యోహాను 3:7-15
నీవు మరల జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును విందువే కాని అది ఎక్కడ నుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అట్లే ఉండును అనెను. ఇది ఎట్లు సాధ్యమగును? అని నికోదేము అడిగెను. అందుకు యేసు నీవు యిస్రాయేలు బోధకుడవై యుండి దీనినేరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము. చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కాని, మా సాక్ష్యము మీరంగీకరింపరని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల నమ్ముట లేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన యెడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడు పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్త బడవలెను.
చింతన : యేసు ప్రభువు నికోదెముతో మరల జన్మించాలి అని చెప్పినందుకు ఆశ్చర్య పడవద్దు అని చెబుతున్నాడు. ఎందుకంటే నికోదెము తాను ఎలా తల్లి గర్భంలోనికి వెళ్లగలనా అని ఆలోచిస్తున్నాడు. కాని యేసు ప్రభువు చెప్పినది ఎలా ఆత్మ వలన ఎలా జన్మించాలి అని చెబుతున్నారు. ఆత్మ వలన జన్మించడం అంటే జ్ఞానస్నానం వలన జన్మించడం. ఒక వ్యక్తి మారుమనసు పొంది, తన పాప జీవితము వదలినప్పుడు తాను పవిత్రంగా ఉండుటకు సిద్దపడుతున్నాడు. అప్పుడు వారికి ఆత్మ ఇవ్వబడుతుంది. జ్ఞాన స్నానం మనలను పాపములనుండి శుద్ది చేస్తుంది. పవిత్రాత్మను మనకు ఇస్తుంది. పాపముల నుండి మనం శుద్ది పొందుట వలన, మనం నూతన సృష్టి అవుతున్నాము. మరియు పవిత్రాత్మను పొంది దేవుని బిడ్డలము అవుతున్నాము. వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వారి మార్పు ఇతరులకు తెలుస్తుంది కాని ఎందుకు, ఎలా అని తెలియదు. ఆత్మ వలన జన్మించిన వారు అందరూ అలానే ఉంటారు అని ప్రభువు చెబుతున్నారు.
యేసు ప్రభువు నికోదెమును అవిశ్వాసం వదలి వేయమని చెబుతున్నాడు. యేసు ప్రభువును విశ్వసించుట వలన మాత్రమే మనం రక్షించ బడతాము మరియు ఇవన్నియు సాధ్యం అవుతాయి, కాని యూదులు యేసు ప్రభువును విశ్వసించుట లేదు, యేసు ప్రభువును విశ్వసించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆయనలో మాత్రమే మనం రక్షించ బడుతాము ఆయన లేకపోతే మనకు రక్షణ ఉండదు. ఆయన మన అందరికోసం శిలువ మరణం అనుభవిస్తున్నారు. ఆయన శిలువ మీద ఎత్తబడుతున్నారు. ఆయనను చూసి ఎలా అయితే పాపం ద్వారా శిక్షను అనుభవిస్తున్న యిస్రాయేలు ప్రజలు మోషే ఎత్తిన కంచు సర్పమును చూసి విష సర్ప కాటు నుండి అంటే మరణము నుండి తప్పించు కుంటున్నారో అలానే కేవలము భౌతిక జీవితమునే కాక నిత్య జీవితమును యేసు ప్రభువును విశ్వసించుట వలన పొందుతారు అని చెబుతున్నారు. అందుకే యేసు ప్రభువును విశ్వసించడం అంత ముఖ్యం, యోహాను సువిశేషంలో అనేక సార్లు ఆయనను విశ్వసించే వారికి ఆయన నిత్యజీవం ఇస్తారు అని మనం వింటాము.
ఎందుకు యూదులు ఆయనను విశ్వసించడం లేదు? యేసు ప్రభువు నా సాక్ష్యం మీరు అంగీకరింపరు అని చెబుతున్నారు, వీటికి కారణం మనం చూసినట్లయితే ప్రజలు చీకటినే ప్రేమించారు, యేసు ప్రభువు వెలుగు వలె ఈ లోకమునకు వచ్చిన ఆయన వెలుగులో వారు ఉండటానికి భయపడ్డారు ఎందుకంటే వెలుగులోనికి వచ్చినట్లయితే వారి పాప జీవితాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడ్డారు, వారు చీకటినే ప్రేమించారు, వెలుగును ద్వేషించారు, నికోదెము కూడా చీకటిలోనే యేసు ప్రభువును కలవడానికి వచ్చారు, కాని యేసు ప్రభువు వద్దకు రావడం వలన చీకటి నుండి వెలుగు వద్దకు వచ్చినట్లు అయ్యింది. రక్షణకు మార్గం సిద్దపరుచుకున్నాడు. యేసు ప్రభువు వద్దకు వచ్చే ప్రతివారు అలానే వెలుగు దగ్గరకు వస్తున్నారు. దీని ద్వారా మనకు వారికి యేసు ప్రభువు చెప్పే మాటలు లేక చేసే పనుల మీద అంత ఇష్టం లేదు కారణం ఆయన వెలుగై ఉన్నాడు వారు చీకటిలో ఉన్నారు, ఆయన సాన్నిధ్యం వారికి ఒక రకమైన భయం కలిగిస్తుంది. వారి జీవితాలు మార్చుకోవడానికి వారు సిద్దంగా లేరు అనే విషయము అర్ధం అవుతుంది. పాపములోనే ఆనందం పొందడానికి వారు ప్రయత్నిస్తున్నారు, కాని ఇది వారికి వారిని నాశనం చేస్తుంది అని వారు తెలుసుకోలేకపోతున్నారు. పాపంలోనే మనం ఉన్నప్పుడు మనం ఒక రకమైన ఆజ్ఞానానికి లోనవుతాము, అందుకే పాపములోనే వారు ఆనందం వెదుకుతున్నారు. కాని యేసు ప్రభువు మనకు కనపడే విధంగా మనం ఆయనను చూడటానికి ఇష్టపడక పోయిన శిలువ మీద ఎత్తబడ్డాడు. మనము ఆయనను చూసేలా చేస్తున్నాడు.
ప్రార్దన : ప్రభువా , మీరు నికోదెముతో ఆయన మరల జన్మించాలి అని చెప్పి, తన జీవితంలో రక్షణ పొందుటకు తాను మారు మనసు పొందాలని, జ్ఞానస్నానం పొందాలని, తాను పవిత్రాత్మను పొందాలని తెలియపరుస్తున్నారు. నేను కూడా ప్రభువా! రక్షణ పొందుటకు, మారు మనసు పొంది, పవిత్రంగా ఉండే విధంగా ఆశీర్వదించండి. నేను జ్ఞానస్నానం పొందిన సమయంలో మీ పవిత్ర ఆత్మతో , పవిత్రంగా ఉన్నానో అదేవిధంగా పవిత్రంగా ఉండేలా నన్ను దీవించండి. మిమ్ములను నా జీవితంలోనికి ఆహ్వానించి, మిమ్ములను అంగీకరించి మీ వెలుగులో నడిచేలా నన్ను దీవించండి. నా పాపములో నేను ఆనందిచే స్థితి నుండి మీ అజ్ఞలను పాటించుటలో ఆనందం పొందేలా దీవించండి. ఎప్పుడు మీ యందు విశ్వాసం వుంచి మీరు వాగ్దానం చేసే ఆ నిత్య జీవం పొందేలా నన్ను ఆశీర్వదించండి. మిమ్ములను చూస్తూ, మీకు సాక్షం ఇచ్చేలా చేయండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి