చెడు నుండి నేర్చుకొనవలసిన మంచి
ఆమోసు 8: 4-7, 1 తిమోతి 2:1-8 లూకా 16 : 1-13
యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: ఒక ధనవనంతుని వద్ద గృహానిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతని పై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉంద వీలుపడదు అని చెప్పెను. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను అని , యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో నీవు నా యజమానునికి ఎంత ఋణ పడి ఉన్నావు ? అని అడిగెను వాడు నూరు మణుగుల నూనె అని చెప్పెను. అపుడు అతడు వానితో నీ ఋణపత్రము తీసుకొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము అని చెప్పెను. అంతట అతడు రెండవ వానితో నీవు ఎంత ఋణపడి ఉంటివి? అని అడిగెను. వాడు నూరుతూముల గోధుములు అని బడులుపలికెను. అపుడు వానితో నీ ఋణ పత్రము తీసికొని ఏనుబది అని వ్రాసికొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయన , ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్యనివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోను నమ్మదగినవాడిగా ఉండును. కనుక, ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములలో మీరు నమ్మదగిన వారు కానిచో, మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలయన , వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును. లేదా , ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవ మును , ద్రవ్యమును సేవింపలేరు.
క్రీస్తు నాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా లూకా సువార్త 15, 16 ఆధ్యాయాలలో ప్రధానమైన ఉద్దేశ్యం దేవుని రాజ్యం.
యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలలో అర్ధం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండే ఒక ఉపమానం ఇది. తన యజమానికి రావలసిన ఋణాన్ని తగ్గించుచున్న గృహ నిర్వహకుని గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. మనం చూసే ఈ ఉపమానం యొక్క సంధర్బం ఏమిటి అంటే యూదయ ప్రాంతం లో చాలా మంది భూస్వాములు ఉండేవారు. కాని వారు పట్టణములలో ఉండేవారు. వారి భూమిని కౌలుకు ఇచ్చే వారు. వారు తమ ఆస్తులను , పొలాలను , వాటి మీద వచ్చేటువంటి ఆదాయమును, కౌలును అన్నింటిని చూసుకోవడానికి కొంతమంది గృహ నిర్వహకులను ఏర్పాటు చేసుకునేవారు. వీరు ఆ కౌలును లేక పంట కోసేటప్పుడు యజమానునికి వచ్చేటు వంటి భాగాన్ని అతనికి చెరవేసేవారు. ఈ ఉపమానం డబ్బును అధికముగా ప్రేమించేవారికి , మరియు దానిమీదే ఆధారపడే వారికి ఒక గుణపాఠం నేర్పుతుంది. అధే విధంగా పేదవారికి ఒక రకముగా ఈయన అభయాన్ని ఇస్తున్నాడు దేవుని మీద ఆధారపడమని. తన శిష్యులను పేదరికాన్ని చూసి భయపడ వద్దు అని చెబుతు ధనవంతులు కావాలని అవినీతి పనులు చేయ వద్దు అని చెబుతున్నారు.
ఒక ధనవనంతుని వద్ద గృహానిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతని పై నేరము మోపబడెను.
ఇక్కడ మనం ముగ్గురును చూస్తున్నాము. యజమాని, గృహానిర్వహకుడు, యజమానికి ఋణ పడినటువంటి వారు. మనకు యజమాని గురించి పూర్తిగా తెలియదు ఆయన ఎటువంటి వాడు అతని గుణగణాలు ఏమిటి ఇవి ఏమి మనకు అంతగా తెలియవు. యజమానుడు గృహ నిర్వహకుని మీద వచ్చిన అన్ని అభియోగాలపై విచారణ జరిపించారా? గృహ నిర్వహకునికి తన యజమానుని ఇంటిలో ఉన్న వారి అందరిమీద అధికారం ఉంటుంది, వారు అందరు సరిగా పని చేస్తున్నారా , అందరు ఆయనకు ఇవ్వవలసిన కౌలు మరియు మిగిలినవి ఇస్తున్నారా అని చూసుకోవాలసినది గృహానిర్వహకుడే. ఒక వేళ గృహ నిర్వహకునిమీద అసూయ తోటి లేక ఇతర కారణాల తోటి ఆయన మీద ఏమైనా నేరం మోపుతున్నారో కూడా మనకు తెలియదు. యజమానికి లాభం రాకపోయినచో అది గృహ నిర్వహకుని యొక్క చేతకాని తనంగా చూస్తారు. యజమానికి జరిగిన అవమానంగా చూస్తారు. గృహ నిర్వహకుని మీద ఇక్కడ వచ్చిన నేరం ఏమిటి అంటే అతను తన యజమానుని సంపదను వృధా చేస్తున్నాడు అని నేరం మోపబడింది. అంటే అతను చేయ వలసిన పని చేయకుండా , యజమాని అప్పగించిన బాధ్యతను అతను సరిగా చేయడం లేదు. కనున యజమానుడు అతనిని తీసివేయుటకు నిశ్చయించుకొని ఆ మాటను అతనికి తెలియజేస్తున్నాడు. తనను లెక్కలు అప్పజెప్పమని అడుగుతున్నాడు. ఇప్పుడు గృహానిర్వహకుడు తన తెలివితేటలను వాడుతున్నాడు. అప్పటి వరకు సోమరిగా ఉన్నాడు. కాని తన ఉద్యొగం పోతుంది అని తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడుతున్నాడు.
అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది.
ఇక్కడ గృహ నిర్వాహకుడు తనకు తానే చెప్పుకొనుచున్నాడు. నేను ఇప్పుడు ఏమి చేయాలి? నా యజమాని నన్ను పని నుండి తీసివేస్తున్నారు, నేనా కష్టించి పని చేయలేను. యాచించుటకా నాకు సిగ్గుగా ఉన్నది. తనతో తాను మాటలాడుకున్న ఈ మాటల నుండి మనకు కొన్ని విషయాలు స్పష్టమగుచున్నవి అవి ఏమిటి అంటేఈ వ్యక్తి తన యజమాని సంపదను పాడు చేస్తున్నాడు. అంటే ఇతను ఒక రకముగా ఇతను తన పనికి తగిన శక్తి సామర్ధ్యం కలిగిన వాడు కాదు. అని అర్ధం అవుతుంది. కనుక యజమాని తనకు తనను పని నుండి తీసి వేస్తున్నాను లెక్కలు తీసుకు రమ్మంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి మొత్తం కూడా కోల్పోతున్నాడు. తన నీడను , ఇక ఎక్కడ ఉండాలో తెలియదు, తాను భవిష్యత్తుకు ఏమి దాచుకోలేదు, తాను కష్టమైన పని చేయలేడు , అడుగుకొనలేడు , ఇప్పుడు అతను ఏమి చేయాలి తనను పని నుండి తీసివేసిన తరువాత ఎవరైన తనకు ఆశ్రయం ఇవ్వాలి. కనుక తన యజమానికి ఉన్న ఋణస్థులను అందరిని పిలుస్తున్నాడు. ఎవరైతే ఋణ పడి ఉన్నారో అందరి ఋణాలను తగ్గిస్తున్నాడు. అతని వద్ద డబ్బులు, లేక ఆస్తి ఏమి లేదు అని తెలుస్తుంది. కాని వృధా ఖర్చులు మాత్రం చేస్తూ ఉండేవాడు. అనవసరపు ఖర్చులు చేసేవాడు. తాను ఇతర పనులకు, ముఖ్యంగా శారీరక శ్రమతో కూడిన పనులు చేయుటకు , యాచించుటకు తాను సరిపోను అని తెలుసుకుంటున్నాడు. ఇక్కడ ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు అది ఏమిటి అంటే తన యజమానునికి ఋణ పడిఉన్న వారిని పిలిచి వారు ఇవ్వవలసిన మొత్తాన్ని తగ్గించుకోమని చెబుతున్నాడు. అంటే వారి వద్ద నుండి ఆశ్రయం పొందాలని అనుకుంటున్నాడు.
గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను అని , యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో నీవు నా యజమానునికి ఎంత ఋణ పడి ఉన్నావు ? అని అడిగెను వాడు నూరు మణుగుల నూనె అని చెప్పెను. అపుడు అతడు వానితో నీ ఋణపత్రము తీసుకొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము అని చెప్పెను. అంతట అతడు రెండవ వానితో నీవు ఎంత ఋణపడి ఉంటివి? అని అడిగెను. వాడు నూరుతూముల గోధుములు అని బడులుపలికెను. అపుడు వానితో నీ ఋణ పత్రము తీసికొని ఏనుబది అని వ్రాసికొనుము అనెను.
గృహనిర్వాహకుడు ఋణగ్రస్తుల ఋణాన్ని తగ్గించడం, వారు యజమానునికి ఇవ్వవలసినది ఎంత , లేక వారు చేసుకున్న ఒప్పందం మొత్తం గృహ నిర్వహకుని వద్ద ఉంటుంది. ఇక్కడ మనం చూసిన 50 మణుగుల నూనె , 20 తూముల గోదుములు తగ్గించడం ద్వారా ఋణస్థులు ఆనందంగా ఉంటారు. ఈ తగ్గించిన ఋణం చాలా పెద్ద మొత్తం లో తగ్గించడం జరిగింది, కనుక ఖచ్ఛితముగా వారు ఇంత సహాయం చేసినందుకు అతనిని అడుకుంటారు. ఎందుకు ఈ గృహ నిర్వాహకుడు ఇది చేస్తున్నాడు అంటే తనని ఋణస్తులందరు మంచి వాడు అని అనుకోవాలి. తరువాత అతనికి ఆశ్రయం కల్పించాలి. ఇంత పెద్ద మొత్తంలో తగ్గించినందుకు ఇది ఖచ్ఛితముగా జరుగుతుంది. ఎందుకంటే మనిషి తన స్వలాభం చూసుకుంటాడు కనుక , తనకు లాభం చేకుర్చిన గృహనిర్వహకునికి సహాయం పడడం తన విధిగా బావిస్తాడు అని గృహ నిర్వాహకుడు అనుకుంటున్నాడు.
ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజల కంటే యుక్తిపరులు.
ఇక్కడ యజమాని గృహనిర్వహకుని పొగుడుతున్నాడు. ఎందుకంటే అతను తెలివిగా ప్రవర్తించాడు. తన భవిష్యత్తు కోసం ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. యజమాని పొగుడుతున్నాడు. కాని యేసు ప్రభువు ఎందుకు ఈ పనిని ప్రశంసిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకానికి సంబందించిన వారు వారి భవిష్యత్తు కోసం ఎంతవరకు అయిన పోయి తమ జీవితాలలో కావలసిన వాటిని సమకూర్చుకుంటారు. యేసు ప్రభువు వీరు వెలుగు పుత్రులు కంటే తెలివిగలవారు. ఎందుకు అంటే విశ్వాసులు వెలుగు పుత్రులు యోహను 12:37.
విశ్వాసులందరు కు మరియు ముఖ్యముగా వెలుగు పుత్రులకు , మరియు డబ్బుల వాడకం గురించి చెప్పిన ఉపమానం ఇది. ఇది శిష్యులకు కూడా చెప్పిన ఒక ఉపమానం. డబ్బును ప్రేమించే వారి కోసం కూడా చెప్పిన ఒక ఉపమానం. యజమాని గృహానిర్వహకుడిని పొగుడుతున్నాడు. ఇతను ఎవరు ఒక గృహ నిర్వహకుడిగా తన దగ్గర ఉన్న వాటిని పాడు చేసిన వాడు. చివరకు తన భవిష్యత్తుకు కూడా ఏమి తన దగ్గర పెట్టుకోలేదు. అటువంటి ఒక వ్యక్తిని పొగడటం ఏమిటి ? అతను తన పనిని సరిగా నిర్వర్తించలేదు.
అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయన , ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్యనివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.
9 వ వచనంలో యేసు ప్రభువు చెబుతున్నారు. మీ సంపదతో మిమ్ములను పరలోక రాజ్యానికి ఆహ్వానించే స్నేహితులను ఏర్పాటు చేసుకోనండి అని చెబుతున్నారు. మీ సంపదను మీ వద్దనే మీరు మరణించినంత వరకు పెట్టుకున్నచో మనం లూకా 12 వ అధ్యాయంలో చూసిన ధనికుని జీవితంలో ఏమి జరుగుతుందో అదే మన జీవితంలో కూడా జరుగుతుంది. ఎలా నేను అవినీతితో సంపాదించిన సంపదతో పరలోకంలో నిధిని ఏర్పాటు చేసుకోగలను?
ధనం గురించి మనం నేర్చుకొనవలసిన మంచి ఏమిటి అంటే? మన ధనాన్ని క్రీస్తు కోసం, క్రీస్తు విలువల కోసం వాడటం. గురించి , ఆయన విలువలకు వాడటం.ఈ లోక సంపద అంటే డబ్బు, భోజనం, ఆస్తి ఐశ్వర్యం, భూమి అయితే పరలోక రాజ్య సంపద అనేది ఇతర ప్రజలను గెలుచుకోవడం. వారికి సేవ చేయడం, మనకు ఉన్న దానిని వారితో పంచుకోవడం. అప్పడు అవి మనకు పరలోకంలో సంపదలుగా మారుతాయి. మొదటి క్రైస్తవ కుటుంబాలు ఇలానే జీవించాయి. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోను నమ్మదగినవాడిగా ఉండును. కనుక, ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములలో మీరు నమ్మదగిన వారు కానిచో, మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును?
ఇక్కడ మనం అర్ధం చేసుకొనవలసినది యేసు ప్రభువు ఈ గృహ నిర్వహకుని యొక్క తెలివిని , తన భవిష్యత్తు కోసం తన ప్రదర్శించిన యుక్తిని మెచ్చుకున్నాడు కాని తాను చేసిన పనిని కాదు. ఇతను నమ్మదగిన వ్యక్తి కాదు. ఎందుకంటే అతను తన పనిని సరిగా నిర్వర్తించిన వ్యక్తి కాదు. అందుకే యేసు ప్రభువు చెబుతున్నారు. మీరు స్వల్ప విషయాలలో నమ్మదగిన వారు కాకపోతే పరలోక సంపదలను ఎవరు మీకు ఇచ్చును అని అంటున్నారు. ఏమిటి ఈ పరలోక సంపదలు? అంటే మంచి పనులు యకొబు రాసిన లేఖ 2: 15-17.
ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలయన , వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును. లేదా, ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవ మును , ద్రవ్యమును సేవింపలేరు.
డబ్బు మనం అనేక మంచి పనులకు కూడా వాడుతూఉంటాం కాని అనేక సార్లు అది మనలను అన్ని విధాలుగా మన జీవితాలను నిర్ణయిస్తుంది. అందుకే మనం దేవునికి మరియు డబ్బుకు సేవ చేయలేం. ధనాన్ని సేవించినచో మనము దానికి బానిసలు అవుతాము దానిద్వారా మనం ఒక యత్రం వలె మారిపోతాం. దేవున్ని మరియు ధనంను మనం సేవించడం కుదరదు. ఇక్కడ ఒక్క ధనమే కాదు దేవునితో వేరె దేనిని మనం పోల్చలేము. మరి ముఖ్యముగా దేవునికి మరియు ధనానికి సఖ్యత అనేది ఎక్కడ కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే మన దగ్గర ధనం ఎక్కువ అయితే అప్పుడు అది గర్వానికి దారి తీస్తుంది. సంపదకి మనిషి బానిస అయినప్పుడు దేవున్ని తిరస్కరిస్తాడు. అది కాకుండా దైవము ధనము ఎప్పుడు కలసి పోవు. కాబట్టి ఎల్లప్పుడు మనం దేవునికి దగ్గరగా మనం ఉండాలి. ఆమెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి