పేజీలు

5.11.22

లూకా 20: 27-38

 లూకా 20: 27-38 

ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని కొందరు  సద్ధూకయ్యులు  యేసు వద్దకు వచ్చి , బోధకుడా! ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా! అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయేను. పిమ్మట రెండవ వాడు ఆ పిదప మూడవ వాడు, అట్లే ఏడుగురు ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును? అని అడిగిరి. అందుకు యేసు ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును. కాని పునరుత్థానమునకు యోగ్యులగువారు రానున్న జీవితమున వివాహమునకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావులేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు. దేవుని కుమారులు. మండు చున్న పోదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఈసాకు దేవుడనియు, యకొబు దేవుడనియు పలికెను. దేవుడు జీవితులకే గాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే, అని వారికి సమాధానం ఇచ్చెను.

సద్దుకయ్యులు యూద సమాజంలో ఎవరు? ఎలా ఉండేవారు ?

 ఈ సువిశేష భాగంలో కొంత మంది సద్దుకయ్యులు యేసు వద్దకు వచ్చారు, అని మనం వింటున్నాము. ఎవరు ఈ సద్దుకయ్యులు  అని ప్రశ్నించినట్లయితే  ఆనాటి సామాజిక పరిస్తితులను బట్టి వీరు  యూదయ సమాజంలో ఒక ఉన్నత వర్గానికి చెందినవారు. వీరు బైబుల్ లోని మొదటి ఐదు గ్రంధాలను  మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. సమరియులవలే వాటిని మాత్రమే విశ్వసించే వారు.  మిగిలిన గ్రంధాలను ఈ మొదటి గ్రంధాల మీద వ్యాక్యానంగా మాత్రమే చూసేవారు. మొదటి గ్రంధాలలో పునరుత్థానం గురించి విపులంగా లేదు, కనుక పునరుత్థానం అంటే నమ్మేవారు కాదు.   

వీరు చాలా ధనికులు అంతే కాకుండా దేవాలయ అధికారం మొత్తం వీరు చేతులలోనే ఉండేది. యూదయా పెద్దల సమాజం అంటే యూదయ న్యాయస్థానం. దీనిలో ఎక్కువ మంది సభ్యులు సద్దుకయ్యులే ఉండేవారు. వీరిని ప్రజలు చాల నిష్ట పరులుగా పరిగణించేవారు కాని పరిసయ్యుల అంత గౌరవాన్ని పొందలేక పోయెవారు. ప్రధాన యాజకులు ఎక్కువ వీరి నుండే వుండే వారు. కైపా అనే ప్రాధాన యాజకుడు కూడా వీరిలోని వాడే. దేవాలయంలో జరిగే అన్ని రకాల వ్యాపారాలు వీరి ఆధీనంలోనే జరిగేవి. దేవాలయంలో జరిగే  డబ్బులు మార్పు కూడా వీరి ద్వారానే జరిగేవి. ఆకాలంలో ఉన్నటువంటి సామాజిక ఆలోచన విధానంగా చూస్తే వీరు లౌకిక వాదులుగానే ఉండేవారు. వీరి దృష్టిలో పునరుత్థానం  అనేది లేదు. దేవదూతలు లేరు, ఈ లోకమే సమస్తం.  

ఒక వ్యక్తి మరణించిన తరువాత ఇంకా ఏమి ఉండదు, అంతటితో వాని జీవితం ముగుస్తుంది అని నమ్మేవారు. అలా అని వీరు, వారి ఇష్టమైన విధంగా ఏమి జీవించేవారు కాదు. ఈ లోకంలో ఉండగా మనం మంచి జీవితం జీవిస్తే, మనలను  దేవుడు ఆశీర్వదిస్తారు అని చాలా మంచి జీవితం జీవించేవారు. కాని వీరి చేసినటువంటి ఒక పాపం ఏమిటి అంటే వీరు  రోమా సామ్రాజ్యానికి ఒక  రకమైన సామంతులుగా ఉండేవారు. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా వీరు ఏమి చేసేవారు కాదు. దేవాలయంలో డబ్బులు మార్పుల విషయంలో కూడా వీరు రోమా సామ్రాజ్యానికి ఒక సంధి ఏర్పాటుచేసుకున్నారు. అంతేకాక యూదయా ప్రజలకు సంబంధించిన విషయాలలో వీరే తీర్పు తీర్చవచ్చు.  న్యాయ స్థానంలో  వీరికి ఒక వ్యక్తికి మరణ తీర్పు విధించే హక్కు మాత్రము లేదు, కనుక వీరికి హక్కులేని  విషయాలు మాత్రమే పిలాతు వద్దకు పంపేవారు మిగిలిన విషయాలలో వీరే తీర్పు తీర్చేవారు. 

సద్దుకయ్యులు  ఎందుకు యేసు ప్రభువును ఇష్టపడలేదు?

పరిసయ్యుల వలె సద్దుకయ్యులు కూడా యేసు ప్రభువును ఇష్ట పడలేదు. యేసు ప్రభువు వారి నమ్మకాలను, వారి వ్యాపారాలను, వారి జీవిత విధానాలను తప్పు పట్టారు అని వారు భావించారు.  యేసు ప్రభువు దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు అక్కడ ఉన్నటు వంటి డబ్బులు మార్చే వారిని , బలికి పక్షులను, జంతువులను అమ్మేవారిని అక్కడ నుండి పంపించి వేశాడు.  అంతేకాక నా తండ్రి ఆలయాన్ని దొంగల గుహాగా చేసారు అని వారి  తప్పును ఎత్తి చూపాడు. వారి వ్యాపారాన్ని దెబ్బతీశాడు. కనుక వారికి యేసు ప్రభువు అంటే ఇష్టం లేదు. ఎలాగైన యేసు ప్రభువును కించ పరచాలని అనుకున్నారు. అనేక విధాలుగా వారు యేసు ప్రభువు మీద కక్ష తీర్చుకోవాలి అనుకున్నారు. యేసు ప్రభువు చనిపోవాలి అని ఎక్కువుగా కోరుకున్నవారు కూడా వీరే. అందరి కోసం ఒకరు మరణించడం మంచిది అని చెప్పింది వీరే.  యేసు ప్రభువుకు ధర్మ శాస్త్రం తెలియదు అని చెప్పాలి అని అనుకున్నారు. ఇప్పుడు మనం చదివిన సువిశేషం సందర్భం యేసు ప్రభువుకు ధర్మ శాస్త్రం మీద మరియు వారి నమ్మకాల మీద పట్టు లేదు అని నిరూపించాలి అనుకున్న సందర్భం. 

పరిసయ్యులకు మరియు సద్దుకయ్యులకు ఉన్న వ్యత్యాసం

పరిసయ్యులు పునరుత్థానమును , దేవదూతలను నమ్ముతారు.  బైబుల్ లోని మొదటి పంచ గ్రంధాలు మాత్రమే కాక చారిత్రక గ్రంధాలు , విజ్ఞాన గ్రంధాలు, కీర్తనలు, ప్రవక్తలు అన్ని గ్రంధాలు  వారు నమ్ముతారు. అంతేకాక పరలోక జీవితం ఉంది అని నమ్ముతారు.  అయితే ఈ పరిసయ్యుల కంటే గొప్ప వారము అనే భావన సద్దుకయ్యులకు ఉండేది. పరిసయ్యుల నమ్మకాల గురించి సద్దుకయ్యులు పరిహాసమాడేవారు. యేసు ప్రభువు పరిసయ్యులను నోరు మూయించాడు అని తెలుసుకొని, మేము ఆయనను పరీక్షించి, ఆయన  మీద కక్ష తీర్చు కోవచ్చు, మరియు పరిసయ్యులు  యేసు ప్రభువును పరీక్షించి విఫలం అయ్యారు కనుక వీరు ఇప్పుడు యేసు ప్రభువును పరీక్షించి పరిసయ్యుల కంటే మేము గొప్ప వారిమి అని ప్రకటించుకోవచ్చు, అనుకున్నారు. మరియు వారి వ్యాపారాలను దెబ్బతీసినందుకు తగిన ప్రతీకారం తీర్చుకోవచ్చు అనుకున్నారు. 

యేసు ప్రభువును పరీక్షించుట   

యేసు ప్రభువును పరీక్షించాలి అని  వారు ఒక కథ అల్లుకున్నారు. అది ఏమిటి అంటే ద్వితీయోపదేశకాండం 25 వ అధ్యాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రశ్నించారు.  "ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా! అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయేను. పిమ్మట రెండవ వాడు ఆ పిదప మూడవ వాడు, అట్లే ఏడుగురు ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును? అని అడిగిరి." ఈ  ప్రశ్నను వీరు కేవలం యేసు ప్రభువును అవమానించాలి అనే ఉద్ధేశ్యంతోనే అడిగారు. ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేడని అనుకున్నారు. కాని వారి అమాయకత్వాన్ని, వారికి  ధర్మ శాస్త్రం మీద వున్న  అవగాహన రాహిత్యాన్ని యేసు ప్రభువు ఇక్కడ వెల్లడి చేస్తున్నారు. వారు అనుకుంటున్నట్లుగా వారేమి  అంత తెలివి గలిగినవారో,  లేక ధర్మ శాస్త్ర పరిజ్ఞానం కలిగినవారో,  ఏమి కాదని ప్రభువు ఇక్కడ  తేటతెల్లం చేస్తున్నారు. వీరికి ఉన్న ధనంతో మరియు రోమా సామ్రాజ్యం వీరికి ఇస్తున్న గౌరవంతో, ఇంతకన్నా గొప్ప ఏమి ఉండదు అని వీరు అనుకుంటున్నారు. ఇంతటితోనే జీవితం అనుకున్నారు.

సద్దుకయ్యుల అవివేకం 

యేసు ప్రభువు  వీరిని లేఖనమునలను గాని, దేవుని శక్తినిగాని ఎరుగక  మీరు పొరబడుచున్నారు, అని మత్తయి సువార్త 22: 29 వ వచనంలో చెబుతున్నారు. ఎందుకు వీరు పొరబడుచున్నారో యేసు ప్రభువు చెప్పారు. మొదటిగా వారికి ధర్మ శాస్త్రము అనిన పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే వీరు  ఏనోకును దేవుడు తనతో తీసుకెళ్ళాడు అని నమ్మేవారు. ఏనోకు కయీను కుమారుడు ఆదికాండమునకు సంభందించినవాడు. అంటే ఆయన దేవునితో పాటు ఉన్నాడు అని కూడా వీరు నమ్మరా? అంటే వారి అవివేకం అంతగా పెరిగిపోయింది. అంతే కాదు, మోషేకు దేవుడు మండుచున్న పొదలో సాక్షాత్కారం ఇచ్చినప్పుడు, దేవుడు మోషే ఏమి చేయాలో చెప్పిన తరువాత కూడా ఆయనకు అనేక సందేహాలు ఉన్నాయి.

 మోషే దేవున్ని తన సందేహం తీర్చుకోవడం కోసం, తన ప్రజలకు దేవుని గురించి చెప్పడం కోసం, దేవున్ని ఒక వేళ ప్రజలు  ఆయన ఎవరు ? ఆయన పేరు ఏమిటి ? అని అడిగితే నేను ఏమి చెప్పాలి అని దేవున్ని అడుగుతున్నప్పుడు దేవుడు మోషేతో నేను “ఉన్న వాడను” అని చెబుతున్నాడు. గతంలో ఉన్నవాడను, భవిష్యత్తులో ఉండేవాడను, నిత్యం ఉండేవాడను అని దీని అర్ధం. కాని మనం అనిత్యులం, ఈ రోజు ఉంటాము,  రేపు ఉండము, గతంలో లేము. దేవుడు ఎల్లప్పుడు ఉండేవాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఆయన జీవం మనము  జీవిస్తున్నాం. ఈ జీవం మన నుండి పోయినప్పుడు మనం మరణిస్తాము కాని దేవుడు అలా కాదు. ఆయనే జీవం.  దేవుని దృష్టిలో  ఆయనకు అందరు జీవితులే. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడను, యకొబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెబుతున్నారు.

 దేవుడు ఎంతో ప్రేమించిన మోషేను, తన ప్రజలను వాగ్ధాన భూమికి తీసుకురావడానికి వాడుకున్న దేవుడు, మోషే అన్ని కష్టాలు పడి ప్రజలను వాగ్ధాన భూమికి తీసుకు వచ్చిన మోషే దానిలో అడుగు పెట్టకుండానే చనిపోతున్నాడు. కేవలం ఈ లోకమే సమస్తం అయితే మోషే జీవితానికి అర్ధం ఏముంది.  అటువంటి అప్పుడు సద్దుకయ్యులు నమ్మినట్లుగా మొత్తం ఈ లోకమే అని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు తన పని చేసిన వారికి ఇచ్చే బాహుమనం కోసం  పరలోకం ఉండాలి.  అందుకే యేసు ప్రభువు వారికి చెబుతున్నాడు. మీకు దేవుని శక్తి గురించి కాని లేక ధర్మ శాస్త్రం గురించి కాని వారికి అంత అవగాహన లేదు అని తెలియ పరుస్తున్నాడు. ఇటువంటి ప్రశ్న అడగడం వలన యేసు ప్రభువును ఇబ్బంది పెట్టాలి అని అనుకున్న సద్దుకయ్యుల అవివేకాన్ని వెల్లడిచేసుకున్నారు.

పునరుత్థానములో మానవుని స్థితి 

ఈ సందర్భంగా యేసు ప్రభువు పునరుత్థానం  అయిన తరువాత మానవుని స్థితి ఏమిటి అని తెలియచేస్తున్నాడు. పునరుత్థానాన్ని పరిసయ్యులు నమ్మేవారు కాని వారికి పునరుత్థానం అంటే ఇప్పుడు మనం ఎలా ఈ భౌతిక దేహం కలిగి ఉన్నామో  అలానే భౌతిక దేహాలతో పునరుత్థానం అవుతాము అని అనుకునేవారు. ఒక వేళ ఒక వ్యక్తికి ఏదైనా లోపం ఈ లోకంలో ఉండగా ఉన్నట్లయితే, పునరుత్థానం అయిన తరువాత కూడా అదే లోపంతో ఉంటారు అనే నమ్మకంలో ఉండేవారు. వాటి అన్నింటిని యేసు ప్రభువు తీసివేస్తున్నారు. పునరుత్థానం అయిన తరువాత మనలో ఆ లోపాలు ఏమి ఉండవు అని తెలియచేస్తున్నారు. పునరుత్థానం అయిన వారు దేవదూతల వలె ఉంటారు అని చెబుతున్నారు. దేవదూతలు ఆత్మలు వారికి శరీరం ఉండదు, పునరుత్థానం నందు మనకు ఉండేది ఆధ్యాత్మిక శరీరం, భౌతిక శరీరమునకు ఉన్న అన్ని ఆటంకములు ఈ శరీరమునకు ఉండవు.

పునరుత్థానము నందు పెళ్లి అనేది లేదు. వివాహ ధ్యేయం భార్య భర్తల శ్రేయస్సు, మరియు సంతానం. కాని ఇవి రెండు కూడా పునరుత్థానంలో ఉత్పన్నం కావు ఎందుకంటే, పునరుత్థానములో మనం పరలోకంలో ఉంటాము. దేవుని దగ్గర ఉండుట కంటే శ్రేయస్సు ఏమి లేదు. సంతానం లేక పునరుత్పత్తి అనే సమస్య ఉండదు. అక్కడ మరణం అనేది ఉండదు. సద్దుకయ్యులు అడిగిన ప్రశ్న తప్పు ఎందుకంటే మోషే ఇచ్చిన ఆజ్ఞలో చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం అంతం అయిపోకుండా ఉండటానికి మరల పెళ్లి చేసుకోవాలి అని ఉంది. ద్వితీ 25:6. కాని పునరుత్థానంలో మరణం అనేది ఉత్పన్నం కాదు. 

దేవుడు జీవితులకే గాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే, అని యేసు ప్రభువు చెబుతున్నారు.  మానవ ఆకాంక్షకు , మరియు ఈ లోకంలో ఉండగా మనం పొందే   కష్టాలకు, బాధలకు, సౌక్యాలకు మన జీవితా నికి అనేక సార్లు పోలిక ఉండదు. ఎందుకు నేను ఇవి అనుభవించాలి అని మనకు అనేక సార్లు ప్రశ్నలు వస్తుంటాయి. ఇన్ని అనుభవిస్తూ   నైతికంగా జీవిస్తున్నాము అంటే ఖచ్ఛితముగా పరలోకం ఉండాలి. వీటి అన్నింటికీ సరియైన విధంగా తీర్పు తీర్చే దేవుడు కావాలి.  కాని మన ఇంటిలో లేక మనకు కావలసిన వారి ఇంటిలో లేక మనం ఎక్కువుగా ప్రేమించిన వారి ఇంటిలో  అకాల మరణం మరణం సంభవించిన ప్రతి సమయంలో మనకు కూడా పునరుత్థానం మీద ప్రశ్న వస్తుంది. నిజముగా ఈ జీవితం ఇంతటితో ఆగిపోయినట్లేనా లేక నేను విశ్వసించే విధముగా దేవుని దగ్గర ఉన్నారా? అని  ఈనాటి సువిశేషం మనకు ఇటువంటి అనుమానాలు అవసరం లేదు అని చెబుతుంది. ఎందుకంటే దేవునికి మృతులు ఎవరు లేరు, అందరు ఆయనకు సజీవులే. ఆయన దృష్టిలో అందరు సజీవులే. యేసు ప్రభువు ఈ మాట చెప్పడం వలన యిస్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు వారు నమ్మిన విషయాలు నిజం అని తెలుసుకుంటున్నారు. మక్కబియుల గ్రంధంలో మనం చూసే ఏడుగురు అన్నదమ్ములు, వారు పునరుత్థానము మీద నమ్మకం ఉంచి అందరు మరణించడానికి సిద్ధ పడ్డారు.

పునరుత్థానం అయిన వారు దేవదూతలతో సమానం మరియు దేవుని కుమారులు అని ప్రభువు చెబుతున్నారు. దేవదూతలతో సమానం అని చెప్పారు కాని దేవదూతలు అని చెప్పలేదు ఎందుకంటే దేవదూతలు దేవుని కుమారులు కాలేరు. అవి కేవలం దేవుని సృష్టిగానే ఉండిపోతారు. మనిషి మాత్రం దేవుని కుమారులు అవుతారు. అందుకే పునీత పౌలు గారు 1 కోరింథీ 6:3 వచనంలో మనము దేవదూతలకు సహితము తీర్పు తీర్చేదము అని చెబుతాడు.

ఈ సువిశేష భాగం ద్వార దేవుడు మానవుని తన పొలికను మాత్రమే ఇవ్వలేదు. తనతో పాటు ఉండుటకు తన వలె జీవించుటకు మరియు తన సృష్టి మొత్తం మీద అధికారం ఇచ్చిఉన్నారు. జీవితం కేవలం ఈ లోకానికి మాత్రమే సంబంధించినది అని, మనకు ఉన్న సంపదను, అనుగ్రహాలును ఇక్కడ సుఖముగా జీవించుటకు మాత్రమే అని కాక మనకు మరణం తరువాత కూడా జీవితం ఉంది అని తెలుసుకొని , ఎటువంటి అపనమ్మకం లేకుండా జీవించాలి అని తెలియజేస్తుంది. పునరుత్థానం ద్వారా మనం దైవ బిడ్డలము అవుతాము అని తెలుపుతున్నది. మరియు దేవుని దృష్టిలో మృతులు ఎవరు లేరు అందరు ఆయనకు సజీవులే అని ఆయన జీవం గల దేవుడు కనుక మనకు ఆ జీవం ఇస్తారు అని తెలుపుతుంది.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...