యోహాను 16:12-15
సువిశేషం : నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది. కాని, ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన, సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపక తాను వినిన దానినే బోధించును. జరుగబోవు విషయములను మీకు తెలియ చేయును. ఆయన నన్ను మహిమ పరుచును . ఏలన , ఆయన నాకున్న దానిని , నా నుండి గైకొని దానిని మీకు తెలియ చేయునని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది. అందుచేత నానుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని.
"ఇప్పడు మీరు వానిని భరింపలేరు", ఎందుకు వీరు యేసు ప్రభువు చెప్పే వాటిని భరించలేరు, కారణం ఏమిటి అంటే వీరు కష్టాలు, బాధలు పొందటానికి ఇంకా సిద్ధంగా లేరు. అందుకే యేసు ప్రభువు వారికి ఈ విషయమును వెల్లడిచేస్తున్నారు. ఇది యేసు ప్రభువుని వీడ్కోలు ఉపదేశం, అంటే వారు ఆయనను ఒక రాజుగా జయ జయ నినాధాలతో యెరుషలేము నగరములోనికి ఆహ్వానించిన తరువాత ఇది జరుగుతుంది. శిష్యులు యేసు ప్రభువును ఒక వీరోచితమైన రాజుగా చూస్తున్నారు. కాని యేసు ప్రభువు వారికి రాబోయే కష్టముల గురించి చెబుతున్నారు. ఆయన వెళ్ళిన తరువాత వారి జీవితాలలో వచ్చే హింసల గురించి యేసు ప్రభువు వారికి పూర్తిగా చెప్పటం లేదు.
ఎందుకు యేసు ప్రభువు వారికి వారు పొందబోవు శ్రమల గురించి పూర్తిగా చెప్పడం లేదు? వీరు ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత చాలా క్రూరమైన హింసలకు గురిఅయ్యారు, అప్పుడు వాటిని భరించారు కాని ఇప్పుడు వీరికి ఇటువంటి వాటిని తట్టుకునే శక్తి లేదు, అందుకే వారికి పవిత్రాత్మ వచ్చిన తరువాత ఇవన్నీ అర్ధం అవుతాయి అని చెబుతున్నారు. దేవుడు మనలను మనం భరించ లేని కష్టాలుకు గురిచేయరు. అందుకే వారు పొందబోయే హింసలు ,కష్టాలు అన్ని వారికి చెప్పడం లేదు. ఇవన్నీ తెలియజేయడానికి, ఆ కష్ట కాలంలో పవిత్రాత్మ వారికి సహాయం చేస్తుంది. వారికి యేసు ప్రభువు తండ్రి దగ్గరకు పోయేంత వరకు చెప్పేమాటలు, రాబోవు పరిస్థితులను తట్టుకొనే విధంగా వారికి ఒక తర్ఫీదు కాలం ఆవుతుంది. అంతే కాదు వారికి ఆ సమయాల్లో ఏమి చేయాలో , ఏమి చెప్పాలో కూడా పవిత్రాత్మ వారికి తెలియ జేస్తుంది. దీనిని మనం యేసు ప్రభువు శిష్యులు , పాలకులు, పెద్దలు మొదలగువారి ముందు మాటలాడినప్పుడు వారు ఎటువంటి జ్ఞానం తో మాటలాడింది, మనం అపోస్తుల కార్యాలలో చూస్తాము. దీనికంతటికి తోడ్పడు ఇస్తుంది, నడిపిస్తుంది, పవిత్రాత్మయే.
"ఆయన సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును" : యేసు ప్రభువు వలె సత్యమును బోధించుటకు, సత్యమునకు నడిపించుటకు ఇప్పుడు పవిత్రాత్మ యొక్క అవసరం శిష్యులకు ఉంది. సత్యం మనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మన పాపమును అది చూపిస్తుంది. మన చెడు జీవితమును మనకు తెలుపుతుంది. ఈరోజుల్లో మనం ఏది మనకు అనుకూలంగా ఉంటుందో దానికి పాటించుటకు ఇష్ట పడుతున్నాము. సత్యమును పాటించుటకు ఇష్టపడుటలేదు. సత్యం మనలను అనేక బందనముల నుండి విముక్తులను చేస్తుంది. సత్యం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువు నేనే సత్యమును జీవమును మార్గమును అని చెప్పారు.
పవిత్రాత్మ సత్య స్వరూపి , అంటే మనలను చేడుగా నడిపించడు, మనలను ఎక్కడకు నడిపించాలి? మనం గమ్యం ఏమిటి? యేసు ప్రభువు నేనే మార్గమును అని చెబుతున్నారు. మన మార్గం ఆయనే ఖచ్ఛితముగా మనలను పవిత్రాత్మ యేసు ప్రభువు దగ్గరకు నడిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువు సత్యము. అంతే కాదు యేసు ప్రభువు తన గురించి చెప్పేటప్పుడు, నా అంతట నేను ఏమి చెప్పుటలేదు, నా తండ్రి నుండి చూసిన దానిని, వినిన దానినే నేను చెబుతున్నాను అని చెప్పారు. పవిత్రాత్మ కూడా తనంతట తాను ఏమి చేయదు, తాను వినిన దానినే బోధించును.
"జరుగబోవు విషయములను మీకు బోధించును", పవిత్రాత్మ క్రైస్తవ సంఘానికి సహాయకునిగా , అనేక సమస్యలను తీర్చుటలో వీరికి సహాయ పడింది. అనేక సార్లు పవిత్రాత్మ వారికి ఏమి చేయాలో నేర్పుతుంది. పౌలు గారి మీద అందరు వ్యతిరేకంగా ఉన్నా, పవిత్రాత్మ ఆయన మీదకు వస్తుంది , ఎందుకంటే ప్రభువే ఆయన్ను ఎన్నుకున్నారు కాబట్టి. పవిత్రాత్మ వీరితో ఉన్నప్పుడు వీరు యేసు ప్రభువు జ్ఞానం కలిగి ఉన్నారు. వారు ఎప్పుడు ఏమి చెప్పాలో పవిత్రాత్మ చెబుతుంది.
ఆయన నాకున్న దానిని, గైకొని మీకు తెలియజేయును : ఇక్కడ యేసు ప్రభువు పవిత్రాత్మ యొక్క తత్వాన్ని తెలియ జేస్తున్నారు. ఆయన తెలుసుకున్నదానిని, వినిన దానిని తీసుకొని మీకు తెలియజేయును, తనంతట తాను ఏమి చెప్పడు. అంటే తండ్రికి ఉన్నదంతయు నాది, దానిని ఆయన మీకు ఇస్తాడు, తెలియ జేస్తాడు, అని యేసు ప్రభువు చెబుతున్నారు. యోహను , తండ్రి అంతయు ఆయనకు ఇచ్చెను అని చెబుతున్నారు. మనకు అంటే తెలియ పరచడానికి పవిత్రాత్మ మనకు సహాయం చేస్తుంది. అన్నిటి మీద యేసు ప్రభువుకు అధికారం ఉన్నట్లు, మరియు అంతా ఆయనదే అని పవిత్రాత్మ తెలియజేస్తుంది. ఆయన ఇచ్చే రక్షణ తెలియ జేస్తుంది. దానికి ఏమి చేయాలో తెలియ జేస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా పవిత్రాత్మ యేసు ప్రభువును మహిమ పరుస్తాడు. పవిత్రాత్మ ఎప్పటికీ ఆయనకు వ్యతిరేకముగా ఏమి చెప్పడు.
యేసు ప్రభువు అంతయు తండ్రి దగ్గర నుండి పొందుతున్నాడు. తండ్రిని చేరుకోవడానికి ఆయనే మార్గం. యేసు ప్రభువు తండ్రి దగ్గరకు పోతున్నప్పుడు పవిత్రాత్మకు అంతయు అప్పగిస్తున్నారు, ఇప్పుడు యేసు ప్రభువును తెలుసుకోవడానికి పవిత్రాత్మ మార్గం అవుతుంది. అంతేకాదు యేసు ప్రభువు చెప్పినవన్ని తెలియజేస్తుంది , ఆయన శిష్యులను నడుపుతుంది. మార్గ చూపరి అవుతుంది.
ప్రార్ధన : ప్రభువా ! మీరు తండ్రి దగ్గరకు వెళుతున్నప్పుడు మీ శిష్యులకు తోడుగా ఉండుటకు, మరియు వారికి మీ వద్దకు నడిపించుటకు పవిత్రాత్మను వారికి సహాయంగా పంపారు. పవిత్రాత్మ వారికి అన్ని విధాలుగా సహాయ పడుతూ , సంపూర్ణ సత్యమగు మీ వైపు నడిపినది, కాని ప్రభువా ఈ లోకంలో జీవిస్తూ మీ దరి చేరాలని కోరిక ఉన్న అనేక సార్లు చెడు మార్గాలలో నడుస్తున్నము ప్రభువా, అటువంటి అపదల నుండి మాకు సహయం చేయుటకు మాకు తోడుగా ఉండుటకు పవిత్రాత్మను మాకు అనుగ్రహించండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి