యోహను 15:26-16:4
సువిశేషం : నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చేడువాడు, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపి అగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్య మిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు. కనుక మీరు నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెంద కుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పితిని. వారు మిమ్ము ప్రార్ధన మందిరముల నుండి వెలివేయుదురు , మిము హత్య చేయు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయు చున్నానని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని, నన్నుగాని, ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచు కొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంత వరకు ఈ విషయములు మీతో చెప్పలేదు.
ఈనాటి దేవుని వాక్యం యేసు ప్రభువు పంపే పవిత్రాత్మ గురించి చెబుతుంది. పవిత్రాత్మను ప్రభువు ఓదార్చువాడు అని చెబుతున్నాడు. మరల పవిత్రాత్మ సత్య స్వరూపి అని చెబుతున్నాడు, యేసు ప్రభువు గురించి ఈ పవిత్రాత్మ సాక్షం ఇస్తుంది. ఇక్కడ ఓదార్పు యొక్క అవసరం ఏమిటి? అంటే యేసు ప్రభువు శిష్యులకు ఓదార్పు అవసరం ఉంది. వారు జీవించేది యేసు ప్రభువు వలె కనుక ఈలోక ప్రేమికులు వారిని చూసి, వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. వారిని అన్యాయముగా కష్ట పెడతారు. అంతే కాదు యేసు ప్రభువు చెప్పినట్లుగా ఆయన శిష్యులను చంపే వారు, దేవునికి సేవ చేస్తున్నట్లు భావిస్తారు. ఇది మనం అపోస్తుల కార్యాలలో చూస్తాము. పౌలు గారు మారు మనస్సు పొందక ముందు క్రైస్తవులను హింసిస్తు, తాను తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను అనుకుంటున్నారు.
ఈరోజు కూడా అనేక మంది వారి వారి విశ్వాసాలను పాటించుట కంటే కూడా క్రైస్తవల మీద దాడి చేయడం వారి విశ్వాసాన్ని పాటించడం అన్నంతగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల గురించి యేసు ప్రభువు ముందుగానే శిష్యులకు చెబుతున్నారు. తాను వారి నుండి తండ్రి దగ్గరకు వెళ్లేముందు, ఈ లోకం దాని తీరు గురించి శిష్యులకు ప్రభువు తెలియచేస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు , మిమ్ములను ప్రార్ధన మందిరముల నుండి వెలివేయుదురు అని చెబుతున్నారు, అంటే మనకు ఉన్న సమస్యలకు, కష్టాలకు బాధలకు, అన్నింటికీ దేవుడే తీర్చుతారు అని మనం నమ్ముతాము, అటువంటి దేవున్ని ప్రార్ధన చేసుకునే మందిరములకు వీరిని దూరం చేస్తుంది, ఈ లోకం. అంటే వీరికి ఎవరి నుండి సహాయం వచ్చే అవకాశం లేకుండా చేస్తుంది.
ఎందుకు వీరు ఇవన్నీ చేస్తారు ? అంటే వారికి తండ్రి (దేవుడు) తెలియదు, ఆయన ప్రేమ తెలియదు, ఆయన గుణగణాలు తెలియవు. తండ్రి దేవుడు వారి వలె ఉంటారు అనే భావనలో వారు ఉన్నారు. దేవుని దయార్ధ హృదయం ఎంత గొప్పదో వారికి తెలియకనే వారు ఈ పనులు చేస్తున్నారు. మనం పౌలు గారినే ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. యేసు ప్రభువు ఆయనకు దర్శనం ఇవ్వకముందు, చాలా క్రూరంగా ప్రవర్తించాడు, కాని తరువాత యేసు ప్రభువును తెలుసుకొని ఆయన మంచి లక్షణాలు కలిగి జీవించడం ప్రారంభిచాడు.
నిజ దేవుని గురించి తెలిసిన వారు ఎవరు ఇతరులను హింసలకు గురిచేయరు. ఎందుకంటే వారు ఆయనకు సాక్షులుగా జీవిస్తారు, ఆయన ప్రేమకు, దయకు, కరుణకు సాక్షులుగా జీవిస్తారు.
వారి విశ్వాసం కోసం ఇటువంటి బాధలు , కష్టాలు , హింసలు అనుభవిస్తున్న వారికి పవిత్రాత్మ తోడ్పడుతుంది. వారికి ఓదార్పుఇస్తుంది. వారు ఎప్పుడు ఏమి చేయాలో, ఎప్పుడు ఏమి మాట్లాడాలో అంతా పవిత్రాత్మ వారికి తెలియజేస్తుంది. ఈ పవిత్రాత్మ శిష్యులను నడిపింది. వారికి యేసు ప్రభువు బోధించిన అన్నీ విషయాలను జ్ఞప్తికి తీసుకువచ్చింది. వారు కష్టాలు, హింసలకు గురి అయినప్పడు వారికి ప్రభువు చెప్పిన విషయాలు తెలియచేసింది. కనుక వారు అన్నింటిని తట్టుకొని నిలబడగలిగారు.
మనము తండ్రిని తెలుసుకున్నవారము. ఆయన ప్రేమ ఎటువంటిదో తెలిసిన వారము కనుక ఖచ్ఛితముగా మన జీవితము ఈ లోకంను అభిమానించే వారి కంటే భిన్నముగా ఉండాలి. ఏ ఒక్కరినీ మన విశ్వాసం కోసం హింసించడం దేవుడు మన నుండి కాంక్షీంచడు. అప్పడు మనం అటువంటి పనులు చేయకూడదు. అంతే కాదు మనం పతనం కాకూడదు అని ప్రభువు కోరుకుంటున్నారు. ప్రభువుకు ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. పతనాన్ని తెచ్చుకోకూడదు.
పవిత్రాత్మ మనకు సత్యం తెలుపుతుంది. పవిత్రాత్మ సత్య స్వరూపి. మనలను హింసించు వారు దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఎందుకంటే వారికి తండ్రి తెలియదు, అంతే కాదు సత్యము ఏమిటో తెలియజేయుటకు పవిత్రాత్మను వారు పొందలేదు. మనం తెలుసుకున్న సత్యమును ఇతరులకు తెలుపుటకు సిద్ధ పడాలి. వారిని అజ్ఞానం నుండి బయటకు తేవాలి. అజ్ఞానంనే జ్ఞానం అని అనేక మంది జీవిస్తున్నారు ఈ రోజుల్లో వారి కోసం ప్రార్ధన చేయాలి.
యేసు ప్రభువుకు పవిత్రాత్మ సాక్షిగా నిలుస్తుంది. అంతే కాదు ఆయన శిష్యులు కూడా సాక్షులుగా ఉన్నారు. మరి మన జీవితం ఏమిటి ? మనం కూడా యేసు ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ఆయన పవిత్రాత్మను పొంది ఆయన వలె జీవించాలి. ఒక సాక్షి జీవితం జీవించాలి. ఎటువంటి పరిస్థితులలో అయిన నిజమైన సాక్షిగా జీవించి ప్రభువు వాగ్ధానం చేసిన నిత్య జీవితం పొందాలి.
మనం మంచి జీవితం జీవించడానికి సిద్ధ పడితే ఆయన మనకు ఆదరణ కర్త అయిన పవిత్రాత్మను పంపి మనలను ఓదార్చుతారు. మంచి జీవితం జీవించుటకు మరియు పవిత్రాత్మను పొందుటకు కావలసిన అనుగ్రహం కోసం ప్రార్ధించుదాం.
ప్రార్ధన : ప్రభువా మీరు పవిత్రాత్మను మీ శిష్యులకు ఇస్తాను అని వాగ్దానం చేశారు. ఆ పవిత్రాత్మను నాకు కూడా ఒసగండి, ఆ పవిత్రాత్మ నా జీవితంలో అందరు నాకు వ్యతిరేకముగా ఉన్న నన్ను ఓదార్చువానిగా నాలో ఎల్లప్పుడు ఉండేలా నాకు మీ అనుగ్రహం దయచేయండి. ఆ పవిత్రాత్మ సత్య స్వరూపి కనుక ఎల్లప్పుడు కూడా నాతో ఉన్నట్లయితే నాలో ఎటువంటి అసత్యం లేకుండ నన్ను శుద్ది చేయువిధంగా నన్ను మలచండి. ప్రభువా మీకు మేము సాక్షులుగా జీవించుటకు కావలసిన శక్తిని మాకు దయచేయండి. పవిత్రాత్మ మీకు సాక్షిగా ఉంటుంది, ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండే ఆ పవిత్రాత్మ మేము కూడా సాక్షులుగా ఉండుటకు మాకు సాయం చేసేలా చేయండి. మాకు జరుగబోయే విషయాలలో, మేము మీకు సాక్షులుగా జీవించుటకు మాకు అడ్డు అయ్యే అనేక రకాల సమస్యలలో మేము భయపడి, వెనుకకుపోకుండా నిజమైన సాక్షులుగా జీవించే శక్తిని మాకు దయచేయండి. ఆమెన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి