యేసు క్రీస్తు జనన మహోత్సవం
తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగుస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించు కొనుటకు ప్రజలందరు తమ తమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు , దావీదు వంశస్తుడైనందున గలిలీయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణమగు బేత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్ధము చేయబడిన , గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటపెట్టుకొని వెళ్లెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండ బెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రతక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయ భ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను: "మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు, ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుటమీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు" అనెను.
దేవదూతల సందేశం : శాంతి సమాధానం మరియు ఆనందం
ఒక తార వెలసింది- భువి అంత వెలుగునింపింది. దేవుని మానవున్ని మధ్య సంబందం చిగురింపచేసింది. మానవుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరి, మానవ వికాసాన్ని పెంపొందేలా చేసిన పండుగ క్రీస్తు జననం. నిజమైన సంతోషము సమాధానంకు చిరునామా క్రీస్తు జననం. ఒకరిని హింసించడం లేక మరణానికి గురిచేయడం కాకుండా కాపాడటానికి నాంది పలికేది ఈ పండుగ. దేవుడు మానవునితో ఉండాలని, మానవ స్వభావాన్ని పావనం చేయాడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఈ క్రీస్తు జన్మ దినము. దేవుడే మానవునితో కలిసి జీవించడానికి రావడమే ఈ పండుగ. ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద, పేదవాడు, ధనికుడు, అనే తారతమ్యం లేకుండా కలిసి జీవించేందుకు నాంది ఈ పండుగ. మానవున్నీ దేవుని కుమారునిగా చేసేది, దానికి మార్గం సుగమం చేయడమే క్రీస్తు జనన ఉద్దేశం. యేసు ప్రభువుని జననం, ప్రతి ఒక్కరికి శాంతి సమాధానము అనే సందేశమును మొదటిగా తెలుపుతుంది. దేవదూతలు ఈ వార్తను గొర్రెల కాపరులకు వినిపిస్తున్నారు. గొర్రెల కాపరులకు ఆనాటి సమాజంలో ఎటువంటి శుభకార్యానికి ఆహ్వానము వీరికి ఉండదు. వీరిని దొంగలుగా చూసేవారు, అటువంటి వారికి శుభ వచనము, దేవుని రాక గురించి చెప్పడం ద్వార యేసు ప్రభువు జననము సమాజంలో అసమానతలను అనుభవించేవారికి, వారికి సమానత్వమును, ఆనందం ఇచ్చే పండుగ అని తెలుస్తుంది.
దేవుడు మానవుడు అగుట
యోహాను సువిశేషము మొదటి అధ్యాయం 12, వచనంలో దేవుడు ఎలా మనతో ఉండుటటకు ఇష్ట పడుతున్నాడు అని చదువుతాం. "అయన ఈ లోకమున ఉండెను అయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలిసికొన లేదు. అయన తన వారి వద్దకు వచ్చెను తన వారే ఆయనను అంగీకరింపలేదు. " యేసు ప్రభువు ఈ తన తండ్రి వద్దనుండి పరలోకం నుండి భూలోకమునకు వచ్చినది మనతో ఉండటానికి. మానవునిలా జీవించడం, మానవుని కష్టాలు భరించడం దేవునికి ఏమి తెలుసు అనుకుంటూ ఉండేవారిని చూస్తూనే ఉంటాము. కాని యేసు ప్రభువు పరలోకం వదలి భూమి మీదకు ఒక సాధారణ వ్యక్తి వలె వచ్చి, మన మధ్య జీవించారు. మానవుడు పొందే అన్ని బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు. దీనిద్వారా ఈ మానవ జీవితాన్ని పావనం చేస్తున్నారు. మానవున్ని దైవ పుత్రత్వం కలిగి ఉండేలా చేసుంది.
దేవుని ఉదారత
"ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికి అయన దేవుని బిడ్డలగు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ , రక్తము వలన కాని శరీరేచ్ఛవలన కాని మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు." క్రీస్తు జననం మనకు ఏమి ఇస్తుంది. యేసు ప్రభువు లేక దేవుడు మానవునిగా మానవు రూపంలో ఈలోకంలో పుట్టుట ద్వారా మన మానవ జీవితాన్ని పవిత్ర మొనర్చడామె కాకుండా దాన్ని దైవీకం చేస్తున్నాడు. దీనిద్వారా దేవుడు తనను తాను మనకు అర్పించుకుంటున్నాడు. దేవుడు మన మధ్యకు వచ్చి నివసించి మనకు దైవ ఔన్నత్యన్నీ చూపిస్తున్నాడు. మనము ఎంత గొప్పగా జీవించ వచ్చు అనేది నేర్పుతున్నారు. దీనినే మనం యోహాను సువిశేషం మొదటి అధ్యాయం 12 వ వచనములో చూస్తున్నాము. దేవుడు తనని తాను, మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు. ఆయనను స్వీకరించే వారు దానికి సిద్ధముగా ఉండాలి. ఇది దేవుడు మననుండి ఏమి ఆశించకుండా మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు. దీనిని మనము నేర్చుకోవాలి.
మానవ స్వభావం - దైవ స్వభావంగా మారుటకు నాంది
ఏ విధంగా యేసు ప్రభువు ఈ మానవ జీవితాన్ని దైవికం చేస్తున్నాడు అంటే మొదటిగా తాను ఈ లోకంలో మానవునిగా పుట్టుట ద్వారా ఆయన మానవ స్వభావాన్ని పంచుకోవాడమే కాకుండా దానికి మరియొక లక్షణాన్ని ఇస్తున్నాడు. అది ఏమిటి అంటే దైవత్వం కలిగిఉండేలా చేయడం. ఇది చేయడం వలన ప్రతి వ్యక్తి కేవలం మానవునిగా మాత్రమే కాక ఈ మానవ స్వభావాన్ని దైవికంగా మార్చుకోవడానికి నాంది పలకడం జరిగింది. ప్రతి మానవ భావాన్ని , లక్షణాన్ని దైవికం చేసే అవకాశం మనకు కూడా ఇస్తున్నాడు.
పరలోక వాణి
క్రీస్తు జననం - ప్రతి ఘడియ పరలోక వాణి అని తెలియజేస్తుంది. ఏమిటి పరలోక వాణి అంటే యిస్రాయేలు ప్రజలు పరలోకానికి భూమికి మద్య ఒక ఎడబాటు ఉంది అని విశ్వసించేవారు. ఈ ఎడబాటు ఎప్పుడు అయితే పరలోక వాణి వినపడుతున్నదో అప్పుడు తీసివేయబడుతుంది అని వారు నమ్మేవారు. ఈ ఎడబాటు తీసివేయడం అంటే పరలోకం మరియు భూమి ఏకమవుతున్నవి అని అర్ధం, అంటే దేవుడు మానవుని దగ్గరకు వచ్చాడు అని అర్ధం. యేసు ప్రభువుని జననంతో ఈ పరలోక వాణి ప్రతి నిత్యం, మానవుడు పొందే భాగ్యం పొందాడు అని అర్ధం. మొదటి మానవునితో కలిసి నడిచిన దేవుడు మరల ఇప్పుడు ప్రతి మానవునికి దేవునితో కలిసి జీవించడానికి అవకాశం ఇస్తున్నాడు.
దేవుని యొక్క సంపూర్ణత తెలుసుకొనే అవకాశం
దేవుడు మనుష్య రూపేణా అంటే అది కేవలం యేసు ప్రభువు మాత్రమే అవుతారు, ఎందుకంటే మనం ఆయన జీవితంలో ఎటువంటి అపరిపక్వత లేక అసంపూర్ణం అనేది చూడం. ఈలోకములోని ఎంతటి గొప్ప వ్యక్తి అయిన కాని అతనిలో ఏదో ఒక అసంపూర్ణత మనం చూస్తూనే ఉంటాము. యేసు ప్రభువు జననము దేవుని సంపూర్ణతను తెలుసుకొనేలా చేస్తుంది. అంతే కాక ఆయన పరిపూర్ణతలో మనము భాగము ఎలా పొందలో తెలుసుకొని మార్గమునకు అంకురార్పణ జరిగినది ఈ రోజు. కనుక మనకు దేవుని సంపూర్ణతను తెలుసుకోవటమే కాక దేవుని కలుసుకొనే అవకాశం పొందటం జరుగుతుంది. దేవున్ని అనుభవించడం, కలుసుకోవడం అనేక విధాలుగా మనం బైబుల్లో చూస్తాము. మోషే మండుతున్న పొదలో దేవున్ని కలుసుకోవడం, దివ్య మందసంలో దేవున్ని కలుసుకోవడం ఇవన్నీ ఒక భాగం కాని క్రీస్తు పుట్టుక వీటన్నింటికన్నా పరిపూర్ణత సంతరించుకున్నది. కనుక మానవుడు దేవుని పరిపూర్ణతను యేసు క్రీస్తు ద్వారా తెలుసుకుంటున్నాడు.
యేసు జననం దేవుని ప్రణాళికా ప్రకటన
మానవునికి సంభందించి దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ప్రణాళికా ఏమిటి? మానవునితో కలసి ఉండుటకు దేవుడు సిద్ధంగా ఉంటాడా? మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన సంబంధమును దేవుడు బాగుచేయుటకు సిద్ధంగా ఉన్నాడని తెలియచేస్తుంది, యేసు ప్రభువు జననం. అంతే కాదు, తెగిపోయిన దైవ-మానవ సంబంధం సరిచేయడం మరియు మానవుని రక్షణకు పరిపూర్ణ అంకురార్పణ జరిగింది అని తెలియజేస్తుంది. దేవుడు మనతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెబుతున్నాడు.
దేవుడు ఇచ్చే పాప క్షమాపణ - చూపే పరి పూర్ణ ప్రేమను సంపూర్తిగా అర్ధం చేసుకునే మార్గం సుగమమం
దేవుని ప్రేమ మానవుడు పరిపూర్ణంగా తెలుసుకునే మార్గం మనకు తెలిసేది కేవలం యేసు ప్రభువు ద్వారానే. ఎందుకంటే ఆయనే దేవుని ప్రేమను సంపూర్ణముగా మనకు తెలియజేయడం జరిగినది. ఎంతో మంది దేవుని ప్రేమ గురించి దేవుడు క్షమించే విధం గురించి చెప్పిన యేసు ప్రభువు వలె ఎవరు అంత పరిపూర్ణంగా ఆ ప్రేమను కాని, దేవుని క్షమాపణ గురించి ఎవరు యేసు ప్రభువులా చెప్పలేదు. అందుకే ఈ రోజు దేవుని ప్రేమ క్షమాపణ పూర్తిగా తెలుసుకోవడానికి అంకురార్పణ జరిగిన రోజు ఇది. కనుక ఈ మానవ స్వభావాన్ని దేవుని అనుగ్రహంతో పావనము చేయుటకు ప్రయత్నించుదాం. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి