పేజీలు

13.3.23

28 వ సామాన్య ఆదివారం

 28 వ సామాన్య ఆదివారం 

సిరా 7:7-11, హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30

ప్రియ మిత్రులారా గత ఆదివారం పరిసయ్యులు యేసు ప్రభువును విడాకుల గురించి ప్రశ్నించారు. ఈ రోజు ఒక యువకుడు యేసు ప్రభువును నిత్య జీవం పొందుటకు ఏమీ చేయాలి అని అడుగుతున్నాడు. యేసు ప్రభువు దైవ ఆజ్ఞలు పాటించమని చెప్పారు. ఆ యువకుడు నేను చిన్నప్పటి నుండి వాటిని పాటిస్తున్నానని   చెప్పుతున్నాడు. యేసు ప్రభువు దానికి నీవు చేయవలసి నది ఇంకొక్కటి ఉంది, నీకు ఉన్నదంతా అమ్మి,  పేదలకు  ఇచ్చి వచ్చి నన్ను అనుసరించు అని చెప్పారు. దానికి ఆ  యువకుడు నిరాశతో వెళ్ళిపోతున్నారు.  ఎందుకంటే అతనికి చాలా  సంపద, ఆస్తులు ఉన్నాయి వాటిని కోల్పోవడానికి సిద్దముగా లేడు. 

ఎందుకు ఆ యువకుడు యేసు ప్రభువును అనుసరించడానికి రాలేదు

పునరుత్థానము మీద ఆనాటి రోజులలో చాలా తక్కువ మందిలో  నమ్మకము ఉండేది.  పరిసయ్యులు పునరుత్థానము ఉంది అని భోదించేవారు. కానీ సద్దుకయ్యులు నమ్మేవారు కాదు.  యేసు ప్రభువు అందరికీ అంతిమ తీర్పు ఉందని విశ్వాసులకు నిత్య జీవం ఉందని బోధించారు. యేసు ప్రభువు బోధనలు  వారిలో నిత్య జీవానికి ఒక ఆశను రేకెత్తించాయి. ఆ కాలములో అందరూ దీనిని నమ్మలేదు, నిత్య జీవం ఉంటే మంచిది , నాకు దేవుడు ఇస్తే దానిని తీసుకోవడానికి సిద్దమే కాని దాని కోసము ఇప్పుడు ఉన్న ఏ ఆనందాన్ని  వదులుకోవడానికి సిద్దముగా లేను.

నిత్య జీవము పొందడానికి నేను ఏమీ చేయాలి అడిగినప్పుడు నీకు ఉన్నదంతయు  వదలి వేయాలనే  సవాలు తీసుకోవడానికి వెనకాడుతున్నాడు. ఈ యువకునికి నిత్య జీవము కావాలని ఉంది కాని  తన ఆస్తిని విడిచి వుండటానికి అతనికి ఇష్టం లేదు, తనకు ఉన్న ఆస్తి ఒక ఆశ్రయం అవుతుంది, బలం అవుతుంది, అనుకుంటున్నాడు.   తనకున్న ఆధారాన్ని వదలివేయడానికి అతనికి ఇష్టం లేదు.

ధర్మ శాస్త్ర బోధనలకు  అనుకూలముగా జీవించిన ఒక యువకుడు యేసు ప్రభువును అనుసరించలేక పోతున్నాడు. ఎందుకు  అంటే మనము పరిశుద్ద గ్రంధములో వినినట్లు , దేవుడే నా ఆశ్రయ  దుర్గము, నా కోట , లేక నా కొండయు ఆయనే అనే మాటలు, అన్నీ ఆపదలనుండి నన్ను కాపాడు వాడు దేవుడే అని మనము చెప్పుతుంటాము.  కానీ నిజానికి మన ఆధారం , ఆశ్రయము అన్నీ డబ్బే అని మనము జీవిస్తున్నాము.  అదే ఈ యువకుడు కూడా చేస్తున్నాడు. నేను అన్నీ చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని చెప్పుతున్నప్పటికీ తన ఆశ్రయం, ఆధారం , అన్నీ డబ్బే అన్నట్లుగా జీవిస్తున్నాడు.  

ప్రపంచంలో ప్రజలు   సంపదను వారికి ఆసరా అనుకుంటారు. వారి ముఖ్యమైన పని ఆది సంపాదించడం అదే వారిని రక్షిస్తుంది అని వారు నమ్ముతారు. మనకు తెలుసు ఎంత సంపద ఉన్న మనలను అది కాపాడలేదు అని మనం ఈరోజుల్లో ఎక్కువగా దానిని చూస్తున్నాము. కరోనా సమయములో సంపదలు కాపాడలేకపోయాయి. కానీ ఇంకా దానికోసమే పరుగెడుతుంటాము. నీ ఆశ్రయం, నీ అండ , నీ ఆసరా దేవుడు అయితే యేసు ప్రభువును అనుసరించటము తేలికవుతుంది. లేక పోతే యువకునిలా వెనక్కు వెళ్లిపోతాము.

నిత్య జీవం పొందటము ఎందుకు కష్టము

యేసు ప్రభువు ధనిక యువకుడిని నిత్య జీవం పొందడానికి ఆ యువకుని లో ఉన్న లోపం గుర్తిస్తూ   రెండు షరతులను పెడుతున్నారు, మొదటగా తన ఆస్తులను తనకున్నదంత వదిలివేయాలని అంటున్నారు,  అనేకమంది క్రైస్తవులు ఈ పని చేసి వారికి యేసు మీద ఉన్న ప్రేమ చూపించారు.  రెండవ షరతు నన్ను అనుసరించు అని అంటున్నారు. యేసు ప్రభువు ఆ యువకుడిని  తన శిష్యుడుగా కావాలనుకున్నాడు.  కానీ  ఆ యువకుడు బాధతో, నిరాశతో వెళ్లిపోతున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మొత్తము వదలి యేసును అనుసరిస్తారో అప్పుడు అతడు యేసు శిష్యునిగా ఉండటానికి తగిన వాడు  అవుతాడు, తనకు తెలియకుండానే యేసు క్రీస్తు పనిలో పాలుపంచుకుంటాడు.  శిష్యులకు యేసు ప్రభువు దీని గురించి వివరిస్తూ ధనవంతులకు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి ఎదురయ్యే సవాళ్లు గురించి చెప్పారు.  ధనవంతునికి పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంత కష్టము? అని యేసు ప్రభువు అనగానే శిష్యులు అంటున్నారు ఇంకా ఎవరు ప్రవేశించగలరు? అందుకే యేసు ప్రభువు చెప్పుతున్నారు మానవులకు   అది అసాధ్యము కానీ దేవునికి సాధ్యము ఎందుకంటే అది ఇచ్చేది  దేవుడు. నీ సంపదలతో దానిని నీవు కొనలేవు. మానవుని ప్రయత్నాలు ఏవి కూడా ఆయనకు నిత్య జీవాన్ని  తీసుకురాలేవు. కేవలము  అది దేవుని వరమే. ఎందుకు పర లోక రాజ్యములో ప్రవేశించుట కష్టము అంటే ధనవంతుడు తన సంపద తనకు అన్నీ సమకూరుస్తుంది అని దేవుని ఆజ్ఞలను పాటించక సంపద లోనే తన సర్వాన్ని చూసుకుంటాడు, వాటిని తన ప్రాణా ప్రాయంగా చూసుకుంటాడు, కొన్ని సార్లు వాటి వలనే తనకు విలువ ఉంటుంది అనుకుంటాడు, సంపదల వలన కొన్ని సార్లు ఎవరిని లెక్క చేయడు , దేవునికి దూరమవుతాడు, మనము పవిత్ర గ్రంధములో చూసే, నాబాలు, ధనవంతుడు లాజరు, కథలో ధనవంతుడు  ఈ కోవకు చెందినవారే. కానీ కొంతమంది తనకు దేవుడు ఇచ్చిన సంపదను మంచిగా వాడుకొని దేవుని మీద ఆధారపడి జీవించేవారు ఉన్నారు.

ఆదిమ క్రైస్తవులు ఏ విధముగా సంపదలను ఆస్తులను పరిగణించారు

 ఆదిమ క్రైస్తవులు  సంపదలను ఏ విధముగా చూసేవారో మనము కూడా అలానే సంపదలను చూడగలిగామా ?  ఒకసారి ఆలోచించండి. వారు ఆస్తులు పెంచుకోవాలి అనుకోకుండా పంచుకోవాలి అని అనుకున్నారు అపోస్తుల కార్యాలలో మనము ఇది చూస్తున్నాము. మనము కూడా దీనిని ఆదర్శము గా తీసుకోవాలి.  వారిలో ఒకరు పెద్ద ఒకరు చిన్న ఏమీ లేరు, వారిలో బలహీనులను వారు ఆదరముతో చూసేవారు.

 ఎందుకు మనం సంపదలను కోరుకుంటున్నాము - మానవుని కి ఏమీ కావాలి

ఈనాటి మొదటి పఠనములో సోలోమోను జ్ఞానము కోసము అడుగుతున్నాడు. దేవుడు చాలా సంతోషించాడు, సోలోమోనును చూసి  ఎందుకంటే ఆయన ఆస్తులకోసం అడగక ప్రజలను పాలించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు.  విచక్షణ,  జ్ఞానం అనే వరాలను మనము అడగాలి, అంతేకానీ డబ్బు ,సంపద ,పేరు, అధికారం లౌకిక అందలాలను మనము అడగకూడదు, మనకు కావాల్సిన వాటి కోసము మనము దేవుడని అడుగవచ్చు. కానీ ముఖ్యమైనది ఏమిటి అంటే జ్ఞానము, దానిని అడగాలి.


మనసు ఏ విధముగా ఉంది ఎంత నిర్మలముగా ఉంది


రెండవ పఠనములో హెబ్రీయులకి రాయబడిన లేఖలో ఇటువంటి ఒక వాదనను మనము చూస్తున్నాము. దేవుని వాక్కు మన హృదయాంతరంగాలు తెలుసుకోగలదని చెప్పుతుంది. అంటే మన హృదయంలో ఉన్న వాటిని శుద్ది చేసి  మంచి ఆలోచనలు కలిగేలా ఆయన చేయగలడు. ఈనాటి సువిశేషము నిజమైన ధనవంతుడు ఎవడూ అంటే కేవలము దైవ జ్ఞానము కల వాడు అని నేర్పుతుంది, ఈలోక సంపదలు ఈ జ్ఞానాన్ని పొందటానికి అవి  ఆటంకముగా ఉన్నాయి. 


సంపదల మీద గల ప్రేమ వలన ఏమి కోల్పోతున్నాము

ఆ యువకుడు తన సంపదల మీదే ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. అతనికి ఉన్న సమస్య మొత్తము కూడా ఒకటే తన సంపదలు. ఈ లౌకిక  విషయాలు లేక వస్తువులు మనల్ని నిత్య జీవితం నుండి దూరం చేయడాన్ని మనము అంగీకరించకూడదు. ఈ ప్రాపంచక వస్తువులు, ఆస్తులు సంపదల మీద మనకు ఉన్న ప్రేమ మనము యేసు  ప్రభువుని అనుసరించడానికి అనేక సార్లు ఆటంకముగా  ఉంటున్నాయి. సంపదల మీద అమితమైన  ప్రేమ కలిగి ఉంటే అప్పుడు దేవుని నుండి  దూరం కావడానికి మనము సిద్దపడుతున్నాము అని గుర్తుంచుకోవాలి.

యేసు ప్రభువు తన ప్రాణాన్ని అడగలేదు, కేవలము తన ఆస్తిని కోల్పోవడానికి సిద్దపడమన్నాడు. కానీ నేను అమితముగా అభిమానించే ఆస్తిని నేను కోల్పోవడానికి సిద్దముగా లేను. చివరికి అది నాకు నిత్య జీవితమును ఇచ్చినా కానీ, అంటే సంపదల మీద ప్రేమ వలన నిత్య జీవితాన్ని కూడా వదులుకుంటున్నాం. ఇటు వంటి ఆలోచనలు మనలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఆస్తి , సంపద  అనేది ప్రశ్న కాదు. నీవు  క్రీస్తుని అనుసరించడానికి ఏమీ నీకు  అడ్డముగా ఉన్నదో దానిని వదలిపెట్టడానికి  నీవు  సిద్దముగా ఉన్నావా  లేదా అనేది  ముఖ్యం. మనకు కూడా అనేక సార్లు ఈ నిత్య  జీవం కావాలి అని ఉంది కానీ నాకు ఇష్టమైన దానిని ఈ నిత్య  జీవము కోసము కోల్పోవడానికి నేను సిద్దం కావడము లేదు. నిత్య జీవితం కావాలనే కోరిక సన్నగిల్లి పోతుంది.  ప్రయోజనము లేని సంపదను ఉంచుకుంటున్నాము క్రీస్తుని పోగొట్టుకుంటున్నాము మనకు ఇష్టమయిన దాని కోసము. నిరాశ లో బాధలో కుమిలిపోతున్నాము.

సంపద అనేది మానవుని కి ఉన్న ఒక బలహీనత. ఇక్కడ  యేసు ప్రభువు మనలను పేద వారిగా ఉండటానికి పిలవటము లేదు ఆయన అనుచరులుగా ఉండటానికి పిలుస్తున్నాడు, ఆయన శిష్యులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. వచ్చి నన్ను అనుసరించు అంటున్నారు. యువకుడు సంపద యేసు  ప్రభువు కన్నా  గొప్పది కాదు  అనే సత్యాన్ని తెలుసుకోవాలి. పునీత శిలువ యోహను గారు యేసు ప్రభువుని  పొందటం కోసం సమస్తాన్ని నేను కోల్పోవాలి అంటారు. నీవు క్రీస్తుని కలిగి ఉంటే సమస్తం నీకు ఉన్నట్లే కనుక క్రీస్తు కోసము ఏమైనా  ఆనందముగా చేయడానికి సిద్దంగా ఉండాలి. ఆమెన్   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...