పేజీలు

13.3.23

లూకా 14:25-33

  23 వ సామాన్య ఆదివారం 

లూకా 14:25-33  

అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను: నన్ను వెంబడింపగోరి ,తన తల్లిదండ్రులను, భార్యను,బిడ్డలను అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్ట దలచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి, దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా, లేదా అని పర్యాలోచన చేయడా?అటుల కాక, పునాది వేసిన పిదప, నిర్మాణము పూర్తి చేయజాలని యెడల చూచు వారు, ఇతడు ఆరంభశూరుడే కాని కార్య సాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్దమునకు వెళ్ళుటకు ముందు, ఇరువది వేల సేనతో తన పై దండెత్తి వచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని యెడల, శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజియించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. 

"అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను." యేసు ప్రభువు చేసే పనులను చూసి ఆయన అద్భుతములను చూసి, ఆయన వారికి సమకూర్చుతున్న ఆహారం చూసి అనేక మంది ఆయనను ప్రవక్తగా, రక్షకునిగా భావించి  ఆయనను వెంబడిస్తున్నారు. ఎక్కువ మంది ఆయన నుండి ఏదో ఒకటి ఆశించి ఆయనను అనుసరిస్తున్నారు. అది తప్పు కాదు. కాని నిజానికి ఆయన ఇవన్నీ ఇస్తున్నప్పటికి, వీటికంటే ఆయన వాగ్ధానం చేసేది గొప్పది. నిజానికి ప్రజలకు దాని గురించి అవగాహన లేదు.  ఆయనతో ఉన్న వారు అందరు ఆయన అనుచరులం అని అనుకుంటున్నారు. ఆయన అనుచరులు కావాలి అని అనుకునేవారు ఏమి చేయాలో, ఎలా ఉండాలో యేసు ప్రభువు ఈనాటి సువిశేషంలో తెలియ పరుస్తున్నారు. 

యేసు ప్రభువును వెంబడించాలి అనుకునేవారు ఏమి చేయాలి? యేసు ప్రభువు చెబుతున్న షరతులు ఏమిటి అంటే "తన తల్లిదండ్రులను, భార్యను,బిడ్డలను అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు." అని ప్రభువు చెబుతున్నాడు.  తల్లి దండ్రులను గౌరవించాలి అనేది ధర్మ శాస్త్రం లో ఉన్నది, కుటుంబాన్ని కాపాడుతూ, వారిని మంచిగా తీర్చి దిద్దటం, బాధ్యత గల ప్రతి యూదుని కర్తవ్యం. దానిని దేవుడు కూడా ఎంతో హర్షిస్తాడు, మరి యేసు ప్రభువు ఎందుకు ఇలా మాటాడుతున్నారు? ఒక సారి యేసు ప్రభువు దేవాలయంలో తప్పి పోయినప్పడు ఏమి అంటున్నారో చదివితే మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. లూకా 2: 48 "అప్పుడు తల్లి ఆయనతో కుమారా ఎందులకు ఇట్లు చేసితివి ? నీ తండ్రియు ,నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఏల వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా? అని ఆయన బదులు పలికెను." యేసు ప్రభువు జీవితంలో తండ్రి పని చేయడం, లేక దేవుని చిత్తం నెరవేర్చడం అనేది  అత్యంత ముఖ్యమైనది, దాని తరువాతనే ఏ పని అయిన , అందుకే ఆయన నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా అహరం అని అంటున్నారు. కనుక ఇక్కడ  , నాకు ఇష్టమైన , లేక నా కుటుంబ సభ్యులైన లేక ఇతర ఏ విషయము కూడా తండ్రి చిత్తముతో పోల్చినచో తక్కువదిగానే ఉండాలి, ఇది మనం తెలుసుకోవలసినది యేసు ప్రభువు జీవితం ద్వారా. 

యేసు ప్రభువును అనుసరించుట వలన ఏమి జరుగుతుంది. యేసు ప్రభువు తన తల్లిని ద్వేషించలేదు. కనుక అది ఖచ్చితముగా తల్లిని, తండ్రిని, తోబుట్టువులను  అసహ్యించుకోవడం కాదు. కాని తాను దేవుని పని చేయడానికి   ఎటువంటి ఆటంకం ఉండకూడదు. అదే విషయాన్ని యేసు ప్రభువు తాను దేవాలయంలో తప్పి పోయినప్పుడు చెబుతున్నారు. 

కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభువు జీవితంలో ఇదే సంధర్భన్ని మనం చూస్తున్నాం. తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి తన ప్రాణమును కూడా తృణప్రాయముగా త్యజించడానికి వెనుకాడలేదు, ఇప్పుడు ఆయనను అనుసరించాలి అని అనుకునేవారు, ఆయన కోసం, ఆ విధంగా తమ ప్రాణమును కూడా త్యజించడానికి సిద్దపడాలి.  అని ప్రభువు చెబుతున్నారు. ఒక వేళ మనం  ఆయన శిష్యుడు కాగోరి, దానికి మనం జీవితాన్ని త్యజించిన యెడల మనకు ఏమి వస్తుంది? మనం ఆయన శిష్యులు అవుతాం. మనం జీవం పొందుతాము, ఎందుకంటే నాకోసం తన ప్రాణమును కోల్పోవు వాడు దానిని నిలుపుకొనును అని ప్రభువు వాగ్ధానం ఇస్తున్నాడు. నిజానికి ఆయన కోసం మనం ఏమి కోల్పోతున్నామో అది సమృద్దిగా దొరకుతుంది. దేవుడు ఇచ్చేదీ సమృద్దిగా ఇస్తాడు. 

తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. యేసు ప్రభువును అనుసరించేది ఏదో ఒక రోజు లేక సమయంలో మాత్రమే కాదు. ప్రతి నిత్యం అది జరుగాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని ప్రభువు కోరుచున్నాడు.  ఏమిటి ఇక్కడ సిలువ అంటే రోజు వారి జీవితంలో యేసు ప్రభువును అనుసరిస్తున్న సమయంలో  ఎదురయ్యే సమస్యలను అదికమిస్తూ ఆయనను అనుసరించుటలో ముందుకు సాగటమే. 

ఈరోజు యేసు ప్రభువు సువిశేషంలో చెప్పే మాటలు చాలా కఠినముగా ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. కొన్ని సార్లు ఈ మాటలు యేసు ప్రభువు నుండి వస్తున్నాయా? అని ఆశ్చర్య పడుతుంటాం. ఈ రోజు సువిశేషంలోనే కాక వేరె సంధర్బంలో కూడా యేసు ప్రభువు ఇటువంటి మాటలు చెప్పారు. అవి  , యేసు ప్రభువు దేవాలయాన్ని శుభ్ర  పరిచే సమయంలో, తన శరీరం భుజించాలి అని అన్నప్పుడు, తనను అనుసరించమని యువకుడను అడిగిన సమయంలో  ఆయన మాటలు అర్ధం చేసుకోవడం కష్టం అని అనుకుంటాం. ఇవి ఏమిటి నిజానికి అంటే 1. ఆయనతో ఉండటం, దేవాలయాన్ని శుభ్ర పరిచే సమయం. 2. ఆయన శరీరం భుజించడం, 3, ఆయనను అనుసరించడం. నిజానికి మూడు ఒకటే అదే ఆయనతో ఎలా ఉండగలం అనే ఒకే ఒక విషయం చెబుతున్నాయి. 

మనం  ఏమి చేయాలి? ఆయనను అనుసరిస్తే ఆయన వాగ్ధానం చేసే నిత్య జీవితం మనకు వస్తుంది. కాని దానికి తగిన జీవితం మనం జీవించగలమా? మనలను మనం పరిశీలన చేసుకొని దానికి తగిన ఆయుధాలను మనం సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం చాలా గొప్పది దానిని కోల్పోకుండా తగిన ఆయుధ సంపత్తిని మనం ఏర్పాటు చేసుకోవాలి. యేసు ప్రభువు ఇక్కడ చెప్పిన రెండు ఉపమానల్లో కూడా సంధి చేసుకొనే సమయంలో మనం చాలా కోల్పోతాము ఎందుకంటే మన కంటే గొప్ప వాడైన రాజు మనతో సంధికి అనేక షరతులు పెట్టవచ్చు మనకు కేవలం కొద్ది వెసులుబాటు మాత్రమే ఇవ్వ వచ్చు, కాని మన ఇష్టాలు , అన్ని కూడా దేవునికోసం ఇస్తే మనకు ఆయననే పొందే భాగ్యం వస్తుంది. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...