యోహను 16:16-20
సువిశేషం : కొంత కాలము తరువాత మీరు నన్ను చూడరు. మరి కొంత కాలము తరువాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు , "కొంత కాలము తరువాత మీరు నన్ను చూడరు . మరి కొంత కాలమైన తరువాత మీరు నన్ను చూచెదరు. ఏలన నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నారు అని ఈయన చెప్పుచున్నాడు. ఇదేమి? కొంతకాలము అని చెప్పుచున్నాడు. ఈయన చెప్పునదేమో మనకు తెలియుటలేదు" అని అనుకొనసాగిరి. వారు తనను ఏదో అడుగదలచుచున్నారని యేసు గ్రహించి వారితో , "కొంత కాలము అయిన తరువాత మీరు నన్ను చూడరు. మరి కొంత కాలమయిన తరువాత మీకు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను మీరు ఒకరి నొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి, విలపింతురు. కాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు. కాని మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను.
"కొంత కాలం తరువాత మీరు నన్ను చూడరు" అని యేసు ప్రభువు శిష్యులకు చెబుతున్నారు. కాని శిష్యులు ఏమి అర్ధం చేసుకోలేక ఒకరినొకరు చూసుకుంటున్నారు. కొంత కాలం అంటే ఎంత కాలం, ఒక వేళ ఈ మత పెద్దలునుండి కనపడకుండా కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్లనున్నరా? అని కూడా వారి అనుకోని వుండవచ్చు. యేసు ప్రభువు చెప్పే మాటలు వారికి అర్ధం కాలేదు. "నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను" అని అనే మాటలకు అర్ధం ఏమిటి? ఎన్ని రోజులు వీరిని విడిచి ప్రభువు ఉంటారు. యేసు ప్రభువు మాటలు, వారిని ఒక రకమైన సంధిగ్ధం లో పడవేశాయి. యేసు ప్రభువు చాలా సార్లు వారికి అర్ధం అయ్యినట్లు ఉన్నప్పటికీ వారికి పూర్తిగా ఆ మాటలు వారికి అర్ధంకాలేదు. వారు కేవలం ప్రాపంచక విషయముల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కనుక యేసు ప్రభువుతో ఉన్న వారికి ఆయన మాటలను అర్ధం చేసుకోలేక పోయారు.
శిష్యులలో ఉన్న ప్రశ్న ఏమిటి అంటే, యేసు ప్రభువు ఎక్కడకి వెళుతున్నాడు? యేసు ప్రభువు మాటలకు వారు చాలా ఆందోళనకు గురయ్యారు. కాని ఆయన్ను ఏమి అడగడానికి సహసించుటలేదు. అప్పడు యేసు ప్రభువే వారితో వీరు ఏదో అడుగకోరుచున్నారు అని తలచి వారితో మీరు శోకించి, విలపింతురు అని అంటున్నారు. ఈ మాటలు వారిని ఇంకా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకు వీరు విలపిస్తారు ? అంతగా శోకించుటకు కారణాలు ఏమి కాబోతున్నాయి? అనే ప్రశ్నలు వీరి మనసులలో ఉన్నాయి.
వీరి ఆందోళన చూసిన ప్రభువు "మీ దుఃఖము సంతోషముగా మారును"అని ప్రభువు అంటున్నారు. యేసు ప్రభువుకు మన ఆలోచనలు , మన కోరికలు అన్నీ తెలుసు. ఆయన శత్రువుల చేతిలో అప్పగించబడినప్పడు ఆయన శిష్యులు బాధపడ్డారు. వారు వారి ప్రాణం కోసం పారిపోయినప్పటికి, వారికి తమ గురువు మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఎంతో బాధ పడ్డారు. వారు బయటకు రావడానికి కూడా భయ పడ్డారు, అనేక శ్రమలు అనుభవించారు ఈ బాధ వారిని, పట్టు కున్నందుకు కాదు. వారిని శిక్షించినందుకు కాదు, ఇది వారికి ఒక అవమానముగా ఉంది. వారి ఆశలు, ఆశయాలు అన్నీ చేదిరిపోయాయి. వారికి ఏమి చేయాలో , ఎలా ఉండాలో కూడా అర్ధం కాలేదు.
ఇది కేవలం యేసు ప్రభువు వారి నుండి వెళ్ళినందుకు మాత్రమే కాదు. వారి అన్నీ ఆశలు తల క్రిందులైనందుకు. ఇప్పుడు వీరు ఎవరికి ఏమి వారు చెప్పలేరు. వారి నమ్మకం మొత్తం చేదిరిపోయింది. ఎక్కడికి వెళ్ళిన వారిని గుర్తు పట్టి వారి నమ్మకం గురించి , వారి గురువు గురించి అడిగితే ఏమి చెప్పాలో తెలియని పరిస్థితిలో వారు ఉన్నప్పుడు యేసు ప్రభువు యొక్క పునరుత్థానం జరిగింది.
యేసు ప్రభువు యొక్క అనుచరులు ఈ లోకంలో కష్టలు, బాధలు నుండి అతీతులు కారు. వారికి అన్నీ రకాలైన బాధలు కష్టలు ఉన్నాయి. మనం జీవితంలో ఉన్న కొన్ని బాధలు మనం ప్రేమించే వారు మనకు దూరం అవ్వడం వలన వచ్చేవి వుంటాయి, యేసు ప్రభువు శిష్యులుకు ఈ శోకం ఉంది. ఇది ప్రతి ఒక్కరు అనుభవిస్తూ వుంటారు వారి వారి ప్రియమైన వారిని పోగొట్టుకున్నప్పుడు. ఈ శోకం, దుఃఖం అనేక కారణాలు వలన రావచ్చు. మనం అనుకున్న విధంగా జరగనప్పుడు, అనుకున్న దానికి విరుద్ధంగా జరిగినప్పుడు. లేక ఇంకా ఏదైనా కారణం చేత అయిన మనం శోకించవచ్చు. విలపించవచ్చు. వీటిని మార్చగలిగేవాడు యేసు క్రీస్తు. ఈలోకం మనం శోకంలో ఉన్నప్పుడు సతోషించవచ్చు. ఎందుకంటే మనం పొందే ఈ శోకానికి వారే కారణం కావచ్చు. ఈలోకం మన శోకానికి కారణం అయినప్పుడు అది సంతోషిస్తుంది, ఎందుకంటే అది మన మీద విజయం సాధించాను అనుకుంటుంది.
"మీ దుఃఖము సంతోషముగా మారును" : యేసు ప్రభువు తన శిష్యులకు వారు పొందబోయే కష్టాలు చెప్పిన తరువాత వారి శోకం, విలాపం, దుఃఖం సంతోషముగా మారుతాయి అని యేసు ప్రభువు వారికి భరోసా ఇస్తున్నారు. ఏ విధంగా వీరి దుఃఖం సంతోషంగా మారుతుంది అంటే ముందుగా కొంత కాలం తరువాత మళ్ళీ వీరు ప్రభువును చూస్తారు. ప్రభువును వీరు చూసినట్లయితే వీరి అన్నీ బాధలు తీరుతాయి. ఆయన సాన్నిధ్యం వారిని సంతోషంగా ఉండే విధంగా చేస్తుంది.
యేసు ప్రభువు తన శిష్యుల శోకాన్ని తీసివేసేది తాను మరణం పొందిన తరువాత మరణంను జయించి పునరుత్థానం పొందటం ద్వారా. యేసు ప్రభువు పునరుత్థానం అయిన తరువాత శిష్యులు మరలా బయటకు వస్తున్నారు. ఆయన మరణాన్ని జయించారు అని చెప్పడానికి బయటకు వస్తున్నారు. ఆయన పునరుత్థానం వారిని సంతోషపెడుతుంది. ఆయన పునరుత్థానం వారిని అవమానం నుంచి బయటకు తీసుకువస్తుంది. వారిని సంతోష పెడుతుంది. తరువాత అయన తండ్రి దగ్గరకు వెళుతూ వారికి తోడుగా ఉండుటకు, సహాయ పడుటకు , ఆయన చెప్పిన వన్ని గుర్తు చేయుటకు పవిత్రాత్మను పంపి వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నారు. యేసు ప్రభువు మనం శోకంలో ఉన్నప్పుడు , దుఃఖంలో ఉన్నప్పుడు అవమానంలో ఉన్నపుడు మన సమస్య ఆయన చూస్తున్నాడు అని మనం గుర్తు ఉంచుకోవాలి. మనకు తోడుగా ఉంటున్నారు. వాటిని మార్చి మనకు సంతోషాన్ని ఇస్తాడు అని గ్రహించాలి.
ప్రార్ధన : ప్రభువా! మా జీవితంలో అనేక సార్లు శోకానికి గురి అవుతున్నాము. మా జీవితంలో మేము ఎక్కువగా ప్రేమించిన వారిని కోల్పోయిన సమయంలో ఎంతో శోకములో ఉంటున్నాము. దేవుడు మాకు ఎందుకు ఈ బాధను ఇస్తున్నాడు అని నిట్టూర్చుతున్నాము. మాకు దేవుడు ఏమి మేలు చేశాడు అని నింధిస్తున్నాము. అటువంటి సమయాల్లో మాకు తోడుగా ఉండండి. మేము అనుకున్నది జరుగుతున్నది అని అనుకోని, అందరికి చెప్పి అది జరుగక అవమానలకు గురి అవుతున్నాము. అటువంటి సమయాలలో మాకు తోడుగా ఉండండి. మాకు మీ ఓదార్పును ఇవ్వండి. మీ పవిత్రాత్మతో మాకు సహాయం పడి మా దుఃఖలను సంతోషంగా మార్చండి. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి