకు ఎంతో ఆశతో వస్తున్నారు. మీ దగ్గరకు వచ్చిన వారిని ఎంతో ఆనందంగా మీరు పంపుతున్నారు. వారు వారి వారి సమస్యల నుండి వారికి విముక్తిని ఇస్తున్నారు. తండ్రితో వారి బంధాన్ని నుత్నికరించుకుంటున్నారు. అంతేకాక మీ మాటలు వినుట వలన ఎలా వలల నిండా చేపలు పడ్డాయో చూసి పేతురు మరియు జెబదాయి కుమారులు ఆశ్చర్యపోతున్నారు. మీరు పావనమూర్తి అని తెలుసుకుంటున్నారు. మేము మేము కూడా మిమ్ములను తెలుసుకొని, మా సమస్యల నుండి విముక్తి పొందేలా చేయండి. ఆ జాలరుల వలె మిమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి ఆమెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి