సొలొమోను జ్ఞానగ్రంధము 2 :12,17 -20) (యాకోబు 3 :16 -4 :3.) (మార్కు 9 :30 -37)
ఈనాటి మొదటి పఠనముద్వారా క్రైస్తవుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఏ విధముగా హింసను ఎదుర్కోవాలో తెలుసుకోవచ్చు. దేవుని వ్యతిరేకులు ఏ విధముగా మాటలాడుతారు అనేది మనము తెలుసుకుంటున్నాం. పూర్వం క్రైస్తవులను ప్రభుత్వాలు, పెద్దలు హింసించడము మొదలు పెట్టినప్పుడు కొంతమంది క్రైస్తవులు వారి విశ్వాసాన్ని వీడి జీవించారు మనము మొదటి పఠనములో యూదుల గురించి వింటున్నాము కానీ మొదటి రెండు ,మూడు శతాబ్ద క్రైస్తవులకు ఇటవంటి హింసలకు కూడిన జీవితం ఎక్కువుగా అనుభవించారు. కొంతమందిని అడవి మృగాలకు ఆహారముగా ఇచ్చారు, మరి కొంతమందిని ఘోరముగా హింసించి అగ్నికి ఆహుతి చేశారు, కొంతమందిని హింసించి చంపించారు. కానీ చాలా మంది వారి విశ్వాసములో గట్టిగా నిలబడ్డారు. ఈరోజు మనకు ఉన్న సవాలు ఏమిటి అంటే నేను క్రీస్తు విశ్వసిగా హింసకు గురి అయినట్లయితే, హింసను తట్టుకొని క్రీస్తు కోసము నిలబడగలనా ? అంత గొప్ప విశ్వాసము నాకు ఉన్నదా ? అని ఆలోచించాలి.
మనుషులు ఏవిధముగా ఒకరిమీద పుకార్లు పుట్టిస్తారు, ఏమి చేయని వారిమీద, ఎటువంటి చెడు చేయకపోయినా కొన్ని సార్లు ఈ పుకార్లు చాలా భయంకరముగా , ప్రమాధకరముగా తయారవుతాయి. అమాయకులు ఇటువంటి విష కాటులకు గురి అవుతుంటారు. విశ్వసిగా జీవించేవారు ఆవిశ్వాసుల చేతులలో శ్రమలను అనభవించవలసి వస్తుంది. సొలోమోను జ్ఞాన గ్రంధములో మనము చెడ్డ వాని స్వభావాన్ని చూస్తున్నాము. వాడు మంచి వాని మీద అకారణముగా పగ తీర్చుకుంటున్నాడు. ఇక్కడ నీతిమంతుడు అంటే దేవుని చిత్తాన్ని పాటించి మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించిన వాడు. ఎటువంటి చెడును చేయనివాడు. దుష్టులు ఇటువంటి మంచి జీవితమును జీవించే వాని మీద కుట్రలు పన్నుతున్నారు..మొదటి పఠనానికి మరియు మత్తయి 27: 41-44 కి మధ్య సంభంధాన్ని మనము చూడవచ్చు. ఇక్కడ వారు యేసుప్రభువును ,నీతిమంతుడు అన్నట్లుగానే అంటున్నారు. నీవు దేవుని కుమారుడవైనచో దిగిరమ్ము అని పలుకుచున్నారు. ఇతడు కేవలము దేవుని కృప వల్లే గెలుస్తాడు. దేవుని మీద నమ్మకానికి విలువ వుంది. నీవు దేవుని నమ్మితే కొన్ని సార్లు దుష్టుల కుట్రల వల్ల నీ పేరు పోవచ్చు, మన సంభందాలు దెబ్బతినవచ్చు,కొన్ని సార్లు ప్రాణాలు పోవచ్చు. నమ్మకము అంటే చివరికి దేవుడే గెలుస్తాడు, తనను నమ్మిన వారిని కాపాడుకుంటాడు. కాబట్టి వీటన్నిటిని పోగొట్టుకున్న పరవాలేదు. దేవుని మీద నమ్మకంతో నీతీమంతమైన జీవితము జీవించడానికి ప్రయత్నించాలి.
రెండవ పఠనం లో యాకోబు గారు మన పాప ఫలితాలను వివరిస్తున్నారు. అసూయ స్వార్ధపూరిత కోరికలు మనలో ఉన్నాయి, ప్రతి చెడు పని సాధనలో స్వార్థముంది, అసూయ ఉంది. మనకు ఉన్న సవాలు ఏమిటీ అంటే మన అసూయ, స్వార్ధ బుద్దికి వ్యతిరేకముగా వ్యతిరేకముగా సదా యుద్ధము చేయడమే. యాకోబు గారు చెప్పినట్లు ఎక్కడ అసూయ స్వార్ధ బుద్ది ఉంటుందో అక్కడ సకల చెడు గుణాలు ఉంటాయి. ఒక సారి మన సంఘాలను, సమాజాన్ని చూసినట్లయితే మనకు ఇది ఇట్టే తెలుస్తుంది. ఒక నెల క్రితమే వార్తా పత్రికలో చూసాము . నెల్లూరులో అనుకుంటా ఒక వ్యక్తి తన బాబాయిని మద్యపాన షాపు వద్దకు ప్రేమగా తాగుదామని తీసుకొని వచ్చాడు. తాగిన వెంటనే తన బాబాయిని కత్తితో చంపుతున్నాడు. అందరూ చూస్తుండగానే అతనిని హత్య చేశాడు, కారణం ఏమిటి అంటే వారికి ఆస్తి తగాదా ఉన్నది మొత్తము మాకే కావాలి అనే స్వార్ధం, తన సొంత అన్న లేక తమ్ముడు కుటుంబాలు ఎదుగుతున్న తట్టుకోలేని అసూయ మనలో ఉంటుంది. ప్రియ మిత్రులారా మనము క్రీస్తు అనుచరులము అయన మాటలను మనము మరిచిపోకూడదు, అయన మొదటి అనుచరుల వలె జీవించాలి. పునీత యాకోబు గారు ఆంతరంగిక యుద్దము గురించి మాటలాడుతున్నారు, మనము చెడు మీద ఎప్పుడు యుద్దము చేస్తూనే ఉండాలి. అంత నాకే కావాలనే స్వార్ధబుద్ది కూడా మనకి ఉంది దీని నుండి ఎలా బయటకు రావాలి. మన స్వార్ధ బుద్దిని విడిచి పెట్టడానికి, మనము ఉదారతను అలవరచుకోవాలి. యేసు ప్రభువు ఏ విధముగా తన ప్రేమను మనకు చూపించినది మనము తెలుసుకొని ఆ విధముగా జీవించడానికి సిద్ద పడాలి. ఆయన ఉదారత్వము, మరియు ప్రేమ మనకు మార్గ చూపరిలా మారి మనము స్వార్ధ , అసూయ బుద్దిని వీడునట్లు చేస్తుంది.
వారు తాము చేసినది తప్పని తెలిసి సిగ్గుతోటి చెప్పడానికి ఇష్టపడకపోయినప్పటికి అయిష్టముగానే మాలో ఎవరు గొప్ప వారు అను విషయాన్ని వాదించుకుంటున్నామని ఒప్పుకుంటున్నారు. వారి వాదనలకు యేసుప్రభువు ఇచ్చిన సమాదానము వారికి మాత్రమే కాక ప్రతి ఒక్కరికి, ప్రతి కాలనికి, నిన్న రేపటికి కూడా ఒక మంచి ఔషదము లాంటిది. ఒక మంచి పాఠము అవుతుంది. ఎవరైతే మొదటి వారు కాగోరుతున్నారో వారు కడపటి వారిగా ఉండాలని బోధిస్తున్నారు.
యేసు ప్రభువు ఒక చిన్న బిడ్డను వారి మద్య ఉంచి చిన్న పిల్లల వలె ఉండాలని చెప్పుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు ఒక చిన్న బిడ్డను వారి మధ్య ఉంచాడు. ఇంతకు ముందు యేసు ప్రభువు తన శిష్యులకు శ్రమలు , మరణము గురించి చెప్పడం జరిగినది. కానీ శిష్యులు దానిని అర్దము చేసుకోలేదు. మార్కు 9:32. వారు ఆయన మాటలు విని కూడా ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు. చిన్న పిల్లలు నిర్మల హృదయులు , కొన్నిసార్లు మారం చేసిన కానీ వారికి వారి తల్లి తండ్రి మీద ఉన్నటువంటి నమ్మకముతోనే చేస్తారు. చిన్న పిల్లలు ఇతరులను సహాజముగానే ప్రేమిస్తారు. ఎదుటివారిని లేదా అందరినీ ఎటువంటి తర్కము లేకుండా నమ్ముతారు, ప్రేమిస్తారు. అందుకే కొత్తవారి దగ్గరకు వెళ్లకూడదని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పుతారు. పిల్లలు చాలా తేలికగా ఎవరినైన క్షమిస్తారు. చిన్న పిల్లలకు ఎటువంటి అధికారాలు ఏమి ఉండవు. వారికి ఏమి శక్తి లేదు, వారికి మత పరమైన విలువ ఉండదు. అది యూదుల ఆచరము. కానీ యేసు ప్రభువు వారిని ఎలా చూస్తున్నారు అని మనము నేర్చుకోవాలి. యేసు ప్రభువుకి పిల్లలు కేవలము దేవుని అనుగ్రహము మాత్రమే కాదు. దేవుని రాజ్యములో వారికి ప్రాముఖ్యత ఉంది. చిన్న పిల్లలను నా వద్దకు రానివ్వండి అని యేసు ప్రభువు అంటున్నారు. చిన్న బిడ్డలను నా పేరున స్వీకరించువారు నన్ను స్వీకరించినట్లే అని అంటున్నారు. మార్కు 10: 14-15, మార్కు 9: 37. వారిది కేవలం అమాయకత్వము కాదు, వారిలో మనము చూడవలసినది వారి నిర్మలత్వము. నిర్మలత్వము అనేది దేవుని గుణము. ఎటువంటి చెడు ఆలోచనలు వారులో ఉండవు.
యేసు ప్రభువు చెప్పినట్లుగా మనము ఇక్కడ ఉన్నది, సేవ చేయడానికె కానీ సేవ చేయించుకోవడానికి కాదు. యేసు ప్రభువు తన శిష్యులకు సేవకులుగా ఉండాలని చెప్పుతున్నారు. మీరు సేవ చేయునప్పుడు మీరు మీ పూర్తి శక్తిని ఊపయోగించి చేయమని చెప్పుతున్నారు. మీ సేవకు ప్రతి ఫలాన్ని ఆశించవద్దు అంటున్నారు. ప్రతిఫలాన్ని ఎందుకు ఆశించవద్దు అంటున్నారంటే ఆయన వలె మనము జీవించాలని, ఆయన గుణ గణాలు మన ద్వార వెల్లడి కావాలని. యేసు ప్రభువు అందరికీ కావలసిన అవసరాలను తీరుస్తున్నారు, వారికి ఆరోగ్యం ఇస్తున్నారు, వారి అనారోగ్యాన్ని తీసివేస్తున్నారు. వారిని అపవిత్ర శక్తులనుంచి కాపాడుతున్నారు, కానీ వారినుండి ఏమి ఆశించలేదు. ఈ జీవితము మనకు కావాల్సినవాటిని సాధించుకోవడానికి మాత్రమే కాదు , లేక ఇతరులతో పోటీ పడటానికి వారి కంటే మనము గొప్ప వారము అనిపించుకోవడానికి మాత్రమే కాదు. మనము ఇటువంటి వాటికి మాత్రమే ప్రాముఖ్యతను ఇస్తే నిజమయిన మానవీయ విలువలు కోల్పోయిన వారిగా ఉంటాము. ఎందుకంటే ఇతరులతో పోల్చుకొని , ఇతరులకంటే గొప్పగా ఉండాలని అనేక తప్పులను చేస్తున్నాము. మనకు ఇష్టమైన వాటిని సాధించుకోవడానికి ఎంతటి ఘోరమైన పనిని అయిన చేయడానికి సిద్దపడుచున్నాము. మానవ విలువలు కోల్పోతున్నాము. మానవీయ విలువలు కోల్పోయినవాడు మనిషి అని ఏ విధముగా అనిపించుకోగలడు? అందుకే యేసు ప్రభువునుండి ఈ మానవీయ విలువలు నేర్చుకోవాలి.
ఈ లోకాన్ని మార్చే విధానము కేవలం ఇవ్వడము ద్వార మాత్రమే. ప్రతి ఒక్కరూ క్రీస్తు వలె చుట్టూ ఉన్న వారి భాదలు కష్టాలలో పాలుపంచుకుంటే ఖచ్ఛితముగా లోకము మారుతుంది. యేసు ప్రభుని సందేశము ఇక్కడ చాలా ముఖ్యమైనది. మనము అందరము దేవుని బిడ్డలము మనం సోదరి సోదరులని తెలియచేస్తుంది. క్రీస్తు శిష్యులుగా మనము ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, సహాయం చేస్తూ జీవించాలని బోధిస్తుంది. మనము యేసు ప్రభువు శిష్యులు అయ్యే ముందే మనము ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన జీవించి ఉండగా కూడా ఆయనను విశ్వసించడము, ఆయనను అనుసరించడం అంత సులువు కాదు. అది అందరికీ సాధ్యపడదు. నిజమైన క్రైస్తవ జీవితము కేవలము మానవీయ విలువలు పాటించడమే కాక ఇంకా ముందుకు పోవడము. ఇతరుల కోసం మనలను మనం త్యజించు కోవడం. ఇది సాధ్య పడేది కేవలము నీవు క్రీస్తుని మరియు నీ సోదరుని పూర్తిగా ప్రేమించినప్పుడు కనుక ఆ విధముగా జీవించడానికి ప్రయత్నిద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి