పేజీలు

13.3.23

మ్రాని కొమ్మల ఆదివారము (ప్రజల ఆకాంక్ష - యేసు ప్రభుని కర్తవ్య నిర్వహణ )

 

ప్రజల ఆకాంక్ష - యేసు ప్రభుని కర్తవ్య నిర్వహణ 

క్రీస్తు నాధుని యందు ప్రియమైన మిత్రులారా ! పవిత్ర ఆదివారము రోజున హోసన్న అనే నినాధాలతో ప్రజలు యేసు ప్రభువును యెరుషలేము నగరానికి ఆహ్వానిస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువును వీరు అంతగా ఆహ్వానిస్తున్నారు? ఎందుకు ఈ జయ జయ నినాధాలు చేస్తున్నారు? ఏ విజయం వారు పొందారు? ఈ ప్రశ్నలను మనం అడిగినట్లయితే మనకు వారి జీవితాలలో వారు ఆశించినవి యేసు క్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతాయి అని వారి అర్ధం చేసుకొని చేసినటువంటి జయజయ నినాధాలు ఇవి అని అర్ధం అవుతాయి. 

ఇది కేవలం జయ జయ నినాదం మాత్రమే కాదు మరి ఏమిటి అంటే ఒక రకమైన వేడుకోలు. హోసన్న అంటే కూడా అర్ధం అదే. మమ్ములను ఇప్పుడు రక్షించు అని అర్ధం. 

యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించిన  చివరి వారము అంత్యంత ముఖ్యమైనటువంటి వారము. మానవ రక్షణ కార్యాన్ని పూర్తి చేసినటువంటి రోజులు.   అందుకే దీనిని మనము పవిత్ర వారము అంటున్నాము. క్రైస్తవులైన మనకు ఇది చాల ముఖ్యమైన వారము. 

యేసు ప్రభువులో వారు ఏమి చూశారు 

మొదటి శతాబ్దము 30 వ సంవత్సరములో జెరూసలెములో  రెండు  ఊరేగింపులు జరిగాయి. ఒకటి అలనాటి కూలీలా ఊరేగింపు , రెండవది సామ్రాజ్య అధికారుల ఊరేగింపు. తూర్పు నుండి యేసు ప్రభువు గాడిద మీద ఊరేగింపుగా జకర్యా ప్రవక్త ప్రవచించిన విధముగా శాంతియుతమైన రాజుగా వస్తున్నాడు.   రెండవ ప్రక్క  పడమర నుండి పిలాతు తన మంది మార్బలంతో,సైన్యంతో  యెరుషలేము లోనికి వచ్చాడు. యేసు ప్రభువు రాక దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తుంది. పిలాతు రాక సామ్రాజ్య అధికారాన్ని సూచిస్తుంది. పిలాతు రాక రోమా సామ్రాజ్య అధికారము మరియు తాను ఎటువంటి అధికారము కల వాడు అన్నది, తన సైన్యము ద్వారా తెలియ పరుస్తున్నాడు. యేసు ప్రభువుని ఆహ్వానించేవారు కూలీలు, రాజకీయ, ఆర్థిక సామజిక అసమానతలతో తమ జీవితాలలో ఎటువంటి మంచి జరగలేని సమయములో యేసు ప్రభువుని ఒక రాజుగా, వారి సమస్యలకు సమాధానము ఇచ్చే వానిగా చూసారు. వారి జీవితాలలోని మరియు వారి పట్టణములోనికి ఆహ్వానించారు.  దావీదు మహారాజుని విజయము తరువాత ఆహ్వానించినట్లు యేసు ప్రభువుని ఆహ్వానిస్తున్నారు.  మనము కూడా యేసు ప్రభువుని మన రాజుగా , రక్షకునిగా తెలుసుకొని ఆహ్వానించుదాము. 


రాజకీయ అణచివేత

యెరూషలేము కేవలము ఒక పట్టణము మాత్రమే  కాదు , మొదటి శతాబ్దములోనే అది ఖగోళిక పవిత్ర కేద్రంగా ఉన్నది.    యూదులకు గొప్ప నగరము కావటము వలన అందరి చూపు ఆ నగరము మీదనే ఉన్నది. ఆధిపత్య వ్యవస్థకు స్థానము అయ్యింది.  రాజకీయ అణచివేతకు అనుకూలముగా గవర్నరు కూడా అక్కడే ఉంటున్నాడు. అటువంటి సమాజములో పెక్కుమంది, తక్కువ మంది చేత పరిపాలించబడుతారు. గొప్పవారు అనుకునే వారికి మాత్రమే స్థానము ఉంటుంది,సాధారణ వ్యక్తులకు అక్కడ స్థానము లేదు. 

ఆర్థిక దోపిడీ 

యెరూషలేము లో మనము చుసేటువంటి ఇంకొక ప్రధానమైన సమస్య ఏమిటి అంటే ఆర్థిక దోపిడీ.  సమాజములో ఉన్నటువంటి సంపద మొత్తము కూడా కొద్దిమంది ధనవంతులు, అధికారము కలవారి దగ్గరనే ఉంది. వారు అక్కడ ఉన్నటువంటి నియమాలను చట్టాలను ఆధారము చేసుకొని ఆ విధముగా చేసుకున్నారు. భూమీ మీద హక్కు , పన్ను విధానము,  పెద వారితో కొన్ని ఒప్పందాలను చేసుకొని  ఆర్థికంగా వారిని దోచుకున్నారు. 

దోపిడీకి మతపరమైన చట్టబద్దత 

సమాజములో ఇటువంటి వ్యవస్థలను మతపరమైన చట్టాలతో వ్యవస్తీకృతము చేసారు. ప్రజలకు  రాజు దేవుని ఆదికారముతో పాలించాడు అని చెప్పారు. రాజు దేవుని కుమారుడు అని, ఇటువంటి వ్యవస్థ దేవుని ప్రణాళిక అని , అధికారులకు దేవుని నుండి అధికారము వచ్చింది అని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు ఏవిధముగా ఉన్నవి అక్కడ అంటే, దేవాలయ అధికారులు, యాజకులు భూస్వాములుగా ఉన్నారు, వారు యెరూషలేములో ఉంటూ వారి  పొలాలకు దూరముగా ఉన్నారు. భూమి లేని వారికి కూలీలకు భూమిని కౌలుకు ఇచ్చేవారు,  కూలీలకు ,పేదవారికి  ఎటువంటి అవకాశమలేదు. కేవలము, దినసరి కూలి , లేక పట్టణానికి వలసపోవడము, లేక అడుక్కోవడము మాత్రమే వారు చేయగలిగినది. దేవాలయము స్థానిక మరియు సామ్రాజ్య పన్ను విధించే వ్యవస్థ అయ్యింది, స్థానిక పన్నులను దశమ భాగం అనేవారు . ఇది వ్యవసాయ  ఉత్పత్తు ల మీద విధించేవారు.  యేసు ప్రభువు మరియు యోహాను లు పాపక్షమాపణను దేవాలయానికి సంభందం లేకుండా ప్రకటించారు, అంటే దేవాలయము పాప క్షమాపణకు, దేవుని చేరుటకు ప్రధానమైన మధ్యవర్తి అనే  సిద్ధాంతాన్ని తిరస్కరించారు. 

ఇటువంటి  బాధలతో ఉన్నటువంటి ప్రజలు యేసుప్రభువుని వారి మధ్యకు ఆహ్వానిస్తూ హోసన్నా జయ జయ  నినాదాలు చేస్తున్నారు. ఎందుకు అంటే వారి కష్టాలు భాదలు మొత్తము కూడా ఆయనకు తెలుసు, వారి గురించి ఆయన మాట్లాడారు. ప్రభు హిత సంవత్సరాన్ని ప్రకటించియున్నాడు. అంటే వారి భూమి వారికి వస్తుంది, వారు ఇక నుండి వడ్డీలు కట్టనవసరము లేదు. అందుకే వారు చెపుతున్నారు హోసన్నా అని .  అంటే మమ్ములను ఇప్పుడే  రక్షించు అని ఆర్డము. ప్రియా సహోదరులారా నిజానికి వారు తెలియకుండానే ఆయన్ను రక్షకునిగా గుర్తించారు. యేసు ప్రభువు నుండి రక్షణను పొందుతున్నారు. ఈనాటి క్రైస్తవులమైన మనము కూడా అలానే ఆయనను మన కష్టాలను బాధలను వీక్షించమని  విన్నవిద్దాము మన రక్షకునిగా ఒప్పుకుందాము. ఆయనను అనుసరిద్దాము. 

ఎటువంటి ఊరేగింపుతో యేసు ప్రభువును వారు ఆహ్వానిస్తున్నారు 

ఇక్కడ యేసు ప్రభువు ఒక యుద్దంలో విజయం పొందిన రాజు వలె యెరుషలేము లోనికి వస్తున్నారు. వీరు ఒక విజయోత్సవం జరుపుకుంటూ వస్తున్నట్లు ఉన్నారు. ఆయనను రాజు వలె ఆహ్వానిస్తున్నారు. పచ్చని కొమ్మలు వూపుతూ వారి ఆనందాన్ని తెలుపుచున్నారు. హోసన్న అని నినాదాలు ఇవ్వడం కూడా దానిలో భాగమే. ఇవన్నీ చెప్పేది ఒక విజయం పొంది తన సొంత రాజ్యానికి విజయోత్సహంతో వచ్చే రాజుకి ఇచ్చే ఆహ్వానం. దీనిని మనం సౌలు విజయం పొందిన తరువాత సౌలుకి దావీదుకి ఇటువంటి ఆహ్వానం లభించినది. 

వారు సౌలు , దావీదునకు పొందిన ఆహ్వానం లాంటిదే కాని ఇక్కడ ఒక విషయంలో భిన్నంగా ఉన్నది, అది ఏమిటి అంటే ఇక్కడ హోసన్న అని వారు అంటున్నారు. వీరిలో ఒక నమ్మకం ఇక్కడ ఉంది.  ఇతని మీద ఒక ఆశ పెట్టుకొని వారు ఉన్నారు. అదే వారిని రక్షించాలని. దావీదు కుమారుడు మా రక్షకుడు అని వారు గ్రహించారు. 

ఎటువంటి రక్షణ వారు కోరుకున్నారు 

యేసు ప్రభువును ఆహ్వానించినవారు, పేదలు, అభాగ్యులు, అవసరాలలో ఉన్నవారు, అణచివేయ బడినవారు, అనారోగ్యంతో ఉన్నవారు వీరు ఆయన వారికి ఉన్న సమస్యలకు విముక్తి ఇస్తారు అని కోరుకున్నారు, ఎందుకంటే ఆయన పరిచర్య మొత్తం వీరికోసమే సాగింది. వీరికి కావలసినది బానిసత్వం నుండి విముక్తి,  ఇతరుల అధికారం నుండి విముక్తి, అనారోగ్యం నుండి విముక్తి, వారికి స్వేచ్ఛ కావాలి, ఎవరు ఇది ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇది చేయగలడు. ఇక్కడ మనకు  సమూవేలు ప్రవక్తను గుర్తుకు వస్తారు. ఆయనే దేవుడే మీకు రాజు అని చెప్పింది. మెలెక్ యావే అంటే యావే మా రాజు. ఇది ఈరోజు వారు అడుగుతున్నారు, ఇంతకాలం వారు దేవుడిని తమ రాజుగా ఉండమని అడగలేదు. ఆయన వారి రాజు అవుతున్నారు. కానీ ఏ విధంగా ఆయన వారి కోరికలను తీరుస్తారు? ఎలా వారికి స్వేచ్ఛ ఇస్తారు? ఎలా వారిని అన్యుల నుండి రక్షిస్తారు? ఎలా పాపమునుండి రక్షిస్తారు? 

యోషయా గ్రంధంలో బాధమయా సేవకునిగా ఆయన ఈ పనిని చేయడం మనం చూస్తాము. బాధమయా సేవకుని వ్యక్తిత్వం ఇది మనకు తెలియ చేస్తుంది. ఆయన దేవునిచేత పంపబడినవాడు. ఆయనకు ఒక కర్తవ్యం ఉంది. అది శ్రమలు, కష్టాలు పొందటంతో జరుగుతుంది. చివరకు తన ప్రాణంను ధరపోసి తన ప్రజలకు రక్షణను ఇస్తున్నాడు. ఇది శ్రమలు, కష్టాలు నుండి వెనకకు పోవడం లేదు. వాటిని ఎదుర్కొంటున్నాడు. యోష 50:7. 

పునీత పౌలు గారు పిలిప్పీయులకు రాసిన లేఖలో  యేసు ప్రభువు ఎలా దేవుని కుమారునిగా తన కర్తవ్యం నెరవేర్చాడు అని తెలుపుతున్నారు. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని మనలను రక్షించారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు యోహను 15 వ అధ్యాయం 13 వ వచనంలో "తన స్నేహితుని కోరకు  తన ప్రాణంను ధారపోయువాని కంటే ప్రేమ కలవాడు ఎవడును లేడు"  అని చెప్తున్నారు. అంటే మన కోసం తనను తాను పూర్తిగా అర్పించారు యేసు ప్రభువు . ఆయన దేవుడైనప్పటికి తన దైవత్వంను వీడి మానవ రూపం దాల్చి మనలను రక్షించారు, తనను తాను తగ్గించ్చుకున్నారు.  ఈ విధంగా ఆయన మనలను రక్షించారు. ఆయనను కోరుకున్న కొరికలన్నింటిని తీరుస్తున్నారు. 

యెరుషలేములోనికి యేసుప్రభుని విజయోత్సవ రాక కూడా  మనకు ఆయన ఎటువంటి రాజు అని తెలుపుతుంది. ఆయన అహంతో కూడిన రాజు కాదు. అందుకే జెకర్యా ప్రవక్త "సియోను కుమారీ! నీవు మిగుల సంతసింపుము. యెరుషలేము కుమారీ నీవు ఆనందనాదాము చేయుము . అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు విజయుడు , జయాశీలుడై విజయము చేయును కానీ వినయాత్ముడై గాడిదపై వచ్చును " అని చెబుతున్నారు 9:9.  ఆయన్ను ప్రజలు రాజుగా చూసిన , ఆయనలో రక్షకుడిని చూసిన , ఆయనకు తెలుసు వారు అడిగేది తాత్కలికమైనటువంటి వాటిని అని ఎందుకంటే ఆయన వారు ఆకలితో ఉన్నప్పుడు ఆహారం ఇచ్చాడు, వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చారు. చనిపోయినవారిని బ్రతికించాడు ఇవి చూసి ఈయన మాతో ఉంటే మాకు ఎటువంటి సమస్య ఉండదు అనే ఉద్దేశం తో వారు ఉన్నారు  కాని, ఆయన మనకు శాశ్వతమైనటువంటి వాటిని ఇవ్వాలనుకుంటున్నారు.  అది ఏమిటి అంటే నిత్య జీవం , మరణం నుండి రక్షణ , పాపం నుండి రక్షించాలనుకుంటున్నారు. ఇది తన ప్రాణాన్ని ధార పోయడం ద్వార ఆయన చేస్తున్నారు. 

ఈ మ్రాని కొమ్మల ఆదివారం మనకు మనం ఎటువంటి కోరికలు కలిగి ఉన్నాము, ఎవరు వాటిని తీర్చగలరు అని తెలుపుతుంది. మనకు కావలసినది ఏమిటి అని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది అది యేసు ప్రభువు మాత్రమే తీరుస్తారు అని తెలియజేస్తుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...