క్రీస్తు రాజు మహోత్సవం
లూకా 23:35-43
ప్రజలు అచట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. "ఇతడు ఇతరులను రక్షించెను. కాని, ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించు కొననిమ్ము" అని అధికారులు ఆయనను హేళనచేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పిలిసిన ద్రాక్షరసమును ఇచ్చి , "యూదుల రాజువైనచో, నిన్ను నీవు రక్షించుకొనుము" అని పరిహాసించిరి. "ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి శిలువ పైభాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు నీవు క్రీస్తువు గదా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము. అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు నీవు దేవునికి భయ పడవా? నీవు కూడ అదే శిక్ష పొందుచున్నావు కదా!మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగుఫలము అనుభవించుచున్నాము. కాని ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, "యేసు!నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను.
ఈ రోజు మనం యేసు క్రీస్తు రాజు పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగను 1925 సంవత్సరంలో 11 వ భక్తినాధ పాపు గారు స్థాపించారు. ఇది నిజమైన శాంతిని పొందడానికి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును అన్వేశించాలి మరియు ఆయన మాత్రమే శాంతి సమాధానం ఇవ్వగలరు అని తెలియజేసే ఒక పండుగ ఇది. 1918 వ సంవత్సరంలో లో మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత 1920 లో ఎవరు నిజమైన శాంతిని ఇవ్వగలరు అని ఆలోచిస్తూ నిజముగా క్రీస్తు మాత్రమే నిజమైన శాంతి ఇస్తాడు అని చెపుతూ స్థాపించిన పండుగ ఇది.
ఇదే సమయంలో ఐరోపా మరియు ఇతర ప్రాంతాలలో ప్రజలు లౌకిక వాదం వైపు మొగ్గుచూపుతూ దేవుని యొక్క అవసరం మాకు లేదు అనే ఆలోచన విధానం పెరిగిపోతున్న సమయం. దేవుని యొక్క అవసరం మాకు లేదు కాని మాకు మేము జీవించగలం, ఆనందంగా ఉండగలం అని మనం అనుకోవచ్చు కాని అది సాధ్యపడదు. యిస్రాయేలు ప్రజలు మనకన్నా ముందుగా ఇలా ఆలోచించి ఇది సాధ్య పడదు అని తెలుసుకున్నారు.
యిస్రాయేలీయుల రాజు
మొదటిగా యిస్రాయేలు ప్రజలకు రాజు లేడు. దేవుడు వారికి ఒక రాజు ఉండాలి అనిఅనుకోలేదు. ఎందుకు అంటే యిస్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉండేవాడు. రాజు చేసేటువంటి పనులు మొత్తం దేవుడు వారికి చేస్తూనే ఉన్నాడు. వారిని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నాడు. ప్రభువైన దేవుడు ఆయన అన్నీ జాతులకు రాజు. యిర్మియా 10,7. యిస్రాయేలును పవిత్ర ప్రజగా ఆయన ఎన్నుకున్నారు. వారి మధ్యలో నివసించారు. కీర్తన 134,3. యోషయా 52:7. నీ ప్రభువు నీ మధ్య నున్నాడు. నీవు సంతసింపుము అని జేపన్యా గ్రంధంలో మనం వింటాం. జఫన్యా 3:14-15.
ఇతర దేశాల రాజులు మరియు రాచరికం
పూర్వ కాలంలో రాచరికం, రాజ్యాధికారం దేవునికి సంభందించినవి అని అనుకునేవారు. ఈ ఆలోచన అప్పటి ప్రజల సంస్కృతి , సంప్రదాయాలలో కూడా కనిపించేది. ఐగుప్తు దేశంలో ఫరో రాజును హ్ోరోస్ అవతారంలా భావించేవారు. ఆయన చేసే పనులన్నీ కూడా దేవునికి సంబంధించినవిగా అనుకునేవారు. బాబిలోనియా ప్రజలు తమ రాజును మదురుక్ ప్రతినిధిగా భావించేవారు. రాజును దేవుడు భూమి, ప్రజలు, సైన్యం, దైవబలి మొదలగు వాటికి అధిపతిగా చేశాడు అని భావించేవారు. బాబిలోనియా, ఐగుప్తు దేశాల రాజులు, వారి రాచరికం గురించి మనం తెలుసుకున్నప్పుడు, రాజు దేవుని ప్రతినిధి అనే భావన కలుగుతుంది. ఇదే ఆలోచనను తరువాత గ్రీకు మరియు రోమా రాజ్యాలలోనూ ఉంది. ఇది ఇంకా కొంచెం పరిధి దాటి రాజును దేవునిగా చూడటం వారు మొదలు పెట్టారు.
యిస్రాయేలు ప్రజలు రాచరికం
యిస్రాయేలు ప్రజలకు మానవ రాజు అనే ఆలోచన అసలు లేదు. కాని వారు ఎప్పుడైతే ఐగుప్తు , బాబిలోనియా దేశాలలో బానిసలుగా ఉన్నారో అప్పుడు వారికి ఈ ఆలోచన కలిగింది. మనకు ఒక రాజు కావాలి అనుకున్నారు. వారు అక్కడ నుండి వచ్చిన తరువాత మిధ్యానియుల నుండి కాపాడిన తరువాత వారు గిద్యొనును తమ మీద రాజుగా వుండమని కోరారు. కాని ఆయన ఒక విషయం స్పష్టం చేశాడు. నేను కాని నా కుమారుడు కాని మిమ్ము పరిపాలింపము. ప్రభువే మిమ్ము పాలించును. దేవుడే మిమ్ములను పాలించును అని వారికి తెలియజేశాడు. న్యాయాధిపతులు 8:23. దేవుడు ఒడంబడిక ద్వారా వారిని ఎన్నుకొని వారిని పాలించాడు. కాని తరువాత అబిమలేకు రాజును కావాలనే ఆశతో షెకెము వద్ద కానా తరహా రాచరికాన్ని స్థాపించాలని చుసాడు. కాని అది నాశనం అయ్యింది. తరువాత సమూవేలు ప్రవక్త కూడా మానవ రాచరికానికి వ్యతిరేకముగా ఉన్నాడు. ప్రజలు పదే పదే అడుగుట వలన సమూవేలు ప్రవక్త వారికి దేవుని ఆజ్ఞ ప్రకారం సౌలును రాజుగా అభిషేకించారు. సౌలును దేవుడు తన ఆత్మతో నడిపించాడు. కాని సౌలు తరువాత తనకు ఇష్టమైన విధముగా జీవించడం వలన దేవుడు అతన్ని తిరస్కరిస్తున్నాడు. దాని తరువాత దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు నీ కుటుంబము, రాజ్యము కలకాలము నా కనుసన్నులలో మన్నును , నీ సింహాసనం నిత్యం, నెలకొని యుండును, అని వాగ్ధానం చేసాడు. కాని యిస్రాయేలులో చెడు రాజులు ఎక్కువయ్యారు. వారు పొరుగు దేశాలను చూసి వారి వలె విగ్రహారాధన చేశారు. ప్రవక్తలను వ్యతిరేకించారు. హొషేయా ప్రవక్త రాజరికాన్ని ఖండించాడు. కాని యేషయా ప్రవక్త భవిష్యరాజు పుట్టుక గురించి చెప్పాడు. దేవుడు వారికి రాజుగా ఉండటం మరియు దావీదు వంశం నుండి రాజు రావడం సాధ్య అవుతుంది యేసు ప్రభువుతోటి.
దేవుడు ఎందుకు వారికి రాజును ఇవ్వాలనుకోలేదు.
దేవుడు యిస్రాయేలు ప్రజలకు ఒక రాజును ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకు అంటే సమూవేలు ప్రవక్త చెప్పిన ప్రకారం ఈ లోక రాజులు ఈ ప్రజలను బానిసలుగా వాడుకుంటున్నారు, దేవుడు వారిని స్వతంత్రులుగా ఉంచాలి అని అనుకున్నారు, రాజుగా ప్రజల బాగోగులను దేవుడు ఎప్పుడు చూసుకుంటూనే ఉన్నాడు. వారిని ఇతర రాజ్యాలనుండి కాపాడాడు, వారికి కావలసిన అన్నీ వారికి సమకుర్చాడు. అన్నీ విధాలుగా వారి మధ్యనే దేవుడు ఉన్నాడు. అందుకే వారిలో ఒక ఆలోచన ఉండేది. మెలెక్ యాహ్వె అని . మెలెక్ అంటే రాజు అని, యాహ్వె అంటే ఉన్నవాడు అని అర్ధం. మెలెక్ యాహ్వె అంటే నిత్యం ఉండువాడు మనకు రాజు అని, లేక దేవుడు మనకు రాజు అని అర్ధం. అప్పటి నుండి ప్రజలలో దేవుడు మాకు రాజు అనే భావన ఉండేది.
యిస్రాయేలు ప్రజలలో దేవుడు వారి రాజు అనె భావనలో పూర్తిగా వ్యక్తం కాకపోయినా ప్రవక్తలు దీని గురించి చాలా నిశ్చితమైన అభిప్రాయంతో ఉండేవారు. వారు దేవున్ని తమ రాజు అని ప్రకటించుకున్నారు. దేవుడు తమ రాజు అని గర్వంగా చెప్పుకునేవారు. మిగిలిన రాజులు కేవలం మానవ మాత్రులు అని ఎగతాళి కూడా చేసేవారు.
తరువాత కాలంలో యిస్రాయేలు ప్రజలు మెస్సీయా వారి రాజుగా ఉండాలి అని వారు కోరుకున్నారు. యేసు ప్రభువు యెరుషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలు ఈ కోరికను వ్యక్త పరిచారు. ఇక్కడ యేసు ప్రభువు విజయోత్సవ రాజు వలె యెరుషలేముకు వస్తున్నాడు. వారు ఆయనను తమ మెస్సీయాగా వారు ఒప్పుకుంటున్నారు. యోహను 6 వ అధ్యాయంలో మనం ప్రజలు ఆయనను బలవంతంగా రాజును చేయబోతున్నారు అని తెలిసి అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం యేసు ప్రభువు సిలువ వేయబడిన సిలువ మీద ఈసూస్ నజారెనుస్ రెక్స్ ఇదయరేయుమ్. నజరతు నివాసి అయిన యేసు యూదుల రాజు అని చదువుతాం.ఇది పూర్తిగా వారి కావాలని కోరుకున్న లేకున్నా దేవుడు వారి రాజుగా ఆయననను అంగీకరిస్తున్నారు.
యేసు ప్రభువు ఎటువంటి రాజు ? యేసు ప్రభువును వారు ఏమి కోరుకుంటున్నారు, యేసు ప్రభువునుగురించి సువిశేషంలో మనం ఏమి తెలుసుకుంటున్నాము? అంటే వారు యేసు ప్రభువు నందు వారి అవసరాలను తీర్చే రాజును, వారిని పీడించే వారి నుండి విడిపించేలా చేసే రాజును వారు చూస్తున్నారు. వారి అనారోగ్యాలను తొలగించే వైద్యుడిని వారు చూస్తున్నారు. వారికి స్వేచ్ఛను ఇచ్చే రాజును వారు చూస్తున్నారు. విటన్నింటికంటే వారు స్వతంత్రులుగా ఉండాలి అని అనుకున్నారు.
ఇవి అన్నీ కూడా కేవలం యేసు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి అంతే కాదు మనకు నిజమైన శాంతిని ఇచ్చేడి కూడా ప్రభువు మాత్రమే. జీవాన్ని మరియు స్వాతంత్రంను ఇచ్చి మనలను బానిసత్వం నుండి నడిపించే రాజు కనుక ఎల్లప్పుడు ఆ ప్రభువు పాలనలో ఉండాలి అని కోరుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి