పేజీలు

24.4.23

అనుదిన ఆత్మీయ అహరం , యోహాను 6:22-29

 యోహాను 6:22-29 

మరునాడు, సరస్సు ఆవలి తీరమున ఉండిపోయిన జనసమూహము, అచటనున్న ఒకే ఒక పడవను చూసిరి. ఆ పడవలో  శిష్యులతోపాటు యేసు వెళ్లలేదని శిష్యులు మాత్రమే వెళ్ళుట చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా  నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని, శిష్యులుగాని లేకుండుట చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి?" అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసిఉన్నాడు." అని యేసు సమాధానమిచ్ఛెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను? అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది." అని చెప్పెను.

ధ్యానము : యేసు ప్రభువును వెదకుచు తిబేరియా నుండి ప్రజలు వస్తున్నారు. వారు, అక్కడ యేసు ప్రభువు లేరని గ్రహించి, అక్కడ నుండి యేసు ప్రభువును వెదకుచు కఫర్నాము  వెళ్లారు. వారు ఎందుకు యేసు ప్రభువును వేదకుచు వచ్చారు? వీరు అనేక కారణాలతో యేసు ప్రభువును వెదకుచు వచ్చి వుంటారు. కాని అన్ని  కారణాలు కూడా తాత్కాలికమైనవే. వారు యేసు ప్రభువును చూసి "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి? అని అడిగిరి." అందుకు ప్రభువు మీరు నా అధ్భుతములు చూసి కాదు, మీరు సంతృప్తిగా భుజించినందుకు నన్ను వెదకుచున్నారు అని వారితో చెబుతున్నారు. ఆనాటి ప్రజలు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినది కూడా వారి యొక్క అవసరాలు తీరుస్తారని, లేక వారి కడుపు నింపుతారని లేక వారి తాత్కాలిక భాదల నుండి వారికి ఉపశమనం కలుగచేస్తారని వారు యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు. అంతేకాని ఆయన వారికి శాశ్వతమైనవి ఇస్తారు అనే ఆలోచన వారికి లేదు. 

యేసు ప్రభువు నందు వారందరు కేవలం వారికి కావలసిన, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే వ్యక్తిని మాత్రమే చూశారు. వారికి అంతకంటే ఎక్కువుగా ఏమి ఉంటుంది అని తెలియదు. ఎందుకంటే వారి  ఆలోచనలు ఎప్పుడు ఇహలోక విషయముల గురించి మాత్రమే.  నేను కూడా ఈరోజు ఇటువంటి ఆలోచనలు మాత్రమే కలిగిఉన్నానా? అని ఒక సారి ఆలోచిస్తే ఈరోజు ఎక్కువగా దేవాలయము వచ్చేది మరియు ప్రార్ధించేది కూడా ఇటువంటి ఆలోచనలతోనే, తాత్కాలికమైన వాటికోసమే మనం దేవున్ని కోరుకుంటున్నాము. యేసు ప్రభువు స్వస్థ పరచిన అనేక మంది తరువాత ఆయన వెంట ఏమి లేరు, దాని తరువాత వారి పనులలో వారు నిమగ్నమైపోతున్నారు. కాని యేసు ప్రభువు ఎవరు ? ఆయన కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చేవాడేనా? లేక ఆకలి తీర్చే వాడు మాత్రమేనా? ఆయనను పూర్తిగా అర్ధం చేసుకోలేక పోతున్నాము. అయినప్పటికీ యేసు ప్రభువు అనేక సార్లు ఆయన ఎవరు ఆయన మనకు ఏమి ఇవ్వగలడు అని  తెలియజేస్తూనే ఉన్నారు, కాని అది మనం అర్ధం చేసుకోలేకపోతున్నాము. 

నా అధ్భుత కార్యములు చూసికాదు మీరు వచ్చినది అని యేసు ప్రభువు చెబుతున్నారు. యోహాను సువిశేషంలో యేసు ప్రభువు చేసిన ప్రతి అద్భుతం కేవలం ఆయన దేవుడు అని తెలియజేస్తుంది. ఆ అద్భుతాలలో ఇది ఏ మానవు మాతృడు చేయలేడు అనే అర్ధం వస్తుంది. యేసు ప్రభువు ప్రతి అధ్బుతం కూడా ఆయన దేవుడు అని తెలుపుతుంది. అటువంటి ప్రభువును మనము అర్ధం చేసుకోక ఆయన నుండి కేవలం ఇహలోక విషయములను మాత్రమే ఆర్ధిస్తున్నాం. ఆయన మనకు ఏమి ఇవ్వ గలడో మనం పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాము. ఇహలోక సంబంధమైనవాటిని కాకుండా ఆయన మనకు ఏమి ఇవ్వగలడు? అని ఒక సారి పరిశీలించనట్లయితే యోహాను సువిశేషం మొత్తం కూడా అదే మనకు ఆయన చెబుతున్నాడు. 

"అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును." యేసు ప్రభువు మనకు ఏమేమి ఇవ్వగలడు మరియు మనము దేనికి శ్రమించాలి అనే విషయాలను ఇక్కడ యేసు ప్రభువు వెల్లడి చేస్తున్నారు. ఏమిటి శాశ్వతమైన భోజనం? ఆ భోజనము ఏమి ఇస్తుంది? యేసు ప్రభువు దీని గురించి తరువాత చెబుతారు , మోషే మీకు పరలోకము నుండి మన్న ఇవ్వలేదు. మనుష్య కుమారుడు మాత్రమే మీకు శాశ్వత భోజనము ఇస్తారు అని. ఆ శాశ్వత భోజనము ఏమి చేస్తుంది? అంటే నిత్య జీవనము ఇస్తుంది. యేసు ప్రభువు ప్రసాధించగలిగి మరలా ఎవరు ప్రసాదించలేనిది ఇదే. అదే నిత్య జీవము. ప్రభువు మనలను తన నుండి దానిని కోరుకోమని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన మాత్రమే అది ప్రసాదించగలడు. అంతే కాదు తండ్రి దేవుడు ఆయనకు ఆ అధికారమును ఇచ్చిఉన్నారు.

దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడిగినప్పుడు యేసు ప్రభువు వారికి తనను విశ్వసించమని చెబుతున్నారు. ఇక్కడ యోహాను సువిశేషం మనకు యేసు ప్రభువును విశ్వసించడం గురించి మనకు అనేక సార్లు గుర్తుచేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును విశ్వసించే వారు ఎలా నిత్య జీవం పొందుతారో ఈ సువిశేషం మనకు వివరిస్తుంది. యేసు ప్రభువును విశ్వసించే వారు, విశ్వసించుట వలన నిత్య జీవం పొందుతారు, వారికి దేవుని బిడ్డలగు భాగ్యమును ఆయన ప్రసాదించారు. తండ్రి దేవుడు మన నుండి ఆశించేది ఏమిటి అంటే మనం తన కుమారుడయిన యేసు ప్రభువును విశ్వసించాలి అని, ఆ విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందాలి దేవుడు ఆశిస్తున్నారు. 

ప్రార్దన : ప్రభువా ! మీరు మా మీద ఎంతో ప్రేమతో మమ్ములను ఎల్లప్పడు మీతో ఉండేలా, నిత్య జీవితాన్ని మాకు ఇవ్వాలి అని మా దగ్గరకు వచ్చి , మీరు అనేక అధ్బుతలు చేసి మీరు మాకు ఏమి ఇవ్వగలరో చూపించన కాని మేము మిమ్ములను అర్ధం చేసుకోవడంలో విఫలం చెందాము, మా తాత్కాలిక భాదలు నుండి సమస్యల నుండి ఉపశమనాన్ని మాత్రమే మిమ్ము కోరుతూ ఉన్నాము. మా అజ్ఞానం మీకు తెలుసు ప్రభువా మేము ఏమి కోరుకోవాలో కూడా తెలుసుకోలేని పరిస్థితులలో మేము ఉన్నాము అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. మేము ఏమి అడగాలో , ఏది శాశ్వతమో అది అశాశ్వతమొ మాకు తెలియజేయండి. మేము ఎల్లప్పుడూ  అశాశ్వతమైన వాటి కోసం పని చేసే వారిగా మమ్ములను మలచండి. మీరు మాత్రమే ఇచ్చే ఆ నిత్యం జీవం కోసం పని చేసే వారిగా , మిమ్ము ఎప్పుడు విశ్వసించే వారిగా మమ్ము చేయండి. తండ్రి మా నుండి ఆశించే పనిని చెసేలా మమ్ము ఆశీర్వదించండి. ఆమెన్ 


21.4.23

అనుదిన ఆత్మీయ అహరం , యోహాను 6:1-15

 యోహాను 6:1-15 

ఆ పిదప యేసు తిబేరియా అనెడి గలీలియ సరస్సు దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అధ్బుత కార్యములను చూచి గొప్ప జనసముహము ఆయనను వెంబడించేను. యేసు పర్వతమునెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్క పండుగ సమీపించినది. యేసు కనులేత్తి గొప్ప జనసముహము తన యొద్దకు వచ్చుట చూచి, పిలిప్పుతో వీరు భుజింపవలసిన అహర పదార్ధములను మనమెక్కడ నుండి కొని తెచ్చెదము? అనెను. పిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలన, తానేమి చేయబోవుచున్నది ఆయనకు తెలియును. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైన రెండువందల వరహాల రొట్టెలు కూడ చాలవు అని పిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు  సీమోను పేతురు సోదరుడు, అంద్రెయ : ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవ (గోదుమ) రొట్టెలు, రెండు చేపలు కలవు. కాని, ఇంత మందికి ఇవి ఏమాత్రము? అని పలికెను. యేసు "అందరను భోజనమునకు కూర్చుండబెట్టుడు" అనెను. అచట ఇంచుమించు  ఐదు వేల మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అపుడు యేసు రొట్టెను తీసికొని, ధన్యవాదములు అర్పించి, కూర్చున్న వారికి వడ్డించేను. అట్లే చేపలను కూడ వారికి తృప్తి కలుగునంతగ వడ్డించేను. వారు తృప్తిగా భుజించిన పిదప, యేసు శిష్యులతో "ఏమి వ్యర్ధము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు" అని చెప్పెను. వారు భుజించిన పిదప ఐదు యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను పండ్రెండు గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అధ్భుతమును చూచి, వాస్తవముగ ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే" అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగ రాజును చేయనున్నారని తెలిసికొని, యేసు మరల ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. 

ధ్యానము: యేసు ప్రభువు రోగుల పట్ల చేసిన అనేక అద్భుత కార్యములు చూసిన వారు, ఆయనను అనుసరిస్తూ వచ్చారు. ఈ ప్రజలు ఆయన దగ్గరకు అనేక కారణాలతో వచ్చారు. కొంత మంది ఆయన చేసిన అద్భుతాలు చూసి వారు జీవితాలలో కూడా స్వస్థత జరుగుతుంది అని వచ్చి ఉంటారు, కొంతమంది దేవుని వాక్కు వినాలి అని కోరికతో వచ్చి ఉంటారు. కొంత మంది ఈ అధ్బుతాలు చేసే ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చి ఉండవచ్చు. వారు ఎటువంటి కారణాలతో వచ్చిన యేసు ప్రభువు వారిని అదరిస్తున్నారు. అది ఎలాగంటే వారు తినుటకు ఏమి అయిన దొరుకుతుందా అని అడుగుతున్నారు. ప్రభువు ఎప్పుడు కూడా మన అవసరాలు చూసి, వాటిని తీర్చడానికి ఎంతో సహాయపడుతారు. ఇక్కడ యేసు ప్రభువు ప్రజలను చూసి వారు తినుటకు ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారు. 

పిలిప్పుతో వారు భుజించుటకు కావలసిన ఆహార పదార్ధాలు మనము ఎక్కడ నుండి తీసుకొనిరావాలి అని అడుగుతున్నారు. వారికి సమృద్దిగా ఇవ్వక పోయిన, కొద్ది కొద్దిగా భుజించుటకు అయిన సుమారు రెండు వందల వరహాల రొట్టెలు  అయిన సరిపోవు అని చెబుతున్నారు. పురుషులు మాత్రమే సుమారు ఐదువేల మంది అక్కడ ఉన్నారు. కాని మిగిలిన వారు స్త్రీలు మరియు పిల్లలు కూడా ఉన్నారు, వారిని సహజముగా లెక్క పెట్టారు. విరందరికి సరిపడిన ఆహారం ఇవ్వడం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే వారు ఉన్న ప్రదేశం మరియు సమయం కూడా అనుకూలముగా లేదు. కాని యేసు ప్రభువు వారి ఆకలిని చూస్తున్నారు. వారు సమృద్దిగా భుజించాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు యేసు ప్రభువు వారి ఆకలి తీర్చాలి అని అనుకుంటున్నారు. యేసు ప్రభువు చేసిన ఏ అధ్భుతము కూడా తన మహిమను తెలియ పరుచుకోవడానికి చేయలేదు. ప్రజల అవసరం గ్రహించి, వారికి అప్పటి అవసరం తీర్చడానికి మాత్రమే చేశారు. ఇక్కడ కూడా ప్రజలు ఎంతో ఆకలితో ఉన్నారు. వారి ఆకలి తీర్చడం చాల అవసరం అక్కడ అందుకే వారి ఆకలి తీర్చడానికి సిద్దపడ్డారు. 

అంద్రేయ ఒక పిల్లవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు కలవు అని చెబుతున్నారు.  అవి ఇంతమండికి ఏ మాత్రము అని చెబుతున్నాడు. అంటే మనము వీరి ఆకలి తీర్చలేము అనే భావనలో ఉన్నాడు.  అక్కడ వేల మంది ప్రజలు  మంది ఉన్నారు. వీరి ఆకలి మాత్రమే యేసు ప్రభువు చూస్తున్నారు.  వారి ఆకలి తీర్చడానికి ప్రభువు ఏమి చేయాలో ఆయనకి తెలుసు అందుకే అందరికీ భోజనానికి కూర్చోమని చెబుతున్నారు. ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను దీవించి యేసు ప్రభువు అందరు తృప్తి పడునంతగ వారికి వడ్డించారు. ఇది కేవలం ఒక అద్భుతము మాత్రమే కాదు. యేసు ప్రభువు మన జీవితాలలో ఉంటే మనకు ఎలా సమృద్ది దొరుకుతుందో మనము తెలుసుకోవచ్చు.  మెస్సీయ్యా వచ్చినప్పుడు అందరూ సమృద్దిగా ఉంటారు మరియు  తృప్తి చెందుతారు అనే ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. సమృద్ది మరియు తృప్తి అనెది యేసు ప్రభువుతోనే సాధ్యం అవుతుంది. 

యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతము ఆయనకు తన తండ్రికి ఉన్న సంబంధమును తెలియజేస్తుంది. యేసు ప్రభువు రొట్టెలను పైకెత్తి దీవించిన వాటిని పంచిన అవి అయిపోలేదు ఇంకా పన్నెండు గంపలు మిగిలినవి. అంటే అందరూ భుజించిన ఇంకా రానివారికి, అక్కడ లేని వారికి కూడా మిగిలినవి. యేసు ప్రభువు వద్ద ప్రతిఒక్కరికి స్థానం ఉంటుంది, కేవలం కొంతమందికి లేక ఎన్నుకొన బడినవారికి అంటూ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ ఆయన వద్ద స్థానం పొందవచ్చు ఆయన నుండి అన్నీ పొందవచ్చు.  ఇక్కడ యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతం మన నుండి కూడా సహకారము కావాలి అని అడుగుతుంది. ఏవిధంగా అయితే ఒక చిన్న పిల్లవాడు తన వద్ద ఉన్న ఐదు రొట్టెలను రెండు చేపలను ప్రభువుకు ఇస్తున్నాడో మన వద్ద ఉన్న వాటిని ప్రభువుకు సమర్పించగలిగితే ఆయన మన ద్వారా ఎన్నో అద్బుతములను చేస్తారు. క్రీస్తు అనుచరులుగ మనం ఆయనకు ఎప్పుడు సహకరించాలి. 

యేసు ప్రభువు తన చేసిన స్వస్థతలు లేక అధ్బుతాలు ఏవి కూడా తన మహిమను చూపించడానికి చేయలేదు కేవలం ప్రజలు శ్రేయస్సు , మంచి కోసమే చేయడం జరిగినది. యేసు ప్రభువును ప్రజలు బలవంతముగ రాజును చేస్తున్నారని ఆయన అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. ప్రజలలో రానున్న మెస్సీయ్యా , యేసు ప్రభువే అని అనుకున్న ఆయన గడియ వరకు ఆయన వేచి ఉన్నాడు గాని తన మహిమను చూపించాలి అనుకోలేదు, యేసు ప్రభువు నుండి మనం ఈ మాతృకను నేర్చుకోవాలి, ఆయన చేయవలసిన మంచి చేసి ఏమి ఆశించకుండా అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మనం కూడా అలానే ఎప్పుడు మంచి చేస్తూ ఇతరుల నుండి ఏమి ఆశించకుండా ఉండుటకు ప్రయత్నించాలి. 

ప్రార్ధన : ప్రభువా! మీరు మీ జీవితంలో అన్నీ అధ్భుతాలు మానవుని మంచికి, స్వస్థతకు, ఆకలి తీర్చుటకు మాత్రమే చేశారు. మా జీవితములలో కూడా మేము మా గొప్ప తనమును లేక మా ఆధిపత్యం చూపించుటకు కాక ఇతరులకు మంచి చేయడం కోసం పని చేసే మంచి మనసును మాకు ఇవ్వండి. ప్రభువా ! మీరు ఒక చిన్న బాలుడు ఇచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలను అక్కడ ఉన్న వారికి అందరు  సంతృప్తిగా భుజించునట్లు చేశారు. మా దగ్గర ఉన్న కొద్ది కొద్ది మంచి గుణాలను పరిపూర్ణంగా అయ్యేలా దీవించండి. మా జీవితాలలో ఉన్న లేమినంతటిని తీసివేసి సమృద్దిని దయచేయండి. ఆమెన్. 




19.4.23

అనుదిన ఆత్మీయ ఆహారం , యోహాను 3:31-36

 యోహాను 3: 31-36 

పైనుండి  వచ్చు  వాడు అందరి కంటే అధికుడు.  భూలోకము నుండి వచ్చువాడు, భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను  గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చు వాడు అందరి కంటే  అధికుడు. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చు వాడు  అందరి కంటే అధికుడు. ఆయన తాను చూచిన, వినిన విషయములను గూర్చి సాక్ష్యము నిచ్చును. కాని , ఆయన సాక్ష్యమును ఎవరును అంగీకరింపరు. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములను గూర్చి చెప్పును. ఎలన, దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్దిగ ఒసగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించు వాడు నిత్య జీవము పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలచి ఉండును. 

ధ్యానము: ఈ సువిశేష భాగంలో యేసు ప్రభువు గురించి అనేక గొప్ప విషయాలు మనం చూస్తున్నాము. ఆయన పై నుండి వచ్చిన వాడు అని, అందరికంటే అధికుడు అని , ఆయన తన తండ్రి వద్ద చూచిన , వినిన విషయములను మాత్రమే మాటలాడుతాడు అని , ఆయన తాను చూసిన, వినిన విషయాలకు సాక్ష్యం ఇస్తున్నాడు అని, ఆయన సాక్ష్యం అంగీకరించిన వారు దేవుడు సత్య సంధుడు అని నిరూపిస్తారు అని, ఆయనకు ఆత్మ సమృద్దిగా ఇవ్వబడింది అని, తండ్రి ఆయనను ప్రేమిస్తున్నారు అని, సమస్తము మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది అని , ఆయనను విశ్వసించు వారికి నిత్య జీవితం ఇవ్వబడుతుంది అని ఆయనను విశ్వాసించని వాని మీద దేవుని కోపం వుంటుంది అని ఈ సువిశేష భాగం తెలియచేస్తుంది. 

 "పైనుండి  వచ్చు  వాడు అందరి కంటే అధికుడు. భూలోకము నుండి వచ్చువాడు, భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను  గూర్చి మాట్లాడును." ఇక్కడ యేసు ప్రభువు తను ఎక్కడ నుండి వచ్చినది మాటలాడుతున్నారు. అందరు ఆయన ఈలోక పుట్టు పూర్వోత్తరాల గురించి మాటలాడుతున్నారు. కాని ఆయన నిజముగా తండ్రి దేవుని నుండి వస్తున్న విషయాన్ని మరచిపోతున్నారు. ఆయన పరలోకము నుండి వస్తున్నారు. ఆయన తండ్రి నుండి వచ్చాడు కనుక ఆయన తన తండ్రి వద్ద ఉన్న విషయములను గురించి మాటలాడుతున్నారు. తన తండ్రి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నవి అని చెబుతున్నారు, మనము ఆ లోకానికి చెందిన వారిమి అని అక్కడ మనకు నివాసం ఏర్పాటు చేస్తాను అని చెబుతున్నాడు.  ఆయన పై నుండి వచ్చాడు, ఆయన అందరికంటే అధికుడు. ఆయన మన వలే కేవలం ఈలోకంలో పుట్టుట ద్వారా తన జీవితం మొదలు కావడం లేదు. ఆయన ఆది నుండి తన తండ్రితో ఉన్నాడు. కాని మనం ఈ లోకానికి చెందిన వారము. యేసు ప్రభువు అలా కాదు. ఆయన ఆది నుండి పరలోకానికి చెందినవాడు. 

యేసు ప్రభువు ఇచ్చే సాక్ష్యం చాలా ముఖ్యం. ఆయన చూసిన వానికి, వినిన వానికి  ఆయన సాక్షం ఇస్తున్నాడు. తాను తన ఇష్ట ప్రకారం లేక సొంతగా ఏమి చెప్పడం లేదు ప్రతిది తండ్రి నుండి చూసింది లేక వినినది మాత్రమే.  ఆయన చెప్పే ప్రతి దానిని మనం విశ్వసించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే తండ్రి నుండి వచ్చినది. ఆయన తండ్రి చేత పంపబడిన వాడు కనుక ఆయన తండ్రి యొక్క మాటలను చెబుతున్నాడు. ఆయన మాటలు కూడా జీవం కలిగి ఉన్నాయి.  ఆయన ఈ లోకానికి వచ్చినది,  ఆయన ద్వారా ఈ లోకం రక్షించబడాలి అని. ఆయన మాటల ద్వారా తన పనుల ద్వారా ఆ పనిని చేస్తున్నాడు. ఆయన పవిత్రాత్మ కలిగి వున్నాడు. తండ్రి తన కుమారునికి పవిత్రాత్మను సమృద్దిగా ఇచ్చారు.  ఆయనను విశ్వసించిన వారికి ఆయన ఆ పవిత్రాత్మను ఇస్తాడు, పవిత్రాత్మ వారిని నడిపిస్తుంది.  యేసు ప్రభువును తండ్రి ప్రేమిస్తున్నారు. యేసు ప్రభువుని తండ్రి ఎంతలా ప్రేమిస్తున్నారు అంటే ఈ లోకం మీద, సర్వ అధికారం ఆయనకు ఇచ్చారు. యేసు ప్రభువుని సాక్ష్యంను అంగీకరించిన వారు దేవుడు సత్యసంధుడు అని నిరూపిస్తారు. 

ప్రార్ధన : ప్రభువా!  మీరు ఎవరు అని ఎంత గొప్ప వారు అని ఈ సువిశేష భాగం ద్వారా తెలుసుకుంటున్నాము. మీరు ఆది నుండి తండ్రితో ఉన్నారు. తండ్రి గురించి ఆయన ప్రేమ గురించి మీ ద్వారా మాత్రమే మేము తెలుసుకుంటున్నాము. కాని కొన్ని సార్లు మీరు మాకు చూపించిన తండ్రి ప్రేమను తెలుసుకోలేక పోతున్నాము. ఎంతగా తండ్రి మిమ్ములను ప్రేమిస్తున్నారో మేము వింటున్నాము అంతే కాదు తండ్రి మమ్ములను కూడా అలానే ప్రేమిస్తున్నారు అని మరచిపోతున్నాము, అటువంటి సమయాలలో మమ్ములను క్షమించండి. ప్రభువా ! మీకు సమస్తము మీద అధికారము ఇవ్వబడినది, నా మీద, జీవితం మీద కూడా మీకు పూర్తిగా అధికారం ఇవ్వబడింది, మీ మాటలను విశ్వసించే మంచి విశ్వసిగా నన్ను మార్చండి. నేను మీరు సత్య వాంతులు అని నిరూపించే మీ శిష్యునిగా నన్ను మార్చండి. మీరు ఎలా తండ్రిని ప్రేమిస్తున్నారో, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఎంత కష్టపడ్డారో, నేను కూడా మీ చిత్తం నెరవేర్చడానికి కావలసిన అనుగ్రహాలు ఇవ్వండి, తద్వార , మీరు నాకు చూపించిన ప్రేమకు నాకు మీ మీద ఉన్న ప్రేమను వ్యక్త పరిచేలా నాకు సహాయం చేయండి. ప్రభువా ! తండ్రి మీకు సమృద్దిగా పవిత్రాత్మను ఇచ్చిన విధంగా నాకు కూడా ఆత్మను ఇవ్వండి ,  ఆత్మ నన్ను నడిపేలా దీవించండి.  ప్రభువా నేను ఎల్లప్పుడూ  మిమ్ములను విశ్వసిస్తూ, మీరు వాగ్ధానం చేసే నిత్య జీవం నేను పొందేలా నన్ను ఆశీర్వాదించండి. ఆమెన్ 


అనుదిన ఆత్మీయ ఆహారం, యోహాను 3:7-15

  యోహాను 3:7-15 

నీవు మరల జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును విందువే కాని అది ఎక్కడ నుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అట్లే ఉండును అనెను. ఇది ఎట్లు సాధ్యమగును? అని నికోదేము అడిగెను. అందుకు యేసు నీవు యిస్రాయేలు బోధకుడవై యుండి దీనినేరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యము మీరంగీకరింపరని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు  చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడు పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్త బడవలెను. 

చింతన  : యేసు ప్రభువు నికోదెముతో మరల జన్మించాలి అని చెప్పినందుకు ఆశ్చర్య పడవద్దు అని చెబుతున్నాడు.  ఎందుకంటే నికోదెము తాను ఎలా తల్లి గర్భంలోనికి వెళ్లగలనా అని ఆలోచిస్తున్నాడు. కాని యేసు ప్రభువు చెప్పినది ఎలా ఆత్మ వలన ఎలా జన్మించాలి అని చెబుతున్నారు. ఆత్మ వలన జన్మించడం అంటే జ్ఞానస్నానం వలన జన్మించడం. ఒక వ్యక్తి మారుమనసు పొంది, తన పాప జీవితము వదలినప్పుడు తాను పవిత్రంగా ఉండుటకు సిద్దపడుతున్నాడు.  అప్పుడు వారికి ఆత్మ ఇవ్వబడుతుంది. జ్ఞాన స్నానం మనలను పాపములనుండి శుద్ది చేస్తుంది. పవిత్రాత్మను మనకు ఇస్తుంది. పాపముల నుండి మనం శుద్ది పొందుట వలన, మనం నూతన సృష్టి అవుతున్నాము. మరియు పవిత్రాత్మను పొంది దేవుని బిడ్డలము అవుతున్నాము.  వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వారి మార్పు ఇతరులకు తెలుస్తుంది కాని ఎందుకు, ఎలా అని తెలియదు. ఆత్మ వలన జన్మించిన వారు అందరూ అలానే ఉంటారు అని ప్రభువు చెబుతున్నారు. 

యేసు ప్రభువు నికోదెమును అవిశ్వాసం వదలి వేయమని చెబుతున్నాడు. యేసు ప్రభువును విశ్వసించుట వలన మాత్రమే మనం రక్షించ బడతాము మరియు ఇవన్నియు సాధ్యం అవుతాయి, కాని యూదులు యేసు ప్రభువును విశ్వసించుట లేదు, యేసు ప్రభువును విశ్వసించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆయనలో మాత్రమే మనం రక్షించ బడుతాము ఆయన లేకపోతే మనకు రక్షణ ఉండదు. ఆయన మన అందరికోసం శిలువ మరణం అనుభవిస్తున్నారు. ఆయన శిలువ మీద ఎత్తబడుతున్నారు. ఆయనను చూసి ఎలా అయితే పాపం ద్వారా శిక్షను అనుభవిస్తున్న యిస్రాయేలు ప్రజలు మోషే ఎత్తిన కంచు సర్పమును చూసి విష సర్ప కాటు నుండి అంటే మరణము నుండి తప్పించు కుంటున్నారో అలానే కేవలము భౌతిక జీవితమునే కాక నిత్య జీవితమును యేసు ప్రభువును విశ్వసించుట వలన పొందుతారు అని చెబుతున్నారు. అందుకే యేసు ప్రభువును విశ్వసించడం అంత ముఖ్యం, యోహాను సువిశేషంలో అనేక సార్లు ఆయనను విశ్వసించే వారికి ఆయన నిత్యజీవం ఇస్తారు అని మనం వింటాము. 

ఎందుకు యూదులు ఆయనను విశ్వసించడం లేదు? యేసు ప్రభువు  నా సాక్ష్యం మీరు అంగీకరింపరు అని  చెబుతున్నారు, వీటికి కారణం మనం చూసినట్లయితే ప్రజలు చీకటినే ప్రేమించారు, యేసు ప్రభువు వెలుగు వలె ఈ లోకమునకు వచ్చిన ఆయన వెలుగులో వారు ఉండటానికి భయపడ్డారు ఎందుకంటే వెలుగులోనికి వచ్చినట్లయితే వారి పాప జీవితాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడ్డారు, వారు చీకటినే ప్రేమించారు, వెలుగును ద్వేషించారు, నికోదెము కూడా చీకటిలోనే యేసు ప్రభువును కలవడానికి వచ్చారు, కాని యేసు ప్రభువు వద్దకు రావడం వలన చీకటి నుండి వెలుగు వద్దకు వచ్చినట్లు అయ్యింది. రక్షణకు మార్గం సిద్దపరుచుకున్నాడు. యేసు ప్రభువు వద్దకు వచ్చే ప్రతివారు అలానే వెలుగు దగ్గరకు వస్తున్నారు. దీని ద్వారా మనకు వారికి యేసు ప్రభువు చెప్పే మాటలు లేక చేసే పనుల మీద అంత ఇష్టం లేదు కారణం ఆయన వెలుగై ఉన్నాడు వారు చీకటిలో ఉన్నారు, ఆయన సాన్నిధ్యం వారికి ఒక రకమైన భయం కలిగిస్తుంది. వారి జీవితాలు మార్చుకోవడానికి వారు సిద్దంగా లేరు అనే విషయము అర్ధం అవుతుంది. పాపములోనే ఆనందం పొందడానికి వారు ప్రయత్నిస్తున్నారు,  కాని ఇది వారికి వారిని నాశనం చేస్తుంది అని వారు తెలుసుకోలేకపోతున్నారు.  పాపంలోనే మనం ఉన్నప్పుడు మనం ఒక రకమైన ఆజ్ఞానానికి లోనవుతాము, అందుకే పాపములోనే వారు ఆనందం వెదుకుతున్నారు. కాని యేసు ప్రభువు మనకు కనపడే విధంగా మనం ఆయనను చూడటానికి ఇష్టపడక పోయిన శిలువ మీద ఎత్తబడ్డాడు. మనము ఆయనను చూసేలా చేస్తున్నాడు. 

ప్రార్దన : ప్రభువా , మీరు నికోదెముతో ఆయన మరల జన్మించాలి అని చెప్పి, తన జీవితంలో రక్షణ పొందుటకు తాను మారు మనసు పొందాలని, జ్ఞానస్నానం పొందాలని, తాను పవిత్రాత్మను పొందాలని తెలియపరుస్తున్నారు. నేను కూడా ప్రభువా! రక్షణ పొందుటకు, మారు మనసు పొంది, పవిత్రంగా ఉండే విధంగా ఆశీర్వదించండి. నేను జ్ఞానస్నానం పొందిన సమయంలో మీ పవిత్ర ఆత్మతో , పవిత్రంగా ఉన్నానో అదేవిధంగా పవిత్రంగా ఉండేలా నన్ను దీవించండి. మిమ్ములను నా జీవితంలోనికి ఆహ్వానించి, మిమ్ములను అంగీకరించి మీ వెలుగులో నడిచేలా నన్ను దీవించండి. నా పాపములో నేను ఆనందిచే స్థితి నుండి మీ అజ్ఞలను పాటించుటలో ఆనందం పొందేలా దీవించండి. ఎప్పుడు మీ యందు విశ్వాసం వుంచి మీరు వాగ్దానం చేసే ఆ నిత్య జీవం పొందేలా నన్ను ఆశీర్వదించండి. మిమ్ములను చూస్తూ, మీకు సాక్షం ఇచ్చేలా చేయండి. ఆమెన్ 


సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...